సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. కాగా, తెల్లం వెంకట్రావ్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
కాగా, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ నేడు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన వెంటనే వెంకట్రావ్ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను కలిశారు. దీంతో, అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే చర్చ నడిచింది. ఇక, గత కొన్ని రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం కూడా ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్‌లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. మరోవైపు.. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు.
అయితే, ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇక, పార్టీ చేరిన వెంటనే వారికి టికెట్ కూడా రావడం విశేషం. దీంతో, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు హైకమాండ్‌పై సీరియస్ అవుతున్నారు. తమకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment