మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పక్కన నాయకులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐదు నెలల రాజకీయ ఉత్కంఠకు తెరదించారు. అనుచరుల అడుగు జాడల్లోనే నడుస్తానని, వారి అభీష్టమే తన నిర్ణయమని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో హైదరాబాద్ వేదికగా ఏ పార్టీలో చేరతానన్న నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఈ నెలాఖరులోనే భారీ బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1న బీఆర్‌ఎస్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన ఆయన ఐదు నెలల పది రోజుల తర్వాత కాంగ్రెస్‌లోనే చేరనున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల సమావేశానికి పది నియోజకవర్గాల నుంచి ఆయన అనుచరులు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశం వేదికగా అటు పాలకులపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతోపాటు ఇక ముందు రాజకీయ ఫైట్ అంటూ అనుచర నేతలను కార్యోన్ముఖులను చేస్తూ ప్రసంగించారు.
ఒక్కొక్కరుగా వచ్చి.. జై కాంగ్రెస్ అని..
ఉదయం 8 గంటల నుంచే పది నియోజకవర్గాల నుంచి పొంగులేటి అనుచరులు చేరుకోగా.. ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాల నుంచి ఐదుగురు చొప్పున తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ తర్వాత వైరా, పాలేరు, మధిర, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల అనుచరులు మాట్లాడారు. 2019 నుంచి పొంగులేటికి అన్యాయం జరుగుతున్నందున కాంగ్రెస్‌లో చేరితేనే అన్యాయం చేసిన వారికి దీటైన సమాధానం ఇవ్వొచ్చని పేర్కొన్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే ఉమ్మడి జిల్లాలో తమ సత్తా నిరూపిస్తామంటూ తెలిపారు. ఈ సమయాన అనుచరులందరూ జై కాంగ్రెస్ అంటూ నినదించారు. రెండున్నర గంటలపాటు ఈ సమావేశం సాగింది. చివరకు అన్ని నియోజకవర్గాల నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లోనే చేరాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
అనుచరుల్లో జోష్..
పొంగులేటి ఈ సమావేశంలో అర గంటకు పైగా మాట్లాడారు. తాను బీఆర్‌ఎస్‌లో చేరితే తండ్రి సమానమైన వ్యక్తే టికెట్ ఇవ్వలేదని చెబుతూ, తనకు పదవులు కాకుండా ప్రజాసేవే ముఖ్యమంటూ పేర్కొన్నారు. ‘పలు దఫాలుగా మీతో పార్టీ చేరిక విషయమై అభిప్రాయ సేకరణ చేసినా చివరకు మీ నిర్ణయం ప్రకారమే నేను నడుస్తాను’ అని తెలిపారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా తనను ఆదరిస్తున్నారని, అందరం కలిసి యుద్ధం చేద్దామంటూ వ్యాఖ్యానించారు. ఏ పార్టీలో చేరుతున్నాననేది హైదరాబాద్‌లో రెండు, మూడు రోజుల్లో వెల్లడిస్తామని.. ఢిల్లీ ముఖ్యనేతలతో మాట్లాడాక ఖమ్మంలో భారీ బహిరంగ సభ తేదీ ఖరారు చేస్తామని తెలిపారు. ఇది ఈ నెలాఖరులోగానే ఉండొచ్చని చూచాయగా చెప్పుకొచ్చారు. దీంతో పొంగులేటి కాంగ్రెస్‌లోకే వెళ్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది.
ఖమ్మం నుంచే పోటీ
పొంగులేటి మాట్లాడుతున్న సమయాన అనుచర నేతలు ఆయన ఖమ్మంలోనే పోటీచేయాలంటూ నినదించారు. జై పొంగులేటి.. జై కాంగ్రెస్.. జై ఖమ్మం అంటూ నినాదాలు చేశారు. పది నియోజకవర్గాల నుంచి పరిమిత సంఖ్యలో నేతలనే ఆహ్వానించినా అంతకుమించి హాజరయ్యారు. సమావేశం అనంతరం కొందరు ముఖ్యనేతలతో పొంగులేటి తన నివాసంలో సమీక్షించాక హైదరాబాద్ వెళ్లారు. ఈ సమావేశంలో భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మార్క్‌ఫెడ్ మాజీ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, నేతలు మువ్వా విజయ్‌బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, మచ్చా శ్రీనివాస్‌యాదవ్, తుంబూరు దయాకర్‌రెడ్డి, మద్దినేని బేబి స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విజయాబాయి, జారె ఆదినారాయణ, ఆకుల మూర్తి, మేకల మల్లిబాబు యాదవ్, గుండా వెంకటరెడ్డి, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, జాలె జానకిరెడ్డి, డాక్టర్ కోటా రాంబాబు, యర్రంశెట్టి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment