సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఎంపీ టికెట్ల విషయమై పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా తర్జనభర్జన పడుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్బంగా రేవంత్ ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఇక, రేపు(శుక్రవారం) కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఉండనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ టికెట్లపై చర్చించి ఖరారు చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. ఖమ్మం కాంగ్రెస్ టికెట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులలో టికెట్ దక్కించుకునేది ఎవరోననే చర్చ నడుస్తోంది. ఇక, ముగ్గురు మంత్రుల కుటుంబాలను కాదని కొత్తవారిపై అధిష్టానం దృష్టి సారించిందనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ఖమ్మంలో రేసులో రాయల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కుసుమ కుమార్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక, కరీంనగర్ సీటు కోసం ప్రవీణ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ టికెట్‌ను ప్రవీణ్ రెడ్డి త్యాగం చేశారు. మరోవైపు.. కరీంనగర్ టికెట్ రేసులో వెలిచాల రాజేంద్ర రావు, ప్రవీణ్ రెడ్డి , తీన్మార్ మల్లన్న ఉన్నారు. వెలమ సామాజిక వర్గం పట్టున్న కరీంనగర్ సీటులో ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే చర్చ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తనకు టికెట్ ఇస్తారన్న హామీని నిలబెట్టుకోవాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ స్థానంలో కూడా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, కొద్దిరోజులుగా హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మీర్జా పోటీ చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, దీనిపై కాంగ్రెస్ నేతలు మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో, ఇక్కడ కూడా ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగానే మారింది.
Comments
Please login to add a commentAdd a comment