
అప్పక్‌పల్లిలో లబ్ధిదారు దేవమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి పునాది తవ్వి పూలు చల్లుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, జూపల్లి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ తదితరులు
12 ఏళ్ల మోదీ పాలన, పదేళ్ల కేసీఆర్ పాలన.. 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చిద్దాం..
‘ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన’లో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్
బండి సంజయ్, కిషన్‌రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. ఎవరొస్తారో చెప్పండి..మీ బంట్లు, బంట్రోతులు ఎవరిని పంపుతారో తేల్చుకోండి
కళ్లలో నిప్పులు, కడుపులో కత్తులతో పంచాయితీ పెడుతున్నారు.. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఎండబెట్టిన పాపం బీఆర్‌ఎస్‌దే..
ప్రగతిభవన్‌లో ‘రాయలసీమ ప్రాజెక్టు పథకం పన్ని ద్రోహం చేశారు..తాము విజయవంతంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టామన్న సీఎం
నారాయణపేట జిల్లాలో మెడికల్ కళాశాల, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభం
2014 ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై చర్చకు సిద్ధమా? అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా నాతో చర్చకు రావాలి. మీ బంట్లు, బంట్రోతులను ఎవరిని పంపుతారో తేల్చుకోండి. ప్రధాని నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో.. ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) ఉన్న గ్రామాల్లో మేం పోటీ చేస్తాం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే బీఆర్‌ఎస్ పోటీ చేయాలి. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?
సాక్షి, నాగర్‌కర్నూల్/ నారాయణపేట: దేశంలో 12 ఏళ్ల మోదీ పాలన, రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలన.. 12 నెలల కాంగ్రెస్ పాలనపై తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఎవరు వస్తారో, ఎక్కడికి వస్తారో చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు అయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో ఉందని సీఎం విమర్శించారు.
శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం మెడికల్ కళాశాల, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలకు ప్రారంబోత్సవం చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పెట్రోల్ బంక్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.
సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎన్నో పనులు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎప్పుడో బ్రిటిష్ కాలమైన 1931లో చేసిన కులగణన తప్ప ఈనాటికీ ఎవరూ లెక్క చెప్పలేదు. బీసీలు చైతన్యం అవుతున్నారు. తమ లెక్క చెప్పాలని అంటున్నారు. దేశంలో మొదటిసారి ప్రతి కులం లెక్క తీసేందుకు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచాం. 30ఏళ్లుగా పీటముడి పడిన ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపాం.
ఏడాదిలోనే సాధించిన ఈ విజయాలు కేసీఆర్ కళ్లకు కనబడటం లేదా? ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు కాకముందే దిగిపోవాలని చూస్తున్నారు. కళ్లలో నిప్పులు, కడుపులో కత్తులు పెట్టుకొని మన మధ్యనే పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. తాను కొడితే గట్టిగా వేరేలా ఉంటుందని కేసీఆర్ అంటున్నారు. ఆయన కొట్టాల్సి వస్తే ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీలు చేసిన కొడుకును, ఢిల్లీలో లిక్కర్ దందా చేసిన బిడ్డను, కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు మింగిన అల్లుడిని కొడితే వాళ్లకు బుద్ధి వస్తుంది.
కేసీఆర్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు..
పాలమూరు నుంచి కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించినా ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన పాపం బీఆర్‌ఎస్‌దే. అప్పుడే పూర్తిచేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో పంచాయతీ ఎందుకు వచ్చేది? పోతిరెడ్డిపాడు ద్వారా జగన్ ఏపీకి 40వేల క్యూసెక్కులు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఊడిగం చేశారు. ఆనాడు మంత్రిగా ఉన్నది హరీశ్‌రావు కాదా? జగన్‌తో కలసి ప్రగతిభవన్‌లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పన్నింది ద్రోహం కాదా? రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 10 టీఎంసీల చొప్పున నెల రోజుల్లోనే శ్రీశైలం ఖాళీ అవుతుంది.
మహిళలకు ఏడాదికి రెండు చీరలు..
దేశంలోనే మొట్టమొదటిసారిగా నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభించాం. ఇందిరా మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళల చేతికి పర్యవేక్షణ, మహిళా సమాఖ్యల ఆధ్యర్యంలో 600 బస్సుల కొనుగోలు, పావలా– జీరో వడ్డీ రుణాలతో మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని మహిళా సంఘాల మహిళలకు ఏడాదికి 2 నాణ్యమైన చీరలు అందిస్తాం. పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చే బాధ్యత నాది.
ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యకు పరిష్కారం చూపుతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం కల: మంత్రులు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది కలగానే మిగులుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని అలాంటిది ఏడాది పాలనలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పారు. రాష్ట్రంలో కులగణనతోపాటు ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపి చరిత్రలో నిలిచామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సామాజిక న్యాయం అందిస్తూ అసమానతలను తొలగిస్తామన్నారు.
నిన్నేం అంటలేను అక్కా..
– సీఎం రేవంత్, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం గేటు వద్ద మహిళా సమాఖ్య ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంబోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను ఒకచోటుకు చేర్చి, మహిళా శక్తిని చాటుతూ నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరతామని సీఎం రేవంత్ పేర్కొనగా.. ఎంపీ డీకే అరుణ కలుగజేసుకుని కేంద్రం ఇప్పటికే నిధులను ఇస్తోందని చెప్పారు.
దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘కేంద్రం ఇస్తుంది. ఇవ్వాలి. మిమ్మల్ని ఏమీ అనడం లేదు అక్కా. ప్రజలకు సేవ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మీకు ఇక్కడ తల్లి గారిల్లు, అక్కడ అత్త గారిల్లు, పిల్లల కోసం ఎవరేం ఇచ్చినా వద్దు అనలేం. అవసరమైనప్పుడు అందరం ఒక్క తాటిపై నిలబడాలి..’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment