సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం, పక్కన నాయకులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కృష్ణా, గోదావరి జలాల విషయంలో శాస్త్రీయ పరిష్కారానికి ఆలోచన చేయాలే తప్ప కేంద్రానికి పెత్తనం అప్పగించొద్దని.. అదే జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏదో ఒక కొర్రీ సృష్టిస్తూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ కుట్ర అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలిచేసి ఏకపక్ష పరిపాలన కోసమే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై కేంద్రం రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసిందన్నారు. కాగా, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చరిత్ర కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలదని తమ్మినేని తెలిపారు.
రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తుండగా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేరకున్నా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడకుండా ఓట్ల కోసం తగువు పడితే తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్‌ఎస్ శాపనార్థాలు పెట్టడం సరైందికాదన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినా ఉద్యమాలు, హక్కుల విషయాల్లో అణిచివేయడం, ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షాలపై అహంకార పూరితంగా ప్రవర్తించిందని తమ్మినేని చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెకు సీపీఎం మద్దతు తెలుపుతోందన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని వీరభద్రం తెలిపారు.
కాగా, పాలేరు పాత కాల్వ కింద 6వేల ఎకరాల్లో వరి, 1,227 ఎకరాల్లో చెరుకు సాగు చేసినందున నీరు విడుదల చేయించే బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, సాయిబాబా, ఎర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం, బండి రమేష్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment