సాక్షిప్రతినిది, ఖమ్మం: పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది! త్వరలో కాంగ్రెస్ విడుదల చేసే రెండో జాబితాలో ఆయన పేరు ఉంటుందని అనుచర వర్గం చెబుతోంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అనుచరులు ప్రచారం మొదలుపెట్టగా.. ఆయన సోదరుడు ప్రసాదరెడ్డి నాలుగు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. తాజాగా శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలోని సాయిగణేష్ నగర్‌లో నియోజకవర్గ స్థాయి క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే, ప్రచార సామగ్రి, వాహనాలు కూడా సిద్ధమయ్యాయని... జాబితా వెలువడగానే పొంగులేటి నేరుగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
గడపగడపకూ...
గత నెలరోజులుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి పాలేరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు. గడప గడపకూ కాంగ్రెస్ పేరిట నాలుగు మండలాల్లో ప్రసాదరెడ్డితోపాటు తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు పర్యటిస్తూ కాంగ్రెస్ గ్యారంటీలను వివరించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ ప్రచార సరళిపై సూచనలు చేస్తున్నారు.
అందరినీ కలుపుకుని..
పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ ఖాయమైనట్లు తెలుస్తుండగా.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కలుపుకువెళ్లేలా వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ టికెట్లు ఆశించిన నేతలను కలిసి చర్చించారు. అలాగే, స్థానిక నేతలను ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో శ్రేణులు, సానుభూతిపరులను సమన్వయం చేసే బాధ్యతను ప్రసాదరెడ్డి తీసుకోగా.. ఆయనకు తోడు తుంబూరు దయాకర్‌రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ హోదాలో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో జరిగే ప్రచారంలో కూడా ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. ఈనేపథ్యాన పాలేరు నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను ప్రస్తుతానికి ప్రసాదరెడ్డి చూస్తున్నారు.
జాబితా వస్తే మరింత హోరు
ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో ప్రసాదరెడ్డి పర్యటిస్తుండగా, రాష్ట్రస్థాయి వ్యవహారాల్లో పొంగులేటి బిజీగా ఉన్నారు. రెండో జాబితాలో ఆయన పేరు వెలువడ్డాక నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలుస్తోంది. అభ్యర్థిత్వం ఖరారై.. నామినేషన్ దాఖలు అనంతరం పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు పొంగులేటి ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఇంతకుముందే నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు పొంగులేటి హాజరయ్యారు. అయితే, అభ్యర్థి పేరు అధికారికంగా వెలువరించని నేపథ్యాన ఆయన సోదరుడి నేతృత్వాన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.
క్యాంపు కార్యాలయం ప్రారంభం
నియోజకవర్గ వ్యవహారాలు చక్కపెట్టేందుకు ఖమ్మం రూరల్ మండలం సాయిగణేష్ నగర్‌లో ఏర్పాటుచేసిన క్యాంపు కార్యాలయాన్ని ప్రసాదరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అలాగే, నేలకొండపల్లిలో మండల క్యాంపు కార్యాలయం ప్రారంభమైంది. రెండు రోజుల్లో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో కూడా కార్యాలయాలను ప్రారంభించనుండగా.. సాయిగణేష్ నగర్‌లోని క్యాంపు కార్యాలయం ద్వారానే నియోజకవర్గ స్థాయి కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇక ప్రచారానికి సంబంధించి వాహనాలు, జెండాలు, స్టిక్కర్లు ఇతర ప్రచార సామగ్రి సైతం సిద్ధమయ్యాయని.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment