Union Ministry Notifies Jurisdiction Of Krishna, Godavari River Boards - Sakshi
Sakshi News home page

పరిశీలనలో కృష్ణా కొత్త ట్రిబ్యునల్‌

Published Fri, Jul 16 2021 3:08 PM | Last Updated on Sat, Jul 17 2021 12:04 PM

Union Ministry Water Resources Issued Gazettes Krishna Godavari: Central - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని, ఇందుకోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ పరిశీలనలో ఉందని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖకు రిఫర్‌ చేశామని, తరచూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కృష్ణా (కేఆర్‌ఎంబీ), గోదావరి బోర్డు (జీఆర్‌ఎంబీ)ల పరిధిని నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి శుక్రవా రం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ అవస్థీ, కేంద్ర జలవనరుల సంస్థ (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ ఎస్‌.కె.హల్దార్, సీడబ్ల్యూసీ సభ్యుడు కుష్విందర్‌ వోహ్రా మీడియాతో మాట్లా డారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం లోని సెక్షన్‌ 87ను అనుసరించి.. 2020 అక్టోబర్‌లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించిన మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేశాం. సీడబ్ల్యూసీ అధికారులు పగలూ రాత్రి పనిచేసి ఒక్కో పదాన్ని జాగ్రత్తగా ఎంచుకుని ఈ నోటి ఫికేషన్‌ రూపొందించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోరేమో అన్నంతగా శ్రద్ధగా అన్ని అంశాలను చేర్చారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక బంధం ఉండే దిశగా కేంద్రం చేసిన కృషిలో భాగమే ఈ నోటిఫికేషన్‌..’’అని వారు వివరించారు.

ఏకాభిప్రాయ సాధన కోసమే ఆలస్యం
రాష్ట్ర విభజన తర్వాత బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు ఇన్నేళ్లు పట్టడంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘నీటి పంపిణీ అనే అంశం సున్నితమైంది. కేంద్ర ప్రభుత్వానిది ఇక్కడ ఎంపైర్‌ పాత్ర. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చాలా కృషి చేయాల్సి వచ్చింది. కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం వంటి చిన్న అంశాలపై కూడా ఏకాభిప్రాయ సాధన అవసరమైంది. అపెక్స్‌ కౌన్సిల్‌ మొదటి సమావేశం తర్వాత రెండో సమా వేశం జరపడానికి నాలుగేళ్లు పట్టింది. ఆలస్యమైనా అన్నిపక్షాలను ఒక వేదికపైకి తేవడం, 8కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం చర్చించుకునేలా చేయ డం చాలా ముఖ్యమైన ప్రక్రియ’’అని అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలు, సందేహాలను లేవనెత్తిందని, వాటన్నిం టినీ పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.

కొత్త ట్రిబ్యునల్‌పై న్యాయ శాఖ అభిప్రాయం కోరాం 
కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి, కృష్ణా జలాలను తిరిగి 4 రాష్ట్రాల మధ్య పంచాలని, ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని.. ఆ తర్వాతే బోర్డులను నోటిఫై చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ను ప్రస్తావించగా.. ‘‘అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించాం. సుప్రీంకోర్టులో కేసు విత్‌డ్రా చేసుకుంటే కేంద్రం ఈ అంశాన్ని న్యాయశాఖకు రిఫర్‌ చేస్తుందని చెప్పాం. కేసు విత్‌డ్రా చేసుకున్నట్టుగా జూన్‌ రెండో వారంలో తెలంగాణ నుంచి సమాచారం అందింది. తర్వాత మేం న్యాయశాఖకు రిఫర్‌ చేశాం. వారు మరింత సమాచారం కోరారు. దీనిపై రోజువారీగా వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. జలశక్తి మంత్రి కూడా ఇప్పటికే అండర్‌ టేకింగ్‌ ఇచ్చారు. న్యాయ విభాగం ఎలాంటి అభిప్రాయం చెప్తుందో తెలియదు. దానికి కట్టుబడి ఉంటాం’’అని అధికారులు స్పష్టం చేశారు.

నీళ్లు, కరెంటు పంపిణీపై నియంత్రణ 
కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల పాలన, నియంత్రణ, నిర్వహణ విషయాలను నోటిఫికేషన్‌లో చేర్చామని అధికారులు తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డులు రెండు రాష్ట్రాల మధ్య నీరు, విద్యుత్‌ సరఫరాపై నియంత్రణ కలిగి ఉంటాయని చెప్పారు. ‘‘బోర్డులు, ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చులను రెండు రాష్ట్రాలు సమంగా భరించాలి. నోటిఫికేషన్‌ జారీ అయిన 60 రోజుల్లోగా రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయాలి. ఆమోదం పొందని ప్రాజెక్టులు ఏవి అనేది స్పష్టంగా నిర్వచించాం. షెడ్యూళ్లలో ప్రస్తావించిన మాత్రాన ప్రాజెక్టులు ఆమోదం పొందినట్టు కాదు. అవి మదింపు, ఆమోదానికి లోబడి ఉంటాయి. ప్రాజెక్టులను మూడు షెడ్యూళ్లుగా విభజించాం. షెడ్యూల్‌–2 ప్రాజెక్టులు పూర్తిగా ఆయా బోర్డుల నియంత్రణలో ఉంటాయి. సుహృద్భావంతో నడవని పక్షంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేపే ప్రాజెక్టులను ఇందులో చేర్చాం. వీటికి సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ ఉంటుంది. షెడ్యూల్‌–3లోని ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా నిర్వహించుకోవచ్చు. అయితే బోర్డుల నుంచి మార్గదర్శనం తీసుకోవాల్సి ఉంటుంది.’’అని తెలిపారు.

ఆమోదం పొందని ప్రాజెక్టులంటే.. 
ఆమోదం పొందని ప్రాజెక్టులను ఎలా నిర్ధారిస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘‘భారీ, మధ్య తరహా నీటి పారుదల, బహుళార్ధ సాధక ప్రాజె క్టు ఇలా ఏదైనా సరే.. ఆయా బోర్డుల ద్వారా మదింపు పొందనివి, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తీసుకోనివి, సాగునీరు, బహుళార్ధ సాధక, వర దల సలహా కమిటీ అనుమతి పొందనివి, ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టు స్వరూపంలో మార్పులు జరిగినవి అన్నీ కూడా ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలో ఉంటా’’యని కేంద్ర అధికారులు వివరించారు.








No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement