మంత్రుల కుటుంబీకులతో పాటు ఇంకొందరి ప్రయత్నాలు
అధిష్టానం ప్రకటన కోసం శ్రేణుల ఎదురుచూపులు
ఇప్పటికే మహబూబాబాద్ అభ్యర్థిగా బలరామ్‌నాయక్ పేరు ప్రకటన
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పక్కనే ఉన్న మహబూబాబాద్ స్థానం అభ్యర్థిగా బలరామ్‌నాయక్‌ను ప్రకటించగా.. ఖమ్మం నుంచి ఎవరిని బరిలోకి దింపుతారోననే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన మంత్రుల కుటుంబీకుల మధ్య టికెట్ కోసం నువ్వానేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. వీరేకాక మరికొందరు నేతలు కూడా టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. టికెట్ ఎవరికి వచ్చినా గెలుపు నల్లేరుపై నడకే అన్న ప్రచారంతో కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనలో ఎవరెవరి పేర్లు ఉన్నాయోనని ఆశావహులు ఆరా తీస్తున్నారు.
పరిశీలనలో ఎవరెవరో?
టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనకు ఎవరి పేర్లు వెళ్లాయన్నది బయటకు తెలియడం లేదు. ఖమ్మం టికెట్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతుండడంతో కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలిస్తున్న పేర్లపై ఉత్కంఠ నెలకొంది. ప్రతీ పార్లమెంట్ స్థానం నుంచి ముగ్గురి పేర్లు ఎన్నికల కమిటీ పరిశీలించి అభ్యర్థిని ప్రకటిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఉండగా.. ఈ స్థానం నుంచి అభ్యర్థిగా తొలి జాబితాలోనే పోరిక బలరాంనాయక్ పేరు ప్రకటించారు. ఖమ్మం స్థానం పెండింగ్‌లో పెట్టడడంపై చర్చ హాట్‌టాపిక్‌గా మారింది.
టికెట్ దక్కితే చాలు..
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో సీపీఐ అభ్యర్థి గెలుపొందగా, మిగతా ఆరు స్థానాల్లోనూ కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. అన్ని స్థానాల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ కంటే 2.65 లక్షల ఓట్లు ఎక్కువగా సాధించింది. దీంతో పార్లమెంట్ టికెట్ దక్కితే చాలు గెలుపు సునాయాసమేనన్న ధీమా ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలో ఉండడం, నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు బలంగా ఉందన్న అంశాలను బేరీజు వేసుకుని టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ అధిష్టానం ఎవరిని కరుణిస్తోందోనని వేచిచూస్తున్నారు.
జాబితాలో పలువురు..
ఖమ్మం లోక్‌సభ టికెట్ కోసం జిల్లాకు చెందిన మంత్రుల కుటుంబీకులు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ రేసులో ఉన్నారు. అలాగే ఖమ్మంకు చెందిన వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, పార్టీ నేతలు జెట్టి కుసుమకుమార్, వి.హన్మంతరావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు ఇప్పటికే అధిష్టానం పెద్దలను పలుమార్లు కలిశారు.
సామాజిక సమీకరణలను పరిగనణలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆశావహులంతా అధిష్టానం తమకే టికెట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. తొలి జాబితాలో ఖమ్మం స్థానం అభ్యర్థి పేరు ప్రకటిస్తారని ఆశించారు. కానీ రాష్ట్రంలోని నాలుగు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించడంతో ఏ అవకాశాన్నీ వదలొద్దనే భావనతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment