రాష్ట్ర సమస్యల పరిష్కారం దిశగా.. మరో ముందడుగు | Andhra Pradesh committee meeting with central team appointed by PMO | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సమస్యల పరిష్కారం దిశగా.. మరో ముందడుగు

Published Sun, Jan 23 2022 2:55 AM | Last Updated on Sun, Jan 23 2022 9:58 AM

Andhra Pradesh committee meeting with central team appointed by PMO - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాతోపాటు ఇతర అంశాల పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం) ఏర్పాటు చేసిన కేంద్ర బృందం సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పీఎంవోకు కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ఈనెల 3న తనతో సమావేశమైనప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. సోమవారం కేంద్ర బృందంతో సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మరోసారి చర్చించేందుకు ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కమిటీ భేటీ అవుతోంది. 

రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండా 
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 మే 30న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తదితరులకు వి/æ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 3న ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన వివరాలు ఇలా ఉన్నాయి. 

► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి.
► రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి.
► 2014 జూన్‌ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి.
► విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు ఏపీ జెన్‌కో ద్వారా విద్యుత్‌ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్‌ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర  విద్యుత్‌ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి.
► జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్‌ ద్వారా రేషన్‌ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి.
► కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి.
► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్‌ క్లియరెన్స్‌ను రెన్యువల్‌ చేయాలి. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మెకాన్‌ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది.

సానుకూలంగా స్పందించిన ప్రధాని 
సీఎం జగన్‌ లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఆ అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పీఎంవో అధికారులను ఆదేశించారు. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ స్వామినాథన్‌ అధ్యక్షతన నలుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఈనెల 10న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బృందంతో చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 

కేంద్ర బృందం 
అజయ్‌ సేథ్, ఆర్థిక శాఖ(ఆర్థిక వ్యవహారాల విభాగం) కార్యదర్శి, పంకజ్‌కుమార్, కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి, దేబాశిస్‌ పాండా, కేంద్ర ఆర్థిక శాఖ (ఆర్థిక సేవల విభాగం), సుధాన్షు పాండే, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి. 

రాష్ట్ర బృందం 
ఆదిత్యనాథ్‌ దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సమీర్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేఎస్‌ జవహర్‌రెడ్డి, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, షంషేర్‌సింగ్‌ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజా శంకర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement