సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి రెండు కళ్ళు అని, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తమ మూడో కన్నుఅని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసని, అలానే పొంగులేటి తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతారని వ్యాఖ్యానించారు.
ఖమ్మంలో 10కి 10 సీట్లుగెలిపించాలని, రాష్ట్రంలో 80కి పైగా సీట్లు గెలిపించే బాధ్యత తమదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి ఎందుకు రాదో తాను చూసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి జన్మదిన కానుక ఇద్దామని అన్నారు.
జూలై 2న రాహుల్ గాంధీ హాజరుకానున్న ఖమ్మం జనగర్జన సభా ప్రాంగణం, ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పొంగులేటితో కలిసి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగైదు నెలలుగా పొంగులేటితో చర్చలు జరిపామని, కార్యకర్తలు, అభిమానులతో చర్చించిన తరువాతే ఆయన నిర్ణయం తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు. తనకు కష్టమైనా, నష్టమైనా వారి అభిమానుల అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు భద్రత పెంపు
పకడ్బందీ ఏర్పాట్లు
జూలై 2న ఖమ్మం సభ వేదికగా సమరశంఖం పూరించాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అందుకే మేంమంతా ఇక్కడకు వచ్చాం. ఖమ్మం సభ ఏర్పాట్లను పొంగులేటి పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై కాంగ్రెస్ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తన వంతు సాయంగా ఉండేందుకు 1,500 బస్సులు సభ కోసం తీసుకోవలనుకున్నారు. కానీ ఒంటికన్ను శివరాసనుడు బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఏదీ లేకపోతే నడుచుకుంటూనైనా ఇక్కడి ప్రజలు సభకు వస్తారు. మీరు అడ్డుగోడలు కడితే దూకి వస్తారు. మీరే అడ్డు వస్తే తొక్కుకుంటూ వస్తారు.
సభను విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు
సీఎం కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నా. ఖమ్మం సభ విజయవంతం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. బీఆర్‌ఎస్ సభ కంటే ఎక్కువ మంది సభలో కదం తొక్కుతారు. కావాలంటే లెక్క కట్టుకో కేసీఆర్. ఖమ్మం సభతో బీఆరెస్ పాలనకు సమాధి కడుతాం. పార్టీలో పాత, కొత్త లేకుండా కలిసి ముందుకు సాగుతాం. ఖమ్మం గడ్డపై కారు గుర్తు ఉండదు. బంగాళాఖాతంలో కలిపేస్తాం. గిరిజనులపై కేసులను పట్టించుకోని కేసీఆర్ ఇవాళ పోడు పట్టాలు ఇస్తుండు. కాంగ్రెస్ పోరాట ఫలితమే పోడు భూములకు పట్టాలు
టికెట్లు ఇవ్వనందుకే పొంగులేటి కాంగ్రెస్‌లోకి వెళుతున్నాడని కేటీఆర్ అంటున్నాడు. ఆనాడు చంద్రబాబు పదవి ఇవ్వకపోతేనే కదా మీ అయ్య టీడీపీని వీడింది. తెలంగాణ జన గర్జన సభ సాక్షిగా బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టడం ఖాయం’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం భట్టి పాదయాత్ర
ఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ కోసం కాదని.. తెలంగాణ సమాజం కోసమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రేవంత్ రెడ్డి, మధుయాష్కీ కలిశారు. జూలై 2న ఖమ్మంలో జరగనున్న తెలంగాణ జనగర్జన బహిరంగ సభ ఏర్పాట్లపై భట్టితో చర్చించారు.
అనంతరం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 107 రోజులుగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారన్నారు. పార్టీలో చేరుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నాయకులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నమన్నారు. ఖమ్మం సభకు రాహుల్ గాంధీ హాజరై తెలంగాణలో జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కార్యాచరణ పై సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్ర లో తెలుసుకున్న ప్రజల సమస్యలు వాటికి చూపించబోయే పరిష్కారం ఆ వేదిక మీద చర్చిస్తామని ఆయన చెప్పారు.
సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది
కాంగ్రెస్ సభకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సభ జరిగే రోజున ఖమ్మంలో మంచినీరు వదలొద్దని అధికారులను ఆదేశిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో సభ విజయవంతం కావొద్దని జిల్లా మంత్రి యత్నిస్తున్నారని అయినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను తలదన్నేలా కాంగ్రెస్ సభ ఉంటుందని పొంగులేటి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment