Krishna Godavari rivers
-
కృష్ణా జలాలపై కేంద్రానికి పెత్తనం ఇవ్వొద్దు! : తమ్మినేని వీరభద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కృష్ణా, గోదావరి జలాల విషయంలో శాస్త్రీయ పరిష్కారానికి ఆలోచన చేయాలే తప్ప కేంద్రానికి పెత్తనం అప్పగించొద్దని.. అదే జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదో ఒక కొర్రీ సృష్టిస్తూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ కుట్ర అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలిచేసి ఏకపక్ష పరిపాలన కోసమే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై కేంద్రం రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసిందన్నారు. కాగా, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదని తమ్మినేని తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తుండగా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేరకున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడకుండా ఓట్ల కోసం తగువు పడితే తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ శాపనార్థాలు పెట్టడం సరైందికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినా ఉద్యమాలు, హక్కుల విషయాల్లో అణిచివేయడం, ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షాలపై అహంకార పూరితంగా ప్రవర్తించిందని తమ్మినేని చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెకు సీపీఎం మద్దతు తెలుపుతోందన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని వీరభద్రం తెలిపారు. కాగా, పాలేరు పాత కాల్వ కింద 6వేల ఎకరాల్లో వరి, 1,227 ఎకరాల్లో చెరుకు సాగు చేసినందున నీరు విడుదల చేయించే బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, సాయిబాబా, ఎర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం, బండి రమేష్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: చర్చకు తేవాల్సిన అంశాలెన్నో.. -
నదీజలాలపై కేంద్ర గెజిట్ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీజలాలపై హక్కులను స్వాధీనం చేసుకుంటూ 2021 జూలై 15న కేంద్రం రీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్ తేల్చి చెప్పారు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులను తీసుకునే అధికారం కేంద్రానికి లేదని, ఇలా చేయడం రాష్ట్రాన్ని తీవ్రంగా అవమానించడమేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఈ నదులు ప్రవహిస్తున్నా.. అక్కడ కేంద్రం తీసుకోలేదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)కు విరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే ఆ గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాడభూషి శ్రీధర్ మాట్లాడారు. నీటివనరులు రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశమని.. అందువల్ల నదీజలాల వినియోగంపై రాష్ట్రాలే సంపూర్ణ హక్కు, అధికారాలను కలిగి ఉంటాయని గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికే కేంద్ర ప్రభుత్వం పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపారు. అంతర్రాష్ట జల వివాదాల పరిష్కార చట్టం కింద ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం ఏడేళ్ల కిందే ఏర్పాటు చేసినా, వాటి విధులేమిటో ఖరారు చేయకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయిందని వివరించారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణాజలాల పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని.. కానీ దీనిపై కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. తక్షణమే కేంద్రం కృష్ణా, గోదావరి అపెక్స్ కౌన్సిళ్ల భేటీలను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపు తన పరిధిలో లేదని కృష్ణా అవార్డ్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ పేర్కొనడం దారుణమన్నారు. కేంద్రం గెజిట్‌ను ఉపసంహరించుకోవాలంటూ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తామని.. ప్రధాని, కేంద్ర మంత్రులకూ పంపుతామని తెలిపారు. ఒకవేళ కేంద్రం స్పందించకుంటే సుప్రీంకోర్టులో పిల్ వేస్తామన్నారు. గెజిట్ అమలైతే.. తాగునీటికి కటకటే! ఏపీ, తెలంగాణలకు నీటివాటాలను కేటాయించకుండానే కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రయోజనం లేదని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయింపులు జరగపోతే.. కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు లభించవని గుర్తుచేశారు. అనుమతులు లేని ప్రాజెక్టులను నిలిపేయాలని గెజిట్‌లో పేర్కొన్న నేపథ్యంలో.. పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఉదయ సముద్రం వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డితోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాలకు తాగునీరిచ్చే ప్రాజెక్టులనూ నిలిపేయాల్సి ఉంటుందని, అదే జరిగితే రాష్ట్రంలో సగం జనాభాకు తాగునీటి కొరత ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ పాండురంగారెడ్డి, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు వి.రాజారెడ్డి, చైర్మన్ బి.రణధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదం పరిష్కారానికి ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశం నిర్వహించా లని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కాగా త్వరలో అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ప్రకటించారు. సమావేశం అజెండాను పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఆయా అంశాలను పరిశీలించి తుది అజెండాను ఖరారు చేస్తామని, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి సమావేశం తేదీని నిర్ణయిస్తారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై పంకజ్‌కుమార్ మంగళవారం ఢిల్లీ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. సీడ్ మనీ మొత్తంపై పునరాలోచన కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణకు గెజిట్‌లో పేర్కొన్న మేరకు ఒక్కో బోర్డు ఖాతాలో ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా తక్షణమే డిపాజిట్ చేయాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకేసారి రూ.200 కోట్లను డిపాజిట్ చేయలేమని తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే ఆ నిధులను ఏం చేస్తారో చెప్పాలని సోమేశ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీడ్ మనీ తగ్గింపుపై పునరాలోచన చేస్తామని పంకజ్‌కుమార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు అప్పగించం: తెలంగాణ కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–3 పరిధిలోని ప్రాజెక్టులను తక్షణమే ఆయా బోర్డులకు అప్పగించాలని పంకజ్‌కుమార్ ఆదేశించారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కొత్త ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎస్ కోరారు. అప్పటిదాకా ప్రాజెక్టులను కూడా అప్పగించబోమని స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మాత్రమేనని, ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు అవసరమే లేదని చెప్పారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని ఏపీ పేర్కొంది. గోదావరి బోర్డు అత్యంత ఆవశ్యకమని.. తక్షణమే శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని కోరింది. శ్రీశైలం, సాగర్లను అప్పగించాల్సిందే: కేంద్రం రెండు రాష్ట్రాల అధికారుల వాదనల అనంతరం పంకజ్‌కుమార్ స్పందించారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను తక్షమే కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. ఏకాభిప్రాయంతో వాటిని బోర్డుకు అప్పగించాలని తేల్చిచెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌ను మార్చే ప్రసక్తే లేదని.. గోదావరి బోర్డు అత్యంతావశ్యకమని స్పష్టం చేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయశాఖతో కేంద్రం చురుగ్గా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఇలావుండగా గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటికి ఆమోదం పొందడం కోసం తక్షణమే వాటి డీపీఆర్‌లను కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) పంపాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ ఆదేశించారు. విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులపై ఒక నివేదిక ఇస్తే.. కొత్తగా అనుమతి తీసుకోవాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుతామని చెప్పారు. -
గెజిట్‌పై బోర్డులతో మరోమారు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశంపై కేంద్రం మరోమారు రంగంలోకి దిగనుంది. అక్టోబర్ 14 నుంచే గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రావాల్సి ఉన్నా.. తెలుగు రాష్ట్రాల నుంచి సరైన మద్దతు కరువైన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై బోర్డులతో చర్చించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర జల శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ రెండు బోర్డుల చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి, తదుపరి నిర్ణయాలు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. అమలుకు నోచని గెజిట్ కేంద్రం వెలువరించిన గెజిట్ ప్రకారం.. కేంద్రం గుర్తించిన ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ప్రధాన పనులు, రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించడంతో పాటు నీటి విడుదల, విద్యుదుత్పత్తి, వినియోగం అంశాలను బోర్డులే చూడాల్సి ఉంది. అయితే ఇరు రాష్ట్రాల చర్చల్లో గోదావరిలో కేవలం పెద్దవాగు, కృష్ణాలో 15 ఔట్లెట్లను మాత్రమే అప్పగించే అంశంపై కొంత సానుకూలత ఏర్పడింది. అయితే ఇందులోనూ కృష్ణాలోని విద్యుదుత్పత్తి కేంద్రాలను బోర్డులకు అప్పగించేందుకు తెలంగాణ ససేమిరా అంటోంది. విద్యుదుత్పత్తి కేంద్రాలు లేకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే ఫలితం ఉండదని ఏపీ అంటుండటంతో గెజిట్ అమలు ముందుకు కదలడం లేదు. దీంతో పరిస్థితిని బోర్డులు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాయి. ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై మార్గనిర్దేశకత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని సమాచారమిచ్చింది. గురు లేక శుక్రవారాల్లో గెజిట్ అమలులో నెలకొన్న సమస్యలపై చర్చించనుంది. డీపీఆర్లపైనా చర్చ కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలో అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెల్లలోగా అనుమతి తీసుకోవాలని, ఒకవేళ అనుమతి తీసుకోవడంలో విఫలమైతే.. ఆ ప్రాజెక్టులు పూర్తయినా వాటి నుంచి నీటిని సరఫరా చేయడాన్ని ఆపేయాల్సిందేనని గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రానికి అందించాయి. ముఖ్యంగా తెలంగాణ సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందించింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్ అంశాలపైనా కేంద్రం బోర్డులతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అందించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు, వాటిపై రాష్ట్రాలను కోరిన వివరణలు, వాటికి సమాధానాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. -
తొలుత ఉమ్మడి ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిలోకి తొలిదశలో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు వెళ్లనున్నాయి. ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చే గెజిట్‌లో భాగంగా కృష్ణాబోర్డు మొదట శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను, గోదావరి బోర్డు పెద్ద వాగు ప్రాజెక్టునుతమ ఆధీనంలోకి తీసుకోను న్నాయి. ఈ మేరకు కేంద్రం సైతం స్పష్టత ఇచ్చి నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అంశాలపై స్పష్టత కోసం, రాష్ట్రాల అభిప్రాయాలను వినేందుకు 10, 11 తేదీల్లో బోర్డుల సబ్ కమిటీ భేటీలు, 12న పూర్తి స్థాయి భేటీలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేర కు తెలుగు రాష్ట్రాలకు బోర్డులు లేఖలు రాశాయి. చైర్మన్లతో కేంద్ర అదనపు కార్యదర్శి భేటీ గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ.. గురువారం ఉదయం రెండు బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌తో భేటీ అయ్యారు. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులు, వాటి వివరాలు, సీఐఎస్ఎఫ్ భద్రత, రాష్ట్రాలు అందించిన సమాచారం, వాటి అభ్యంతరాలు, ఇంతవరకు పూర్తి చేసిన చర్యలు తదితరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల ఆధీనానికి సంబంధించి రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయని, మూడు ప్రాజెక్టుల విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు సానుకూలతతో ఉన్నాయని తెలిపినట్లుగా సమాచారం. శ్రీశైలం, సాగర్, పులిచింతల విషయంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో వాటిని మొదటగా బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకొని పర్యవేక్షణ మొదలు పెట్టాలని సూచించినట్లుగా తెలిసింది. మిగతా ప్రాజెక్టులపై చర్చించేందుకు వీలైనంత త్వరగా బోర్డు భేటీలు నిర్వహించి రాష్ట్రాల అభిప్రాయం కోరాలని చెప్పినట్లుగా బోర్డుల వర్గాలు తెలిపాయి. వరుస భేటీలు పెట్టిన బోర్డులు గెజిట్ అమలుకు మరో వారం రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, బోర్డులు తమ పనిలో వేగం మరింత పెంచనున్నాయి. వచ్చే ఆది, సోమ వారాల్లో రెండు బోర్డుల సబ్ కమిటీల భేటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఆ వెంటనే పూర్తి స్థాయి స్పెషల్ బోర్డు భేటీలను ఈ నెల 12న నిర్వహించనున్నాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల కార్యదర్శులకు బోర్డులు లేఖలు రాశాయి. ఏయే ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచాలన్న దానిపై ఈ సమావేశాల్లో మరింత స్పష్టత తీసుకోనున్నాయి. -
Telangana: వాటాలు తేల్చుకుందాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సిద్ధమయ్యింది. సెప్టెంబర్ ఒకటిన జరిగే కృష్ణా బోర్డు పూర్తిస్థాయి భేటీలో వినిపించాల్సిన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు అదేరోజున కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త భేటీకి హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక దఫాలుగా ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, న్యాయనిపుణులతో చర్చించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. బోర్డుల ముందు ఏఏ అంశాలను ప్రస్తావించి, ఎలాంటి వాదనలు విన్పించాలనే విషయమై అంశాల వారీగా మార్గదర్శనం చేశారు. ఆయన సూచనలు, సలహాల మేరకు ఇంజనీర్లు అన్ని నివేదికలు సిద్ధం చేశారు. ఇక సెప్టెంబర్ 2న ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి నదీ జలాల సంబంధిత అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. వాటాలు పెంచుకోవడంపైనే దృష్టి రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచి కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి పెరగాల్సిన వాటాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటినే ఏపీ, తెలంగాణలు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో వాడుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి నీటి వాటాలను మార్చాలని తెలంగాణ గట్టిగా డిమాండ్ చేస్తోంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా, నీటి వాటాలు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని.. పరీవాహకాన్ని, ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని, బోర్డును కోరుతోంది. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే మొత్తం 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో సగం వాటా అంటే 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేదాకా వినియోగించుకోవాలని సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో నిర్ణయించారు. బుధవారం జరిగే కృష్ణా పూర్తి స్థాయి భేటీలోనూ ఈ మేరకు బలంగా వాదనలు వినిపించాలని, అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ తరలించే 80 టీఎంసీల గోదావరి నీటితో, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాను ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ రాబట్టుకునేలా వ్యూహరచన చేశారు. దీనికి తోడు క్యారీఓవర్ నీటిపై ఏపీ చేస్తున్న వాదనను తిప్పికొట్టేందుకు, తాగునీటి కేటాయింపులో 20 శాతం వినియోగమే లెక్కలోకి తీసుకునేలా రాష్ట్ర వాదనను బలంగా వినిపించేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ఏపీ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం లక్ష్యంగా నివేదికలు రూపొందించారు. గెజిట్‌పై చర్చకు రెడీ కేంద్రం వెలువరించిన కృష్ణా, గోదావరి గెజిట్ నోటి ఫికేషన్ అమలుకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ, అత్యవసర సమావేశాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న తెలంగాణ.. ఈసారి వైఖరి మార్చుకుంది. వచ్చేనెల 1వ తేదీన జరిగే సంయుక్త భేటీకి హాజరవ్వాలని నిర్ణయించింది. గెజిట్‌లోని అభ్యం తరకర అంశాలను సమావేశం దృష్టికి తీసుకురావడంతో పాటు ఇతర విషయాల్లో తామందించబో యే సహకారాన్ని వివరించనుంది. రాష్ట్రంలో అను మతి లేని ప్రాజెక్టులపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మూడ్రోజులు ఢిల్లీలో మకాం ఇలావుండగా సెప్టెంబర్ 2న ఢిల్లీకి వెళుతున్న సీఎం.. మూడ్రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు సమాచారం. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో పాటు ఇద్దరు, ముగ్గురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. నదీజలాల వివాద చట్టం సెక్షన్–3 కింద కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుతో కృష్ణా జలాల పునఃపంపిణీ చేసే అంశంపై షెకావత్‌కు విన్నవించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్రం కోరుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ఆయా ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతులు త్వరగా ఇవ్వాల్సిందిగా ఆయన కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గెజిట్‌లోని అభ్యంతరకర అంశాలపై స్పష్టత కోరనున్నట్లు తెలిపాయి. -
నిధులపై నీళ్లు.. సాగునీటి ప్రాజెక్టులపై గెజిట్ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల పరిధిలో భారీగా బకాయిలు పేరుకుపోగా.. కృష్ణా, గోదా వరి బోర్డులపై కేంద్రం తీసుకొచ్చిన గెజిట్‌తో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. అనుమతుల్లేవని చెబుతున్న ప్రాజెక్టులకు రుణాల విడుదలలో రుణ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు నిధుల విడుదలను నిలిపివేయడంతో, ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు నిర్ణీత గడువులోగా చేరుకునే పరిస్థితి లేకుండా పోతోంది. పేరుకుపోయిన బకాయిలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా బకాయిలు పేరుకుపోయాయి. కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడటం, మరోవైపు ఇతర ప్రాధాన్యత రంగాలకు నిధుల వెచ్చింపు పెరగడంతో ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల నుంచి కేటాయింపులు తగ్గాయి. కొత్త ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులపై రూ.4,925 కోట్లు వెచ్చించగా, ఇందులో రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చింది కేవలం రూ.1,887 కోట్లు మాత్రమే. ఇక రుణాల రూపేణా వచ్చిన సొమ్ముతో మరో రూ.3,038 కోట్లు మేర ఖర్చు చేశారు. అయినప్పటికీ ఇంకా రూ.11,396 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనులు (వర్క్స్)కు సంబంధించిన బిల్లులే రూ.5,710 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. పనులకు సంబంధించిన బకాయిల్లో కాళేశ్వరం పరిధిలోనే రూ.1,200 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలోనివి రూ.300–400 కోట్ల వరకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, చివరి దశలో ఉన్న పనులకు నిధుల కొరత కారణంగా కనీసం డీజిల్ ఖర్చులకు సైతం ఇక్కట్లు తప్పట్లేదు. పాలమూరు–రంగారెడ్డి పరిధిలో మరో రూ.2 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జూలై తొలివారం వరకు వచ్చిన నిధులు ప్రాజెక్టులకు నిధుల కొరత రావద్దనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లకు ప్రైవేటు బ్యాంకులతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్ వంటి సంస్థలు రుణాలిస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది జూలై తొలివారం వరకు కాళేశ్వరానికి రూ.1,624 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.1,039 కోట్లు, కంతనపల్లికి రూ.40 కోట్లు, దేవాదులకు రూ.127 కోట్లు, సీతారామకు రూ.136 కోట్లు మేర రుణాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కాళేశ్వరం, పాలమూరుతో పాటు సీతారామలో పనులకు సంబంధించి రూ.563 కోట్లు, దేవాదులలో రూ.10 కోట్లు బకాయిలున్నాయి. మున్ముందు పనులకు రూ.2 వేల కోట్ల మేర నిధుల అవసరాలున్నాయి. గెజిట్‌తో రుణ సంస్థల వెనుకంజ ప్రస్తుతం కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ల కారణంగా రుణ సంస్థలు రుణాల విడుదలపై సందిగ్ధంలో పడ్డాయి. అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి అనుమతుల విషయమై గెజిట్‌లో కేంద్రం పలు సూచనలు చేసిన నేపథ్యంలో రుణాల విడుదలపై సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మసాగర్ బ్యారేజీ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతి తీసుకోవాలని గెజట్లో పేర్కొన్న నేపథ్యంలో రుణ సంస్థలు ఈ అంశాలపై రాష్ట్రానికి ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఆమోదం ఎప్పటిలోగా తీసుకుంటారు, ఒకవేళ అనుమతులు రాకుంటే పరిస్థితి ఏంటీ, రుణాల చెల్లింపు విషయంలో ప్రభుత్వ విధానం ఏంటని ఆరా తీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గెజిట్ వెలువడిన నాటి నుంచి కార్పొరేషన్లకు రుణ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రూ.400 కోట్ల మేర రావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులతో వాటిని వాయిదా వేస్తోంది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రుణాలే కీలకం కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మేర రుణాలు లభిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. -
‘కృష్ణా, గోదావరి గెజిట్’పై వ్యూహాలకు సర్కారు పదును
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలు, వాటి పర్యవసనాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. శుక్రవారం తొలిసారి గెజిట్‌పై విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శనివారం కూడా అధికారులతో 8 గంటల పాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహాలపై మరి ంత స్పష్టత ఇచ్చారు. ఆదివారం సమావేశం కావాలని తొలుత భావించినప్పటికీ విషయ ప్రాధాన్యత దృష్ట్యా శనివారమే సమావేశం నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. గెజిట్‌లోని రాష్ట్రానికి అభ్యంతరకరంగా ఉన్న అంశాలపై ఓవైపు పోరాడుతూనే, మరోవైపు అందులో పేర్కొన్న మేరకు ప్రాజెక్టులకు అన్ని అనుమతులు సాధించేలా ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. గెజిట్‌ను రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకుని, మరిన్ని నీటి హక్కులు సాధించుకుందామని సీఎం చెప్పారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు, సీతారామ, తుపాకులగూడెం, పాలమూరు– రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులకు నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి ఆరు నెలల్లో అనుమతులు పొందాలని గెజిట్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ భేటీలో కొంత స్పష్టత వచ్చింది. డీపీఆర్‌లు సమర్పించి ప్రాజెక్టులకు కావా ల్సిన అన్ని అనుమతులు పొందుదామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. ఏయే ప్రాజెక్టులకు ఇంకా ఎలాంటి అనుమతులు అవసరమున్నాయో చూసుకోవాలని, ఆయా అనుమతులు పొందేలా కేంద్ర విభాగాల పరిశీలనకు పంపుదామని అన్నట్టు సమాచారం. ఒకవేళ కేంద్రం ఏవైనా కొర్రీలు పెడితే వారే బద్నాం అవుతారని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా జలాల్లో బచావత్, బ్రిజేశ్‌కుమార్ కేటాయించిన జలాల్లో నిర్ణీత వాటాలను వాడుకునేలాగానే ఇప్పటిదాకా ప్రాజెక్టులు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై కృష్ణాలో మరింత వాటాను సాధించి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు సైతం నికర జలాలు దక్కేలా కేంద్రంతో కొట్లాడుదామని సీఎం అన్నట్టు అధికారులు చెబుతున్నారు. బోర్డులకు కూడా ధీటైన జవాబు.. ప్రాజెక్టుల డీపీఆర్‌లు, అనుమతులు, నీటి వినియోగం తదితరాలపై రెండు బోర్డులు వరుసగా రాస్తున్న లేఖలపైనా ఇకపై ధీటుగా జవాబివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. బోర్డులు రాసే ప్రతి లేఖకు రాష్ట్ర ప్రభుత్వ వివరణ పంపాలని, భేటీలకు సైతం హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలిసింది. అయితే సోమవారం నాటి బోర్డుల భేటీకి తెలంగాణ హాజరయ్యేదీ లేనిదీ తెలియరాలేదు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సాగునీటిశాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే, మాజీ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ అడ్వొకేట్ రవీందర్రావు, సాగునీటి శాఖ అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
CM KCR: ఆ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి దక్కే వాటాల విషయంగా ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని.. ప్రభుత్వ యంత్రాంగం అంతా పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే నదీ బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించిన, న్యాయమైన నీటివాటాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పులు, తాజాగా కేంద్రం జారీ చేసిన గెజిట్‌లోని అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఉభయరాష్ట్రాలకు ఉండే నీటివాటాల లెక్కలనూ పరిశీలించారు. కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ అంశాలపై ఆదివారం కూడా సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సాగునీటిశాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే, మాజీ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ అడ్వొకేట్ రవీందర్రావు, సాగునీటిశాఖ అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్ఈ కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభ్యంతరాలపై కేంద్రానికి లేఖ.. ఆపై సుప్రీంకు.. కేంద్ర గెజిట్‌లోని అంశాలు, వాటితో రాష్ట్ర ప్రాజెక్టులపై పడే ప్రభావం, బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు తేవడం, వాటికి అనుమతులు, నిధుల చెల్లింపులు తదితర అంశాలపైనా సమీక్షా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. గెజిట్‌లోని అంశాలకు సంబంధించి రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలపై వీలైనంత త్వరలో కేంద్రానికి లేఖలు రాయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రధానంగా ఉమ్మడి ప్రాజెక్టులు కాని వాటిని సైతం షెడ్యూల్–2లో చేర్చడం, వాటిపై బోర్డుల అజమాయిషీపై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని గెజిట్‌లో పేర్కొన్న దృష్ట్యా.. ఏ ప్రాజెక్టులకు ఏయే అనుమతులు పొందాలి, ఈ విషయంగా కేంద్ర ప్రభుత్వ శాఖలు అందించే సహకారంపై స్పష్టత కోరాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. ఇక అనుమతుల్లేని ప్రాజెక్టులకు సంబంధించి రుణాలిచ్చిన సంస్థలు వివరణ కోరుతున్న నేపథ్యంలో.. నిర్దేశిత గడువులోగా వాటికి అనుమతులు సాధిస్తామన్న స్పష్టత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆయా అంశాల్లో రాష్ట్రం లేవనెత్తే అభ్యంతరాలపై కేంద్రం స్పందించే తీరును బట్టి.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని సమావేశంలో సూచనలు వచ్చినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక సుప్రీంలో తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణ పూర్తయితే.. ఆ వెంటనే సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు, కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాం: ఏపీ ఈఎన్సీ
సాక్షి, హైదరాబాద్: జలసౌధలో జరిగిన కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శులు, కేంద్ర జలశక్తిశాఖ ప్రతినిధి తదితరులు హాజరయ్యారు. అదే విధంగా... ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎన్సీ, ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు హాజరయ్యారు. అయితే, తెలంగాణకు చెందిన ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు మాత్రం సమావేశానికి రాలేదు. ఇక భేటీ అనంతరం ఏపీ ఈఎన్సీ మాట్లాడుతూ... ‘‘గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలన్న కృష్ణా, గోదావరి బోర్డులు నోటిఫికేషన్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాం. టైం షెడ్యూల్ ప్రకారం సమాచారం కావాలని కోరారు’’ అని తెలిపారు. కాగా నదీ జలాల విషయంలో బోర్డులకు పూర్తిస్థాయి అధికారాలు కేటాయిస్తూ కేంద్రం గెజిట్ నోటిషికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. గత నెల 29న గోదావరి బోర్డు.. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం ఈ కమిటీ భేటీ నిర్వహించనున్నట్లు 30న రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే, ఈ అంశంపై సోమవారం స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రాజెక్టులను గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలకు తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందుకే వీటిని పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. బోర్డు భేటీలో అభిప్రాయాలు, మార్గదర్శకాలు తెలుసుకోకుండా నేరుగా సమన్వయ కమిటీ భేటీలో గెజిట్‌పై చర్చించడం సాధ్యం కాదని తెలిపింది. అయితే దీనిపై గోదావరి బోర్డు వెంటనే స్పందించి గత నెల 28న కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్థీ రాసిన లేఖను ప్రస్తావిస్తూ తెలంగాణకు లేఖ రాసింది. ‘గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఒక నిర్ధిష్ట సమయాన్ని పేర్కొన్నాం. దీనికి అనుగుణంగా అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తగిన సమాచారం ఆగస్టు 2లోగా మాకు ఇవ్వాలి’ అని కేంద్రం రాసిన లేఖను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీని అత్యవసరంగా నిర్వహిస్తున్నామని వెల్లడించింది. అదే విధంగా.. కృష్ణా బోర్డు సైతం 12 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారమే లేఖ రాసింది. అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడం గమనార్హం. ఈ క్రమంలో... కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహిస్తే హాజరవుతామని తెలిపింది. -
Water Dispute: సగం వాటాపై కొట్లాడదాం..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా పెంచుకునే అవకాశాలపై దృష్టి సారిం చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు బోర్డుల పరిధిని ఖరారు చేశామని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో అదే చట్టంలో పేర్కొన్న మేరకు కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్ విచారణకు పట్టుబట్టేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పునఃపంపిణీ చేసేలా కేంద్రానికి లేఖ రాయా లని భావిస్తోంది. అదే సమయంలో రాజ కీయంగా కూడా ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికను రూపొందిస్తోంది. అయితే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తుది తీర్పు వెలువడేందుకు ఏళ్ల తరబడి సమయం పట్టే అవకాశం ఉన్న దృష్ట్యా, అప్పటిలోగా, ప్రస్తుతం 66:34 శాతంగా ఉన్న నీటి వాటాల నిష్పత్తిని 50:50 శాతంగా మార్చేలా కేంద్రంపై పోరాడాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ అంశంపై అంతర్రాష్ట్ర విభాగం ఇంజనీర్లతో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ సోమ వారం సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. పునఃపంపిణీపై ఒత్తిడి పెంచాలి కేంద్రం వెలువరించిన గెజిట్ తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులకు భంగం వాటిల్లేలా ఉన్నా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నా న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదెలా ఉన్నా తొలుత చట్ట ప్రకారం వాటాలు పెంచుకునేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కృష్ణా జలాల్లో ఏ లెక్కన చూసినా తమ వాటాలు పెరగాలని తెలంగాణ తొలి నుంచి వాదిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతంలో 68.5 శాతం రాష్ట్రానిదే అయినా.. నీటి కేటాయింపులు మాత్రం 37 శాతమే ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా కృష్ణా పరివాహకం కింద సాగు యోగ్య భూమి తెలంగాణలో 37.11లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో 16.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉందని చెబుతోంది. ఈ లెక్కన రాష్ట్రానికి 811 టీఎంసీల్లో కనీసంగా 560 టీఎంసీలు దక్కాలని అంటోంది. ఈ అంశాలన్నీ అనేకమార్లు కేంద్రం దృష్టికి తెచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ ప్రస్తావించగా.. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటే న్యాయసలహా తీసుకొని కొత్త ట్రిబ్యునల్‌పై ఆలోచన చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం పిటిషన్ విత్‌డ్రా చేసుకుంది. తాజాగా కేంద్రం గెజిట్ వెలువరించిన నేపథ్యంలో నదీ జలాల వివాద చట్టం 1956లోని సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పునఃపంపిణీ చేసేలా ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. సోమవారం జరిగిన సమీక్షలో కూడా తెలంగాణకు వాటాలు పెరిగేలా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. దీంతో పాటే ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సమర్పించి, వాటికి అనుమతులు పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను వేగిరం చేయడంపై భేటీలో చర్చించారు. ఎలా చూసినా రాష్ట్ర వాటా పెరగాలి: రజత్‌కుమార్ తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నామని స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ చెప్పారు. ఇంజనీర్లతో సమీక్షకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరివాహకం, ఆయకట్టు, జనాభా.. ఏ లెక్కన చూసినా తెలంగాణకు 811 టీఎంసీల్లో 560 టీఎంసీలు దక్కాలి. అయితే తాత్కాలికంగా అయినా ఏపీ, తెలంగాణకు చెరిసగం నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. అపెక్స్ కౌన్సిల్లో చెప్పిన మేరకు, సెక్షన్–3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వాటాలు తేల్చాలి..’ అని ఆయన అన్నారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌తో న్యాయపరంగా, సాంకేతికంగా, పాలనా పరంగా ఏర్పడే ఇబ్బందులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే 2014కు ముందు చేపట్టిన దేవాదుల వంటి ప్రాజెక్టులకు డీపీఆర్‌లు కోరడంపైనే అభ్యంతరాలున్నాయని చెప్పారు. -
కీలక ప్రాజెక్టులన్నీ బోర్డుల ఆధీనంలోకి..
సాక్షి, హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించారు. రెండు రాష్ట్రాల్లో ఈ నదులు, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను మొదటి షెడ్యూల్లో ప్రస్తావించారు. మొత్తంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులను షెడ్యూల్-2లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధిం చిన ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాల్వల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకుని నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. ఆ ప్రాజెక్టుల్లోని రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ సహా ఉద్యోగులంతా బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. బోర్డులు ప్రాజెక్టులను తమ స్వాధీనంలోకి తీసుకున్నా.. గెజిట్ వచ్చేనాటికి ఉన్న కేసులు, అప్పటికే జరిగిన విషయాలపై భవిష్యత్‌లో దాఖలయ్యే కేసులకు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. షెడ్యూల్ -3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాలి. కృష్ణా బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీశైలం రిజర్వాయర్, దానిపై ఆధారపడిన ప్రాజెక్టులు.. స్పిల్‌వే, ఎడమ, కుడిగట్టు విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్ఎస్ఎస్ నాగార్జున సాగర్ పరిధిలో.. సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్ కెనాల్లు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా, సాగర్ టెయిల్ పాండ్. తుంగభద్ర, దాని పరిధిలోని హై లెవల్, లో లెవల్ కెనాల్లు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల ఎగువ కృష్ణాలో.. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్‌పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు - పాకాల ఇన్‌ఫాల్ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంపుహౌస్, ఎస్సారెస్పీ స్టేజ్ -2లోని మైలవరం రిజర్వాయర్ వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్ఎంసీ-ఎన్ఎస్-ఎల్ఎంసీ లింకు, పోలవరం–కృష్ణాలింకు,కృష్ణాడెల్టా,గుంటూరు కెనాల్. గోదావరి బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీరాంసాగర్ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు, చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్ ఎత్తిపోతలు, సీతారామ లిఫ్టు, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్. పెద్దవాగు రిజర్వాయర్ స్కీం, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు ప్రాజెక్టు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాకు గోదావరి నీళ్ల తరలింపు. పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తమపట్నం లిఫ్టు, సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్. తొర్రిగడ్డ, చింతలపూడి, చాగలనాడు, వెంకటనగరం ఎత్తిపోతలు. -
పరిశీలనలో కృష్ణా కొత్త ట్రిబ్యునల్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని, ఇందుకోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్ పరిశీలనలో ఉందని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖకు రిఫర్ చేశామని, తరచూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కృష్ణా (కేఆర్ఎంబీ), గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధిని నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించి శుక్రవా రం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థీ, కేంద్ర జలవనరుల సంస్థ (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఎస్.కె.హల్దార్, సీడబ్ల్యూసీ సభ్యుడు కుష్విందర్ వోహ్రా మీడియాతో మాట్లా డారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోని సెక్షన్ 87ను అనుసరించి.. 2020 అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేశాం. సీడబ్ల్యూసీ అధికారులు పగలూ రాత్రి పనిచేసి ఒక్కో పదాన్ని జాగ్రత్తగా ఎంచుకుని ఈ నోటి ఫికేషన్ రూపొందించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోరేమో అన్నంతగా శ్రద్ధగా అన్ని అంశాలను చేర్చారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక బంధం ఉండే దిశగా కేంద్రం చేసిన కృషిలో భాగమే ఈ నోటిఫికేషన్..’’అని వారు వివరించారు. ఏకాభిప్రాయ సాధన కోసమే ఆలస్యం రాష్ట్ర విభజన తర్వాత బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు ఇన్నేళ్లు పట్టడంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘నీటి పంపిణీ అనే అంశం సున్నితమైంది. కేంద్ర ప్రభుత్వానిది ఇక్కడ ఎంపైర్ పాత్ర. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చాలా కృషి చేయాల్సి వచ్చింది. కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం వంటి చిన్న అంశాలపై కూడా ఏకాభిప్రాయ సాధన అవసరమైంది. అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం తర్వాత రెండో సమా వేశం జరపడానికి నాలుగేళ్లు పట్టింది. ఆలస్యమైనా అన్నిపక్షాలను ఒక వేదికపైకి తేవడం, 8కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం చర్చించుకునేలా చేయ డం చాలా ముఖ్యమైన ప్రక్రియ’’అని అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలు, సందేహాలను లేవనెత్తిందని, వాటన్నిం టినీ పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. కొత్త ట్రిబ్యునల్‌పై న్యాయ శాఖ అభిప్రాయం కోరాం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, కృష్ణా జలాలను తిరిగి 4 రాష్ట్రాల మధ్య పంచాలని, ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని.. ఆ తర్వాతే బోర్డులను నోటిఫై చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ను ప్రస్తావించగా.. ‘‘అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించాం. సుప్రీంకోర్టులో కేసు విత్‌డ్రా చేసుకుంటే కేంద్రం ఈ అంశాన్ని న్యాయశాఖకు రిఫర్ చేస్తుందని చెప్పాం. కేసు విత్‌డ్రా చేసుకున్నట్టుగా జూన్ రెండో వారంలో తెలంగాణ నుంచి సమాచారం అందింది. తర్వాత మేం న్యాయశాఖకు రిఫర్ చేశాం. వారు మరింత సమాచారం కోరారు. దీనిపై రోజువారీగా వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. జలశక్తి మంత్రి కూడా ఇప్పటికే అండర్ టేకింగ్ ఇచ్చారు. న్యాయ విభాగం ఎలాంటి అభిప్రాయం చెప్తుందో తెలియదు. దానికి కట్టుబడి ఉంటాం’’అని అధికారులు స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు పంపిణీపై నియంత్రణ కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల పాలన, నియంత్రణ, నిర్వహణ విషయాలను నోటిఫికేషన్లో చేర్చామని అధికారులు తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డులు రెండు రాష్ట్రాల మధ్య నీరు, విద్యుత్ సరఫరాపై నియంత్రణ కలిగి ఉంటాయని చెప్పారు. ‘‘బోర్డులు, ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చులను రెండు రాష్ట్రాలు సమంగా భరించాలి. నోటిఫికేషన్ జారీ అయిన 60 రోజుల్లోగా రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలి. ఆమోదం పొందని ప్రాజెక్టులు ఏవి అనేది స్పష్టంగా నిర్వచించాం. షెడ్యూళ్లలో ప్రస్తావించిన మాత్రాన ప్రాజెక్టులు ఆమోదం పొందినట్టు కాదు. అవి మదింపు, ఆమోదానికి లోబడి ఉంటాయి. ప్రాజెక్టులను మూడు షెడ్యూళ్లుగా విభజించాం. షెడ్యూల్–2 ప్రాజెక్టులు పూర్తిగా ఆయా బోర్డుల నియంత్రణలో ఉంటాయి. సుహృద్భావంతో నడవని పక్షంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేపే ప్రాజెక్టులను ఇందులో చేర్చాం. వీటికి సీఐఎస్ఎఫ్ రక్షణ ఉంటుంది. షెడ్యూల్–3లోని ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా నిర్వహించుకోవచ్చు. అయితే బోర్డుల నుంచి మార్గదర్శనం తీసుకోవాల్సి ఉంటుంది.’’అని తెలిపారు. ఆమోదం పొందని ప్రాజెక్టులంటే.. ఆమోదం పొందని ప్రాజెక్టులను ఎలా నిర్ధారిస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘‘భారీ, మధ్య తరహా నీటి పారుదల, బహుళార్ధ సాధక ప్రాజె క్టు ఇలా ఏదైనా సరే.. ఆయా బోర్డుల ద్వారా మదింపు పొందనివి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోనివి, సాగునీరు, బహుళార్ధ సాధక, వర దల సలహా కమిటీ అనుమతి పొందనివి, ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టు స్వరూపంలో మార్పులు జరిగినవి అన్నీ కూడా ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలో ఉంటా’’యని కేంద్ర అధికారులు వివరించారు. -
రేపు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల
న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ రేపు(శుక్రవారం) గెజిట్లు విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల చేయనుంది. రెండు బోర్డులకు వేర్వేరుగా కేంద్రం గెజిట్లు విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదం నేపథ్యంలో గెజిట్లకు ప్రాధాన్యమేర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జల బోర్డుల పరిధి నిర్ధేశించే అధికారం కేంద్రానిదే. దీనిలో భాగంగానే వాటి పరిధిపై కేంద్రం వేర్వేరుగా గెజిట్లు విడుదల చేయడానికి సమాయత్తమైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తోందని, కేఆర్ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని కేంద్రానికి తెలిపారు. పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోందని, కేఆర్ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుందని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా.. సీఐఎస్ఎఫ్ బలగాల పరిధిలోకి ప్రాజెక్ట్‌లను తేవడమే కాకుండా తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా.. కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. -
‘అపెక్స్’కు వేళాయె
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కేంద్ర జల శక్తి శాఖ నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ భేటీకి తెలంగాణ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కేంద్రం, బోర్డులు లేవనెత్తే అన్ని అంశాలకు గట్టిగా సమాధానం ఇచ్చేలా సమగ్ర నివేదికలు తయారు చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కౌన్సిల్ చైర్మన్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన వెబినార్ ద్వారా జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ సీఎంలు, కేంద్ర జల సంఘం అధికారులు, కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు పాల్గొన నున్నారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, వాటి డీపీఆర్‌ల సమర్పణ, బోర్డుల పరిధి వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. పునఃకేటాయింపులు.. సమ న్యాయం అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం ముందు లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ఇంజనీర్లతో చర్చించారు. కేంద్రం తీరును గట్టిగా ఎండగట్టేలా నివేదికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా కేంద్రం తీరు వల్లే వివాదాలు పెరిగాయని, వారి పట్టింపు లేనితనం వల్లే అవి ముదురుతున్నాయన్న అంశాలను అపెక్స్ భేటీలో ఎత్తిచూపాలని నిర్ణయించారు. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్–3 మేరకు ఏ రాష్ట్రమైనా ఫిర్యాదు చేసిన ఏడాదిలో పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలని స్పష్టంగా ఉన్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదంటున్న రాష్ట్రం ఈ అంశంపై కేంద్రాన్ని కడిగేయాలని నిర్ణయించింది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతమే ఉన్నాయని, తెలంగాణలో ఉన్న ఆయకట్టు ప్రాంతం 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు మాత్రం సరిపోవని తెలంగాణ ఇప్పటికే కేంద్రం దృష్టికి తెచ్చింది. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు 299 టీఎంసీల నుంచి 500 టీఎంసీలకు పెరగాలని రాష్ట్రం అంటోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం విజ్ఞప్తి చేసినా, ట్రిబ్యునల్ పట్టించుకోని దృష్ట్యా, దీనిపై పునఃసమీక్షించి కేటాయింపులు చేయాలని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని గట్టిగా కోరనుంది. ఇక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 (ఏ), సెక్షన్ (బీ)లకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణకు సంబంధించిన అవసరాలను, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచారణ చేయాలని కేంద్రం స్పష్టంగా సూచించకపోవడంతో ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి న్యాయం జరగట్లేదని ప్రభుత్వం బలంగా భావిస్తోంది. ఈ అంశాలనే ప్రధాన అస్త్రాలుగా అపెక్స్ భేటీలో కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక బేసిన్లో లేని ప్రాంతాలకు కృష్ణా నది నీటిని ఏపీ ప్రభుత్వం తరలించుకొని వెళుతున్నా, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టినా, వాటిని నిలుపుదల చేయడంలో బోర్డు విఫలమైన తీరును ఎండగట్టే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాల్వలను విస్తరించడంపై అభ్యంతరం తెలపడంతోపాటు వాటిని ఆపించేలా ఒత్తిడి తీసుకురానుంది. కృష్ణా, గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని, అవన్నీ పాత ప్రాజెక్టులేనని నిరూపించే జీవోలు, అనుమతుల వివరాలతో తెలంగాణ సిద్ధమైంది. -
అపెక్స్ భేటీలో తేల్చుదాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లోని సమస్యాత్మకంగా ఉన్న అంశాలన్నింటినీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ భేటీలోనే తేల్చాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. కార్యదర్శుల స్థాయి సమావేశాలతో కీలక అంశాలపై తుది నిర్ణయాలకు రాలేమని, సీఎంల సమక్షంలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీని నిర్ణయించి బోర్డుల పరిధి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ అనుమతులు వంటి అంశాలను చర్చిస్తామని తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కృష్ణాబోర్డు తరలింపు, ప్రాజెక్టుల డీపీఆర్, పట్టిసీమ మళ్లింపు జలాలు, వరద జలాల వినియోగం, తాగునీటి వినియోగంలో 20% మాత్రమే లెక్కింపు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, పోలవరం ముంపు వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తిభవన్ లో తెలుగు రాష్ట్రాలతో భేటీ జరిగింది. దీనికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, కేంద్ర జలసంఘం సభ్యుడు ఆర్కే గుప్తా, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనా«థ్‌దాస్, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ అంతరాష్ట్ర జల విభాగపు సీఈ నర్సింహారావు తదితరులు హాజరయ్యారు. మళ్లింపు వాటాలు దక్కాల్సిందే.. భేటీలో తెలంగాణ మళ్లింపు జలాల అంశాన్ని ప్రస్తావించింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుతో మళ్లిస్తున్న జలాల మేరకు తమకూ కృష్ణా బేసిన్ లో 45 టీఎంసీల అదనపు టీఎంసీలు కేటాయిం చాలని కోరింది. ఏపీ పట్టిసీమ ద్వారా నీటిని మళ్లిస్తున్నా తెలంగాణకు వాటా మాత్రం దక్కడ డం లేదని దృష్టికి తెచ్చింది. ఈ మూడేళ్లలోనే 135 టీఎంసీల మేర నష్టపోయామంది. దీనిపై కేంద్ర కార్యదర్శి జోక్యం చేసుకుంటూ సీఎంల సమావేశాల్లో దీనిపై తుదినిర్ణయం చేద్దామని చెప్పినట్లుగా తెలిసింది. అప్పటివరకు కృష్ణా జలాల్లో పాత వాటాలు ఏపీ 512 టీఎంసీ, తెలంగాణ 299 టీఎంసీల వాటా ప్రకారమే వినియోగించుకోవాలని సూచించింది. కృష్ణాలో వృథాగా సమద్రంలోకి వెళ్తున్న సమయంలో వినియోగించిన నీటిని రాష్ట్రాల వినియోగం కింద లెక్కించరాదని ఏపీ విన్నవించింది. దీనిపైనా అపెక్స్ కౌన్సిల్లో చర్చించి నిర్ణయం చేస్తామని కేంద్రం తెలి పింది. ఇక కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధి, వర్కింగ్ మాన్యువల్‌పైనా చర్చించారు. ప్రాజెక్టులు తమ పరిధిలో ఉంటేనే వాటి నిర్వహణ సాధ్యమని కృష్ణా, గోదావరి బోర్డులు తెలిపాయి. -
కృష్ణమ్మకు కష్టం.. గోదారమ్మకూ నష్టం
సాక్షి, అమరావతి : పశ్చిమ కనుమల్లో అడ్డగోలుగా అడవుల నరికివేత గోదావరి, కృష్ణా నదుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందా.. నైరుతి రుతు పవనాల గమనాన్ని మార్చేస్తుందా.. ఈ పరిస్థితి ద్వీపకల్ప భారతావనిని దుర్భిక్షంలోకి నెడుతుందా.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) తాజా పరిశోధనలు. పశ్చిమ కనుమల్లోని అడవులను ఇష్టారాజ్యంగా నరికివేయడం వల్లే గతేడాది కేరళ, ఈ ఏడాది కర్ణాటకలో జల విలయాలు సంభవించాయనే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల గ్రీన్హౌస్ వాయువుల ప్రభావం పెరగటం ప్రమాదకరంగా పరిణమించిందనే వాస్తవాన్ని చాటుతున్నాయి. పశ్చిమ కనుమల్లో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1.15 డిగ్రీలకు పెరుగుతున్నాయని.. దీనివల్లే ఒకట్రెండు నెలల్లో కురవాల్సిన వర్షం.. మూడు నాలుగు రోజుల్లోనే కుండపోతలా కురుస్తోందని.. ఈ పరిస్థితి వరదలకు దారి తీస్తోందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాలు బలహీనపడే అవకాశం ఉందని.. ఇది ద్వీపకల్ప భారతదేశాన్ని కరువు కోరల్లోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో పశ్చిమ కోస్తా తీరానికి 1,621 కిలోమీటర్ల పొడవున గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 1.4 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పశి్చమ కనుమల్లో పచ్చటి అడవులు విస్తరించి ఉన్నాయి. నైరుతి రుతు పవనాలు పశ్చిమ కనుమల మీదుగానే కేరళలో ప్రవేశించి.. దేశమంతటా విస్తరిస్తాయి. వర్షాలు కురిపిస్తాయి. ద్వీపకల్ప భారతదేశంలో ప్రధానమైన గోదావరి, కృష్ణ, పెరియర్, పంబా తదితర జీవ నదులకు పుట్టినిల్లు పశ్చిమ కనుమలే. అక్కడ సమృద్ధిగా వర్షాలు కురిస్తే గోదావరి, కృష్ణ, పెరియర్ వంటి నదులు ఉరకలెత్తి ద్వీపకల్పాన్ని సస్యశ్యామలం చేస్తాయి. ప్రపంచం విడుదల చేసే గ్రీన్హౌస్ వాయువుల్లో ఏటా 37.5 మిలియన్ టన్నుల బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డైయాక్సైడ్)ను పశ్చిమ కనుమల్లో అడువులు పీల్చుకుని.. అంతే స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేసి పర్యావరణ సమతౌల్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇది 100 బిలియన్ డాలర్ల (రూ.2,142 కోట్లు)కు సమానం. వరదలు.. లేకుంటే ఎడారులు పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం తగ్గుదల వల్ల ఒకట్రెండు నెలల్లో కురవాల్సిన వర్షం.. రెండు మూడు రోజుల్లోనే కుండపోతగా కురుస్తోందని ఐఐఎస్సీ, సీడబ్ల్యూసీ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కుండపోతలా కురిసిన వర్షపు నీటిని అడ్డగించేందుకు అడవులు లేవు. దీనివల్ల పశ్చిమ కనుమల్లో వాగులు, వంకలు ఉప్పొంగి.. నదులు వరదెత్తేలా చేస్తున్నాయి. ఈ వరదల దెబ్బకు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. గతేడాది కేరళను వరదలు అతలాకుతలం చేయడానికి పశ్చిమ కనుమల్లో అడవుల అడ్డగోలు నరికివేతే కారణమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది కర్ణాటకను, కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహించడానికి కూడా అదే కారణమని ఐఐఎస్సీ వెల్లడించింది. పశ్చిమ కనుమల్లో ఒక్కసారిగా కుండపోత కురిసి.. ఆ తర్వాత వర్ష విరామం (డ్రై స్పెల్) వస్తే వరదతో ఉప్పొంగిన నదులు.. నీటి చుక్క లేక ఎడారులను తలపిస్తాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గోదావరి, కృష్ణా నదులే ఆధారం. పశ్చిమ కనుమల్లో అటవీ క్షయం గోదావరి, కృష్ణా నదుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుందని, ఇది ద్వీపకల్ప భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఐఎస్సీ కేంద్రానికి నివేదిక ఇచి్చంది. ద్వీపకల్పానికి గొడ్డలిపెట్టు.. ప్రపంచానికి, ద్వీపకల్ప భారతదేశానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పశ్చిమ కనుమల్లో అడవులను వ్యవసాయం, రహదారులు, ఖనిజ నిక్షేపాల వెలికితీత పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. దీనివల్ల గత రెండు దశాబ్దాల్లో పశ్చిమ కనుమల్లో అటవీ విస్తీర్ణం ఐదు శాతం తగ్గిపోయిందని ఐఎల్పీసీ సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ డైరెక్టర్ టీవీ రామచంద్ర నేతృత్వంలో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. 1985 అటవీ లెక్కల ప్రకారం పశ్చిమ కనుమల్లో 16.21 శాతం హరితారణ్యాలు ఉంటే 2019 నాటికి ఆ అడవుల విస్తీర్ణం 11.3 శాతానికి తగ్గిపోయింది. అంటే ఏడాది పొడవునా పచ్చగా ఉండే అటవీ విస్తీర్ణం 4.91 శాతం తగ్గిపోయిందని ఐఐఎస్సీ వెల్లడించింది. దీనివల్ల గ్రీన్హౌస్ వాయువులను గ్రహించే సామర్థ్యం పశ్చిమ కనుమలు 11 శాతం కోల్పోయాయి. ఇది భూతాపం పెరగడానికి దారి తీస్తోంది. పశ్చిమ తీరం వెంబడి సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.5 నుంచి 1.15 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమ కనుమల్లోనూ అదే రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల నైరుతి రుతు పవనాల ప్రవేశంలో జాప్యం చోటుచేసుకుంటోందని ఐఐఎస్సీ పరిశోధనలో మరోమారు వెల్లడైంది. నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించినా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏకరీతిగా వర్షాలు కురవడం లేదు. ఇది ద్వీపకల్ప భారతదేశంలో ఖరీఫ్ పంటలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. తీవ్ర దుర్భిక్షానికి దారి తీస్తోంది. ►పశ్చిమ కనుమల పొడవు 1,621కి.మీ ►అడవుల విస్తీర్ణం 1.40 లక్షల చ.కి.మీ. ►దీని పరిధిలో గల రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ►ఇక్కడి అడవులు పీల్చుకునే కార్బన్ డైయాక్సైడ్ 37.50 మిలియన్ టన్నులు ►ఇవి విడుదల చేసే ఆక్సిజన్ విలువకు సమానమైన మొత్తం రూ.2,142 కోట్లు ►1985 నాటికి పశ్చిమ కనుమల్లో గల హరితారణ్యాలు 16.21% ►2019 నాటికి వీటి విస్తీర్ణం 11.3% -
‘నదుల అనుసంధానానికి నిధులివ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో చేపట్టబోయే కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకి తగిన నిధులు మంజూరు చేయాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ఈ అంశంపై ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు, వరదలు భారీగా వచ్చినప్పటికీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కరువు ముప్పు తప్పేలా లేదని తెలిపారు. గత 52 ఏళ్లుగా శ్రీశైలం రిజర్వాయర్‌కు ప్రతి ఏటా వచ్చే వరద 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు తగ్గిపోతున్నా ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు గోదావరిలో ఏటా 2,780 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కరువు బారిన పడుతున్నాయని విశ్లేషించారు. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తే తప్ప ప్రతి ఏటా ఈ దుస్థితి అనివార్యమని గ్రహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు తగినంత ఆర్ధిక సాయం చేయాలని నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో జరిగిన భేటీలో కోరిన విషయం గుర్తు చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకొని నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
భగీరథ ప్రయత్నం!
-
చేయూతనివ్వండి
-
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేయూతనివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అదనపు నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.61,071.51 కోట్లు అవసరమని గత సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పేర్కొందని, తమ ప్రభుత్వం సమర్పించిన పూర్తి స్థాయి బడ్జెట్లోనూ ఇదే విషయాన్ని తెలియ చేశామన్నారు. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,739 కోట్లు మాత్రమేనన్నారు. గత ప్రభుత్వం వివిధ పనులు, పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి రూ.50 వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందువల్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అదనంగా మరో రూ.40 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30 గంటల సమయంలో 7, లోక్ కళ్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. సుహృద్భావ వాతావరణంలో సాయంత్రం 5.50 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. గోదావరి–కృష్ణా అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీతోపాటు పలు అంశాలపై సమగ్రంగా చర్చించిన ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు వినతిపత్రం కూడా సమర్పించారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలు ఇవీ.. కృష్ణా – గోదావరి అనుసంధానానికి నిధులివ్వండి.. ►కృష్ణా పరీవాహక ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి వనరైన శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం గత 52 ఏళ్లుగా చూస్తే 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలి. ►గత 30 ఏళ్లుగా ఏటా సగటున ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 2,780 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించడం ద్వారా కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుంది. పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించండి.. ►పోలవరం పనుల్లో 2014–19 మధ్య అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పాత కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించాం. ►పోలవరంలో రివర్స్ టెండరింగ్ వల్ల ఇప్పటికే రూ.838 కోట్లు ఆదా అయ్యాయి. ఇందులో హెడ్ వర్క్స్, హైడ్రో పవర్ ప్రాజెక్టు పనుల్లో రూ.780 కోట్లు ఆదా కాగా, లెఫ్ట్ కనెక్టివిటీ(65వ ప్యాకేజీ) పనులకు సంబంధించిన రూ.58 కోట్లు ఆదా అయ్యాయి. ►పోలవరం కోసం రాష్ట్రం వెచ్చించిన రూ.5,103 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలి. ►పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించాం. వరదలు తగ్గగానే పనులు ప్రారంభించి శరవేగంగా చేసేందుకు ఈ ఏడాది రూ.16 వేల కోట్లు విడుదల చేయాలి. ప్రాజెక్టు కోసం ఇంకా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. ►రూ.55,548 కోట్లతో ప్రతిపాదించిన పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేయాలి. ఇందులో భూసేకరణ, పునరావాస కార్యక్రమాలకే దాదాపు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి.. ►విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టులను కేంద్రమే నిర్మించాలి. దుగ్గరాజపట్నం వద్ద పోర్టు ఏర్పాటు సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనికి బదులుగా రామాయపట్నం వద్ద పోర్టు నిర్మించాలి. ►విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌లకు తగిన రీతిలో నిధులు విడుదల చేయాలి. సకాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా సంబంధిత శాఖలను ఆదేశించాలని కోరుతున్నాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఊతమివ్వండి.. ►ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. జిల్లాలు, వాటి ఖర్చు ప్రాతిపదికన ఈ ప్యాకేజీని రూపొందించారు. బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు కేటాయించారు. కానీ, ఏపీలో మాత్రం ఆ మొత్తం కేవలం రూ.400 మాత్రమే. అందువల్ల ఈ ప్యాకేజీ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ►ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడ్డ జిల్లాలకు ఆరేళ్లలో రూ.2,100 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.1,050 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగతా నిధులు విడుదల చేసి ఈ జిల్లాల అభివృద్ధికి ఊతమివ్వాలి. నవరత్నాలకు చేయూత ఇవ్వండి.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం ప్రకటించిన నవరత్నాలు కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఇవన్నీ జాతీయస్థాయిలో అమలు చేయదగ్గవి కాబట్టి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించాలి. కేంద్రం తరఫున సహకారం అందించాలి. హోదాతోనే సమగ్రాభివృద్ధి.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి మీకు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశాం. విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలకు రాయితీలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలి.. రాజధాని నిర్మాణం కోసం రూ. 2,500 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా రూ.1,500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరతాం. ఆ మేరకు నిధులు విడుదల చేసి రాజధాని నిర్మాణానికి తోడ్పాటు అందించాలి. రెవెన్యూ లోటు భర్తీ చేయండి.. రెవెన్యూ లోటు కింద ఇంకా రూ.18,969.26 కోట్లను విడుదల చేయాలి. సవరించిన లెక్కల మేరకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలి. రైతు భరోసా ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం.. వ్యవసాయ పెట్టుబడి కింద రైతులకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసా పథకాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించేందుకు ఈనెల 15న రాష్ట్రానికి రావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. అయితే చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తుండటం... మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఊపిరిసలపనంత బిజీగా ఉన్నందున రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ వెంట వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, రఘురామ కృష్ణంరాజు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, అదనపు కార్యదర్శి కె. ధనుంజయరెడ్డి, ఏపీ భవన్ ఓఎస్డీ భావన సక్సేనా తదితరులున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి 9.25 సమయంలో ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతం నీటి కొరతను ఎదుర్కొంటోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం గత 52 ఏళ్లుగా చూస్తే 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయింది. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పే కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ -
‘కృష్ణా–గోదావరి’కి సహకరించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో బీడు భూము లకు సాగునీరు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి చేపట్టనున్న కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి ఉదారంగా సాయం అందించాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రధాని నివాసానికి ఒక్కరే వెళ్లిన కేసీఆర్... సుమారు 50 నిమిషాలపాటు సమా వేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదుల అనుసంధా నం, ఆర్థిక మాంద్యం పరిస్థితులు, ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు సహా జోనల్ వ్యవస్థలో మార్పు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనకరం.. తెలుగు రాష్ట్రాల్లో సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి కొత్త ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు విషయమై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో పలుమార్లు చర్చించానని, ఇరు రాష్ట్రాల అధికారులు కొంతకాలంగా సాంకేతిక అంశాలపై విస్తృత అధ్యయనం జరుపుతున్నారని ప్రధానికి వివరించినట్లు తెలిసింది. వీలైనంత తక్కువ భూసేకరణ, తక్కువ నష్టంతో గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించాలని నిర్ణయించామని వివరించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నీటి పంపకాలు చేసుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చాయని ఆయన వివరించినట్లు తెలిసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఉదారంగా సాయం అందించాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం లేదా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. ఆర్థిక సాయం పెంచండి.. ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం తగ్గుతోందని, దీన్ని కొంత మేరకు అధిగమించేందుకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ. 450 కోట్లను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉందని, గత ఐదేళ్లలో నాలుగుసార్లు విడుదలైనప్పటికీ ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదని కేసీఆర్ వివరించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులను కొత్త జిల్లాలకు అనుగుణంగా ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు తెలియవచ్చింది. ఇక నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ కాకతీయ పథకానికి రూ. 5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలని కోరారు. అలాగే మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన హర్ ఘర్ జల్ పథకానికి అనుసంధానించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. వెనుకబడిన ప్రాంతాల్లో 4 వేల కి.మీ మేర రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేసీఆర్ కోరారు. అలాగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా 100 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలని విన్నవించారు. సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తిగా కేంద్రం ఖర్చుతో వరంగల్‌లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలని, వరంగల్ టెక్స్టైల్ పార్కు కోసం రూ. వెయ్యి కోట్ల నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అందించాలని కోరారు. హైదరాబాద్–నాగ్‌పూర్, వరంగల్–హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని కేసీఆర్ కోరారు. జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు కేటాయించాలని, వరద కాల్వలకు సవరించిన అంచనాల మేరకు నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలని విన్నవించారు. జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాలి.. ప్రజల ఆకాంక్షల మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని, వికారాబాద్ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్ నుంచి చార్మినార్ జోన్ పరిధిలోకి మార్చాలని నిర్ణయించామని, ఈ మార్పులకు అనుగుణంగా జోనల్ ఉత్తర్వులు సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి సహకరించాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరినట్లు తెలిసింది. జడ్జీల సంఖ్య పెంపు.. విద్యాసంస్థల ఏర్పాటుపై వినతి.. తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణలో ఐఐఎంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్)ను నెలకొల్పాలని కోరారు. హైదరాబాద్‌కు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సహా అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఉండాలన్న నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని కొత్త జిల్లాలకు వాటిని కేటాయించాలని కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, పీపీపీ పద్ధతిలో కరీంనగర్లో ఐఐఐటీ నెలకొల్పాలని కోరారు. ఇక కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక అయిన రామప్ప దేవాలయన్ని ప్రపంచ వారసత్వ సంసదగా గుర్తించాలని కోరారు. రిజర్వేషన్ల పెంపుపై వినతి.. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలని, ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, రిజర్వేషన్లు కల్పించాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలని, మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కాగా, ప్రధాని ఇటీవల చేపట్టిన అమెరికా పర్యటన గురించి సీఎం కేసీఆర్ ఈ భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యంగా హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన విషయాన్ని మోదీతో కేసీఆర్ పంచుకున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్సింగ్లతోనూ భేటీ.. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మధ్యాహ్నం 1.30 గంటలకు కలిశారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. అమిత్ షాతో భేటీలో కేసీఆర్ వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం 5.35 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా స్కైవేల నిర్మాణానికి అవసరమైన కంటోన్మెంట్ భూముల బదలాయింపు సహా వివిధ ప్రాజెక్టులకు రక్షణ భూముల కేటాయింపులపై ఆయనతో చర్చించినట్లు తెలిసింది. కంటోన్మెంట్ ప్రాంతంలో సచివాలయ భవనం, రహదారుల విస్తరణకు రక్షణ భూములను బదలాయించాలని రాజ్‌నాథ్‌ను కేసీఆర్ కోరారు. రాజ్‌నాథ్‌తో 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో కేసీఆర్ వెంట టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బండ ప్రకాశ్, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేష్ నేత, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
నీళ్లు ఫుల్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తి తీరుస్తోన్న జలాశయాల్లోకి వరద పోటెత్తుతోంది. కృష్ణా, గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో నగరానికి అత్యవసర పంపింగ్ కష్టాలు తీరాయి. నాగార్జునసాగర్ నుంచి అక్కంపల్లి మీదుగా కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నిత్యం 1,253 మిలియన్ లీటర్ల తాగునీటిని గ్రేటర్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో నాగార్జునసాగర్ వైపునకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. మరో వారం రోజుల్లో సాగర్ 590 అడుగుల గరిష్ట మట్టానికి చేరుకునే అవకాశాలున్నట్లు జలమండలి అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో సాగర్ బ్యాక్‌వాటర్ వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర మోటార్లను యుద్ధప్రాతిపదికన తొలగించామన్నారు. ఇక సిటీకి గోదావరి జలాలను తరలిస్తోన్న ఎల్లంపల్లి జలాశయానికి సైతం కాళేశ్వర గంగ పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఈ జలాశయంలో 485.560 అడుగుల గరిష్ట మట్టానికి నీటి నిల్వలు చేరడంతో జలకళ సంతరించుకుంది. ఈ జలాశయం నుంచి నగరానికి నిత్యం 771 మిలియన్ లీటర్ల జలాలను తరలిస్తున్నారు. ఆయా జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్న నేపథ్యంలో నగరవాసులకు ఇక నుంచి పుష్కలంగా తాగునీరు అందించవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ తెలిపారు. అదనంగా 200 మిలియన్ లీటర్లు నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ఎల్లంపల్లి, నాగార్జునసాగర్, అక్కంపల్లి జలాలే ఆదరువయ్యాయి. మరోవైపు నగరానికి ఆనుకొని ఉన్న ఉస్మాన్‌సాగర్(గండిపేట్), హిమాయత్‌సాగర్‌ల నుంచి సైతం నిత్యం 123 మిలియన్ లీటర్ల తాగునీటిని సేకరించి, శుద్ధి చేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. మొత్తంగా ఆయా జలాశయాల నుంచి రోజూ వారీగా 2,147 మిలియన్ లీటర్ల జలాలను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్, ఎల్లంపల్లి జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్న నేపథ్యంలో నగరానికి అదనంగా మరో 200 మిలియన్ లీటర్ల జలాలను తరలించే అవకాశాలున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ నీటిని ఇటీవల హడ్కో తాగునీటి పథకం, ఓఆర్ఆర్ తాగునీటి పథకం కింద నూతనంగా నిర్మించిన 225 భారీ స్టోరేజీ రిజర్వాయర్లలో నిల్వ చేసి నగరం నలుమూలలకు సరఫరా చేసే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు. కష్టాలుండవ్.. వర్షాకాలం ప్రారంభంలో వరుణుడు ముఖం చాటేయడంతో నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ (పుట్టంగండి) వద్ద నుంచి అత్యవసర పంపింగ్ చేపట్టి కృష్ణా జలాలు సరఫరా చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడంతో నగరానికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం మూడు, నాలుగురోజులకోసారి తాగునీరు సరఫరా అవుతున్న ప్రాంతాలకు ఇక నుంచి రోజు విడిచి రోజు సరఫరా చేయవచ్చని జలమండలి అధికారులు తెలిపారు. ఇక కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా, వేళలను కుదించడం లాంటి కష్టాలు ఉండవని అధికారులు భరోసా ఇస్తున్నారు. నీటివృథాను అరికట్టాలి సాక్షి, సిటీబ్యూరో: తాగునీరు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత జలమండలి లైన్మెన్లదేనని బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన లైన్మైన్లకు తాగునీటి వృథాపై అవగాహన కల్పించారు. నగరానికి సరఫరా చేస్తున్న నీటిలో నిత్యం 50 మిలియన్లు రహదారుల పాలవుతోందన్నారు. గుర్తించిన 150 ప్రాంతాల్లో జలమండలి లైన్మెన్లు నీటివృథాను ఎలా అరికడుతున్నారన్న అంశంపై ఎండీ ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లో ఎన్ని ఇంకుడుగుంతలు నిర్మించారు? నల్లా నీటితో వాహనాలు, వరండాలు శుభ్రం చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. పరిశీలించిన అంశాలపై లైన్మెన్లు ఓ నమూనా పూర్తిచేసి జనరల్ మేనేజర్లకు సమర్పించాలని సూచించారు. మంచినీటి పైపులైన్లకున్న వాల్వూ తిప్పితే ఎన్ని ఇళ్లకు నీరు సరఫరా అవుతుంది? ఆయా ఇళ్లకు నీటి సరఫరా, బిల్లింగ్ విషయాల్లో వస్తున్న వ్యత్యాసాలను గుర్తించాలన్నారు. ఈ పరిశీలన ద్వారా ఏ ప్రాంతాల్లో తాగునీటి వృథా జరుగుతుందన్న విషయం తెలుస్తుందన్నారు. ప్రతి ఒక్క లైన్మెన్ తమ పరిధిలో ఒక ఇంజెక్షన్ బోర్వెల్, ఒక ఇంకుడుగుంత నిర్మించే విధంగా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు–2 డైరెక్టర్ డి.శ్రీధర్‌బాబు, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్.ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ,గోదావరి
-
కృష్ణా, గోదావరిలో వాటా సాధిస్తాం
సాక్షి,పరిగి: ఉమ్మడి జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు సాధించే వరకు చేవెళ్ల జలసాధన సమితి పోరాటం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు రాకుండా కుట్రలు చేస్తున్న కేసీఆర్ ఇక్కడి రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు రెండు నదుల నుంచి 20 టీఎంసీలు సాధించేందుకు క్షేత్రస్థాయి నుంచి పార్టీల రహితంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.దివంగత వైఎస్సార్ జిల్లాను సస్యశ్యామలం చేసేందకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలు, పాలమూరు ఎత్తిపోతల నుంచి 10 టీఎంసీల నీళ్లు కేటాయించారని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాణహితను దూరం చేసి పాలమూరు ఎత్తిపోతల నుంచి రావాల్సిన నీటి వాటాను 10 టీఎంసీల నుంచి 2.8 టీఎంసీలకు కుదించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ పక్క సాగు నీటి ప్రాజెక్టులు జిల్లాకు దూరం చేస్తూ టీఆర్ఎస్ సర్కారు మోసం చేస్తుంటే మరోవైపు రంజిత్‌రెడ్డి సాగునీరు తెస్తాడంటా.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజుక్టు డిజైన్ మార్చి ద్రోహం చేసింది సీఎం కాదా...? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఎవరూ లేరని వరంగల్ జిల్లా నాయకుడిని ఎంపీ అభ్యర్థిగా దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అతిథిలాగా ఎన్నికలప్పుడే కనిపిస్తారని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన సీఎం మళ్లీ ఈ ఎన్నికల్లో కనిపించారని ఎద్దేవా చేశారు. మోసం చేసిన టీఆర్ఎస్కు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ...నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. చార్మినార్ జోన్లో కలపాలని ఉద్యమిస్తే పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల సమయంలో సమస్యను పరిష్కరిస్తానని మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సంగారెడ్డికి, చార్మినార్‌కు, వికారాబాద్‌కు జోగులాంబకు సంబంధమేంటని ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్‌చందర్‌రెడ్డి, కొమిరె లక్ష్మయ్య, నారాయణ్‌రెడ్డి, లాల్‌కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.