Gazette Notifications
-
గెజిట్‌లో భూములు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం సర్వే చేశారు.. అలైన్మెంట్ ఖరారు అయింది. భూమి వివరాల ఆధారంగా మూడు గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వాటిపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తంతూ పూర్తయింది.. ఇక పరిహారం పంపిణీకి రంగం సిద్ధమైంది. కానీ తాజాగా హెక్టార్ల కొద్దీ భూమి వివరాలు రికార్డుల్లోకి రాలేదని గుర్తించారు. ఇప్పటివరకు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో వాటి వివరాలు లేకపోవడంతో హడావుడిగా ఆ భూములకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు జారీ ప్రక్రియ ప్రారంభించారు. వీటికి తొలుత 3ఏ (క్యాపిటల్), ఆ తర్వాత 3డీ నోటిఫికేషన్లు ఇస్తూ, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి గ్రామ సభల్లో సమాధానాలు చెప్పాలి. ఆ తర్వాతే పరిహారం ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది. ఏడాదిన్నర తర్వాత గుర్తింపు! రీజినల్ రింగురోడ్డులో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించే ఉత్తర భాగానికి సంబంధించిన ప్రక్రియ 2021లోనే మొదలైన విషయం తెలిసిందే. సర్వే ప్రక్రియ పూర్తి చేసి అలైన్‌మెంటు ఖరారయ్యాక గతేడాది మార్చిలో తొలి గెజిట్ నోటిఫికేషన్ 3ఏ (స్మాల్ ఏ) జారీ అయింది. అందులో ఎక్కడ ఎన్ని కి.మీ. రోడ్డు నిర్మాణం కానుందో వెల్లడించారు. ప్రభావితమయ్యే భూముల వివరాలు కూడా సేకరించారు. అనంతరం ఏప్రిల్‌లో 3ఏ (క్యాపిటల్ ఏ) నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో సేకరించే భూమి వివరాలను సర్వే నంబర్లు, విస్తీర్ణం వారీగా ప్రచురించారు. ఆ తర్వాత పట్టాదారు పేర్లతో 3డీ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అయితే మధ్యలో చాలా భూముల వివరాలు గల్లంతైన విషయాన్ని మాత్రం గుర్తించలేదు. ఇప్పుడు పరిహారం పంపిణీకి వివరాలు సిద్ధం చేస్తున్న క్రమంలో లెక్కల్లో తేడాలొచ్చాయి. 162 కి.మీ. ఉత్తర భాగం రింగురోడ్డుకు సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. కానీ పరిహారం లెక్కించే తరుణంలో భూమి తక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో మొదటి నుంచి చూస్తూ రాగా, దాదాపు 450 ఎకరాల భూమి వివరాలు గల్లంతైనట్టు గుర్తించారు. సర్వే నెంబర్ల వారీగా వాటి వివరాలు తీసి ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ చేయటం ప్రారంభించారు. ఇందులో భాగంగా తాజాగా యాదాద్రి, ఆందోల్–జోగిపేట భూసేకరణ అథారిటీ (కాలా)ల పరిధిలోని భూములకు సంబంధించి 3ఏ (క్యాపిటల్ ఏ) నోటిఫికేషన్‌ను ఎన్హెచ్ఏఐ జారీ చేసింది. యాదాద్రి కాలాకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో 185 హెక్టార్ల భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వగా, ఇప్పుడు గల్లంతైన మరో 19.20 హెక్టార్ల భూమికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందోల్–జోగిపేట కాలా పరిధికి సంబంధించి గతేడాది 94.38 హెక్టార్ల భూమికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వగా, గల్లంతైన 15.05 హెక్టార్లకు సంబంధించి తాజాగా జారీ చేశారు. వీటిపై అభ్యంతరాలు వెల్లడించేందుకు సంబం«దీకులకు గడువు ఇచ్చారు. పొరపాటు కాదు.. ఇది పొరపాటుగా జరిగింది కాదని అధికారులు చెబుతున్నారు. ‘రీజినల్ రింగురోడ్డు అలైన్‌మెంటును ప్రాథమికంగా గూగుల్ మ్యాపు ఆధారంగా చేశారు. ఈ ప్రక్రియలో కొన్ని వివరాలు గల్లంతయ్యే పరిస్థితి ఉంటుంది. నిజాం కాలం నాటి లెక్కల్లో కొన్ని వివరాలు సరిగా లేకపోవటం కూడా దీనికి కారణం..’అని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
బిల్లులు కట్టని సంస్థలకు ఎన్పీడీసీఎల్ షాక్
సాక్షి, హైదరాబాద్: భారీ మొత్తంలో విద్యుత్ బిల్లులు బకాయిపడిన పలు పరిశ్రమలు, వ్యాపార సంస్థలపై ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) కొరడా ఝుళిపించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టాన్ని ప్రయోగించింది. రెవెన్యూ శాఖ సాయంతో వాటి ఆస్తులను అటాచ్ చేసుకొని వేలం వేసేందుకు చర్యలు ప్రారంభించింది. విద్యుత్ బిల్లుల బకాయిలను చెల్లించనందున వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు పరిశ్రమలు, సంస్థల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ స్థానిక మండల తహసీల్దార్లు తాజాగా ఆర్ఆర్ యాక్ట్ కింద గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశారు. సంబంధిత పరిశ్రమలు/సంస్థలకు చెందిన భవనాలు, ఖాళీ స్థలాలు, యంత్రాలు, ఇతర ఆస్తుల జాబితాను ఈ నోటిఫికేషన్లలో పొందుపరిచారు. ఈ జాబితాను టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థ తన వెబ్సైట్లో ఉంచింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా మొత్తం బకాయిలను ఆయా సంస్థలు వడ్డీ, ఇతర చార్జీలతో సహా చెల్లించకుంటే ఆస్తులను వేలం వేసి విక్రయించడం ద్వారా బకాయిలను టీఎస్ఎన్పీడీసీఎల్ వసూలు చేసుకోనుంది. మంచిర్యాలలోని మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీ రూ. 10.35 కోట్ల బిల్లులను బకాయిపడగా ఆ పరిశ్రమకు చెందిన 165 ఎకరాలకుపైగా స్థలాలను అటాచ్ చేసినట్లు నోటీసుల్లో తహసీల్దార్లు పేర్కొన్నారు. -
జంక్షన్ల వద్ద మరింత భూసేకరణ
►వారిద్దరు అన్నదమ్ములు.. రాష్ట్ర రహదారిని ఆనుకుని వారికి 15 ఎకరాల పొలం ఉంది. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఆ రహదారిని క్రాస్ చేసే చోట నిర్మించే కూడలికి తొలుత 50 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు ప్రాథమిక అలైన్‌మెంటు రూపొందించారు. దీనివల్ల ఆ అన్నదమ్ములు తమ పొలంలో ఐదెకరాలు కోల్పోవాల్సి వస్తుందని తేలింది. అన్నదమ్ములు పోనీలే అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఆ జంక్షన్‌ను మరింత పెద్దదిగా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో వారు తమ మొత్తం పొలం కోల్పోవాల్సి వస్తోంది. ►ఆయనో వ్యాపారి.. జాతీయ రహదారికి చేరువలో ఆయనకు కొంత ఖాళీ స్థలం, ఓ మిల్లు ఉంది. ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసే చోట నిర్మించే ఇంటర్ ఛేంజర్‌కు 63 ఎకరాలు కావాల్సి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. ఈ మేరకు రూపొందించిన అలైన్మెంటులో ఆ వ్యాపారి స్థలం కూడా ఉంది. దీంతో తన మిల్లుకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆ స్థలం మినహాయించినా సరిపోతుందని భావించిన అధికారులు ఓ ప్లాన్ రూపొందించారు. కానీ తాజాగా విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఆయనకున్న ఖాళీ స్థలంతోపాటు మిల్లు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ ఛేంజర్ల డిజైన్ మారటం.. వాటికి చేరువగా ఉన్న భూ యజమానులపై పెద్ద ప్రభావాన్నే చూపుతోంది. కొత్తగా విడుదలైన గెజిట్ నోటిఫికేషన్లు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముందనుకున్న ప్లాన్‌ను మారి ఉన్నట్టుండి కొత్త ప్లాన్ తెరపైకి రావటం, భారీగా భూ సమీకరణ చేయాల్సిన పరిస్థితి తలెత్తడమే ఇందుకు కారణం. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ కసరత్తును వేగవంతం చేసిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఇందుకోసం ఒక అదనపు కలెక్టర్, ఏడుగురు ఆర్డీఓల పరిధితో కూడిన ఎనిమిది క్లస్టర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటికి వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉండగా.. గత ఏప్రిల్‌లో మూడు, రెండు రోజుల క్రితం నాలుగు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ల వివరాలు చూసి, జంక్షన్లకు చేరువగా ఉన్న కొందరు భూ యజమానులు లబోదిబోమంటున్నారు. 11 చోట్ల ఇంటర్ ఛేంజర్లు రింగురోడ్డు ఉత్తరభాగంలో 11 చోట్ల ఇంటర్ ఛేంజ్ నిర్మాణాలు (జంక్షన్లు) రానున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇతర రోడ్లను క్రాస్ చేసే చోట జంక్షన్లు నిర్మిస్తారు. ఒక్కో జంక్షన్ 50 నుంచి 60 ఎకరాలలో ఉండేలా తొలుత డిజైన్ చేశారు. వాటిని ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్పించారు. సాధారణంగా జంక్షన్ల వద్ద వాహనాలు 30 కి.మీ. వేగానికి పరిమితం కావాల్సి ఉంటుంది. ఔటర్ రింగురోడ్డు కూడళ్లపై నిర్మించిన ఇంటర్ చేంజర్లను అలాగే డిజైన్ చేశారు. కానీ ఆర్ఆర్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే అయినందున ఇంటర్ ఛేంజర్లపై వాటి వేగం 50 నుంచి 60 కి.మీ. వరకు ఉండేలా చూడాలని తాజాగా నిర్ణయించిన అధికారులు ఇంటర్ ఛేంజర్ల డిజైన్లను మార్చారు. చాలా దూరం నుంచే మలుపు ఉండేలా చేయటంతో ఒక్కో జంక్షన్ విస్తీర్ణం 70 నుంచి 80 ఎకరాలకు పెరిగింది. ఈ మేరకు అక్కడ భూమిని సమీకరించాల్సి వచ్చింది. తాజాగా విడుదలైన గెజిట్లలో ఈ విషయం గుర్తించి, భూములు కోల్పోతున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎనిమిదో గెజిట్ నోటిఫికేషనూ విడుదల ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియకు పచ్చజెండా ఊపే చివరి 8వ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. తూప్రాన్ ఆర్డీఓ పరిధిలో దాతర్‌పల్లె, గుండారెడ్డి పల్లె, ఇస్లాంపూర్, కిష్టాపూర్, నాగులపల్లె, నర్సంపల్లె, వట్టూరు, వెంకటాయపల్లె గ్రామాలకు సంబంధించిన 176.6176 హెక్టార్ల మేర భూమిని సేకరించేందుకు అనుమతినిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన 158.64 కి.మీ. నిడివితో రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ ప్రక్రియకు అనుమతినిస్తూ 3 ఏ గెజిట్ నోటిఫికేషన్లు అన్నీ విడుదల అయినట్టయింది. -
కృష్ణా, గోదావరి గెజిట్లు అమలయ్యేనా?
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడటమే లక్ష్యంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు గడువు సమీపిస్తోంది. కానీ.. ఇప్పటికీ షెడ్యూల్–2లో ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల గడువును కేంద్రం మరోసారి పొడిగిస్తుందా.. లేదంటే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి కృషిచేస్తుందా.. అన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగురాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటుచేస్తూ 2014 మే 28న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కానీ పరిధిని కేంద్రం ఖరారు చేయకపోవడంవల్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో బోర్డులు ప్రభావం చూపలేకపోతున్నాయి. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించారు. తక్షణమే బోర్డుల పరిధిని ఖరారుచేయాలని విజ్ఞప్తిచేశారు. మరోవైపు నీటి కేటాయింపులు జరిగే వరకు బోర్డుల పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోసిపుచ్చుతూ బోర్డుల పరిధిని ఖరారు చేస్తామని తేల్చిచెప్పారు. తరువాత కేంద్రం ఈ విషయంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో కలిసేలా చేస్తోంది. ఇలా ఏపీ హక్కులను కాలరాస్తుండటాన్ని గతేడాది జూన్‌లో ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఎట్టికేలకు గెజిట్ నోటిఫికేషన్లు జారీ ఏపీ హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై సీఎం జగన్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గతేడాది జూలై 15న రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీచేసింది. నోటిఫికేషన్ జారీచేసిన రోజు నుంచి ఆరునెలల్లో అంటే 2022 జనవరి 15న అమల్లోకి రావాలి. నోటిఫికేషన్ అమలుపై పలుమార్లు బోర్డులతో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఒకేసారి సీడ్‌మనీ కింద రూ.200 కోట్లు డిపాజిట్ చేయలేమని, ఎప్పటికప్పుడు నిర్వహణ వ్యయాన్ని అందజేస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయి. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగిస్తామని తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేవరకు ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. అలాగే అనుమతిలేని ప్రాజెక్టులకు అనుమతి తీసుకునేందుకు ఏపీ సర్కార్ సీడబ్ల్యూసీకి డీపీఆర్‌లు సమర్పించింది. కానీ, తెలంగాణ సర్కార్ కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే డీపీఆర్‌లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును ఆరునెలలు పొడగిస్తూ ఫిబ్రవరి 2న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ నోటిఫికేషన్లు ఈనెల 15 నుంచి అమలు కావాల్సి ఉంది. కుదరని ఏకాభిప్రాయం గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎం.పి.సింగ్, ఎం.కె.సిన్హా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పాతపాటే పాడుతోంది. దీంతో ఈనెల 15 నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్లు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును కేంద్రం మరోసారి పొడగిస్తుందా? లేదంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధకు కృషిచేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. -
‘గెజిట్’తో నదులు, ప్రాజెక్టుల స్వాధీనం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులు, వాటిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రముఖ న్యాయనిపుణుడు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్టు కేంద్రం చెపుతోందని, అయితే నదులు, వాటిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ఈ చట్టం లో ఎక్కడా లేదన్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసి, వాటి అధికార పరిధిని నిర్ణయించే అవకాశమే కేంద్రానికి ఉందన్నారు. గెజిట్ నోటిఫికేషన్‌పై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం శనివారం ఇక్కడ నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డుల అధికార పరిమితిని నిర్వచించే సాకుతో గెజిట్ ద్వారా కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కుందని విమర్శించారు. దీనివల్లరూ.70 వేల కోట్ల అంచనాలతో తెలంగాణ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత అర్ధంతరంగా నిలిపివేయాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులు ఆగిపోతే రాష్ట్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. కేంద్రం తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయసమ్మతంగా ఉండాలి: తెలంగాణ భౌ గోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నదీ జలాల్లో న్యాయమైన కేటాయింపులను జరపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలతో నీళ్లను తీసుకోవాలంటే అధిక సమయం, వ్యయం అవుతుందని, అదే ఏపీలో కేవలం ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం ద్వారా నీళ్లు వస్తాయని అన్నారు. కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా కొనసాగుతోందని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి విమర్శించారు. కేంద్రం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ వల్ల హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం తాగునీటి కోసం కటకటలాడాల్సి వస్తుందని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌రెడ్డిలు ఈ కార్యక్రమానికి సంధానకర్తలుగా వ్యవహరించారు. -
త్వరలో ‘అపెక్స్’ భేటీ!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి సమావేశం అజెండాను రూపొందించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. గతేడాది జూలై 15న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును అజెండాలో ప్రధానంగా చేర్చాలని సూచించారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మదింపు అంశాన్నీ పొందుపరచాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాలు సూచించిన మేరకు మిగతా అంశాలను అజెండాలో చేర్చి ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చించి అజెండాను ఖరారు చేయనున్నారు. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లతో చర్చించి వారు అందుబాటులో ఉండే రోజు అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని షెకావత్ నిర్వహించనున్నారు. అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని 2016 సెప్టెంబరు 21న కేంద్రం నిర్వహించింది. రెండో భేటీ 2020 అక్టోబర్ 6న జరిగింది. మూడో భేటీని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యేలోగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. -
11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 8 జిల్లాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 16న గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేసిన స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్‌కుమార్, తూర్పుగోదావరి నుంచి అనంత సత్యఉదయ్‌భాస్కర్, గుంటూరు నుంచి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, చిత్తూరు నుంచి కృష్ణరాఘవ జయేంద్రభరత్, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావులు ఎన్నికైనట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. -
రేపట్నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ అమలు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. అనేక చర్చలు, వాదోపవాదాలు, అభ్యంతరాల నడుమ ప్రయోగాత్మకంగా తొలిదశలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ప్రాజెక్టుల నుంచి కేంద్రం స్వాధీన ప్రక్రియ మొదలు పెట్టనుంది. గోదావరిలో ఒక్క పెద్దవాగు ప్రాజెక్టుపై బోర్డు పెత్తనం ఉండనుండగా కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై ఉన్న 16 ఔట్లెట్లను స్వాధీనం చేసుకొని నిర్వహణ బాధ్యతలు చూసేలా రంగం సిద్ధం చేసుకుంది. కృష్ణాలో బోర్డు ప్రతిపాదించిన ఔట్లెట్లపై ఏపీ నుంచి అభ్యంతరాలు లేకున్నా తెలంగాణ మాత్రం విద్యుదుత్పత్తి కేంద్రాలు (పవర్‌హౌస్)లపై బోర్డు పెత్తానాన్ని సహించలేమని స్పష్టం చేస్తోంది. ప్రతిపాదిత ఔట్లెట్లను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏపీ సమ్మతిస్తుండగా తెలంగాణ మాత్రం తమ ప్రభుత్వంతో చర్చించాకే వైఖరిని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర్వుల జారీపై సందిగ్ధత నెలకొంది. పవర్‌హౌస్‌లపై వాడీవేడిగా చర్చ... ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసే క్రమంలో సోమవారం గోదావరి బోర్డు భేటీ కాగా మంగళవారం కృష్ణా బోర్డు భేటీ జలసౌధలో జరిగింది. కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈ మోహన్‌రావు తదితరలు పాల్గొన్నారు. ఏపీ తరఫున జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చంతా బోర్డుల పరిధిలో ఉండాల్సిన ప్రాజెక్టులపైనే జరిగింది. కృష్ణా బోర్డు సబ్ కమిటీ మొత్తంగా శ్రీశైలంపై ఉన్న 12 ఔట్లెట్లు, సాగర్ పరిధిలోని 18 ఔట్లెట్లను కలిపి మొత్తం 30 ఔట్లెట్లు బోర్డు పరిధిలో ఉంచాలని ప్రతిపాదించింది. అయితే దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పవర్‌హౌస్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్డు అధీనానికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ‘కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా పెరగాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం కొత్త ట్రిబ్యునల్ వేయాలని ఇప్పటికే కేంద్రం, కోర్టు ముందు ప్రతిపాదనలు పెట్టాం. ఈ దశలో నీటి కేటాయింపులు తేలేదాక గెజిట్ అమలును ఆపాలి’ అని రజత్ కుమార్ వాదించారు. అయితే గెజిట్ వెలువడ్డాక, అమలును ఆపలేమని బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏపీ తరఫున శ్యామలరావు మాట్లాడుతూ విద్యుదుత్పత్తి ఆపాలని పదేపదే కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని, తక్షణమే విద్యుదుత్పత్తి ఆపేలా చూడాలని కోరారు. దీనికి రజత్ కుమార్ స్పందిస్తూ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీవ్రంగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అయినందున ఉత్పత్తి ఆపడం కుదరదని తేల్చిచెప్పారు. దీనిపై మరోమారు కల్పించకున్న శ్యామల్రావు... ఈ ఏడాది పులిచింతల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుపుతున్నారన్న తమ ఫిర్యాదు నేపథ్యంలో గెజిట్ వెలువడిందని... ఈ నేపథ్యంలో పవర్‌హౌస్‌లను కాదని మిగిలిన ఔట్లెట్లను బోర్డు పరిధిలో ఉంచుతామంటే కుదరదని ఏపీ తేల్చిచెప్పింది. 16 ప్రాజెక్టులపై బోర్డు తీర్మానం... ఇరు రాష్ట్రాల వాదోపవాదాల అనంతరం పవర్‌హౌస్‌లు కలుపుకొని 16 ఔట్లెట్లను తన పరిధిలోకి తీసుకునేలా బోర్డు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ఏపీ ఓకే చెప్పింది. 16 ఔట్లెట్లపై బోర్డు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వపరంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు సమ్మతించింది. అయితే దీనిపై తెలంగాణ మత్రం నిర్ణయం చెప్పలేదు. పవర్‌హౌస్‌లను సైతం తీసుకుంటామని చెబుతున్నందున దీనిపై ప్రతిపాదనలు వచ్చాక ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ప్రభుత్వ అనుమతి వచ్చాకే ఔట్లెట్లను అప్పగిస్తామని తెలిపింది. ఇక ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించినా కేవలం నిర్వహణ (ఆపరేషన్స్) మాత్రమే చూడాలని, ప్రాజెక్టులపై యాజమాన్య హక్కు (ఓనర్షిప్) మాత్రం రాష్ట్రానికే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ భేటీ అనంతరం ఒక ప్రకటన విడుదల చేసిన కృష్ణా బోర్డు... ‘శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రధాన రిజర్వాయర్ల పరిధిలో గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న అన్ని ఔట్లెట్లను ప్రాధాన్యంగా రెండు రాష్ట్రాలు ఈ నెల 14లోగా బోర్డుకు అప్పగించాలి’ అని బోర్డు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఇప్పటికే జరిగిన గోదావరి బోర్డు భేటీలో పెద్దవాగును ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించగా, దీనిపై రెండు రాష్ట్రాలు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఇక ఇరు రాష్ట్రాలు కూడా రెండు బోర్డులకు విడివిడిగా ఇవ్వాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్ మనీకి సంబందించి ప్రభుత్వంతో చర్చించాకే నిధుల విడుదలపై నిర్ణయం చెబుతామని వెల్లడించాయి. బోర్డు బాధ్యత ఇదీ... కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు కట్టబెడుతూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించగా రెండు రాష్ట్రాల్లోని నదులు, ఉపనదులపై ఎన్ని ప్రాజెక్టులుంటే అన్నింటినీ మొదటి షెడ్యూల్లో చేర్చింది. షెడ్యూల్– 2లో పేర్కొన్న ప్రాజెక్టులు 100 శాతం బోర్డుల పరిధిలో ఉంటాయి. ఈ ప్రాజెక్టుల్లోని ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ అధీనంలోకి తీసుకొని రోజువారీ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తాయి. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో కేంద్రం భద్రత కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్వహణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అధికారం బోర్డులకు ఉంటుంది. బోర్డులు తాము స్వాధీనంలోకి తీసుకునే షెడ్యూల్–1లో పేర్కొన్న ప్రాజెక్టులకు సంబంధించి.. గెజిట్ నోటిఫికేషన్ ప్రచురితమైన రోజు నాటికి హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో ఏవైనా కేసులు విచారణలో ఉన్నా, భవిష్యత్‌లో ఏవైనా కేసులు దాఖలైనా వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. షెడ్యూల్–3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. గెజిట్ ప్రకారం షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులు ఇవీ.. కృష్ణాలోః శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే, ఎడమ, కుడి గట్టు విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బంకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్ఎస్ఎస్, నాగార్జునసాగర్ పరిధిలో సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్ కెనాల్లు, ఏఎంఆర్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా, సాగర్ టెయిల్‌పాండ్, తుంగభద్ర, దాని పరిధిలోని హైలెవల్, లోలెవల్ కాలువలు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్‌పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు–పాకాల ఇన్‌ఫాల్ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంప్‌హౌస్, ఎస్సారెస్పీ స్టేజ్–2లోని మైలవరం రిజర్వాయర్, వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్ఎంసీ–ఎన్ఎస్–ఎల్ఎంసీ లింకు, పోలవరం–కృష్ణా లింకు, కృష్ణా డెల్టా, గుంటూరు కెనాల్. గోదావరిలోః పెద్దవాగు రిజర్వాయర్ స్కీమ్, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాకు గోదావరి నీటి తరలింపు, పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తపట్టణం ఎత్తిపోతలు, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి, తొర్రిగడ్డ ఎత్తిపోతలు, చింతలపూడి ఎత్తిపోతలు, చాగలనాడు ఎత్తిపోతలు, వెంకటనగరం ఎత్తిపోతలు, శ్రీరాంసాగర్ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు (అదనంగా రోజుకు ఒక టీఎంసీ), చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకులగూడెం బ్యారేజి, ముక్తేశ్వర్ ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతల, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లు. -
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు సంపూర్ణ సహకారం అందించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. నోటిఫికేషన్లో సవరణల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ స్పందన ఆధారంగా ముందుకెళ్తామని తెలిపాయి. బుధవారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు సమావేశం ముగిశాక... కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ అమలే అజెండాగా కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్, గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ల అధ్యక్షతన బోర్డులు ఉమ్మడిగా సమావేశమయ్యాయి. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–1, 2, 3 లో పేర్కొన్న ప్రాజెక్టుల వివరాలను తక్షణమే అందజేయాలని రెండు రాష్ట్రాలను కోరాయి. గతనెల 3న జరిగిన సమన్వయ కమిటీ సమావే శానికి, 9న జరిగిన బోర్డుల ఉమ్మడి సమావేశా నికి గైర్హాజరైన తెలంగాణ అధికారులు ఉమ్మడి భేటీకి హాజరయ్యారు. కృష్ణానదిపై ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు లను బోర్డులు అధీనంలోకి తీసుకుని, నిర్వహిం చాలని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామ లరావు సూచించారు. ఇతర ప్రాజెక్టుల్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను రోజువారీ సేకరించి.. వాటా కింద లెక్కించాలని ప్రతిపాదించారు. దీనివల్ల బోర్డులపై భారం తగ్గుతుందన్నారు. తెలంగాణ అధికారులు కూడా ఇదేరీతిలో స్పందించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం అన్ని ప్రాజెక్టుల వివరాలు అందజేయాలని, అభ్యంతరాలుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డుల చైర్మన్లు సూచించారు. నోటిఫికేషన్లో సవరణలు చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖను కోరినట్లు రెండు రాష్ట్రాల అధికారులు వివరించారు. కృష్ణా బేసిన్లో విద్యుదుత్పత్తి కేంద్రాలపై చర్చించాలని ఏపీ అధికారులు పట్టుబట్టగా.. తెలంగాణ అధికారు లు అభ్యంతరం తెలిపారు. కృష్ణాజలాల తరహా లోనే ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 66 శాతాన్ని ఏపీకి కేటాయించాలని అధికారులు కోరారు. సాగర్ కుడికాలువ, టెయిల్‌పాండ్, పులిచింతల విద్యు త్ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఏపీకే కేటా యించాలని, సాగర్ ఎడమకాలువ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను దామాషా పద్ధతిలో పంపిణీ చేయాలని ఏపీ అధికారులు కోరారు. ఈ ప్రతిపాదనలపై తెలంగాణ అధికా రులు అభ్యంతరం తెలిపారు. దీంతో వాటిపై మరో సమావేశంలో చర్చిద్దామని కృష్ణా బోర్డు చైర్మన్ సూచించారు. ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలతో సంబంధంలేని ప్రకాశం బ్యారేజీ కాలువల వ్యవస్థను కృష్ణా బోర్డు, ధవళేశ్వరం బ్యారేజీ కాలువల వ్యవస్థను గోదావరి బోర్డు పరిధి నుంచి మినహాయించాలని ఏపీ అధికా రులు కోరారు. రెండురాష్ట్రాల అధికారుల సూచనల మేరకు బోర్డుల పరిధి, స్వరూపాన్ని ఖరారు చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి, నిపుణుడు, సభ్యుడు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర విభాగాల సీఈలు, జెన్కో సీఈల నేతృత్వంలో సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. -
కేంద్రం ఎలా చెబితే అలా
సాక్షి, హైదరాబాద్: కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలుపై తెలుగు రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల వివరాలను కృష్ణా, గోదావరి బోర్డులు కేంద్రానికి నివేదించనున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన నెల రోజుల్లోగా గెజిట్‌లోని అంశాల అమలుకు నిర్దిష్ట కార్యాచరణ పూర్తి చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన సమన్వయ కమిటీ, బోర్డుల అత్యవసర భేటీ వివరాలను మంగళవారమే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక రూపంలో పంపనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా బోర్డులు తదుపరి కార్యాచరణను మొదలు పెట్టే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అత్యవసర భేటీ అసంపూర్ణమే.. ఈ నెల 3న బోర్డులు ఉమ్మడిగా నిర్వహించిన సమన్వయ కమిటీ భేటీకి దూరంగా ఉన్న తెలంగాణ, సోమవారం నాటి అత్యవసర బోర్డుల భేటీకి కూడా దూరంగా ఉంది. సోమవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ తరఫున జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో బోర్డులకు సిబ్బంది నియామకం, నిధుల విడుదల, బోర్డు స్వరూపం తదితరాలపై చర్చించారు. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం, అనుమతుల్లేని ప్రాజెక్టులు, సీఐఎస్ఎఫ్ భద్రత, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు ఏపీ సహకారాన్ని బోర్డులు కోరాయి. గెజిట్‌లో పేర్కొన్న మేరకు అన్ని నివేదికలు, వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. దీనిపై స్పందించిన ఏపీ షెడ్యూల్–2, 3లో పేర్కొన్న కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపింది. వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొంది. దీంతో కేంద్రానికి నివేదించే అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని బోర్డులు పేర్కొన్నాయి. బోర్డుల నిర్వాహక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించాలని కోరగా అందుకు ఏపీ అంగీకరించింది. అనంతరం బోర్డులు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. తెలంగాణ సభ్యులు ఎవరూ ఈ భేటీకి హాజరు కాలేదని తెలిపాయి. వివిధ అంశాలపై ఏపీ అధికారుల స్పందనను తెలియజేశాయి. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత అంశంపై కేంద్ర హోంశాఖతో కేంద్ర జల్‌శక్తి శాఖ చర్చిస్తోందని తెలిపాయి. నిర్దిష్ట గడువులకు అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ అమలుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరాయి. గెజిట్ అమలుకు సహకరిస్తాం: ఏపీ బోర్డులకు సంబంధించి వెలువడిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 14 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని, దీనికి తగ్గట్టుగా ప్రాజెక్టుల వివరాలు బోర్డులకు అందిస్తామన్నారు. -
పరిశీలనలో కృష్ణా కొత్త ట్రిబ్యునల్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని, ఇందుకోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్ పరిశీలనలో ఉందని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖకు రిఫర్ చేశామని, తరచూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కృష్ణా (కేఆర్ఎంబీ), గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధిని నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించి శుక్రవా రం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థీ, కేంద్ర జలవనరుల సంస్థ (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఎస్.కె.హల్దార్, సీడబ్ల్యూసీ సభ్యుడు కుష్విందర్ వోహ్రా మీడియాతో మాట్లా డారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోని సెక్షన్ 87ను అనుసరించి.. 2020 అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేశాం. సీడబ్ల్యూసీ అధికారులు పగలూ రాత్రి పనిచేసి ఒక్కో పదాన్ని జాగ్రత్తగా ఎంచుకుని ఈ నోటి ఫికేషన్ రూపొందించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోరేమో అన్నంతగా శ్రద్ధగా అన్ని అంశాలను చేర్చారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక బంధం ఉండే దిశగా కేంద్రం చేసిన కృషిలో భాగమే ఈ నోటిఫికేషన్..’’అని వారు వివరించారు. ఏకాభిప్రాయ సాధన కోసమే ఆలస్యం రాష్ట్ర విభజన తర్వాత బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు ఇన్నేళ్లు పట్టడంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘నీటి పంపిణీ అనే అంశం సున్నితమైంది. కేంద్ర ప్రభుత్వానిది ఇక్కడ ఎంపైర్ పాత్ర. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చాలా కృషి చేయాల్సి వచ్చింది. కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం వంటి చిన్న అంశాలపై కూడా ఏకాభిప్రాయ సాధన అవసరమైంది. అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం తర్వాత రెండో సమా వేశం జరపడానికి నాలుగేళ్లు పట్టింది. ఆలస్యమైనా అన్నిపక్షాలను ఒక వేదికపైకి తేవడం, 8కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం చర్చించుకునేలా చేయ డం చాలా ముఖ్యమైన ప్రక్రియ’’అని అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలు, సందేహాలను లేవనెత్తిందని, వాటన్నిం టినీ పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. కొత్త ట్రిబ్యునల్‌పై న్యాయ శాఖ అభిప్రాయం కోరాం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, కృష్ణా జలాలను తిరిగి 4 రాష్ట్రాల మధ్య పంచాలని, ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని.. ఆ తర్వాతే బోర్డులను నోటిఫై చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ను ప్రస్తావించగా.. ‘‘అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించాం. సుప్రీంకోర్టులో కేసు విత్‌డ్రా చేసుకుంటే కేంద్రం ఈ అంశాన్ని న్యాయశాఖకు రిఫర్ చేస్తుందని చెప్పాం. కేసు విత్‌డ్రా చేసుకున్నట్టుగా జూన్ రెండో వారంలో తెలంగాణ నుంచి సమాచారం అందింది. తర్వాత మేం న్యాయశాఖకు రిఫర్ చేశాం. వారు మరింత సమాచారం కోరారు. దీనిపై రోజువారీగా వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. జలశక్తి మంత్రి కూడా ఇప్పటికే అండర్ టేకింగ్ ఇచ్చారు. న్యాయ విభాగం ఎలాంటి అభిప్రాయం చెప్తుందో తెలియదు. దానికి కట్టుబడి ఉంటాం’’అని అధికారులు స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు పంపిణీపై నియంత్రణ కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల పాలన, నియంత్రణ, నిర్వహణ విషయాలను నోటిఫికేషన్లో చేర్చామని అధికారులు తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డులు రెండు రాష్ట్రాల మధ్య నీరు, విద్యుత్ సరఫరాపై నియంత్రణ కలిగి ఉంటాయని చెప్పారు. ‘‘బోర్డులు, ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చులను రెండు రాష్ట్రాలు సమంగా భరించాలి. నోటిఫికేషన్ జారీ అయిన 60 రోజుల్లోగా రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలి. ఆమోదం పొందని ప్రాజెక్టులు ఏవి అనేది స్పష్టంగా నిర్వచించాం. షెడ్యూళ్లలో ప్రస్తావించిన మాత్రాన ప్రాజెక్టులు ఆమోదం పొందినట్టు కాదు. అవి మదింపు, ఆమోదానికి లోబడి ఉంటాయి. ప్రాజెక్టులను మూడు షెడ్యూళ్లుగా విభజించాం. షెడ్యూల్–2 ప్రాజెక్టులు పూర్తిగా ఆయా బోర్డుల నియంత్రణలో ఉంటాయి. సుహృద్భావంతో నడవని పక్షంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేపే ప్రాజెక్టులను ఇందులో చేర్చాం. వీటికి సీఐఎస్ఎఫ్ రక్షణ ఉంటుంది. షెడ్యూల్–3లోని ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా నిర్వహించుకోవచ్చు. అయితే బోర్డుల నుంచి మార్గదర్శనం తీసుకోవాల్సి ఉంటుంది.’’అని తెలిపారు. ఆమోదం పొందని ప్రాజెక్టులంటే.. ఆమోదం పొందని ప్రాజెక్టులను ఎలా నిర్ధారిస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘‘భారీ, మధ్య తరహా నీటి పారుదల, బహుళార్ధ సాధక ప్రాజె క్టు ఇలా ఏదైనా సరే.. ఆయా బోర్డుల ద్వారా మదింపు పొందనివి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోనివి, సాగునీరు, బహుళార్ధ సాధక, వర దల సలహా కమిటీ అనుమతి పొందనివి, ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టు స్వరూపంలో మార్పులు జరిగినవి అన్నీ కూడా ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలో ఉంటా’’యని కేంద్ర అధికారులు వివరించారు. -
తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
- ఏపీలో ప్రభుత్వం ఏర్పడే దాకా కొనసాగింపు - గెజిట్ విడుదల చేసిన రాష్ట్రపతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఆదివారం విడుదల చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటునకు టీడీపీ సమయం కోరిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంటుందని గెజిట్‌లో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితుల నేపథ్యంలో మార్చి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో పెడుతూ రాష్ట్రపతి పాలన విధించిన విష యం తెలిసిందే. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 ప్రకారం జూన్ 2న అపాయింటెడ్ డే అమలులోకి రానున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాం తాల్లో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో స్పష్టమైన మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ తాము జూన్ 2న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్ నరసింహన్‌కి తెలియజేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో మెజార్టీ సాధించిన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరిం త గడువు కావాలని కోరింది. ఇరు పార్టీల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ రాష్ట్రపతికి ఓ నివేదిక పంపారు. వీటిని పరిశీలించిన అనంతరం తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని గె జిట్ విడుదల చేశారు. -
అడ్మిషన్లపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్
రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలందిచేలా ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న ప్రవేశాల విధానం కొనసాగింపు, ఉన్నత విద్యా మండలి సహా రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు ఉమ్మడి రాష్ట్రాలకు సేవలందించేలా త్వరలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్లలో పొందుపరచాల్సిన అంశాలపై ఉన్నత విద్యా మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూలులో ఉన్నత విద్యా మండలితోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ద్రవిడ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూకేటీ), శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలతోపాటు మరో 100 రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థలు ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలి. చట్టం ప్రకారం మొదటి ఏడాదిలోగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వీటి సేవల విషయంలో పరస్పర అంగీకారానికి రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా మండలి పరిధిలోని ఆరు విద్యా సంస్థలు అపాయింటెడ్ డే జూన్ 2నుంచి వచ్చే ఏడాది జూన్ 2 వరకు రెండు రాష్ట్రాలకు సేవలు అందించేలా గెజిట్ నోటిఫికేషన్లు సిద్ధం అవుతున్నాయి. రాష్ట్రాలు విడిపోయినా వాటి సేవలు మాత్రం రెండు రాష్ట్రాలకు అందించాలి. ఆ సేవలను కొనసాగిస్తారా? లేదా? వేర్వేరుగా ఆయా సంస్థలను ఏర్పాటు చేసుకుంటారా? అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకునే వరకు ఈ గెజిట్ నోటిఫికేషన్లు అమల్లో ఉంటాయి. ఏడాదిలోగా రెండు ప్రభుత్వాలు అవగాహనకు రాకపోతే చట్టం ప్రకారం వాటిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల విధానం పదేళ్లపాటు పాత పద్ధతి ప్రకారమే ఉంటుందని చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది.