గండం గట్టెక్కేనా..? మున్సిపల్‌ పాలకవర్గాలు సతమతం! | - | Sakshi
Sakshi News home page

గండం గట్టెక్కేనా..? మున్సిపల్‌ పాలకవర్గాలు సతమతం!

Published Mon, Dec 18 2023 12:08 AM | Last Updated on Mon, Dec 18 2023 1:37 PM

- - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపల్‌ పాలకవర్గాలపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. పాలకవర్గాల్లో నెలకొన్న విభేదాలు, రాజకీయ కారణాలతో పదవీ కాలం పూర్తి కావడం సందేహంగానే కనిపిస్తోంది. ఇల్లెందు, వైరా మున్సిపల్‌ చైర్మన్లపై గతంలోనే పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందజేశారు. ఇల్లెందుకు సంబంధించి ఫార్మాట్‌లో లేదని కలెక్టర్‌ తిరస్కరించగా.. మరోసారి నోటీసు ఇచ్చారు.

వైరా చైర్మన్‌పై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేయగా.. చట్టంపై స్పష్టత లేకపోవడంతో నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో పాత మున్సిపల్‌ చట్టం ఆధారంగా అవిశ్వాస అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వైరా, ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్లు కాంగ్రెస్‌లో, ఖమ్మం కార్పొరేషన్‌, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం మున్సిపల్‌ పాలకవర్గాలు బీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యాన ఎక్కడెక్కడ అవిశ్వాసం పెట్టే అవకాశముంది, తద్వారా పాలకవర్గాలు మారుతాయా అనే చర్చ జరుగుతోంది.'

ఇక్కడా సందేహమే..

  • సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు అన్నీ బీఆర్‌ఎస్సే గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఐదుగురు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ బలం 18కి తగ్గింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు చెందిన కూసంపూడి మహేష్‌ చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తోట సుజలారాణి ఉన్నారు.
  • కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు చెందిన కాపు సీతాలక్ష్మి చైర్‌పర్సన్‌గా, వేల్పుల దామోదర్‌ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. చైర్‌పర్సన్‌పై వ్యతిరేకతతో బీఆర్‌ఎస్‌, సీపీఐ కౌన్సిలర్లు గతంలో అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించినా, ఇప్పుడెలాంటి కదలికా లేదు. ఇక్కడ 36 వార్డులకు గాను బీఆర్‌ఎస్‌కు 25, సీపీఐకి ఎనిమిది మంది, కాంగ్రెస్‌కు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల ముందు సీపీఐ కౌన్సిలర్లు ఐదుగురు బీఆర్‌ఎస్‌లో చేరగా ఆ పార్టీ బలం 30కి పెరిగింది. సీపీఐకి ముగ్గురే మిగిలారు.
  • మధిరలో 22 వార్డులకు బీఆర్‌ఎస్‌కు 15 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, టీడీపీ నుంచి ముగ్గురు, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలిచారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఎరగ్రుంట లక్ష్మి, మొండితోక నాగరాణి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. స్వతంత్ర కౌన్సిలర్‌ గద్దల మాధురి ప్రమాణ స్వీకారానికి ముందే బీఆర్‌ఎస్‌లో చేరారు. 20వ వార్డు కౌన్సిలర్‌ ముత్తవరపు రాణి అనారోగ్యంతో మృతి చెందగా ఆ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో 13 మంది, కాంగ్రెస్‌కు నలుగురు, టీడీపీ ముగ్గురు, సీపీఎంకు ఒకరు ఉన్నారు. చైర్‌ పర్సన్‌ మొండితోక లత, వైస్‌ చైర్‌పర్సన్‌ శీలం విద్యాలత బీఆర్‌ఎస్‌లో గెలిచి అదే పార్టీలో కొనసాగుతున్నారు.

పాలకవర్గాల్లో విభేదాలు!
ఏడాది కాలంగా పలు మున్సిపల్‌ పాలకవర్గాల్లో విభేదాలు పొడచూపాయి. పార్టీ తరఫున ఎన్నికై న చైర్మన్లకు, నాయకత్వానికి పొసగకపోవడం, కౌన్సిలర్లు – చైర్మన్‌కు మధ్య విభేదాల వంటి కారణాలతో అవిశ్వాసానికి అడుగులు పడ్డాయి. మరికొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానానికి నిర్ణయించినా సర్దుబాట్లతో ముందుకు సాగలేదు. ఇల్లెందు, వైరాలో మాత్రం అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందాయి. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలని చట్టంలో ఉంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీన్ని నాలుగేళ్లకు పెంచి గవర్నర్‌కు పంపించగా ఆమోదం లభించలేదు. దీంతో ఇల్లెందు, వైరా తీర్మానాలపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోలేదు.

మరోసారి తెరపైకి..
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో అవిశ్వాస అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్‌ సర్కారు తెచ్చిన నాలుగేళ్ల చట్టానికి గవర్నర్‌ ఆమోదం లభించకపోవడంతో, మూడేళ్లు దాటిన పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్‌ పాలకవర్గాలు 2020 జనవరిలో కొలువుదీరాయి. ప్రస్తుతం మూడేళ్లు దాటడంతో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది.

గతంలో అవిశ్వాసానికి యత్నించిన వైరా, ఇల్లెందు మున్సిపాలిటీల చైర్మన్లు ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడంతో బలాబలాలు మారాయి. మిగతా మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఉన్నా.. వచ్చే నాలుగు నెలల్లో రాజకీయ సమీకరణలతో తమ బలం పెరుగుతుందన్న అంచనాలో కాంగ్రెస్‌ ఉంది. తద్వారా అవి శ్వాసం పెట్టి ఆయా మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటామని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.

ఖమ్మంపై రాజకీయ కాక..
ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌పై రాజకీయ కాక మొదలైంది. ఈ పాలకవర్గం 2021 మే 7న కొలువుదీరింది. 60 డివిజన్లలో బీఆర్‌ఎస్‌, సీపీఐ కలిసి పోటీ చేయగా.. బీఆర్‌ఎస్‌ 43, సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్‌ 10, సీపీఎం, స్వతంత్రులు రెండేసి స్థానాలు, బీజేపీ ఒక స్థానం దక్కించుకున్నాయి. దీంతో బీఆర్‌ఎస్‌ పగ్గాలు చేపట్టగా, ఆ తర్వాత ముగ్గురు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌లో చేరారు.

అసెంబ్లీ ఎన్నికల సమయాన స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్‌లో చేరగా.. బీఆర్‌ఎస్‌కు చెందిన తొమ్మిది మంది సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ బలం 18కి చేరగా, బీఆర్‌ఎస్‌కు 37 మంది ఉన్నారు. వచ్చే ఏడాది మే 7తో కేఎంసీ పాలకవర్గం మూడేళ్లు పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌కే బలం ఉన్నా, వచ్చే నాలుగు నెలల్లో మారే సమీకరణలతో తమ బలం పెరిగి కార్పొరేషన్‌ను ‘హస్త’గతం చేసుకుంటామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. అయితే తమ కార్పొరేటర్లెవరూ కాంగ్రెస్‌ వైపు చూడరని బీఆర్‌ఎస్‌ నేతలు ధీమాగా ఉన్నారు.

వైరా, ఇల్లెందుల్లో ఇలా..
ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు వైరా మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌పై కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు 16 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, సీపీఎంకు ఒకరు, స్వతంత్ర కౌన్సిలర్‌ ఒకరు ఉన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు పదేసి మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే మరికొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.

ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో ఏడాది కాలంగా చైర్మన్‌కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక్కడ 24 వార్డులకు గాను చైర్మన్‌ డి.వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్‌ జానీపాషాతో పాటు 21 మంది బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. సీపీఐ, న్యూడెమోక్రసీ, బీఆర్‌ఎస్‌ రెబల్‌గా ఒక్కొక్కరు గెలుపొందారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు చైర్మన్‌పై కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చినా ఫార్మాట్‌ ప్రకారం లేదనడంతో వారం క్రితం మళ్లీ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్‌ ప్రోద్బలంతో ఈ ప్రక్రియ సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఎన్నికల ముందు మున్సిపల్‌ చైర్మన్‌ సహా నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ బలం 17కు తగ్గింది. వైరా, ఇల్లెందులో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వారు గెలవడం, ఆ పార్టీకే చెందిన చైర్మన్లు ఉండడంతో ఆ పార్టీ నేతలు ఎలా చక్రం తిప్పుతారో వేచి చూడాల్సిందే.

ఇవి చ‌ద‌వండి: సర్కారు ఖజానాలో పైసల్లేవ్‌.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement