
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో చేపట్టబోయే కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకి తగిన నిధులు మంజూరు చేయాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ఈ అంశంపై ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు, వరదలు భారీగా వచ్చినప్పటికీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కరువు ముప్పు తప్పేలా లేదని తెలిపారు. గత 52 ఏళ్లుగా శ్రీశైలం రిజర్వాయర్‌కు ప్రతి ఏటా వచ్చే వరద 1230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు తగ్గిపోతున్నా ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు గోదావరిలో ఏటా 2,780 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కరువు బారిన పడుతున్నాయని విశ్లేషించారు. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తే తప్ప ప్రతి ఏటా ఈ దుస్థితి అనివార్యమని గ్రహించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు తగినంత ఆర్ధిక సాయం చేయాలని నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీతో జరిగిన భేటీలో కోరిన విషయం గుర్తు చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణనలోకి తీసుకొని నిధులు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment