ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో త్రిమూర్తులు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో త్రిమూర్తులు

Published Fri, Dec 8 2023 12:18 AM | Last Updated on Fri, Dec 8 2023 8:28 AM

- - Sakshi

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరగా... ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఉమ్మడి జిల్లా రాజకీయ చరిత్రలో ముగ్గురికి అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తర్వాత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఆరో వరుసలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పదో వరుసలో తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇందులో భట్టి, తుమ్మల దైవసాక్షిగా, పొంగులేటి పవిత్ర హృదయంతో ప్రమాణ స్వీకారం చేశారు.  – సాక్షిప్రతినిధి, ఖమ్మం

భట్టికి ఉన్నత పదవి
అంతా అనుకున్నట్లే భట్టికి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉన్నత పదవి లభించింది. సీఎం పదవి కోసం భట్టి పోటీ పడినా.. చివరకు అధిష్టానం ఆయనను డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తపరిచింది. జలగం వెంగళరావు తర్వాత ఉమ్మడి జిల్లాకు దక్కిన అత్యున్నత పదవి ఇదే. రేవంత్‌రెడ్డి తర్వాత అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో ప్రస్తుతం భ ట్టి కీలక నేతగా వ్యవహరించనున్నారు.

గత ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో భట్టి నేతృత్వాన ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయని అనుచర నేతలు పేర్కొంటున్నారు. వైఎస్‌ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన భట్టి 2009 నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.

ప్రజలకు శీనన్నగా..
మాజీ ఎంపీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అతి తక్కువ కాలంలోనే మాస్‌ లీడర్‌గా ఎదిగి.. రాజకీయాలను శాసించే స్థాయి పొందారు. తొలుత కాంట్రాక్టర్‌గా పనిచేసిన పొంగులేటి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానంతో 2013 ఫిబ్రవరి 23న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పొంగులేటి అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆయనతోపాటు పార్టీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు, పొత్తులో భాగంగా భద్రాచలంలో సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలుపునకు కృషి చేశారు. పాలేరు ఉప ఎన్నికల సమయాన 2016 మే 3న బీఆర్‌ఎస్‌లో చేరిన పొంగులేటి ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం క్రియాశీలకంగా పనిచేశారు.

తిరుగుబాటు చేసి..
ఏడేళ్లపాటు బీఆర్‌ఎస్‌లో కొనసాగిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. కేంద్ర రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా, ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీలో తనకు సముచిత స్ధానం దక్కలేదనే కారణంతో ఈ ఏడాది జనవరి 1న పార్టీపై తిరుగుబాటు చేశారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తుండడంతో ఆయనను ఏప్రిల్‌ 10న బీఆర్‌ఎస్‌ సస్పెండ్‌ చేసింది. అనంతరం జూలైలో ఖమ్మంలో జరిగిన జనగర్జన బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షాన కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటిని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియమించింది.

ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ పేరిట ప్రచారం నిర్వహించడమేకాక ఉమ్మడి జిల్లాలో గడపగడపకు కాంగ్రెస్‌ను తీసుకెళ్లారు. తొలిసా రి ఎమ్మెల్యేగా తాజా ఎన్నికల్లో పాలేరు నుంచి గెలి చిన ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు.

సముచిత గౌరవం
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయంలో అంతా తామై వ్యవహరించిన ముగ్గురు నేతలకు సముచిత గౌరవం దక్కింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్‌ఎస్‌ సత్తా చాటినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌కు అధిక స్థానాలు దక్కాయి. ఈసారి కూడా మెజార్టీ స్థానాలు దక్కడంలో భట్టి, పొంగులేటి, తుమ్మల కృషి ఉంది.

వీరు తమ నియోజకవర్గాలే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం చేస్తూ నాయకులను సమన్వయపరిచారు. దీంతో కార్యకర్తలు, నేతలు ఒకతాటిపైకి చేరగా కాంగ్రెస్‌ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. దీంతో ఈ ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం దక్కగా.. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా నుంచి అనుచర నేతలు భారీగా తరలివెళ్లారు.

మూడు ప్రభుత్వాల్లో మంత్రి
జిల్లా రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల ప్రస్థానం కలిగిన నేత తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం, బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రస్తుత కాంగ్రెస్‌ మంత్రివర్గంలోనూ స్థానం దక్కడం అరుదైన విషయంగా చెప్పుకోవాలి. 1985, 1995, 1996, 1999, 2001 ఏడాదిలో టీడీపీ హయాంలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్‌, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 2014లో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన సమయాన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. 2018లో పాలేరు నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌పై ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement