సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (జీడబ్ల్యూడీటీ) ప్రకారమే పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. జీడబ్ల్యూడీటీ అవార్డుకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు వెనుక భాగంలో వరద నీటి మట్టం ఎంత ఉంటుందో, ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతే ఉంటుందని తేల్చి చెప్పింది.
బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేశాకే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేసింది. ముంపు ప్రభావంపై సాంకేతికంగా వాస్తవాలను వివరించి, ప్రభావిత రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈనెల 7న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఈఎన్‌సీలతో సమావేశం నిర్వహించాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు నివేదిస్తామని వెల్లడించింది.
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలతో నెలాఖరులోగా చర్చించి నివేదిక ఇవ్వాలని ఈనెల 6న కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో గురువారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తా వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ అధికారి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల అధికారులు పాల్గొన్నారు.
మూడు రాష్ట్రాల ఒప్పందం మేరకే..
పోలవరం నిర్మాణానికి అంగీకరిస్తూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని, దీనిని జీడబ్ల్యూడీటీ ఆమోదించిందని ఏపీ అధికారులు గుర్తు చేశారు. దాని ప్రకారమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. గోదావరికి వందేళ్లలో గరిష్టంగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, అదే స్థాయిలో పోలవరం స్పిల్ వే నిర్మిస్తే సరిపోతుందన్నారు.
గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు వదిలేసేలా స్పిల్ వే డిజైన్‌ను సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించిందన్నారు. ఆ డిజైన్ ప్రకారమే కేంద్రం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను 2009 నాటికే ఇచ్చిందని.. ఆ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ముంపు నివారణకు సీలేరు, శబరి నదులకు కరకట్టల నిర్మాణానికి ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వందల సార్లు ఆ రాష్ట్రాలకు లేఖలు రాశామని, అయినా స్పందన లేదని చెప్పారు. ఈ కరకట్టల నిర్మాణానికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.
సీడబ్ల్యూసీ అధ్యయనమే ప్రామాణికం
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మారిన నేపథ్యంలో పర్యావరణ అనుమతిని పునఃసమీక్షించే వరకు పనులు నిలిపివేయాలని ఒడిశా, చత్తీస్‌గఢ్ కోరడంపై సీడబ్ల్యూసీ సభ్యుడు కుశ్వీందర్ వోహ్రా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిజైన్ ఏమాత్రం మారలేదని స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ చేసిన అధ్యయనంలో భద్రాచలం, మణుగూరు భారజల కర్మాగరం, భద్రాద్రి విద్యుత్‌కేంద్రం, గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ చెప్పారు. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ అత్యున్నత సంస్థ అని, అది చేసిన బ్యాక్ వాటర్ సర్వేనే ప్రామాణికమని స్పష్టంచేశారు. బ్యాక్ వాటర్‌తో ముంపు ఉండదని సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేల్చిందని చెప్పారు. గోదావరికి గరిష్ఠంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, దాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్ట్ పార్టీతో అధ్యయనం చేయించాలని తెలంగాణ కోరగా, ఆ స్థాయిలో గోదావరికి వరద వచ్చే అవకాశమే లేదని ఏపీ అధికారులు తేల్చిచెప్పారు.
పోలవరం ప్రాజెక్టులో ఈ ఏడాది నీటిని నిల్వ చేయడం వల్ల శబరి, సీలేరు ద్వారా వరద ఎగదన్ని తమ ప్రాంతం ముంపునకు గురైందన్న ఒడిశా వాదనను పీపీఏ సీఈవో కొట్టిపారేశారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీటినే నిల్వ చేయలేదని, అందువల్ల వరద ఎగదన్నిందని చెప్పడం సబబు కాదని అన్నారు. ఈ ఏడాది వరదలకు తమ రాష్ట్రాంలోనూ గిరిజన ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చత్తీస్‌గఢ్ అధికారులు చెప్పగా.. ఇంద్రావతి వరదల వల్లే ఆ ప్రాంతం ముంపునకు గురైందని సీడబ్ల్యూసీ అధికారులు తేల్చిచెప్పారు.
ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పోలవరం నిర్మాణం
Published Fri, Sep 30 2022 3:39 AM | Last Updated on Fri, Sep 30 2022 12:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment