
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడమే లక్ష్యంగా అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో చర్చించి సమావేశం అజెండాను రూపొందించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశించారు. గతేడాది జూలై 15న కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలును అజెండాలో ప్రధానంగా చేర్చాలని సూచించారు.
గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, మదింపు అంశాన్నీ పొందుపరచాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాలు సూచించిన మేరకు మిగతా అంశాలను అజెండాలో చేర్చి ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చించి అజెండాను ఖరారు చేయనున్నారు. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లతో చర్చించి వారు అందుబాటులో ఉండే రోజు అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని షెకావత్ నిర్వహించనున్నారు. అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని 2016 సెప్టెంబరు 21న కేంద్రం నిర్వహించింది. రెండో భేటీ 2020 అక్టోబర్ 6న జరిగింది. మూడో భేటీని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పునఃప్రారంభమయ్యేలోగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.