మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పక్కన నాయకులు
కూల్చేస్తామనే వారి కలలు నెరవేరవు
రెండు, మూడు రోజుల్లో ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజల తీర్పుతో, ప్రజా ఆకాంక్షలతో ఏర్పడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. కూల్చేస్తామనే వారి కలలు నెరవేరే అవకాశం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌లో కొనసాగడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టపడకపోగా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్‌లో చేరదామా అనే ఉత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు.
అయినా తాము ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని భట్టి చెప్పారు. ఢిల్లీలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నడుస్తోందని.. ఈ సమావేశాల్లో ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిపై చర్చించనుండగా రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పిన భట్టి.. ఎన్నికల్లో తమకు ఏ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
గత ప్రభుత్వ తీరుతోనే నీటి సమస్య..
పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ తీరుతోనే ప్రస్తుతం నీటి సమస్య వచ్చిందని.. గత వర్షాకాలంలో నీటిని సక్రమంగా వినియోగించుకోకపోవడంతోనే ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతోందని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం నీటిని రాజకీయాల కోసమే వాడుకోగా.. తాము ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని తాగు అవసరాలకు ఎలా ఉపయోగించుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్ గరిష్టస్థాయిలో ఉన్నా అందుకు తగినట్లుగా సరఫరా చేస్తున్నామని చెప్పారు.
చాలా మంది నాయకులు వారి స్థాయి దిగజార్చుకుని మాట్లాడుతున్నారని, వారు నిర్వహించిన మీడియా సమావేశంలో కరెంట్ పోకపోయినా పోయినట్లుగా చెబుతూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని భట్టి మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సరైన రీతిలో ప్రభుత్వాన్ని నడపకపోవడంతోనే ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. తాము ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కృషి చేస్తున్నామని, కేంద్ర మంత్రి గడ్కరీ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు క్లియరెన్స్ తీసుకొచ్చామని, ఇతర అంశాల్లోనూ నిధులపై ఒప్పించి తీసుకొచ్చామని భట్టి తెలిపారు.
అంతేతప్ప ఢిల్లీ వెళ్లి ఇతర రాష్ట్రాల నేతలతో సమావేశమవుతూ దేశ్‌కీ నేత కావాలనుకోలేదని భట్టి చెప్పారు. కాగా, తుక్కుగూడలో నిర్వహించే సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, జావీద్, మలీదు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment