ఖమ్మం: ప్రజలు విన్నవించే సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నేలకొండపల్లి మండలం చెరువుమాధారానికి చెందిన రైతులు 110 ఎకరాల్లో వరి విత్తనాలు వేయగా 60 రోజుల్లోనే కంకులు వచ్చి నష్టపోయామని విన్నవించగా విచారణ చేపట్టి కంపెనీపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డీఏఓ విజయనిర్మలను ఆదేశించారు.
అలాగే, రాజుపేట వద్ద నిర్మించిన చెక్‌డ్యాంను సాగర్ నీటితో నింపాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు రేలా వెంకటరెడ్డి వినతిపత్రం అందజేశారు. అధికారులు విచారణ చేపట్టకుండా ఫ్యామి లీ సర్టిఫికెట్ జారీచేశారని నేలకొండపల్లి మండలం నాచేపల్లికి చెందిన మల్లెల వెంకటాచారి ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టాలని సూచించారు. ఆతర్వాత మంత్రి మాట్లాడుతూ రాజుపేటలోని ఖబరస్తాన్‌కు ప్రహరీ నిర్మించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ భూముల కబ్జాపై సర్వే చేయాలని సూచించారు.
మహాశివరాత్రి సందర్భంగా తీర్థాల, కూసుమంచి ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. తొలుత మంత్రి పొంగులేటి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులతో పాటు విద్యుత్ శాఖ నుండి మంజూరైన బీమా చెక్కులను అందజేశారు. అనంతరం కూసుమంచి మండలం ధర్మాతండాకు చెందిన విద్యార్థి జర్పుల సింధు రోడ్డు ప్రమాదంలో గాయపడిన కోమాలోకి వెళ్లగా మంత్రి పరామర్శించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24 గంటల వైద్యసేవలు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వైద్యం అందేలా తమ ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి లో హోమియో ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం లింగారంతండాలో జీపీ భవనం, పలుచోట్ల రహదారి నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీఓ గణేష్, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి శ్రీరాం, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సులోచన, మత్స్యశాఖ ఏడీ ఆంజనేయస్వామితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వాణిశ్రీ, డాక్టర్ రాములు, ఉమామహేశ్వరరావు, బానోత్ శ్రీనివాస్‌నాయక్, మోహ న్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు మాదాసు ఉపేందర్, జూకూరి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, కూసుమంచిలో రహదారి పక్కన ఉన్న ఓ టీ స్టాల్ వద్ద కాన్వాయ్ నిలిపిన మంత్రి టీ తాగాక నిర్వాహకుడు అనిల్‌తో మాట్లాడి వ్యాపారంపై ఆరా తీశారు.
తమ్మినేని కృష్ణయ్యకు నివాళి..
మండలంలోని తెల్దారుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం గతంలో హత్యకు గురైన నాయకుడు తమ్మినేని కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు రాయల నాగేశ్వరరావు, తమ్మినేని నవీన్, తమ్మినేని మంగతాయారు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment