సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని.. ఒకవేళ తాము గేట్లు తెరిస్తే ఆ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం ఏర్పాటుచేయగా మంత్రి మాట్లాడారు.
ఎమ్మెల్యేలను కొంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్‌ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే, తమ ఎమ్మెల్యేలను కొనే శక్తిసామర్థ్యాలు వారికి లేవన్నారు. గత పదేళ్లు అధికారం లేకపోయినా నిర్భంధాలు, అక్రమ కేసులను ఎదుర్కొంటూ కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు అభినందనీయులన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ఏజెంట్లూ ఉండొద్దని ప్రలోభాలకు గురిచేసినా ప్రత్యర్థి దిమ్మతిరిగేలా 50వేల పైచిలుకు మెజార్టీతో తనను గెలిపించిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఆయన భావోద్వేగంతో తెలిపారు.
కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందని, వారి అనుమతి లేకుండా కొత్త వారిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. కాగా, గత ప్రభుత్వం మాదిరి అవినీతి జరగకుండా నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు మహ్మద్ జావీద్, దొబ్బల సౌజన్య, మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్‌రెడ్డి, నాగండ్ల దీపక్‌చౌదరి, షేక్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment