central team
-
నిండా మునిగాం.. ఆదుకోండి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: ‘‘అర్ధరాత్రి దాటాక అకస్మాత్తు వరద.. మెలకువ వచ్చి చూస్తే నీళ్లలో ఉన్నాం.. దిక్కుతోచని పరిస్థితిలో ఇంటిపైకి ఎక్కి, ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తి ప్రాణాలు మాత్రం కాపాడుకున్నాం.. కానీ సర్వం కోల్పోయాం.. నిత్యావసరాల నుంచి ఇంట్లో వస్తువుల దాకా అన్నీ కొట్టుకుపోయాయి.. ఉన్నా పాడైపోయాయి.. మా బతుకులకు ఆధారమైన పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. నిండా మునిగిపోయాం.. ఆదుకోండి’’ అని ముంపు బాధితులు కేంద్ర బృందానికి గోడు వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పరిధిలో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించి, నష్టం అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది. రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి.. ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర వరద పరిశీలన బృందం.. తొలిరోజు బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి, హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్‌సింగ్ నేతృత్వంలోని ఈ బృందంలో.. ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్‌కుమార్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతినాథ్ శివప్ప, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.కె.కుశ్వంగ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి టి.నియల్ ఖాన్సూన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్త శశివర్ధన్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి.. ఒక సబ్ టీమ్ పంట, ఆస్తి నష్టాలను పరిశీలించగా, మరో సబ్ టీమ్ తెగిపోయిన రోడ్లు, చెరువులు, వంతెనలు, కాల్వలు వంటివాటిని పరిశీలించింది. ఎక్కడిక్కడ రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు వరద నష్టాలను కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ఖమ్మంలో జిల్లాలో.. కేంద్ర బృందం సభ్యులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం భగవత్వీడ్ తండాలో కోతకు గురైన, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఖమ్మం, సూర్యాపేట మధ్యలో దెబ్బతిన్న జాతీయ రహదారిని, మల్లాయిగూడెంలో దెబ్బతిన్న రోడ్డును, పాలేరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు పడిన గండిని, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌లను పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు, తనకంపాడు, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండా, కస్నాతండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాలేరు, మున్నేరు వరదలతో తీవ్రంగా నష్టపోయామంటూ బాధితులు కేంద్ర బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యారు. రాకాసితండాలో దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. సమీపంలో ఆకేరు వరదతో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని చూశారు. ఈ సందర్భంగా తమ ఇళ్లు, పంట పొలాలు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయని.. తమను ఆదుకోవాలని మహిళలు కేంద్ర బృందం సభ్యులకు దండం పెట్టి వేడుకున్నారు. తమకు మరో ప్రాంతంలో నివాసం కల్పించాలని విన్నవించారు. మానుకోట జిల్లాలో పరిశీలించి.. కేంద్ర బృందం సభ్యులు మహబూబాబాద్ జిల్లాలోనూ రెండు సబ్ టీమ్‌లుగా పర్యటించారు. ఒక సబ్ టీమ్ సభ్యులు తొలుత మరిపెడ మండలం ఉల్లెపల్లిలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. సీతారాంతండాలో వరదతో సర్వం కోల్పోయిన ఇస్లావత్ మంగీలాల్ కుటుంబంతో మాట్లాడారు. వరద వచ్చినప్పుడు సమయమెంత? మీకు మెలకువ ఎలా వచ్చింది? సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లారు? ఎంత నష్టం జరిగింది అంటూ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మరో సబ్ టీమ్ సభ్యులు.. మరిపెడ మండలం అబ్యాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమాయ గూడెం, ముల్కలపల్లి గ్రామాల్లో తెగిన చెరువులు, రోడ్లు, వరద ప్రవాహం తీరును పరిశీలించారు. నష్టం ఫొటో ఎగ్జిబిషన్లను పరిశీలించారు. నేడు మున్నేరు ముంపు, సూర్యాపేట జిల్లాలో పర్యటన కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు. -
నష్టం అంచనా.. 11న తెలంగాణకు కేంద్ర బృందం
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా కేంద్ర బృందం సభ్యులతో కిషన్ రెడ్డి ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, కేంద్ర బృందానికి హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేపీ సింగ్ నేతృత్వం వహించనున్నారు.ఇక, ఈనెల 11న(బుధవారం) రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరు పర్యటించి నష్టం అంచనా వేయనున్నారు. అలాగే, బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.అయితే, ఆరుగురు సభ్యులతో కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. -
ఏపీలో కేంద్ర బృందం పర్యటన
-
ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యం
సాక్షి, మచిలీపట్నం: బాధ్యతాయుతమైన, స్థిరమైన ఆక్వాకల్చర్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం బృందం సభ్యులు తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం శివారులోని గిలకలదిండిలో నిరి్మస్తున్న హార్బర్‌ను ఆదివారం కేంద్ర బృందం ప్రాజెక్టు ఇండియా సహాయ ప్రతినిధి డాక్టర్ కొండ చెవ్వ, బయో డైవర్సిటీ ఎక్స్పర్ట్, కో–ఆర్డినేటర్ సీమ భట్, లీడ్ టెక్నికల్ స్పెషలిస్ట్ మురళీధరన్, ఆక్వా కల్చర్ స్పెషలిస్ట్ విష్ణుభట్, ఫైనాన్స్ స్పెషలిస్టు నీలకంఠ మిశ్రా, ఎని్వరాన్మెంటల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ నీనా కోషి, సేఫ్ గార్డ్ స్పెషలిస్టు సలోమ్ ఏసుదాస్ పరిశీలించారు.ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ (ఎఫ్ఏఓ) ఆధ్వర్యంలో వాతావరణ పరిస్థితులు, మత్స్యకారుల ఇబ్బందులు, చేపల నిల్వ, ప్యాకింగ్, నీరు, ఉప్పు శాతం, భూమి, ఇతర నమూనాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వాకల్చర్‌పై దృష్టి పెడుతుందన్నారు. మెరుగైన, సైన్స్ ఆధారిత ఆక్వాకల్చర్ నిర్వహణ పద్ధతులు, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ స్కేప్ విధానాలు అవలంబించాలని, రసాయన వినియోగం తగ్గించి స్థిరమైన ఆక్వాను ఉత్పత్తి అయ్యేలా చూడాలన్నారు.మన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగమతి చేస్తే.. రిజెక్టు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర బృందంతో భూగర్భ వనరులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. బందరును ఆక్వాహబ్‌గా మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోలార్ పవర్డ్ బోట్స్ సాంకేతికను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అనంతరం కేంద్ర బృందం కలెక్టర్ డి.కె.బాలాజీని కలిసి, హార్బర్ వద్ద సేకరించిన అంశాలను ఆయనకు వివరించింది. -
కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి కేంద్ర బృందం ఏర్పాటు
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టును తనిఖీ చేసి నాలుగు నెలల్లో నివేదిక అందజేయాలంటూ కేంద్ర జలశక్తి ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేసి, సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు, వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది. నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు. -
తుపాను, కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం జగన్ విజ్ఞప్తి
-
ఉదారంగా సిఫార్సులు చేయండి
సాక్షి, అమరావతి : తుపాను, వర్షాభావ ప్రాంతాల్లో రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. తుపాను, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందాలు క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో తాము చూసిన పరిస్థితులను, గుర్తించిన అంశాలను సమావేశంలో వివరించాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విస్తృత వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి.. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడమే కాకుండా వారికి తక్షణ సహాయాన్ని కూడా అందించాం. సహజంగా.. తుపాను ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటుతుంది. కానీ, ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైంది. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోంది. ఏపీలో ఈ–క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉంది. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతాం. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలుచేస్తున్నాం. రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయి. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా వారికి చేరుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆ మేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయండి. ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా,డీబీటీ పథకాలు బాగున్నాయి.. రాష్ట్రంలో ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, డీబీటీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ, కంటింజెన్సీ కింద విత్తనాల పంపిణీ, అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటూ బాగున్నాయి. అలాగే, గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును తాము స్వయంగా చూశామని.. ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర బృందం కితాబి చ్చింది. కౌలు రైతులకూ రైతుభరోసా భేష్.. అంతేకాక.. కౌలు రైతులకూ ఎక్కడాలేని విధంగా రైతుభరోసా అందించడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది. వరి కాకుండా పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటల వైపు మళ్లేలా చూడాలని సూచించింది. ఇదే అంశంపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ‘ఉపాధి’ పెండింగ్ నిధులు వెంటనే ఇప్పించండి.. మరోవైపు.. ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైన కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరించారు. పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని వారు కోరారు. అలాగే, తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి కూడా వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐడీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, వ్యవసాయ శాఖ జేడీ విక్రాంత్సింగ్, డీఏఎఫ్డబ్ల్యూ జాయింట్ సెక్రటరీ పంకజ్ యాదవ్ సహా రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణా శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుజాగ్రత్తతో నష్టాలనునివారించారు : కేంద్ర బృందం అనంతరం.. కేంద్ర బృందం స్పందిస్తూ.. అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామని వివరించింది. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులను పరిశీలించామని అందులోని సభ్యులు తెలిపారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామని, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్నారు. అలాగే, జలవనరులు, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూడడంతోపాటు ఉపాధి పథకాన్ని పరిశీలించినట్లు కేంద్ర బృందం తెలిపింది. తుపానుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తం కావడంవల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగిందని పేర్కొంది. సచివాలయాల రూపంలో ఇక్కడ గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని, విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని ప్రశంసించింది. ఈ–క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడాలేదని, ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు వీటిని తెలియజేస్తామని తెలిపింది. అలాగే, తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బృందం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులనూ బృందం అధికారులు వివరించారు. -
సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర బృందం చర్చించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం.. తాము చూసిన పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు. ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా కేంద్రం బృందం పేర్కొంది. విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు మెరుగ్గా ఉన్నాయని సదరు బృందం తెలిపింది. ఏపీలో అమలవుతున్న ఈ- క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని తెలిపిన కేంద్ర బృందం.. ఇవి ఇతర రాష్ట్రాల్లో అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు తెలియజేస్తామని పేర్కొంది. మిచౌంగ్ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించింది. తాము పరిశీలించిన అంశాలను సీఎం జగన్‌కు వివరించిన కేంద్ర బృందం అధికారులు అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై మొత్తంగా ఏడు జిల్లాల్లో తిరిగామని వెల్లడి. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశామన్న కేంద్ర బృందం. అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామన్న సభ్యులు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామlr, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్న కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువులు, తాగునీరు తదితర అంశాలపై చర్చ. జలవనరులు పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూశామని వెల్లడి. అలాగే ఉపాధిహామీ పథకంపైనా పరిశీలన చేశామన్న కేంద్ర బృందం. ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, డీబీటీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ, కంటిజెన్సీ కింద విత్తనాలు పంపిణీ, అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇవన్నీకూడా తాము స్వయంగా చూశామని, ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని వెల్లడి. కౌలు రైతులకు కూడా ఎక్కడా లేని విధంగా రైతు భరోసా అందించడం అభినందనీయంగా పేర్కొన్న కేంద్ర బృందం. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని కేంద్ర బృందం సూచన. పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటలవైపు మళ్లేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచన. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన అధికారులు. ఉపాధిహామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైనా కేంద్ర బృందానికి వివరాలు తెలిపిన రాష్ట్రాధికారులు. పెండింగులో ఉన్న ఉపాధిహామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని కోరిన అధికారులు. తుపాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను వివరించిన సీఎం జగన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించమే కాకుండా వారికి తక్షణ సహాయాలను కూడా అందించామని తెలిపిన సీఎం తుపాను ఏదో ఒక ఒక ప్రాంతంలో సహజంగా తీరం దాటుతుందని, కాని ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైందన్న సీఎం దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించిన సీఎం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోందని తెలిపిన అధికారులు తమ రాష్ట్రంలో ఈ- క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతామన్న సీఎం ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తున్నామన్న సీఎం రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయన్న సీఎం దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా రైతులకు చేరుతుందన్న సీఎం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆమేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని కోరిన సీఎం -
ఉదారంగా ఆదుకోండి
సాక్షి, అమరావతి/పామర్రు/గుడివాడ/కంకిపాడు: మిచాంగ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ముందెన్నడూలేని విధంగా 19 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సాయం అందించే విషయంలో ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ–విపత్తుల నిర్వహణ శాఖ) సాయిప్రసాద్ కేంద్ర బృందానికి విన్నవించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో నష్టాలను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో బుధవారం తాడేపల్లిలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ తదితరులతో కలిసి సాయిప్రసాద్ సమావేశమయ్యారు. తుపాను తీవ్రతతో కురిసిన భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని కేంద్ర బృందానికి వివరించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయని తెలిపారు. వీలైనంత మేర ఆదుకోవడానికి సహకరిస్తాం: కేంద్ర బృందం కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ మాట్లాడుతూ.. తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన నాలుగు జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తామని చెప్పారు. తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి వెంటనే అందించి వీలైనంత మేర ఆదుకోవడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. తుపాను వల్ల కలిగిన నష్టాలను విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ కేంద్ర బృందానికి వివరించారు. శాఖాపరంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.2,641 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.703 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.100 కోట్లు, ఉద్యాన శాఖకు రూ.86.97 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. మొత్తంగా మిచాంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వాటి పునరుద్ధరణకు రూ.3,711 కోట్లు సాయం అందించాలని విన్నవించారు. ఈ సమావేశం తర్వాత కేంద్ర బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లింది. గురువారం కూడా ఈ బృందం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రైతులకు న్యాయం చేస్తాం.. రాష్ట్రంలో పంట నష్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర బృందం ప్రతినిధి రాజేంద్ర రత్నూ పేర్కొన్నారు. బుధవారం కృష్ణా జిల్లా పామర్రు, కంకిపాడు, గుడివాడల్లో కేంద్ర బృందం పర్యటించింది. కంకిపాడు రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. గుడివాడ మండలం రామనపూడి, వలిపర్తిపాడు గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించింది. అలాగే పామర్రు మండలం నెమ్మలూరు, కొరిమెర్ల తదితర గ్రామాల పరిధిలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్ తదితరులతో కలిసి రాజేంద్ర రత్నూ పరిశీలించారు. నెమ్మలూరులో కౌలు రైతు ఆత్మూరి రామ కోటేశ్వరరావు కేంద్ర బృందంతో మాట్లాడుతూ సాగు చేస్తున్న 40 ఎకరాలలోని వరి పంట పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంట కాలువలు, మురుగు డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఏటా పంట నష్ట పోవాల్సి వస్తోందని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ వివిధ గ్రామాల రైతులు కేంద్రం బృందానికి అర్జీలను సమర్పించారు. మొత్తం 1,270 ఎకరాల సాగులో 1,040 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. జేసీ అపరాజితాసింగ్ స్థానికంగా జరిగిన పంట నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, కైలే అనిల్ కుమార్, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నేడు దెబ్బతిన్న ధాన్యం పరిశీలన తుపాను దాటికి దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కేంద్ర పౌరసరఫరాల శాఖ సాంకేతిక బృందం గురువారం నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో పంట కోసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యంతో పాటు ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన ధాన్యంలో విరిగిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం నమూనాలను సేకరించనుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సహాయకులను ఎంపిక చేసింది. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. ఈ క్రమంలో తేమ శాతంతో సంబంధం లేకుండా తడిచిన ధాన్యాన్ని సైతం సేకరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తుపాను ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ సైతం రాసింది. వర్షాలు తగ్గడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తోంది. -
తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన సెంట్రల్ టీం ఒకరోజు పర్యటన
-
2 గంటలు.. క్షుణ్ణంగా
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం మంగళవారం పరిశీలించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యుడు, అథారిటీ చైర్మన్ అనిల్‌జైన్, డైరెక్టర్లు కె.శర్మ, తంగమణి, రాహుల్ కె.సింగ్ తదితరులు స్థానిక అధికారులతో కలిసి మధ్యాహ్నం 12.10 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీ పూర్తిగా పోలీసు దిగ్బంధంలో ఉంది. రాకపోకలు నిలిపివేశారు. బ్యారేజీ పైకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం సభ్యులు కుంగిన బ్యారేజీని, రోడ్డును, బ్యారేజీలో పగుళ్లు ఏర్పడిన 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే బ్లాక్‌లోని 15 నుంచి 22వ పియర్ వరకు, క్రస్ట్ గేట్ల పనితీరును తనిఖీ చేసినట్లు తెలిసింది. బృందం సభ్యులు 20వ పియర్ దగ్గరి నుంచి మహారాష్ట్ర వైపునకు కాలినడకన వెళ్లారు. కొలతలు తీసుకున్నారు. దిగువకు దిగేందుకు ప్రయత్నం చేసినా తేనె తుట్టెలు ఉండడంతో ఆగిపోయినట్లు సమాచారం. బ్యారేజీ వివరాలపై ఇరిగేషన్ అధికారులు, ఎల్అండ్టీ ప్రతినిధులతో చర్చించినట్లు తెలిసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీ కొనసాగింది. కానీ ఒక్క ఇరిగేషన్ శాఖ ఈఎన్సీతో తప్ప ఇతర అధికారులెవరితోనూ వారు మాట్లాడలేదు. తమ వెంట రానివ్వలేదు. తమ పరిశీలనలో ఏం తేలిందో కూడా వారు వెల్లడించలేదు. కాగా బ్యారేజీ పరిస్థితి, ఇతర వివరాలతో తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి బృందం సభ్యులు సమర్పించన్నారు. ఎల్అండ్టీ గెస్ట్‌హౌస్‌లో భోజనానంతరం ఈ బృందం అక్కడినుంచి వెనుదిరిగింది. కాగా బ్యారేజీ పరిస్థితి, సంబంధిత వివరాలను ఇరిగేషన్ శాఖ, ఎల్అండ్టీ సంస్థ గోప్యంగానే ఉంచుతున్నాయి. ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన అధికారులను కూడా వద్దని నిలువరించినట్లు సమాచారం. కేంద్రం బృందం వెంట ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఎల్ అండ్‌టీ ప్రతినిధులు, స్థానిక ఇరిగేషన్, పోలీసు అధికారులు ఉన్నారు. మళ్లీ కుంగిన వంతెన! జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ఈనెల 21న సాయంత్రం భారీ శబ్దంతో ఓ అడుగు మేర కుంగడం కలకలం రేపింది. తెలంగాణతో పాటు పక్కనున్న మహారాష్ట్ర వాసులు ఆందోళనకు గురయ్యారు. కాగా ఆది, సోమ, మంగళవారం మూడు రోజుల్లో మళ్లీ కొంతమేర వంతెన, పియర్ కుంగినట్లు తెలిసింది. అర మీటరు లోతుకు కుంగినట్లు సమాచారం. ఎఫ్ఐఆర్ నమోదు.. బ్యారేజీ కుంగిన ఘటనపై మహదేవపూర్‌తో పాటు మహారాష్ట్రలోని పోలీసు స్టేషన్లలో అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీంతో మహదేవపూర్ పోలీసులు 174/2023 యూ/ఎస్ ఐపీసీ 427, సెక్షన్ 3 పీడీపీసీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్‌ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. జనం ఇబ్బందులు మేడిగడ్డ నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా పోచంపల్లి వరకు గోదావరిపై 1.6 కిలోమీటర్ల మేర బ్యారేజీని నిర్మించారు. ప్రస్తుతం వంతెన కొంత కుంగడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వారంతా కాళేశ్వరం మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. నిత్యం తెలంగాణ వైపు పత్తి, మిరప తోటలకు వచ్చే కూలీలు కూడా పని లేక ఇబ్బందులు పడుతున్నారు. రబీ పంటకు నీరెట్లా? మేడిగడ్డను ఖాళీ చేస్తుండటంతో రబీ పంటకు నీరెట్లా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మూడు రోజుల క్రితం వరకు బ్యారేజీలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన మహారాష్ట్ర ప్రాణహిత నది ద్వారా ప్రస్తుతం 22 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అయితే బ్యారేజీ 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిగా మరమ్మతులు చేసే వరకు ఇందులో నీటిని నిల్వ చేయడం వీలు కాదు. ఈ నేపథ్యంలోనే ఈసారి రబీ సీజన్లో ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: మహదేవపూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ కుంగిన సందర్భంలో ఆ బ్యారేజ్‌ను కేంద్రం బృందం మంగళవారం పరిశీలించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించింది. బ్యారేజీలోని ఆరవ బ్లాకు నుండి ఎనిమిదవ బ్లాకు వరకు, 15వ పిల్లరు నుండి 20వ పిల్లరు వరకు కేంద్రం బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం హైదరాబాద్‌లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం.కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొలిమెట్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. గోదావరి నదిపై రూ.1849 కోట్ల వ్యయంతో లక్ష్మీ బ్యారేజ్‌ను నిర్మించారు. 24 నెలల్లో బ్యారేజ్ నిర్మాణాన్ని ఎల్అండ్ టీ పూర్తి చేయగా, దీని నీటీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలుగా ఉంది. బ్యారేజ్ పొడువు 1.6 కిలోమీటర్లు. -
ఐదు జిల్లాల్లో భారీ నష్టం !
సాక్షి, హైదరాబాద్, బూర్గంపాడు: భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్డీఎంఏ) సలహాదారుడు కునాల్ సత్యార్థి వెల్లడించారు. వరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనట్టు తమ పరిశీలినలో తేలిందన్నారు. ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో భారీ ఆస్తి నష్టం కలిగిందన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కునాల్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం ఈ నెల 1 నుంచి 3 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమావేశమై తమ పరిశీలనకు వచ్చిన విషయాలను వివరించింది. విపత్తుల నివారణకు కేంద్ర బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని శాంతి కుమారి తెలిపారు. కేంద్రానికి సమగ్ర నివేదిక అందిస్తాం గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లో నష్టపోయిన పంటలను, ముంపు ప్రాంత ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం పరిశీలించింది. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల దెబ్బతిన్న పంటలు, రహదారుల వివరాలను బృందం స భ్యులకు వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. పంట, రహదారుల నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే అన్న బీజేపీ నేతలు వాతావరణశాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు జారీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం తగిన వేగంతో స్పందించకపోవడంతోనే తీవ్రనష్టం వాటిల్లిందని కేంద్ర వరద పరిశీలక బృందం దృష్టికి బీజేపీ ప్రతినిధి బృందం తీసుకొచ్చింది. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం మునిగిపోవడం వెనక రాష్ట్ర ప్రభుత్వ సమన్వయలేమి స్పష్టమైన ఉదాహరణగాకనిపిస్తోందని పేర్కొంది. గురువారం ఈ మేరకు కేంద్ర హోంశాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు (పీపీ) కునాల్ సత్యార్థికి బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీనేత అశ్వథ్థామరెడ్డి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందేలా చూడాలని కోరారు. -
ఎంత కష్టం.. ఎంత నష్టం
భూపాలపల్లి అర్బన్/ములుగు, ఏటూరునాగారం: ఇటీవల భారీ వరద తాకిడికి గురైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామాన్ని బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. భారీ వర్షాలు, వరద ఉధృతికి మోరంచపల్లి గ్రామంలో జరిగిన ప్రాణ, ఆస్తినష్టం గురించి కలెక్టర్ భవేష్‌మిశ్రా వివరించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తూ కేంద్ర బృందం సభ్యులు బాధితులతో మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత ములుగు జిల్లాకు చేరుకున్న బృందానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి వర్షం, వరదల నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పస్రా సమీపంలో గుండ్లవాగు వద్ద కొట్టుకుపోయిన జాతీయ రహదారిని, ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని జలగలంచ దారిని పరిశీలించారు. సాయంత్రం ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల వరద ముంపు గ్రామాలను కేంద్ర బృందం పరిశీలించింది. వరద ఉధృతి ఏ మేరకు వచ్చింది.. ఎనిమిది మంది ఎలా కొట్టుకుపోయారు.. వంటి వివరాలను సర్పంచ్ కాక వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందంలో ఎన్డీఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యారి్థ తదితరులు ఉన్నారు. -
రేపు తెలంగాణకు కేంద్ర బృందం.. నష్టాలపై నివేదిక!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వరదల నేపథ్యంలో పరిస్థితిని తక్షణమే అంచనా వేసేందుకు అమిత్‌షా ఆదేశాల మేరకు అంతర్–మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాన్ని కేంద్ర హోంశాఖ నియమించింది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. ఎన్డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల 31 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. ఎనిమిది శాఖల అధికారులతో కేంద్ర బృందం రానుంది. క్షేత్రస్థాయిలో నష్టాలను కేంద్ర బృందం అంచనా వేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివరణాత్మక నివేదిక కేంద్రానికి సమర్పిస్తుంది. అనంతరం అవసరమైతే కేంద్ర బృందం మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పిస్తుంది. కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, జలశక్తి, విద్యుత్, రహదారుల శాఖలు, అంతరిక్ష విభాగంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు చెందిన అధికారులు ఉంటారు. తెలంగాణలో 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద చేసిన కేటాయింపులు, నిధుల విడుదల, ఖర్చుల వివరాలను కూడా కేంద్ర బృందానికి ఇవ్వాలని సంబంధిత శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి.. -
ఏపీలో విద్యా విధానం అద్భుతం
జగ్గయ్యపేట అర్బన్: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం, స్కూళ్ల ఆధునికీకరణ, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర బృంద సభ్యులు కొనియాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్లు కతక్ శుక్లా, దేవస్మిత చక్రవర్తి తదితరులతో కూడిన కేంద్ర బృందం గురువారం జగ్గయ్యపేటలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్‌ను సందర్శించింది. మనబడి నాడు–నేడు, తరగతుల విలీనం చేసిన ప్రక్రియ, ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక తదితర పథకాల అమలు తీరును పరిశీలించారు. నాడు–నేడు ద్వారా చేపట్టిన పనులు, నిధుల వినియోగం, తల్లిదండ్రుల కమిటీ పాత్ర తదితర అంశాలను ఎంఈఓ రవీంద్ర, ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత వారికి వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెనూ గురించి తెలియజేయగా.. రోజుకొక వెరైటీ వంటకమా అంటూ వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, డిజిటల్ రూమ్, తరగతుల నిర్వహణ, భోజనశాల తదితరాలను పరిశీలించారు. 10, 9, 8 తరగతుల విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. ప్రొఫెసర్ దేవస్మిత చక్రవర్తి మాట్లాడుతూ.. స్కూల్లోని మౌలిక సదుపాయాలన్నీ బాగున్నాయని.. నాడు–నేడు పనులైతే అద్భుతమని కితాబిచ్చారు. ఈ సందర్శనలో డీఈవో రేణుక, డీవైఈవో బి.గౌరీశంకర్, సీమెట్ ప్రొఫెసర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ భేష్
మదనపల్లె: జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల వ్యవస్థ పనితీరు, రేషన్ డోర్ డెలివరీ, వలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర బృందం సభ్యులు ప్రశంసించారు. జాతీయ ఆహారభద్రత చట్టం అమలు, పీడీఎస్ పంపిణీని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు నియమించిన కేంద్ర పరిశీలకుల బృందం మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించింది. గాలివీడు, కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యం, మదనపల్లె తదితర ప్రాంతాల్లో రేషన్ షాపులను తనిఖీచేసి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఆహారభద్రత చట్టం సలహా సంఘం సభ్యులు జీఎన్ శర్మ, ఎంసీ చింపా మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆహార భద్రత చట్టం అమలు ఏపీలో బాగా జరుగుతోందని కితాబిచ్చారు. పౌరసరఫరాల పంపిణీకి ఎండీయూ వాహనాలు, వలంటీర్ల వ్యవస్థ, రేషన్ డోర్ డెలివరీ సత్ఫలితాన్నిస్తున్నాయని ప్రశంసించారు. 100కి 98శాతం మంది ప్రజలు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పొందుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీపై లబ్ధిదారులను విచారిస్తే.. సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. -
సాక్షి కార్టూన్ 24-07-2022
గజ ఈతగాళ్లు కాదు సార్! కేంద్ర బృందం!! -
పెట్టుబడంతా నీటిపాలైంది.. ఆదుకోండయ్యా
సాక్షి, ఆదిలాబాద్/కడెం/భద్రాచలం/బూర్గంపాడు: ‘వరదలతో చేలను ఇసుకమేటలు కప్పే శాయి.. పంటలు మొత్తం నష్టపోయినం.. పెట్టుబడి అంతా నీళ్ల పాలయింది.. ప్రభుత్వమే మాకు సాయం చేయాలి.. మా బాధను చూసి ఆదుకోండి అయ్యా’ అంటూ వరద ప్రాంతాల్లో నష్టాన్ని పరి శీలించేందుకు వచ్చిన కేంద్ర బృందానికి అన్న దాతలు మొర పెట్టుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, బ్రిడ్జీలను కేంద్ర బృందం సభ్యులు శుక్రవా రం సందర్శించారు. ఫొటో ఎగ్జిబిషన్లను తిలకించారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమా వేశమై వరద నష్టాన్ని అంచనా వేశారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (సీఈపీఐ) సౌరవ్ రే ఆధ్వర్యంలో దీప్‌శేఖర్ సింఘాల్, కృష్ణప్రసాద్ ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం కుఫ్టి–కుమారి గ్రామంతోపాటు ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి, ఇచ్చోడ మండల కేంద్రం, నేరడిగొండ మండలంలో పర్యటించారు. జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు. మరోవైపు భారీ వరదలకు దెబ్బతిన్న నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును కేంద్ర బృందం సందర్శించింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. అనంతరం పాండ్వపూర్ వంతెన వద్ద దెబ్బతిన్న రోడ్లను పరిశీలించింది. భద్రాద్రిలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చేరుకున్న కేంద్ర బృందం.. ఐటీడీఏ సమావేశపు మందిరంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి ఆ తర్వాత బూర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం, బూర్గంపాడు గ్రామాల్లో పర్యటించింది. వరద ముంపుతో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రహదారులను పరిశీలించింది. బాధిత రైతులు, ప్రజలతో మాట్లాడి నష్టం తీవ్రతపై చర్చించింది. ఈ సందర్భంగా వారికి భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు అనుదీప్, వీపీ గౌతమ్ తదితరులు నష్టం వివరాలను వెల్లడించారు. కేంద్ర బృందంలో కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శి పార్తీబన్, జూట్ డెవలప్మెంట్ డైరెక్టర్ మనోహరన్, కేంద్ర జలసంఘం డైరెక్టర్ రమేశ్‌కుమార్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్ఈ శివకుమార్ కుష్వాహ ఉన్నారు. కేంద్ర బృందంతో సీఎస్ భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రెండ్రోజులుగా పర్యటించి హైదరాబాద్‌కు శుక్రవారం రాత్రి చేరుకున్న కేంద్ర ప్రభుత్వ బృంద అధికారులకు రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ఈ నెల 20న జిల్లాల్లో పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో నీటిపారుదల వ్యవస్థకు జరిగిన నష్టం, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి, వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించడంపై కేంద్ర బృందానికి సోమేశ్‌కుమార్ కృతజ్ఞత తెలిపారు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
-
ఏపీలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు పరిశీలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ జీఎడ్ పెరెల్ (పీఎం మిత్ర) పథకం కింద కేంద్రం ఏర్పాటు చేయనున్న ఏడు టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 1,188 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ.. అప్పట్లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో కేంద్ర టెక్స్టైల్ శాఖ డైరెక్టర్ హెచ్ఎస్ నంద నేతృత్వంలోని కేంద్రబృందం శుక్రవారం విజయవాడకు చేరుకుంది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులతో పాటు టెక్స్టైల్ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వివిధ టెక్స్టైల్ అసోసియేషన్లతో బృందం సమావేశమై రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలను చర్చించింది. ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు గల అవకాశాలు, ప్రయోజనాలను కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు చక్కటి అవకాశాలున్నాయని నంద పేర్కొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర బృందం కడపకు వెళ్లింది. శనివారం వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని భూములను బృందం పరిశీలించనుంది. పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఈడీలు సుదర్శన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ వీఆర్వీఆర్ నాయక్, సీజీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు -
రాష్ట్ర సమస్యల పరిష్కారం దిశగా.. మరో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాతోపాటు ఇతర అంశాల పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు పీఎంవో (ప్రధాన మంత్రి కార్యాలయం) ఏర్పాటు చేసిన కేంద్ర బృందం సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పీఎంవోకు కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా ఈనెల 3న తనతో సమావేశమైనప్పుడు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. సోమవారం కేంద్ర బృందంతో సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మరోసారి చర్చించేందుకు ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ కమిటీ భేటీ అవుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 మే 30న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తదితరులకు వి/æ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 3న ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేస్తే.. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దేశంలో మిగిలిన 15 జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరానికి నీటి పారుదల, తాగునీటి వ్యయాలను ఒక్కటిగానే పరిగణించి నిధులివ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,100 కోట్లను త్వరితగతిన మంజూరు చేసి, ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా చూడాలి. ► రాష్ట్ర విభజనతో 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 45 శాతం ఆదాయం (రెవెన్యూ) మాత్రమే దక్కింది. 2015–16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కాగా.. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇదే నిదర్శనం. ఈ పరిస్థితిని మార్చడానికి సహకరించాలి. ► 2014 జూన్ నుంచి 2015 మార్చి 31 వరకు రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నిర్ధారించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతి తీసుకొచ్చి రెవెన్యూ లోటును రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులు, ఇతర బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే రెవెన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కాబట్టి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.18,830.87 కోట్లను చెల్లించి ఆదుకోవాలి. ► విభజన తర్వాత కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకు రూ.6,284 కోట్లను విద్యుత్ చార్జీల రూపంలో తెలంగాణ ఏపీకి చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో.. ఆ బిల్లులను చెల్లించేలా తెలంగాణ సర్కార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలి. ► జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత లోపించడంతో రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దీని వల్ల రాష్ట్రంలో అదనంగా 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే పీడీఎస్ ద్వారా రేషన్ అందిస్తోంది. దీని వల్ల అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిపై సమగ్రమైన పరిశీలన చేసి, ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలి. ► కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ.42,472 కోట్ల మేర రుణాలు పొందే వెసులుబాటు కల్పించాలి. ► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చిన సైట్ క్లియరెన్స్‌ను రెన్యువల్ చేయాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మెకాన్ సంస్థ నివేదిక వీలైనంత త్వరగా అందేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు గనులను వేగంగా కేటాయిస్తే.. రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతుంది. సానుకూలంగా స్పందించిన ప్రధాని సీఎం జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఆ అంశాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పీఎంవో అధికారులను ఆదేశించారు. దాంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ స్వామినాథన్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఈనెల 10న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బృందంతో చర్చించేందుకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బృందం అజయ్ సేథ్, ఆర్థిక శాఖ(ఆర్థిక వ్యవహారాల విభాగం) కార్యదర్శి, పంకజ్‌కుమార్, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి, దేబాశిస్ పాండా, కేంద్ర ఆర్థిక శాఖ (ఆర్థిక సేవల విభాగం), సుధాన్షు పాండే, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి. రాష్ట్ర బృందం ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేఎస్ జవహర్‌రెడ్డి, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కరికాల వలవెన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, షంషేర్‌సింగ్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గిరిజా శంకర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్. -
సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర బృందం, పనితీరుపై ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు తెలిపిన కేంద్ర బృందం.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను సీఎం జగన్‌కు కేంద్ర బృందం వివరించింది. కేంద్ర బృందం తరఫున కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఎన్ఎండీఏ సలహాదారు కునాల్ సత్యార్థి వివరాలు అందించారు. ఈ సందర్భంగా కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. 3 రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆ గ్రామాలను కూడా పరిశీలించామని, పశువులు చనిపోవడం, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు.. ల్లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం జగన్ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని, వీరంతా తమకు మంచి సహకారాన్ని అందించారన్నారు. ఇంకా ఆయనమాట్లాడుతూ.. ‘యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులు ఉన్నారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు. అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి. ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదు. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయి. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి. కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తీరందాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదు, అది చాలా రోజులు కొనసాగింది. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉంది. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది. కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికందుతున్న సమయంలో నీట పాలైంది. శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. వాటర్ స్కీములు కూడా దెబ్బతిన్నాయి. అన్నమయ్య నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడింది. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పనిచేశారు. విద్యుత్ సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయి. అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. సహాయ కార్యక్రమాలకోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు. ఈ డబ్బును బాధితులను వెంటనే ఆదుకునేందుకు వాడుకున్నారు. అలాగే జేసీబీలు పెట్టి.. అవసరమైనచోట యుద్ధ ప్రాతిపదికిన పనులు చేపట్టారు. సహాయక శిబిరాలను తెరిచి ముంపు బాధితులను ఆదుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రశంసనీయం. వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగింది. వీలైనంత మేర ఆదుకోవడానికి మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని సత్యార్థి పేర్కొన్నారు. కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్ అయితే ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నంటున తేమ, ఇతరత్రా నిబంధనల విషయలో సడలింపులు ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగా కేంద్ర బృందంతో సీఎం జగన్.. ఇలాంటి విపత్తు హృదయవిదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనాల కోసం కేంద్ర బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంపై ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరారు. తాము పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదని స్పష్టం చేశారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో తమకు సమర్థవంతమైన వ్యవస్థ ఉందన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉందని, ప్రతి రైతు పంటకూడా ఇ–క్రాప్ అయ్యింది. సోషల్ ఆడిట్ కూడా చేయించాం. ఇ– క్రాప్‌కు సంబంధించి రశీదు కూడా రైతుకు ఇచ్చారు. నష్టపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను తమకు అందించాం. కోవిడ్ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయి. మామ ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారు. పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటాం. దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. వీలైనంత త్వరగా పెద్దమొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతాం. ఆటోమేటిక్ వాగర్ గేజ్ సిస్టంపైనా దృష్టిపెడతాం’ అని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్.రావత్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కే.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: AP: నష్టం అపారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన -
ఏలూరు ఘటనలో అంతుచిక్కని కారణం
సాక్షి, ఏలూరు: అంతుబట్టని అనారోగ్యం బారి నుంచి ఏలూరు కోలుకున్నా వ్యాధి నిర్ధారణ ఇంకా చిక్కుముడిగానే ఉంది. దీనిపై కేంద్ర బృందాలు ఇంకా ఒక తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి. మరోవైపు ఆరో రోజు గురువారం ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 14కి పరిమితమైంది. నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నా నిర్థారణ పరీక్షల ఫలితాల కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏలూరులో బాధితులను పరామర్శించి అధికారులతో సమావేశం అయ్యారు. కేంద్ర బృందాలతో కూడా చర్చించారు. బాధితుల్లో 24 గంటల అనంతరం సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఢిల్లీ ఎయిమ్స్ నిపుణుల బృందం తెలిపింది. ఐఐసీటీ నిపుణులు కూడా వివిధ రకాల శాంపిళ్లు సేకరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌వో) ప్రతినిధి బృందం ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేస్తూ నమూనాలు సేకరించింది. ఒకటి రెండు రోజుల్లో కచ్చితమైన నిర్ధారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర నిపుణుల బృందాలు చెబుతున్నాయి. ఏలూరులో తాగునీటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, కలుషితం కాలేదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, విమ్టా ల్యాబ్ నివేదికలో వెల్లడైంది. హాని కలిగించే స్థాయిలో లేదు.. ఇప్పటివరకు 604 మంది బాధితులు ఏలూరు ఆస్పత్రిలో చేరగా 536 మంది డిశ్చార్జి అయ్యారు. 34 మందిని మెరుగైన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం 33 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇద్దరు వింత వ్యాధితో చనిపోయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ ఖండించారు. ఏలూరు ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇప్పటికే తాగునీటి విషయంలో పూర్తి స్పష్టత వచ్చిందని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. తాగునీటిలో ఆర్గానో క్లోరిన్ ఉన్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై స్పందిస్తూ ‘వైద్య పరిభాషలో ఎంజీ అంటే మిల్లీ గ్రామ్ కాదు. మైక్రోగ్రామ్‌గా భావించాలి. బాధితుల రక్త నమూనాల్లో లభ్యమైన ఆర్గానో క్లోరిన్ హాని కలిగించే స్థాయిలో లేదు’ అని తెలిపారు. చదవండి: (బాబు హయాంలో అప్పుల తప్పులు: కాగ్ నివేదిక) రక్త నమూనాల్లో సీసం, ఆర్గానో క్లోరిన్స్! ►పరీక్షల కోసం సీఎఫ్ఎస్ఎల్ సహాయం కోరిన ఢిల్లీ ఎయిమ్స్ సాక్షి, న్యూఢిల్లీ: ఏలూరులో వింత వ్యాధికి కారణమైన మూలాలను కనుగొనేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మరింత లోతుగా పరిశోధనలు చేస్తోంది. ఏలూరులో సేకరించిన మరిన్ని రక్త నమూనాలను ఎయిమ్స్ వైద్యులు విశ్లేషించారు. మొత్తం 37 రక్త నమూనాలను విశ్లేషించగా.. అందులో 21 నమూనాల్లో అధిక మోతాదులో సీసం (లెడ్) ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మిగతా నమూనాల్లోనూ సీసం, నికెల్ వంటి భార లోహాలతోపాటు ఆర్గానో క్లోరిన్స్ (క్రిమిసంహారకాలు) కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆర్గానో క్లోరిన్స్ పరీక్షల కోసం ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సహాయం కోరారు. అయితే ఈ పరిశోధనల కోసం కేంద్ర హోంశాఖ నుంచి రాతపూర్వకంగా ఆదేశాలు కావాలని సీఎఫ్ఎస్ఎల్ తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చొరవతో హోంశాఖ నుంచి రాతపూర్వక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆర్గానో క్లోరిన్స్ ఆనవాళ్ల కోసం సీఎఫ్ఎస్ఎల్ పరిశోధనలు చేస్తోంది. శుక్రవారం పరీక్ష ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. -
కచ్చితమైన కారణం కనుక్కోండి
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పలువురు ఆకస్మికంగా అస్వస్థతకు గురి కావడంపై నిశిత పరిశీలన చేసి కచ్చితమైన కారణాలను కనుక్కోవాలని కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. వ్యాధి మూలాలను కచ్చితంగా గుర్తించాలని, వీలైనంత త్వరగా అన్ని రకాల పరీక్షలను పూర్తి చేయాలని సూచిస్తూ శుక్రవారం మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. తుది నివేదికల ఆధారంగా పరిస్థితిని చక్కదిద్దేలా సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రధానంగా తాగునీటి వల్ల అస్వస్థత వచ్చిందా.. లేదా? అనే విషయంపై దృష్టి సారించాలన్నారు. మిగిలిన అంశాలపై కూడా పరిశోధించాలని సూచించారు. కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కేసులు గణనీయంగా తగ్గాయని, కొత్తవి చాలా తక్కువగా వస్తున్నాయని, 3 – 4 గంటల్లోనే బాధితులు పూర్తిగా కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. నీటి వల్లే కాలుష్యం జరిగిందని ఊహించలేమని, ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ప్రజలు ఎక్కువగా వినియోగించే కూరగాయాల్లో రసాయనాల ప్రభావంపై పరిశీలించాల్సి ఉందని ప్రముఖ న్యూరాలజిస్టు చంద్రశేఖరరెడ్డి చెప్పారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వినియోగించిన బ్లీచింగ్, క్లోరిన్‌లు కూడా కారణం కావచ్చనే అనుమానాలు నిపుణులు వ్యక్తం చేశారు. భారతీయుల్లో నికెల్ ఎక్కువే: ఢిల్లీ ఎయిమ్స్ నిపుణులు ఇంకా సమగ్ర పరీక్షలు చేయాల్సి ఉంది. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోంది. నికెల్ కూడా కనిపిస్తోంది. భారతీయుల్లో నికెల్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీసం వల్లే అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. మరిన్ని శాంపిళ్లను పరీక్షిస్తున్నాం. బాధితులు కోలుకోగానే సీసం స్థాయి గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. వీలైనంత త్వరలో కారణాలపై కచ్చితమైన నిర్ధారణకు వస్తాం. సీఎంతో సమీక్షలో పాల్గొన్న అధికారులు బ్యాటరీల డంపింగ్‌తో.. గతంలో లెడ్ పెట్రోల్ వినియోగం ఉండేది. గాలిలో కూడా లెడ్ స్థాయి ఎక్కువగానే ఉండేది. ఇప్పుడు అన్ లెడెడ్ పెట్రోల్ వాడుతున్నాం. బ్యాటరీల రీ సైక్లింగ్ ప్రక్రియ కూడా ఈ పరిస్థితికి దారి తీసి ఉండవచ్చు. బ్యాటరీలను డంప్ చేయడం వల్ల భూమిలో కలిసి ఉండవచ్చు. లేదా వాటిని కాల్చినప్పుడు గాలిలో కలిసి ఉండవచ్చు. కూరగాయలు, ధాన్యం లాంటి ద్వారా కూడా శరీరాల్లో చేరి ఉండవచ్చు. ఇలా వేర్వేరు మార్గాల్లో మనుషుల శరీరాల్లోకి సీసం చేరే అవకాశం ఉంది. వీటన్నింటి మీదా పరిశోధిస్తున్నాం. పెస్టిసైడ్స్ కోణంలో పరిశీలన: ఎయిమ్స్ మంగళగిరి నిపుణులు పురుగు మందుల ద్వారా ఆర్గానిక్ క్లోరైడ్స్ కలుషితమై అస్వస్థతకు దారి తీసిందన్నది ప్రాథమిక అనుమానం. దీనిపై కచ్చితమైన నిర్ధారణకు రావాల్సి ఉంది. అన్ని రకాలుగా అధ్యయనం చేస్తున్నాం. ప్రమాదకర సంకేతాలు లేవు: ఎన్ఐఎన్, హైదరాబాద్ నిపుణులు అస్వస్థతకు గురైన కుటుంబాలను పరిశీలించాం. ఐదు ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లాం. బాధితులు తీసుకున్న ఆహారం వివరాలు ఆరా తీశాం. కూరగాయలు, బ్లడ్, యూరిన్ శాంపిళ్లు తీసుకున్నాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి కూడా శాంపిళ్లు తీసుకున్నాం. కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసిన రెండు మార్కెట్ల నుంచి శాంపిళ్లు సేకరించాం. సమగ్రంగా పరీక్షలు చేస్తున్నాం. ప్రస్తుతానికి ప్రమాదకర స్థాయిలో సంకేతాలు ఏమీ కనిపించడం లేదు. దాద్రానగర్ హవేలీలో మైనింగ్ చేస్తున్న సమయంలో నీటిలో లెడ్ కలుషితమైంది. పంటలకూ విస్తరించింది. అధికంగా సీసం: ఐఐసీటీ, హైదరాబాద్ నిపుణులు తాగు నీటిపై వివిధ రకాల శాంపిళ్లు తీసుకున్నాం. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోంది. పురుగు మందుల వల్ల కూడా కాలుష్య కారక మూలకాలు కలిసే అవకాశాలు ఉంటాయి. తాగు నీటి పరీక్షల్లో అనుకున్న విధంగా ప్రమాదకర సంకేతాలు కనిపించడం లేదు. కచ్చితమైన నిర్ధారణల కోసం సమగ్ర పరీక్షలు చేస్తున్నాం. మరికొంత సమయం తరువాతే: సీసీఎంబీ అస్వస్థతకు వైరల్ కారణమా? అన్న దానిపై పరీక్షలు చేస్తున్నాం. ఫలితాలు రావడానికి, కచ్చితమైన నిర్ధారణలకు కొంత సమయం పడుతుంది. వివరాలు సేకరిస్తున్నాం: డబ్ల్యూహెచ్‌వో ‘బాధితులు తీసుకున్న ఆహారం సహా ఆరోగ్య పరమైన వివరాలు నమోదు చేస్తున్నాం. దీన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. హాజరైన ఉన్నతాధికారులు.. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, న్యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పశ్చిమ గోదావరి కలెక్టర్ ముత్యాల రాజు తదితరులు ఏలూరు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. ఏలూరుకు ఊరట అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదించింది. ఐదో రోజు బాధితుల సంఖ్య తగ్గటంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంటోంది. బుధవారం రాత్రి 10 గంటల వరకు రోజంతా కేవలం 20 కేసులే నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. రాత్రి సమయానికి ఆస్పత్రిలో మొత్తం 42 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 563కి చేరుకుంది. ఈ నెల 6వతేదీన గుంటూరు ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో చికిత్స కోసం ఐదుగురు చేరగా ముగ్గురు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 24 మంది బాధితులు చేరగా ఇద్దరిని డిశ్చార్జి చేశామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివశంకరరావు చెప్పారు. పరిస్థితులను నిరంతరం అంచనా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తుండటంతో వేగంగా కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఇంటింటా సర్వే.. ఏలూరులో 62 వార్డు సచివాలయాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక వైద్యుడు, నర్సు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించి నిమిషాల వ్యవధిలో 108 అంబులెన్సుల ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తూ ఆరోగ్య స్థితిపై వివరాలు సేకరిస్తున్నారు. శానిటేషన్‌పై మంత్రి నాని పాదయాత్ర నగరంలో పారిశుధ్యం, తాగునీటిపై జాగ్రత్తలు సూచిస్తూ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నూకాలమ్మ గుడి వరకూ పాదయాత్ర చేశారు. డ్రైనేజీల్లో మురుగు తొలగిస్తున్నారా? తాగునీరు ఎలా ఉంది? అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. -
ఏలూరుకు రానున్న కేంద్ర బృందం
న్యూఢిల్లీ: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు మంగళవారం కేంద్ర బృందం రానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు ఎయిమ్స్ అధికారుల బృందాన్ని ఏలూరు పంపుతున్నాము. కేంద్ర బృందం రేపు ఏలూరుకు చేరుకుంటుంది. విచిత్ర వ్యాధితో జనం భయపడిపోతున్నారు. రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తాం' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్) -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కేంద్ర బృందం
-
వరద నష్టం రూ.8,084.38 కోట్లు
సాక్షి, అమరావతి: భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలోని వివిధ రంగాలకు జరిగిన అపార నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి కళ్లకు కట్టేలా నివేదించి విపత్తు బాధిత రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సాయం అందించేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర బృందానికి విన్నవించారు. రెండు రోజులపాటు జిల్లాల్లో పర్యటించి, కుండపోత వర్షం, వరద నష్టాలను పరిశీలించి.. వివిధ వర్గాలతో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలోని కేంద్ర బృందం ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. షెడ్యూలులో లేనప్పటికీ అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు కేంద్ర బృందానికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కరువు, భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్తులతో రాష్ట్రం దారుణంగా నష్టపోతోందని, విపత్తు భాధిత రాష్ట్రంగా మారిందని అధికారులు వివరించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఉదారంగా సాయం చేసేలా సిఫార్సు చేయాలని కోరారు. అధికారులు ఇంకా ఏం చెప్పారంటే.. ► ఆగస్టు – అక్టోబర్ నెలల మధ్య తుపాన్లు, అల్పపీడనాలతో భారీ వరదల వల్ల భారీగా పంట నష్టం వాటిల్లింది. రహదారులు దెబ్బతిన్నాయి. వివిధ రంగాలకు రూ.8,084.38 కోట్ల పైగా నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.3,084.6 కోట్లు నష్టం వాటిల్లింది. ► శాశ్వత పునరుద్ధరణ పనులకు రూ.4,439.14 కోట్లు, దెబ్బతిన్న రహదారులు, చెరువులు, వంతెనలు తదితర మౌలిక సదుపాయాల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.3,645.25 కోట్లు అవసరం. జాతీయ విపత్తు సహాయ నిధి నిబంధనావళి ప్రకారం మౌలిక సౌకర్యాల తాత్కాలిక పునరుద్ధరణ, రైతులకు పెట్టుబడి సాయం కలిపి రూ.1,236.66 కోట్లు విడుదల చేయాలి. ► ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, హోంమంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కమిషనర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ సాయం అందేలా చూడండి భారీ వరదల వల్ల రూ.8,084.38 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. మీరు ఐదు జిల్లాల్లో పర్యటించి నష్టాలను స్వయంగా చూశారు. మీరు చూసిన విషయాలను, జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి యథాతథంగా నివేదించి జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నిబంధనల ప్రకారం వీలైనంత ఎక్కువ సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి. వేరుశనగ, వరి దారుణంగా దెబ్బతిన్న విషయం మీరు చూశారు. పోయింది పోనూ మిగిలిన దానిని రైతులు నూర్పిళ్లు చేస్తారు. తడిసిన, రంగు మారిన ధాన్యం, వేరుశనగ కొనుగోలు చేసేందుకు వీలుగా ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ) నిబంధనలు సడలించేలా సిఫార్సు చేయండి. తడిసిన, రంగు మారిన ధాన్యం, వేరుశనగ సేకరణకు ఎఫ్ఏక్యూ నిబంధనలను తప్పకుండా మినహాయించాల్సి ఉంది. – కేంద్ర బృందంతో సీఎం వైఎస్ జగన్ ఎక్కువ సాయానికి సిఫార్సు చేస్తాం కొన్ని రోజుల ముందు వచ్చి ఉంటే జరిగిన నష్టం ఇంకా స్పష్టంగా కనిపించేది. ఇప్పటికీ అధిక నష్టం జరిగినట్లు మా పరిశీలనలో గుర్తించాం. అధికారులు కూడా బాగా సహకరించడంతోపాటు ఫొటో ఎగ్జిబిషన్ల ద్వారా నష్టాన్ని కళ్లకు కట్టారు. రైతులకు కోలుకోలేని నష్టం జరిగింది. ఎక్కువ సాయం అందించి కేంద్ర ప్రభుత్వం ఆదుకునేలా మేం సిఫార్సు చేస్తాం. – కేంద్ర బృందం -
‘హితం’ బాగుంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు టెలి మెడిసిన్ సేవలు, వారి పర్యవేక్షణను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతిలో ప్రవేశపెట్టిన ‘హితం’యాప్‌ను నీతి ఆయోగ్ సభ్యులు వినోద్ కుమార్ పాల్ అభినందించారు. పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా, రవీంద్రన్‌లతో కూడిన కేంద్ర బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు హైదరాబాద్‌లో పర్యటించింది. పర్యటన ముగింపు సందర్భంగా బీఆర్కేఆర్ భవన్లో బృందం సభ్యులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హితం యాప్ వివరాలతో పాటు రాష్ట్రంలో కరోనా మేనేజ్మెంట్పై చేపట్టిన పనులను ఇతర రాష్ట్రాలతో షేర్ చేస్తామని వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో టెస్టింగ్‌ను పెంచారని, ఇది వైరస్ నియంత్రణకు కీలకమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఆస్పత్రుల సన్నద్ధత స్థాయి, వైరస్ నివారణ చర్యలు, రోగులకు చికిత్స వంటి అంశాలపై సంతృప్తి వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల ప్రాణాలు కాపాడటానికి 24 గంటలు పని చేస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో టెస్టింగ్, కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్ పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. పర్యటనలో భాగంగా కేంద్ర బృందం సోమవారం ఉదయం సీఎస్, జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో సమీక్షించారు. వైరస్ విస్తరించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సోమేశ్‌కుమార్ కేంద్ర బృందానికి వివరించారు. టెస్టింగ్‌లను ప్రతిరోజు 40 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు కరోనా నియంత్రణకు ప్రత్యేక నిధులు కేటాయించామని పేర్కొన్నారు. -
హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. తెలంగాణలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణలో భాగంగా బృందం సభ్యులు సోమవారం వివిధ ఆస్పత్రుల్లో ల్యాబులను పరిశీలిస్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైనా కంటైన్మెంట్ క్లస్టర్లో పర్యటిస్తారు. అక్కడినుంచి నేరుగా బీఆర్కే భవన్లో రాష్ట్ర సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతారు. సాయంత్రం గాంధీ ఆస్పత్రిని సందర్శించి అనంతరం గచ్చిబౌలీలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శిస్తారు. అటునుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు. (చదవండి: అవసరమైతే మళ్లీ లాక్డౌన్ : కేసీఆర్) కాగా, ‘విపత్తు నిర్వహణ చట్టం–2005’ నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఈ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక దేశంలో అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్ జిల్లాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని హెచ్చరించింది. తెలంగాణతో పాటు గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. (టిమ్స్ రెడీ..!) -
మహమ్మారి కట్టడికి కేంద్ర బృందాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50కి పైగా జిల్లాలు, నగరపాలక, మున్సిపాల్టీలకు అత్యున్నత కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మహారాష్ట్ర(ఏడు జిల్లాలు/మున్సిపాలిటీలు), తెలంగాణ (4 జిల్లాలు), తమిళనాడు (7), రాజస్ధాన్ (5), అసోం (6), హరియాణ (4), గుజరాత్ (3), కర్ణాటక (4), ఉత్తరాఖండ్ (3), మధ్యప్రదేశ్ (5), పశ్చిమ బెంగాల్ (3), ఢిల్లీ (3), బిహార్ (4), యూపీ (4), ఒడిషాలో 5 జిల్లాలకు కేంద్ర బృందాలు రానున్నాయి. ఆయా జిల్లాల్లో కోవిడ్-19 వ్యాప్తి, సంక్రమణను అడ్డుకునేందుకు అనువైన వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించడంలో స్ధానిక అధికారులకు కేంద్ర బృందాలు మార్గనిర్ధేశకం చేస్తాయి. చదవండి : చైనాలో ఆగస్టులోనే కరోనా విజృంభణ! -
మార్గదర్శకాలను పాటించాలి: కేంద్ర బృందం
సాక్షి, కర్నూలు: కరోనా వైరస్ విధ్వంసక చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శక సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులను కేంద్ర బృందం ప్రతినిధులు ఆదేశించారు. గురువారం నగర శివారు ప్రాంతంలోని కర్నూలు చైతన్య కాలేజ్ కోవిడ్ కేర్ సెంటర్ ను కేంద్ర బృందం పరిశీలించింది. కోవిడ్ కేర్ సెంటర్, ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ కేంద్రాలలో ప్రభుత్వం సూచించిన కరోనా ప్రోటోకాల్ ప్రకారం బాధితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్వారంటైన్ స్పెషల్ అధికారి, డి ఎఫ్ ఓ అలెన్ చాంగ్ టేరాన్ కోవిడ్ కేర్ సెంటర్ లో చేసిన ఏర్పాట్లపై నివేదించారు. (ఏపీలో మరో 36 కరోనా పాజిటివ్ కేసులు) వైద్య సదుపాయాలపై కేంద్ర బృందం ఆరా.. కోవిడ్ కేర్ సెంటర్ లో బాధితులకు ఎలాంటి వైద్య సదుపాయం కల్పిస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ లో జిల్లా యంత్రాంగం కల్పించిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో మెడికల్ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి కరోనా వ్యాధి నివారణపై ముమ్మర ప్రచారం చేయాలన్నారు. ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా చైతన్యవంతులను చేయాలని వారు సూచించారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలోనే ఉండి ప్రభుత్వం చేపట్టే పనులకు సహకారం అందించాలని కోరారు. జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజా మొహిదీన్, కర్నూలు రూరల్ తహశీల్ధార్ వెంకటేష్ నాయక్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యరేఖ తదితరులు కేంద్ర బృందం వెంట ఉన్నారు. (కరోనా వైద్యులకు రోబో సాయం) -
రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి చర్యలు
మంగళగిరి/కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో త్వరలో ప్లాస్మా థెరపీని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కేంద్ర బృందం ప్రతినిధి, ఆలింఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైజీస్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బబ్బిపాల్ చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. గుంటూరు జిల్లా చినకాకాని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో ఏమన్నారంటే.. ► వైరస్ నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న పరీక్షల కారణంగా అత్యధిక కేసులు బయటపడుతున్నాయి. ► నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ల గుర్తింపు, క్వారంటైన్ల నిర్వహణ తదితర కార్యకలాపాల్లో మరింత వేగంగా పనిచేయాలి. ► కాంటాక్ట్‌ల గుర్తింపులో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది విజయవంతం అయిన కారణంగానే కరోనా నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ► కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ నందినీ భట్టాచార్య, ఎన్ఆర్ఐ అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ ఉపేంద్రనాథ్ తదితరులున్నారు. వందశాతం నివారణ అసాధ్యం ► కరోనా వైరస్‌ను వందశాతం నివారించడం సాధ్యం కాదని కేంద్ర బృందం సభ్యురాలు డాక్టర్ మధుమిత దూబే చెప్పారు. కర్నూలు పెద్దాస్పత్రి (రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రి)లో కరోనా కట్టడిపై కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ సంజయ్‌కుమార్ సాధూఖాన్, కలెక్టర్ జి.వీరపాండియన్‌తో కలిసి ఆస్పత్రి హెచ్వోడీలు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ► డాక్టర్ సంజయ్‌కుమార్ సాధూఖాన్ మాట్లాడుతూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అవసరమైన వారికి అజిత్రోమైసిన్ మాత్రలు కూడా ఇవ్వాలని సూచించారు. ► కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా బాధితులు 95 శాతం మంది కోలుకుంటున్నారని కేంద్ర బృందానికి నివేదించారు. -
రెడ్‌జోన్ ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం కరోనా కట్టడికి తీసుకుంటున్న సాంకేతిక టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో డా. మధుమిత దూబే, ప్రొఫెసర్ సంజయ్ కుమార్, సాధూఖాన్ ఉన్నారు. పర్యటనలో భాగంగా రెడ్‌జోన్ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానంతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. డ్రోన్ కెమెరాల పనితీరును ఫాల్కన్, హాక్ వాహనాల నుంచి పర్యవేక్షించారు. కర్నూలు నగరంలోని కొత్తపేట, పాతబస్తీ, కొండారెడ్డి బురుజు ప్రాంతాలు, నగరంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు, పోలీసు, మున్సిపల్, వైద్య బృందాల విధులు, ప్రధాన మార్గాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు నగరంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చారు. రోడ్లపై అనవసరంగా తిరిగే ద్విచక్ర వాహనాలను, కార్లలో తిరిగే వ్యక్తులను డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు కేంద్ర బృందానికి జిల్లా ఎస్పీ రాఘవ తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు పట్టణ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ మహేశ్వర రెడ్డి, ఈ కాప్స్ ఇంచార్జ్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఏపీలో కరోనా నివారణ చర్యలు భేష్ -
ఏపీలో కరోనా నివారణ చర్యలు భేష్
కర్నూలు(సెంట్రల్)/నరసరావుపేట: కోవిడ్–19 నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోందని ఆదివారం కేంద్ర బృందం సభ్యులు కితాబిచ్చారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతోందని ప్రశంసించారు. కర్నూలు జిల్లాతో పాటు గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోంది. కర్నూలు బృందంలో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత దూబే, ప్రొఫెసర్ సంజయ్‌కుమార్ సాధూఖాన్ ఉండగా, గుంటూరు బృందంలో డాక్టర్ బాబీపాల్, డాక్టర్ నందినీ భట్టాచార్య ఉన్నారు. కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ జి.వీరపాండియన్ నేతృత్వంలో జిల్లా నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. డాక్టర్ మధుమిత దూబే ఇంకా ఏమన్నారంటే.. ► పాజిటివ్ వ్యక్తులను గుర్తించేందుకు అవసరమైతే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. ► వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, కర్నూలు జిల్లా యంత్రాంగానికి చేయూతనిచ్చేందుకు సిద్ధం. ► క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా యంత్రాంగానికి తగిన సలహాలు, సూచనలిస్తాం. ► ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కోవిడ్‌తో కలిసి జీవించేలా ప్రజల ఆలోచనలో మార్పు తేవాలన్నారు. ► నరసరావుపేటలో 164 కేసులే నమోదవగా, నాలుగు వేల మందికి పైగా టెస్టులు చేయడాన్ని అభినందించారు. -
అంతా బాగుంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు తీరు, వైరస్ వ్యాప్తి నియంత్రణకు సర్కా రు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందం మూడోరోజు సోమవారం హైద రాబాద్‌లో విస్త్రృతంగా పర్యటించింది. కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్‌బరోకా, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్, జాతీయ పోషకాహార సంచాలకురాలు డాక్టర్ హేమలత, జాతీయ వినియోగదారుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ ఠాకూర్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేదిల బృందం.. ఉదయం ఖైరతాబాద్ పరిధిలోని రెండు కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. పలు అంశాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకుంది. అక్కడి ఏర్పాట్ల న్నీ బాగున్నాయని సంతృప్తి వ్యక్తంచేసింది. అనంతరం మెహిదీపట్నంలోని సరోజిని కంటి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న హైదరాబాద్ జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను పరిశీలించింది. ఎటువంటి పరిస్థితులెదురైనా అందుకవసరమైన మందుల లభ్య త, స్టాకు రికార్డు, టెస్టింగ్స్ కిట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకుంది. గాంధీ వైరాలజీ ల్యాబ్ సందర్శన... సాయంత్రానికి గాంధీ ఆస్పత్రికి చేరుకున్న కేంద్ర బృందం.. గాంధీ మెడికల్ కాలేజీలోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించింది. వైద్య పరికరాలు, పరీక్షల కోసం వాడుడుతు న్న కిట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించింది. రోజుకు ఎక్కడ, ఎన్ని శాంపిల్స్ సేకరిస్తున్నారు? ఎలా సేకరిస్తున్నారు? వాటిని ఇక్కడికి ఎలా తీసుకొస్తున్నారు? రిపో ర్టుల జారీకి ఎంత సమ యం పడుతోంది వంటి అంశాలపై ఆరా తీసింది. కరోనా ప్రత్యేక వార్డులో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని ప్రశంసించింది. అనం తరం వైద్యాధికారులతో సమావేశమై.. గాంధీ ఆస్పత్రిలో ఉన్న పడకలు, ఐసీ యూ పడకలు, వెంటిలేటర్ల లభ్యత గురిం చి వివరాలు సేకరించింది. కేంద్ర బృం దం తమ పర్యటనను మరోరోజు పొడిగించుకుంది. మంగళవారం ఈ బృందం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో భేటీ కానుంది. -
అవి అనువైన భవనాలు కావు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్ ప్రాంగణంలోని పాత భవనాలు జాతీయ అంటు వ్యాధులని యంత్రణ సంస్థ (ఎన్సీడీసీ) ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రానికి అనువైనవి కావని కేంద్రం స్పష్టం చేసింది. తమకు అనువైనచోట రెండెకరాలు కేటాయిస్తే అందులో భవనాలు నిర్మించుకుంటా మని కోరింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఎన్సీడీసీ అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లో తమ పరిశోధన కేంద్రానికి అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కోఠిలోని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన భవనాలను పరిశీలించారు. అవి పరిశోధన సంస్థకు యోగ్యంకావని నిర్ధారించారు. ఇటు యాచారం, శామీర్‌పేట, మానసిక చికిత్సాలయంలలో ఉన్న స్థలాలనూ పరిశీలించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. స్థలం గుర్తించే వరకు కోఠిలోని ఆరోగ్య కుటుం బ సంక్షేమ కమిషనరేట్‌లోని భవనాలను ఉపయోగించుకోవాలని వారిని ఆయన కోరారు. కేంద్ర బృందంతో భేటీ అనంతరం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావుతో కలసి మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల వైరస్‌లను గుర్తించడం, వాటిపై పరిశోధన చేసేందుకు రాష్ట్రంలో ఎన్సీడీసీ ఏర్పాటవుతోందన్నారు. కాగా, కేంద్ర బృందంతో భేటీ కోసం మంత్రి ఈటల రాజేందర్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యా లయానికి వచ్చారు. ఆ సమయంలో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో మరో సమావేశంలో ఉం డిపోయారు. కీలక సమావేశానికి ఉన్నతాధికారులెవ రూ హాజరుకాకపోవడంపై మీడియా ముందే ఈటల అసహనం వ్యక్తం చేశారు. ‘మిగతా అధికారులంతా ఏమయ్యారు’అని ఆయన అక్కడి అధికారులను ప్రశ్నించారు. కోఠిలో నిత్యం ఉండే కీలక అధికారులు ఒకరిద్దరు మినహా ఎవరూ మంత్రి సమావేశానికి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఔషధ నిల్వ అత్యంత దారుణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఔషధ నిల్వ వ్యవస్థ అత్యంత దారుణంగా ఉందని కేంద్ర బృందం స్పష్టం చేసింది. శిశువులకు వ్యాక్సిన్ల అనంతరం పారాసిటమాల్ బదులు ట్రెమడాల్ మాత్రలు ఇవ్వడంతో ఇద్దరు మరణించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర బృందం.. రెండ్రోజులు హైదరాబాద్‌లో పర్యటించింది. క్షేత్రస్థాయి పరిస్థితిని అధ్యయనం చేసి కేంద్రానికి ఆదివారం ప్రాథమిక నివేదిక అందజేసింది. ఆ నివేదిక ప్రకారం నాంపల్లి ఆస్పత్రిలో 2018 జూన్ నుంచి ఔషధ నిల్వలను సరిగ్గా నిర్వహించడంలేదని తెలిపింది. స్టాక్ రిజిస్టర్ సరిగ్గా లేదని, ఔషధాల ఇండెంట్ ప్రక్రియా సక్రమంగా లేదని పేర్కొంది. మెడికల్ ఆఫీసర్, ఫార్మసిస్ట్‌లు స్టాక్ రిజిస్టర్లను సరిగ్గా పర్యవేక్షించడంలేదని వెల్లడించింది. ట్రెమడాల్ వంటి షెడ్యూల్ ‘హెచ్’ఔషధాల నిల్వ ప్రక్రియ నిబంధనలను ఫార్మసిస్ట్ అనుసరించలేదని పేర్కొంది. ప్రజారోగ్యం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై కనీసం శిక్షణ ఇవ్వకుండానే మెడికల్ ఆఫీసర్‌ను ఇటీవలే కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని దుయ్యబట్టింది. సంఘటన జరిగిన మార్చి 7న నాంపల్లి యూపీహెచ్‌సీలో 132 మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. అందులో 90 మందికి ట్రెమడాల్ మాత్రలు ఇచ్చినట్లు నిర్ధారించారు. అవసరంలేని మాత్రలు ఇచ్చారని గుర్తించారు. అందులో 34 మందిని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నిలోఫర్‌లో ఒకరు, ప్రైవేటు ఆసుపత్రిలో మరొకరు మరణించినట్లు నివేదిక తెలిపింది. గతేడాది హైదరాబాద్ డ్రగ్ స్టోర్‌లో 2.22 లక్షల ట్రెమడాల్ మాత్రలు ఇవ్వగా అందులో ఒక్క నాంపల్లి యూపీహెచ్‌సీకే ఏకంగా 10 వేల మాత్రలు ఇవ్వడంపై కేంద్ర బృందం విస్మయం వ్యక్తంచేసింది. ఈ నెల 9 నాటికి హైదరాబాద్ డ్రగ్ స్టోర్‌లో 1.97 లక్షల ట్రెమడాల్ మాత్రలు అందు బాటులో ఉన్నాయి. యూనివర్సల్ జాబితాలోనే ట్రెమడాల్ మాత్రలు, ఇంజక్షన్లు ఉన్నాయి. దీనివల్ల ఈ మాత్ర లేదా ఇంజక్షన్‌ను ఉపయోగించడానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా పోయాయి. ఇక రాష్ట్రస్థాయిలో ట్రెమడాల్ మాత్రలను వెనక్కి తెప్పించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించినట్లు బృందం నివేదికలో పేర్కొంది. కేంద్ర బృందం సిఫార్సులు ఇవీ.. - పారాసిటమాల్ మాత్రలకు బదులు సిరప్‌ను ఆస్పత్రులకు సరఫరా చేయాలి. - పారాసిటమాల్ సిరప్, చుక్కల మందును ఎంత వాడారు? ఎంత వెనక్కి పంపించారన్న అంశాలపైనా రికార్డు ఉండాలి. వాటిని తక్షణమే అమలు చేయాలి. - ట్రెమడాల్ మాత్రలను యూనివర్సల్ జాబితా నుంచి తొలగించాలి. వాటి వాడకంపై ఆంక్షలు విధించాలి. నిర్ధారిత ప్రభుత్వ ఆసుపత్రులకే మాత్రలను సరఫరా చేయాలి. ఆ మేరకు డ్రగ్స్ సరఫరా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి. -
కరువు అంచనా...అంతా వంచన
కరువు పరిశీలనకు కేంద్ర అధికారుల బృందం వస్తుందని రైతులు, కూలీలు సంతోషించారు. తమ కష్టాలు విని ఉపశమనం కలిగిస్తారని భావించారు. తీరా వచ్చాక కనీసం ఒకచోట పది నిమిషాలు కూడా గడపలేదు. రైతులు వ్యవసాయంలో ఇబ్బందులు, కష్టాలు వారికి తెలుపుకుందామని వారి వద్దకు వెళ్లగా చివరకు నిరాశే మిగిలింది. తూతూమంత్రంగా వారితో మాట్లాడారు. కనీసం వివరాలు కూడా నమోదు చేయకుండానే వెనుదిరిగారు. దీంతో కరువు బృందం పరిశీలన తమకు ఎంతమేర ఉపశమనం కలిగిస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బద్వేలు : రబీ సీజనుకు సంబంధించి కేంద్ర కరువు పరిశీలన బృందం బుధవారం కాశినాయన, పోరుమామిళ్ల మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులు, ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. పంటనష్టం, తాగునీటి సరఫరా, ఉపాధి పనుల తీరు తదితరాలను పరిశీలించారు. ఈ బృందంలో హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్ బీకే శ్రీవాత్సవ, ఎఫ్‌సీడీ ఫైనాన్స్ డిప్యూటీ డైరెక్టరు ముఖేష్‌కుమార్, అగ్రి ఇన్పుట్స్ పరిశోధనాధికారి అనురాధ బటానా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం విజయకుమార్ ఉన్నారు. ఒకరోజు పరిధిలో రెండు మండలాల్లో ఆరు ప్రాంతాల్లో కరువు బృందం పర్యటన ఏర్పాటు చేయడంలోనే అధికారుల చిత్తశుద్ధిలోపం కనిపిస్తోంది. గుంతలతో కూడిన మట్టి రోడ్లపై దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించడం, నాలుగు ప్రాంతాల్లో రైతులు, కూలీలతో ముఖాముఖి, మూడు ప్రాంతాల్లో చెరువుల పరిశీలన ఎలా సాధ్యమనే విషయాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఒక రోజు వ్యవధిలో వీటన్నింటిని పూర్తి చేసుకుని తూతూమంత్రంగా తమ పర్యటనను ముగించారు. ఉపాధి కష్టాలకు గంతలు కరువు పరిశీలన బృందం మొదట సావిశెట్టిపల్లె సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అక్కడ కొండవాలున తవ్విన కందకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా అధికారులు కూలీలతో పనులు బాగున్నాయని, కూలీ నగదు అందుతున్న రీతిలో చెప్పించారు. దీంతో పాటు పని వద్ద నీడ ఏర్పాట్లు, మజ్జిగ అందజేత, మెడికల్ కిట్లు అందించామని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వందరోజులు పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ దాదాపు వందమంది కూలీలు ఉండగా వారిలో కేవలం నలుగురో ఐదుగురో వంద రోజులు పనిచేశారు. కేవలం వీరిని మాత్రమే అధికారులతో మాట్లాడించారు. మెడికల్ కిట్లు అందజేసి నాలుగేళ్లు అవుతోంది. ఈ ఏడాది నీడ కోసం టెంట్లు అందించలేదు. అలాగే ఎండలకు నీటి వసతి, మజ్జిగ సౌకర్యం కల్పించలేదు. కానీ ఇవన్ని కూలీలు చెప్పకుండా కేవలం పనులు బాగున్నట్లు మాత్రమే చెప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది నెలల తరబడి ఉపాధి వేతనం రాకున్నా ఆ సమస్యను మాత్రం కేంద్రం బృందం దృష్టికి మాత్రం తీసుకురాలేదు. చెరువుల పరిశీలన అంతకుమునుపు ఇటుకలపాడు చెరువును పరిశీలించారు. చెరువు ఆయకట్టు, నీటి ఒరవ, పంటల సాగు వంటి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాలాయపల్లెలో కూడా చెరువును పరిశీలించారు. చెరువు 45ఎకరాల విస్తీర్ణంలో ఉండగా చాలావరకు ఆక్రమణకు గురైంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించలేదు. చెరువుకు ఒరవ తక్కువగా ఉందని. రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెప్పారు. ఇటుకలపాడు, బాలాయపల్లె చెరువులకు తెలుగుగంగ ఎడమ కాలువ నుంచి ఎత్తిపొతల పథకం ఏర్పాటు చేసి నీటిని అందించాలని విన్నవించారు. ఆర్డీఓ వీరబ్రహ్మం, జేడీఏ ఠాకూర్‌నాయక్, ఏడీ క్రిష్ణమూర్తి, డ్వామా పీడీ హరిహరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావు, డీడీ మురళి, వెటర్నరీ ఏడీ డాక్టరు రెడ్డమ్మ, కాశినాయన తహసీల్దార్ మల్లికార్జున, పోరుమామిళ్ల తహసీల్దార్ సీసీఎస్ వర్మ, ఎంపీడీఓలు ఆయూబ్, రామక్రిష్ణయ్య, ఆర్ఐలు మోహనరాజు, దక్షిణమూర్తి, ఎఓలు రామాంజనేయరెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు. రైతులకు గోడు వినకుండానే.. అనంతరం కాశినాయన మండలంలోని చిన్నాయపల్లెలో శెనగ రైతులతో కరువు బృందం సమావేశమైంది. కానీ ఇక్కడ కూడా ఇద్దరు రైతుల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకున్నారు. కేవలం పది నిమిషాల సమయం కూడా కేటాయించలేదు. వ్యవసాయాధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వలేదు. మండలంలోని అధికశాతం మంది రైతులు నష్టపోయినా రైతుల సంఖ్య తక్కువ చేసి చూపారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులు చెప్పిన విషయాన్ని నమోదు చేసే సమయం కూడా అధికారులకు లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులు తాము వేసిన పంట విస్తీర్ణం, వచ్చిన దిగుబడి, కలిగిన నష్టం వివరాలను తెలుపుదామని ఎదురుచూసినా వారికి అవకాశం లభించలేదు. సాయంత్రం మూడు గంటలకు బాలాయపల్లెలో జొన్న రైతులతో సమావేశమయ్యారు. ఇద్దరు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగతా రైతులు తమ కష్టాలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అలాగే గ్రామంలోని పలువురు తాగునీటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఇక్కడ పది నిమిషాల కంటే తక్కువ సమయం కేటాయించారు. -
ఇలా వచ్చి.. అలా వెళ్లారు
అనంతపురం అగ్రికల్చర్ : రబీలో నెలకొన్న కరువు పరిస్థితుల అంచనా వేయడానికి మంగళవారం ముఖేష్‌కుమార్ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం(కేంద్ర బృందం) జిల్లా పర్యటన కంటితుడుపుగా సాగింది. జిల్లాకు తక్షణ సాయంగా రూ.699.45 కోట్లు అవసరమని కలెక్టర్ జి.వీరపాండియన్ కేంద్ర బృందానికి కరువు నివేదిక అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు జాబితాలో మొదట 15, తర్వాత 8 మొత్తం 23 మండలాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీవ్ర కరువు కాకుండా సాధారణ కరువు (మాడరేట్) జాబితా కింద ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌సీడీ ఫైనాన్స్ డైరెక్టర్ ముఖేష్‌కుమార్, నీతి అయోగ్, అగ్రికల్చర్ ఇన్పుట్స్ రీసెర్చ్ ఆఫీసర్ అనురాధాబటనా, ఎఫ్సీఐకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం (లీగల్) జీవీ విజయకుమార్, హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్ శ్రీవాస్తవల బృందం జిల్లాకు వచ్చింది. ఊరూరా కరువు కథలే... జాయింట్ కలెక్టర్–2 సుబ్బరాజు ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీఆర్డీఏ అధికారులతో కలిసి 11.30 గంటలకు గోరంట్లకు వెళ్లారు. అక్కడ తాగునీటి కష్టాలు తెలుసుకుని ఎండిపోయిన బోరుబావిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప, జెడ్పీ చైర్మన్ పూలనాగరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర బృందం ఏటా వచ్చివెళుతున్నా...కరువుకు శాశ్వత పరిష్కారం చూపించడంలో ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా శంకరనారాయణ విమర్శించారు. వస్తున్న అరకొర నిధులు కూడా టీడీపీ కార్యకర్తలకే సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. అక్కడి నుంచి అదే మండలం బెల్లాలపల్లికి చేరుకున్న కేంద్రం బృందం.. అక్కడ నిర్మిస్తున్న ఫారంపాండ్ చూసి ఉపాధి కూలీలతో మాట్లాడారు. తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు పెనుకొండ మండలం అడదాకులపల్లి గ్రామానికి చేరుకుని పంట పొలాలు పరిశీలించారు. పప్పుశగన రైతులు కొండారెడ్డి, జగన్నాథరెడ్డితో మాట్లాడారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి పంట ముగిసేదాకా వర్షంజాడ లేకపోవడంతో వేసిన పప్పుశనగ దారుణంగా దెబ్బతినడంతో నష్టాలపాలైనట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ 20 నిమిషాలు గడిపిన కేంద్రబృందం సభ్యులు ఆ తర్వాత 2.15 గంటలకు చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన 4 ఎకరాల చీనీతోటను చూసి బాధిత రైతు లక్ష్మమ్మతో మాట్లాడారు. గ్రామ శివార్లలో ఉపాధికూలీలతో సమావేశమై కష్టనష్టాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత మామిళ్లపల్లి, కనగానపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు కంబదూరు మండలం తిప్పేపల్లి గ్రామంలో ఎండిపోయిన తాగునీటి బోరుబావిని పరిశీలించి సర్పంచ్ నరసింహులుతో మాట్లాడారు. 500 అడుగులకు పైగా బోర్లు వేస్తున్నా చుక్క నీరు పడటం గగనంగా మారిందని ఈ సందర్భంగా పలువురు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ సరిగ్గా 15 నిమిషాలు గడిపారు. పక్కనే ఎండిపోయిన టమాట, కర్భూజా పంటలను పరిశీలించాలని కోరినా సమయం లేదని.. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి రాత్రి 7 గంటలకు అనంతపురం ఆర్అండ్బీ అతిథిగృహానికి చేరకున్నారు. రూ.699.45 కోట్లతో నివేదిక జిల్లాకు తక్షణ సాయంగా రూ.699.45 కోట్లు అవసరమని కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి కరువు నివేదిక అందజేశారు. అందులో ఇప్పటికే రూ.53.94 కోట్లు ఖర్చు చేశామని, మిగతా రూ.645.51 కోట్లు జూన్‌లోపు అందజేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో వ్యవసాయశాఖ పరిధిలో రూ.42.40 కోట్లు, ఉద్యానశాఖ పరిధిలో రూ.13.20 కోట్లు, పశుసంవర్ధఖశాఖకు రూ.49.65 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.10.57 కోట్లు, డ్వామాకు రూ.274.71 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌శాఖకు రూ.274.71 కోట్లు అవసరమని నివేదించారు. 11 గంటలకు ప్రారంభం, 6 గంటలకు ముగింపు క్షేత్రస్థాయి పర్యటన ఉదయం 11 గంటలకు చిలమత్తూరు మండలం రక్షా ఆకాడమీ నుంచి ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అనంతరం స్థానిక ఆర్అండ్బి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష 9.30 గంటల వరకు నిర్వహించారు. ఇందులో కరువు పరిశీలన కన్నా ప్రయాణం, అధికారులతో సమీక్షకే ఎక్కువ సమయం తీసుకోవడం విశేషం. పంట పొలాలు, ఎండిన బోరుబావులు, పండ్లతోటల పరిశీలించడం.. రైతుల కష్టాలు వినేందుకు కనీసం మూడు గంటలు కూడా కేటాయించలేదు. అధికారులపై అసంతృప్తి వ్యవసాయ, అనుబంధశాఖలు, డ్వామా, డీఆర్డీఏ తదితర శాఖల పరిధిలో నెలకొన్న కరువు పరిస్థితులకు సంబంధించి సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించారు. అనంతరం జిల్లా కరువు పరిస్థితుల గురించి కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. జిల్లా స్థాయి అధికారులతో కేంద్ర బృందం సభ్యులు సమీక్షించారు. పర్యటన సమయంలో కరువు పరిస్థితులు చూసిన కేంద్ర బృందం సభ్యులు కరువు నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరువు తీవ్రంగా ఉన్నా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు గానీ, కరువు నివారణ ప్రతిపాదనలు కాని పంపకపోవడంతో వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ, ఉద్యానశాఖ అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
హమ్మయ్యా.. ఇప్పటికి బయటపడ్డాం !
♦ వాయిదా పడ్డ కేంద్ర బృందం పర్యటన ♦ ఊపిరి పీల్చుకుంటున్న ‘ఉపాధి’ సిబ్బంది ♦ రికార్డుల్లో లొసుగులతో అంతర్గత మధనం ♦ అంతర్గత ఆడిట్లో సంతృప్తికర ఫలితాలు ♦ వచ్చాయంటున్న అధికారులు రికార్డుల పరిశీలనకు కేంద్ర బృందం రానున్నదనే సమాచారంతో ఉపాధి హామీ పథకం సిబ్బందిలో గుబులు మొదలైంది. హడావుడిగా గత కొన్ని రోజులుగా రాత్రనకా, పగలనక రికార్డులు సేకరించే పనిలో పడ్డారు. సంబంధిత జిరాక్సు కాపీలకే వేల రూపాయలు ఖర్చయ్యాయంటే ఏమేరకు సిద్ధపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కేంద్రం బృందం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందన్న సమాచారంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు... సాక్షి, మచిలీపట్నం : ఉపాధి హామీ పథకం సిబ్బందికి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. ఇప్పటి వరకు పథకంలో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డుల పరిశీలనకు ఈనెలలో రాష్ట్ర, కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు హడావుడిగా రికార్డులు సిద్ధం చేసుకున్నారు. తమ తప్పులు ఎక్కడ బహిర్గమవుతాయోనని ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జిల్లాకు రాష్ట్ర బృందం మాత్రమే తనిఖీలకు వచ్చినట్లు సమచారం. కేంద్ర బృందం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో జిల్లా ఉపాధి అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేంద్ర బృందం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే.. ఆ తనిఖీ ల్లో రికార్డుల నిర్వహణ, నిధుల వెచ్చింపుల్లో తేడాలు వస్తే శాఖపరమైన చర్యలకు బలవ్వాల్సిన పరిస్థితి వస్తుందని మదన పడ్డారు. అంతర్గత ఆడిట్లో సంతృప్తికర ఫలితాలు ! ఉపాధి పథకం నిధులతో జిల్లావ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీల్లో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, ఎన్టీఆర్ గృహాలు తదితర వాటికి రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నాయి. గత ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లతో వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపట్టినట్లు సమాచారం. కాగా ఈ పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ గతంలో గందరగోళంగా ఉండేది. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుందన్న ఆదేశాలతో అధికారులు రికార్డుల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఒక్కో మండలంలో రూ.50 వేలు జిరాక్స్ కాపీలకే వెచ్చించారంటే ఏ మేరకు క్రమబద్ధీకరించారో అర్థం అవుతోంది. గత నెలలోనే బృందం జిల్లాకు రావాల్సి ఉండగా.. వాయిదా పడుతూ వచ్చింది. ఈనెలలో కూడా బృందం వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఐదేళ్లుగా ఉపాధి పథకం నిధుల వ్యయంపై అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఆ ఆడిట్లో ఎలాంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం బహిర్గతం కాలేదని డ్వామా పీడీ రాజగోపాల్ తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదన్నారు. రికార్డుల నిర్వహణ సైతం పక్కాగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంతర్గత ఆడిట్లో సైతం ఎలాంటి తప్పులు బయటపడలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
భూగర్భ జలాల పెరుగుదలపై దృష్టి
- జిల్లాకు చేరుకున్న కేంద్రబృందం – జిల్లా కలెక్టర్ చెప్పిన అంశాలపై పరిశీలన – నేడు క్షేత్ర స్థాయికి వెళ్లనున్న బృందం సభ్యులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో భూగర్బ జలాల పెరుగుదలను పరిశీలించేందుకు మంగళవారం సాయంత్రం కేంద్రబృందం కర్నూలుకు వచ్చింది. ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్ అవార్డుకు కర్నూలు జిల్లా ఎంపికైన నేపథ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఢిల్లీ వెళ్లి భూగర్భ జలాలు పెరగడానికి దోహద పడిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు. పవర్‌పాయింట్‌లోని అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కేంద్రం టెలికమ్యూనికేషన్స్ శాఖ డిప్యూటీ సెక్రటరీ అహోక్, డైరెక్టర్ బీరేంద్రకుమార్ అనే ఇద్దరు ఉన్నతాధికారులను జిల్లాకు పంపింది. స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ఈ బృందానికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వివిధశాఖల అధికారులు స్వాగతం పలికారు. ఉద్యమ తరహాలో చేపట్టిన కార్యక్రమాలతో భూగర్బ జలాలు గణనీయంగా పెరిగాయని కలెక్టర్ వారికి వివరించారు. ఇందువల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించిన అంశాలను బృందం బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనుంది. కార్యక్రమంలో సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో మరో కేంద్ర బృందం పర్యటన
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల అధ్యయనం కోసం గత జనవరిలో ముగ్గురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం పర్యటించి వెళ్లగా సోమవారం ఇద్దరు బృందం సభ్యులతో కూడిన మరో బృందం పలు మండలాల్లో పర్యటించింది. ఈ పర్యటనను జిల్లా యంత్రాంగం గోప్యంగా ఉంచడం విశేషం. బృందం వెంట కలెక్టర్ కోనశశిధర్ వెళ్లినా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు కూడా ఎలాంటి వివరాలు అందించకపోవడం గమనార్హం. పలువురు అధికారులకు ఫోన్లు చేసినా బృందం సభ్యుల పేర్లు, పర్యటన గురించి చెప్పడానికి నిరాకరించారు. అనధికార వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర బృందం సభ్యులు పుట్లూరు మండలం మడుగుపల్లి, కూడేరు మండలం కమ్మూరు, ఆత్మకూరు మండలం కొత్తపల్లి, రాప్తాడు మండలం బండమీదపల్లి, రూరల్ మండలం ఆలమూరు ప్రాంతాల్లో పర్యటించారు. డ్రిప్ ద్వారా పండ్లతోటల సాగు, ముఖ్యంగా తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న పుట్లూరు మండలంలో అరటి తోటల సాగు, రైతుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు, అక్విడెక్ట్ పనులు, ఫారంపాండ్స్, ఉపాధి పనులు పరిశీలన, కూలీలతో ముఖాముఖి, చెరువుల పరిశీలన, నీరు–చెట్టు కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. జిల్లా పరిస్థితి గురించి పవర్‌పాయింట్ ద్వారా అధికారులు తెలియజేశారు. మంగళవారం కూడా కేంద్ర బృందం పర్యటన కొనసాగనుందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర బృందం వెంట కలెక్టర్ కోనశశిధర్‌తో పాటు ఏపీఎంఐపీ, ఉద్యానశాఖ, భూగర్భజలశాఖ, జలవనరుల శాఖ అధికారులు ఉన్నారు. -
సమయమూ కరువేనా..
మొక్కుబడిగా సాగిన కేంద్ర బృందం పర్యటన మండలాల సంఖ్య కుదింపు పశ్చిమాన నామమాత్రంగా... ఆలస్యంగా ప్రారంభించి వడివడిగాముగించుకున్న వైనం జిల్లాలో కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం నిరాశ మిగిల్చింది. పంట నష్టంతో దిగాలు పడిన అన్న దాతకు బృందం పర్యటన తీరు భంగపాటు కలిగించింది. వచ్చాం.. వెళ్లాం.. అనే రీతిలో వీరి పర్యటన సాగడం విమర్శలకు దారితీసింది. సోమవారం ఆలస్యంగా ప్రారంభించి ఆదర బాదరాగా రెండు మూడు మండలాల్లో మొక్కుబడిగా తిరిగి పర్యటన అయ్యిందనిపించారు. కరువు కరాళ నృత్యం చేస్తున్న పశ్చిమ మండలాల్లో నామమాత్రంగా పర్యటించడం అక్కడి రైతాంగాన్ని బాధించింది. కరువు జాబితాలో లేని మండలాన్ని పర్యటించడం కొసమెరుపు. పర్యటించాల్సిన మండలాల షెడ్యూలును కూడా కుదించేసుకుంటూ బృందం వడివడిగా వైఎస్సార్ జిల్లాకు పయనమైపోయింది. చిత్తూరు (కలెక్టరేట్): జిల్లాలో నెలకొన్న కరువు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన ఆదరాబాదరాగా సాగింది. సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సిన పర్యటన ఆఖరి నిముషంలో మార్పు చేశారు. దీంతో పలు మండలాల పర్యటనను రద్దుచేసి, నామమాత్రపు పరిశీలనకు శ్రీకారం చుట్టారు. కరువు ఎక్కువగా ఉన్న పడమటి మండలాల్లో పొద్దుపోయాక తిరిగామనిపించారు. ఆదివారమే తిరుమలకు చేరుకున్న బృందం సోమవారం చెన్నై నుంచి వచ్చినట్లు భ్రమింపజేశారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 9.45 గంటలకు చిన్నగొట్టిగల్లు నుంచి బృందం పర్యటన సాగాలి. సాయంత్రం 4 గంటల వరకు 9 మండలాల్లో కరువును పరిశీలించాల్సి ఉంది. అయితే ఆది వారం మధ్యాహ్నం జిల్లాకు వచ్చిన అధికారుల బృందం నేరుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. సోమవారం ఉదయం ఆఖరి నిమిషంలో షెడ్యూల్‌ను బాగా కుదిం చేసింది. దీంతో ఈ బృందం మధ్యాహ్నానికి తూర్పుప్రాంతంలోని వరదయ్యపాళెం మండలంలో పర్యటించి తిరుపతికి చేరుకుంది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు చిన్నగొట్టిగల్లు మండలం చేరుకుని అక్కడి పరిస్థితులను చూసింది. తరువాత రొంపిచెర్ల , పీలేరు మండలం వద్దకు చేరుకునే సమయానికే పొద్దుపోయింది. అక్కడ నుంచి కలికిరి, కలకడ మండలాలకు వెళ్లింది. చీకట్లో తూతూ మంత్రంగా పర్యటన చేపట్టి వైఎస్సార్ జిల్లాకు వెళ్లిపోయింది. కరువు బృందం ఆదివారం మధ్యాహ్నానికే తిరుమలకు చేరుకున్న విషయం సోమవారం అన్ని పత్రికల్లో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ బృందం తిరుమల నుంచి నేరుగా నెల్లూరు జిల్లా తడకు చేరుకుంది. అక్కడి నుంచి మధ్యాహ్నానికి చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఈ బృందం చెన్నై నుంచి వచ్చినట్లు చెప్పుకోవడం గమనార్హం. జిల్లాలో కరువు తాండవిస్తున్న పడమటి మండలాల్లో కరువు బృందం పర్యటించాల్సి ఉంది. ఇందుకోసం చిన్నగొట్టిగల్లు నుంచి కలకడ వరకు 9 మండలాల్లో పర్యటించే విధంగా షెడ్యూల్ రూపొందించింది. సోమవారం ఉదయం హడావుడిగా షెడ్యూల్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న బృందం కరువు లేని తూర్పు ప్రాంతాల్లోని వరదయ్యపాళెం మండలంలో పర్యటించడం విస్మయం కలిగించింది. తిరుపతిలో ఫొటో ఎగ్జిబిషన్ చూసి సాయంత్రం కరవు పర్యటనకు శ్రీకారం చుట్టింది. సమయం తక్కువగా ఉండటంతో మార్గం మధ్యలోని నాలుగు మండలాలను మాత్రం పరిశీలించకుండా వైఎస్ఆర్ జిల్లాకు వెళ్లిపోయింది. తమ ప్రాంతాలకు కరువు బృందం వస్తుంది... అంచనాలు వేస్తుంది... తమకేదో లాభం చేకూర్చుతుందని భావించి ఆశగా ఎదురుచూసిన కురబలకోట, మదనపల్లె ప్రాంత రైతులకు నిరాశే మిగిలింది. ఆఖరు నిమిషంలో బృందం తమ మండలాలకు రావడం లేదని తెలియడంతో రైతులు నిరుత్సాహపడ్డారు. బృందం పర్యటించిన మండలాల రైతులు కూడా ఉదయం నుంచి పొద్దుపోయేంత వరకు పొలాల్లోనే పడిగాపులు కాశారు. తరువాత చీకట్లో వెళ్లిన బృందం గ్రామాల్లోని రైతులతో పలకరించి వెళ్లిపోయింది. కరువు విలయతాండం రొంపిచెర్ల(పుంగనూరు): రొంపిచెర్ల మండలంలో తీవ్ర వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను సోమవారం కేంద్ర కరువు బృందం పరిశీలించింది. బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ పెద్దకురవపల్లెకు సమీపంలోని వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులను విచారించింది. ఐదేళ్లుగా కరువు విలయ తాండవం చేస్తోందని రైతులు అధికారులకు తెలిపారు. పశువులకు గ్రాసం కూడా లేదనీ, చెరువులు ఎండిపోవడంతో పశువులకు తాగునీరు కూడా దొరకడం లేదని వివరించారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని చెప్పారు. వెయ్యి అడుగులు డ్రిల్చేసినా నీరు లేదు కలికిరి(పీలేరు): వెయ్యి అడుగుల లోతు కంటే ఎక్కువగా బోర్లు డ్రిల్ చేసినా నీరు పడడం లేదని కలికిరి మండల ప్రజలు కరువు బృందానికి తెలిపారు. మేడికుర్తి పంచాయతీలోని సుల్తాన్ చెరువును సోమవారం సాయంత్రం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా హంద్రీ–నీవా జలాలను ఈ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు విన్నవించారు. రుణాలు మాఫీ చేయండి వరదయ్యపాళెం (సత్యవేడు): ఇటు వరాభావ పరిస్థితులు.. అటు చెరువులకు చేరని తెలుగు గంగ నీటితో రెండేళ్లుగా పంటలు చేతికందలేదని వరదయ్యపాళెం మండల రైతులు కేంద్ర కరువు బృందానికి తెలిపారు. కేంద్ర బృందం సోమవారం ఉదయం మండలంలోని కడూరులో పర్యటించింది. ఈ సందర్భంగా తమకు వ్యవసాయరుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేసి కొత్త రుణాలు అందజేయాలని రైతాంగం మొరపెట్టుకుంది. తిరుపతిలో ఫోటో ప్రదర్శన పరిశీలన తిరుపతి (అలిపిరి) : జిల్లాలో కరువు పరిస్థితులపై తిరుపతి ఆర్ అండ్ బీ అతిథి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను సోమవారం ఉదయం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కరువు మండలాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని జిల్లా అధికారులను ప్రశ్నించింది. -
సాయం చేయకుంటే.. చావులే శరణ్యం
= వర్షాలు, పంటలు, పాడి లేక.. బోర్లలో నీళ్లు రాక అప్పులపాలయ్యాం = ఎకరా వేరుశనగకు రూ.15 వేలు ఖర్చు చేస్తే అర బస్తా కూడా రాలేదు = వేరుశనగకు ఫసల్‌బీమా వర్తింపజేయాలి.. ఇన్పుట్, ఇన్సూరెన్సు విధానం మారాలి = ఉపాధి పనిదినాలు పెంచాలి = ఉద్యాన పంటల రక్షణ, శాశ్వత సాగునీటి చర్యలు చేపట్టాలి = కేంద్ర కరువు బృందానికి రైతులు, పార్టీల నేతలు, ప్రజాసంఘాల వినతి = తక్షణ సాయంగా రూ.2,161.38 కోట్లు ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి అనంతపురం అగ్రికల్చర్ : ‘‘పంటలు పండలేదు. పెట్టిన పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. ఇంటినిండా అప్పులు మిగిలాయి. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ పోషణ భారంగా మారింది. బతుకుదామని బోర్లు వేయిస్తే 800 నుంచి వెయ్యి అడుగులు తవ్వినా చుక్క నీరు రావడం గగనమైంది. మల్బరీ, పండ్లతోటలు నిలువునా ఎండిపోతుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. పండినా మార్కెట్లో ధర లేక టమాట లాంటివి రోడ్లలో పారబోస్తున్న పరిస్థితి. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా మారాల్సిన దుస్థితి. తాగడానికి కూడా గుక్కెడు నీరు లభించడం కష్టంగా ఉంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సాయం అందజేయకుంటే చావులే శరణ్యం’’ అంటూ జిల్లా రైతులు కేంద్ర కరువు బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాత్కాలిక ఉపశమనంతో పాటు హంద్రీ–నీవా లాంటి ప్రాజెక్టులతో తాగు, సాగునీటి కల్పన ద్వారా శాశ్వత కరువు నివారణ చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యుత్‌శాఖ డైరెక్టర్ జేకే రాథోడ్ నేతృత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సెక్రటరీ ఎం.రామకృష్ణ, తాగునీటి విభాగం సీనియర్ సలహాదారు జీఆర్ జర్గర్తో కూడిన ముగ్గురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం సోమవారం జిల్లాలో పర్యటించింది. రూ.2,161.38 కోట్ల సాయం చేయండి సోమవారం ఉదయం 9.40 గంటలకు కేంద్ర కరువు బృందం సభ్యులు హిందూపురం మండలం కిరికెర వద్దనున్న పట్టుపరిశోధన, అభివృద్ధి సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. కరువు పరిస్థితులపై వ్యవసాయ, పట్టు, పాడి, పశుసంవర్ధక, ఉద్యాన, భూగర్భజల, ఐసీడీఎస్, డ్వామా తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడే కరువు పరిస్థితులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ కోన శశిధర్ కేంద్ర బృందానికి అర్థమయ్యేలా గణాంకాలతో సహా ఇచ్చారు. తక్షణసాయంగా జిల్లాకు రూ.2,161.38 కోట్లు అందజేయాలంటూ నివేదిక సమర్పించారు. 2017 జూన్ వరకు అంచనాతో ఈ నివేదికను తయారు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అందులో వ్యవసాయశాఖకు రూ.1,203.02 కోట్లు, ఉద్యానశాఖకు రూ.168.97 కోట్లు, పట్టు పరిశ్రమశాఖకు రూ.27 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.55.84 కోట్లు, తాగునీటి విభాగానికి రూ.47.94 కోట్లు, పబ్లిక్ హెల్త్‌కు రూ.21.99 కోట్లు, మైనర్ ఇరిగేషన్ కు రూ.207.75 కోట్లు, డ్వామాకు రూ.309.46 కోట్లు, ఐసీడీఎస్‌కు రూ.119.41 కోట్లు అవసరమని వివరించారు. ఎండిన పంటల పరిశీలన గంట పాటు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఉదయం 11.30 గంటలకు కరువు పరిశీలన కోసం బయలుదేరారు. మొదట హిందూపురం మునిసిపాలిటీ పరిధిలోని రహమత్‌నగర్‌లో తాగునీటి సమస్యను తెలుసుకున్నారు. స్థానికులు, పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీ మహిళలు దశాబ్దాలుగా తాగునీటి కోసం తాము పడుతున్న అవస్థలను వివరించారు. అక్కడి నుంచి హిందూపురం మండలం మణేసముద్రం గ్రామానికి వెళ్లి అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పరిగి మండలం గొల్లపల్లిలో హనుమంతరాయుడుకు చెందిన ఎండిన మల్బరీ తోట, రైతు వీరారెడ్డికి చెందిన ఎండిన కంది పంట పొలాలను పరిశీలించారు. రెండెకరాల పొలంలో 600 అడుగుల చొప్పున నాలుగు బోర్లు వేసినా చుక్కనీరు రాకపోవడంతో అప్పులు మిగిలాయని రైతు వీరారెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెడితే ఒక బస్తా వేరుశనగ పండిందని రైతు నాగప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప జిల్లా కరువు పరిస్థితుల గురించి చెబుతూ తప్పనిసరిగా సాయం చేయాలని కోరారు. కరువు బృందాలు వచ్చివెళుతున్నా శాశ్వత పరిష్కారం చూపించలేదన్నారు. దేశమంతా ఒకేరకంగా కాకుండా ‘అనంత’ లాంటి జిల్లాలకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స పాలసీలు కూడా మార్పు చేయాలన్నారు. అక్కడి నుంచి గోరంట్ల మండలం మందలపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రైతులతో సమావేశమయ్యారు. 3.40 ఎకరాల వేరుశనగకు రూ.70 వేల వరకు ఖర్చు పెట్టినా ఎకరాకు బస్తా కూడా పండలేదని రైతు రామచంద్రనాయక్ వాపోయాడు. పదేళ్లుగా ఇవే బాధలు పడుతున్నామన్నారు. ఐదెకరాల వేరుశనగ సాగుకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశానని మరో రైతు కరావులపల్లి గోవిందరెడ్డి చెప్పాడు. మరో ఐదు ఎకరాల్లో కూరగాయలు, కళింగర లాంటి పంటలు వేస్తే గిట్టుబాటు లేక ఒక్కోసారి రోడ్డున పారబోస్తున్నామన్నాడు. ఈ ఏడాది రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందన్నారు. మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కోరాడు. వేరుశనగ పంటకు ఫసల్‌బీమా వర్తింపజేయాలని, ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని వైఎస్సార్సీపీ నాయకుడు రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. కరువు బృందం సభ్యులు కొత్తచెరువులో మధ్యాహ్న భోజనం ముగించుకున్నారు. 3.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎండిపోయి నెర్రెలు చీలిన బుక్కపట్నం చెరువును పరిశీలించారు. ఇక్కడ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సభ్యులను కలిసి జిల్లా పరిస్థితిని వివరించారు. పోలీసుల అత్యుత్సాహం జిల్లా కరువు పరిస్థితులపై వినతి పత్రం ఇవ్వడానికి సీపీఎం, సీపీఐ, రైతు సంఘం నాయకులు చేతిలో గడ్డి పట్టుకుని బుక్కపట్నం చెరువు దగ్గరకు రాగా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకున్నారు. ‘మీరు రైతులేనా? ఏదీ పాస్‌పుస్తకం చూపించండి’ అంటూ రైతు సంఘం నాయకులను గద్దిస్తూ చేతిలో ఉన్న గడ్డిని విసిరేసి తోసేశారు. ‘మేము రౌడీలమా? రైతుల సమస్యల గురించి అడగడానికి వచ్చామ’ని మొత్తుకున్నా వారు వినకుండా రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిని మాత్రమే కేంద్ర బృందం దగ్గరకు అనుమతించారు. మామిడి తోట పరిశీలన బుక్కపట్నం చెరువును చూసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు పెనుకొండ మండలం రాంపురం గ్రామం వద్ద చలపతి పొలంలో ఉపాధిహామీ పథకం కింద ఫారంపాండ్ తవ్వుతున్న కూలీలతో మాట్లాడారు. వేరే పనులు లేకపోవడంతో పనిదినాలు కనీసం 200 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పెనుకొండ వద్ద గొర్రెల అభివృద్ధి క్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ పశుశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాయితీతో పశుదాణా, సైలేజ్బేల్స్ పంపిణీ గురించి తెలుసుకున్నారు. తర్వాత అదే మండలం కోనాపురంలో రైతు శ్రీనివాసరెడ్డికి చెందిన ఎండిన మామిడితోటను చూశారు. పెనుకొండకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కేంద్ర బృందాన్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. పెనుకొండ మండలం తిమ్మాపురంలో రైతు కిష్టప్పకు చెందిన ఎండిన జొన్న, కంది పంటలను చూశారు. పంటను కాపాడుకునేందుకు 800 అడుగులు బోరు వేసినా నీళ్లుపడలేదని రైతు తెలిపాడు. చివరగా సాయంత్రం 6.30 గంటలకు చెన్నేకొత్తపల్లి సమీపంలో రైతు శ్రీనివాసులుకు చెందిన ఎండిన కంది పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత, జెడ్పీ చైర్మన్ చమన్ తదితరులు కేంద్ర బృందాన్ని కలిసి జిల్లా పరిస్థితిని వివరించారు. రాత్రి ఎనిమిది గంటలకు అనంతపురం ఆర్అండ్బీ అతిథిగృహానికి చేరుకుని.. అక్కడే బస చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ శశిధర్ హిందూపురం వరకు పాల్గొనగా.. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం రైతులు చెప్పిన సమస్యలను కేంద్ర బృందానికి ఇంగ్లిష్‌లో వివరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, వ్యవసాయ, అనుబంధ శాఖలు, ఇరిగేషన్, ప్రణాళిక, భూగర్భజలశాఖ, సమాచార పౌరసంబంధాలశాఖ, ఐసీడీఎస్ తదితర అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. -
కరువు బృందానికి వాస్తవాలు చెప్పండి
అనంతపురం అర్బన్ : జిల్లా కరువుని పరిశీలించేందుకు వస్తున్న కేంద్ర బృందానికి వాస్తవ నివేదిక ఇవ్వాలని అధికారులను రైతు సంఘం (సీపీఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో వేరుశనగ పంట 6,09,377 హెక్టార్లలో నష్టం జరిగిందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, అయితే కరువు మాడ్యూల్‌ని అమలు చేయడం లేదని తెలిపారు. కరువు నివారణకు నిధులు కేటాయించలేదని తెలియజేశారు. -
జిల్లాలో రేపు కేంద్ర కరువు బృందం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిని పరిశీలించేందుకు మంగళవారం కేంద్ర కరువు బృందం జిల్లాలో పర్యటించనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ జేకే రాథోడ్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి పంటల పరిస్థితి, రైతుల కష్టాలు, తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత తదితర అంశాలను అధ్యయనం చేయనుంది. కేంద్ర బృందం పర్యటన క్రమాన్ని జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించే కరువు బృందం మంగళవారం 11.15 గంటలకు ఆలూరు మండలానికి చేరుకుంటుంది. ఎ.గోనేహల్‌లో కరువు రైతులతో ముఖాముఖిగా చర్చిస్తుంది. తర్వాత ఆదోని మండలం ధనాపురం చేరుకుంటుంది. ఆదోనిలో మధ్యాహ్నం భోజనం తీసుకున్న అనంతరం కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామాల్లో పర్యటించి ఎండిన చెరువులను పరిశీలించడంతో పాటు కరువు తీవ్రతపై రైతులతో చర్చిస్తుంది. సాయంత్రానికి స్టేట్‌గెస్ట్ హౌస్‌కు చేరుకొని అక్కడ కరువు పరిస్థితిపై వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తుంది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఇతర శాఖల అధికారులతోను ప్రజాప్రతినిధులతోను కరువుపై చర్చిస్తారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీకి వెళ్తుడటంతో కేంద్రబృందం వెంట జాయింట్ కలెక్టర్ హరికిరణ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి ఈ బృందం వెంట ఉంటారు. 5.30 గంటలకు కేంద్ర బృందం విజయవాడ వెళ్తోంది. -
మా భాష అర్థం కాదులెండి!
– ప్రజాప్రతినిధులతో కేంద్ర బృందం భేటీ – ‘విజయగాథ’ల కోసం వచ్చిన సెంట్రల్ టీం – అది తెలియక సమస్యల చిట్టావిప్పిన జెడ్పీ సభ్యులు అనంతపురం టౌన్ : ‘జిల్లా పరిషత్ సమావేశాలు మూడు నెలలకు ఒకసారి జరుగుతున్నాయి. కానీ అంతా చర్చలకే పరిమితం. నిధులు లేవు.. నిర్ణయాలు తీసుకోవడమే గానీ అమలు చేయలేని పరిస్థితి. ఎవరో చేసిన దానిపై చర్చ జరుగుతుంది. మా ఊరి సమస్యలొక్కటే చెప్పగలుగుతున్నాం. కేవలం సభ్యులుగా ఎన్నికయ్యామంతే.. ఐదేళ్లుంటాం.. మాకిక్కడ ఏదీ లేదు’ ఇదీ కేంద్ర బృందంతో జరిగిన భేటీలో పెనుకొండ జెడ్పీటీసీ సభ్యుడు నారాయణస్వామి ఆవేదన. జిల్లా పరిషత్ పనితీరును పరిశీలించేందుకు సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఆఫీసర్ సునీల్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బాలమురళి రెండ్రోజుల క్రితం జిల్లాకు వచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ముగియడంతో గురువారం జెడ్పీ భవనంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. బృందానికి కావాల్సింది కేవలం జెడ్పీ పరిపాలన ఎలా జరుగుతోందన్నదే. కానీ ఈ విషయం సమావేశానికి వచ్చిన జెడ్పీ సభ్యులకు తెలియదు. దీంతో రెండున్నరేళ్లుగా తాము ఎంతగా ఇబ్బందులు పడుతున్నామో వివరించే ప్రయత్నం చేశారు. సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చిన నారాయణస్వామి చేతికి మైక్ ఇవ్వగానే పై విధంగా మాట్లాడారు. జెడ్పీ సీఈఓ రామచంద్ర కలుగజేసుకుని బృందం సభ్యులకు నిధులు విడుదల చేసే అధికారం లేదని, సమస్యలు కాకుండా విజయగాథలు తెలియజేయాలన్నారు. దీంతో ‘సరే..సరే.. మా భాష ఎలాగూ వారికి అర్థం కాదులెండి’ అనడంతో అక్కడున్న వారిలో నవ్వులు పూయించింది. కలెక్టర్‌తో ముడిపెట్టొద్దు : జెడ్పీ సమావేశాల్లో ఒక అంశంపై తీర్మానం చేస్తే దాన్ని అమలు చేయడం లేదు. కలెక్టర్‌కు పంపుతున్నారు. జెడ్పీ ప్రధానమా? కలెక్టర్ ప్రధానమా.? ప్రతి దానికీ కలెక్టర్‌తో ముడిపెట్టొద్దు.. అని జెడ్పీటీసీ సభ్యుడు రవీంద్రారెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణ అన్నారు. జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసమూర్తి, విశాలాక్షి, వేణుగోపాల్ మాట్లాడుతూ ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా పంచాయతీలకే వెళ్తుండడంతో ఇబ్బందిగా ఉందన్నారు. ‘ఉపాధి’ ప్రగతి భేష్ : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ప్రగతి బాగుందని కేంద్ర బృందం సభ్యులు కితాబిచ్చారు. పీడీ నాగభూషణంను అభినందించారు. ఈ ఏడాది జరుగుతున్న పనుల వివరాలను, దేశంలోనే అత్యధికంగా ఫారంపాండ్ల తవ్వకాలు చేపడుతున్నట్లు పీడీ చెప్పగా.. నివేదికలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘సామూహిక సీమంతాలు’ చేపట్టడంపై పీడీ జుబేదాబేగంను ప్రశంసించారు. సీఎం భజన చేసిన జెడ్పీ చైర్మన్ హిందీలో ప్రసంగించిన జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ సీఎం భజన చేశారు. మొదట జెడ్పీ పరిపాలన సాగుతున్న తీరును వివరించారు. ఆ తర్వాత అందరూ 8 గంటలే పని చేస్తారని, కానీ ముఖ్యమంత్రి మాత్రం 18 గంటలు పని చేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. -
'కొత్త నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలి'
హైదరాబాద్ : కొత్త రూ.500 నోట్లను వెంటనే అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర బృందాన్ని కోరారు. నోట్ల రద్దుతో తలెత్తిన పరిణామాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సమావేశానికి సీఎస్‌తో పాటు ఆర్బీఐ, పలు బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. నోట్ల రద్దుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి వివరించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుదలపై శాఖలవారీగా నివేదికలు సమర్పించారు. వ్యవసాయ అవసరాలతో పాటు ప్రభుత్వ చెల్లింపులకు పాత నోట్లను అనుమతించాలని రాజీవ్ శర్మ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. -
దుర్భరంగా రైతు జీవితాలు
– బలవణ్మరాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక – రెండో రోజు పర్యటనలో కేంద్ర బందం ప్రతినిధులు అనంతపురం అగ్రికల్చర్ : అనావష్టి పరిస్థితుల వల్ల వరుసగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో జిల్లాలో రైతు కుటుంబాల పరిస్థితి దయనీయంగానే ఉందని కేంద్ర ప్రభుత్వ రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ (సెంట్రల్ సూసైడ్ కమిటీ) ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్‌ఎస్) ప్రతినిధులు డాక్టర్ జె.రాంబాబు, డాక్టర్ బి.రాము, డాక్టర్ ఎం.నాగేశ్వరరావుతో కూడిన ముగ్గురు అధికారుల బందం శనివారం జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు బుక్కపట్నం, ఓడీచెరువు, కదిరి మండలాల్లో పర్యటించిన బందం రెండో రోజు ఆదివారం మరో ఏడు మండలాల్లో పర్యటించారు. డీడీఏ ఎం.కష్ణమూర్తి, గార్లదిన్నె ఏఓ శ్రీనాథరెడ్డిని వెంటబెట్టుకుని అనంతపురం రూరల్ మండలం నరసనాయునికుంట తండా, గార్లదిన్నె మండలం మర్తాడు, కల్లూరు, శింగనమల మండలం లోలూరు, కొరివిపల్లి, బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం, సంజీవపురం, నార్పల మండలం నరసాపురం తదితర గ్రామాల్లో పర్యటించి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాంబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న రైతులు, బలన్మరణాలకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ ఆర్థిక స్థితిగతులు, పరిహారం పంపిణీ, ప్రస్తుతం కుటుంబ పరిస్థితి గురించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కనీసం 20 కుటుంబాలకు సంబంధించి సేకరించిన డేటాను అధ్యయనం చేయడంతో పాటు సమగ్రంగా విశ్లేషించి డిసెంబర్ 15 నాటికి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేస్తామన్నారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలు, జిల్లా స్థితిగతులు చెప్పడానికి ఆయన నిరాకరించారు. -
రైతు ఆత్మహత్యలపై ఆరా
అనంతపురం అగ్రికల్చర్ : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల స్థితిగతులు తెలుసుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ (ఏఈఆర్‌ఎస్) ప్రతినిధులు డాక్టర్ జే.రాంబాబు, డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, డాక్టర్ బి.రాములతో కూడిన బందం శనివారం జిల్లాకు వచ్చింది. బందం సభ్యులు స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అడిషినల్ డైరెక్టర్ సుశీల, జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని కలిశారు. జిల్లాలో 2014 జూన్ నుంచి ఇప్పటివరకు బలవణ్మరాలకు పాల్పడిన రైతుల వివరాలు, పరిహారం అందిన రైతులు, అందని రైతుల వివరాలు తీసుకున్నారు. అనంతరం డీడీఏ ఎం.కష్ణమూర్తి, కదిరి ఏడీఏ వి.లక్ష్మానాయక్‌ను వెంటబెట్టుకుని బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి, ఓడీ చెరువు మండలం వడ్డివారిపల్లి, అలాగే కదిరిలో రైతు కుటుంబాలు, పలువురు రైతులు, ఎన్జీఓ ప్రతినిధులను కలిసి వివరాలు సేకరించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 90 మంది వరకు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాబితాలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. -
నష్టం అంచనాకు కేంద్ర బృందం
తెనాలి: భారీ వర్షాలకు కలిగిన నష్టం అంచనాకు కేంద్రం బృందం త్వరలోనే వస్తుందని, తగిన నివేదిక ఇచ్చిన వెంటనే తప్పక ఆదుకొంటామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ఇక్కడి చావాస్ గ్రాండ్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రకృతి విపత్తు నిధులు రూ.300 కోట్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని ముందు వినియోగిస్తూ తర్వాత మిగతా నిధులు కేటాయించుకోవచ్చని చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.1142 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని కోసం డ్రాఫ్ట్ ప్రాజెక్టు రిపోర్టు లేదన్న అభ్యంతరాలను ఖాతరు చేయకుండా విజయవాడ, గుంటూరులో కొన్ని పథకాల కోసం రూ.1000 కోట్లను మంజూరు చేయించినట్టు వెంకయ్యనాయుడు వెల్లడించారు. గన్నవరం– విజయవాడ– అమరావతి మధ్య మెట్రో రైలు, గుంటూరు– అమరావతి మధ్య షటిల్ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రాజధానికి 168 కిలోమీటర్ల ఔటర్ రింగురోడ్డును కేంద్రమే నిర్మిస్తుందని తెలిపారు. తాగునీరు, మురుగునీటి పథకాలకూ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ కేవలం 18 నెలల్లోనే కేంద్రం 8 ఉన్నత విద్యా సంస్థల్ని 13 జిల్లాల్లో ఏర్పాటుకు వేల కోట్ల రూపాయల్ని మంజూరు చేసిందన్నారు. అనంతరం తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, టి.అనంతాచార్యులు, డాక్టర్ పి.దక్షిణామూర్తి, దిలీప్‌రాజా మాట్లాడారు. వేదికపై మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రావి రవీంద్రనాథ్ ఉన్నారు. -
'ఐదేళ్లలో ఎయిమ్స్‌ను నిర్మిస్తాం'
నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ను పరిశీలించిన సభ్యులు హైదరాబాద్: మంగళగిరిలో నిర్మాణం చేపట్టిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను కేంద్రబృందం సోమవారం పరిశీలించింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు పర్యటించనుంది. ఇప్పటికే పూర్తయిన ఎయిమ్స్ భవన నిర్మాణాలను కేంద్ర బృందం పరిశీలించింది. వచ్చే ఐదేళ్లలో ఎయిమ్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. ఆరుగురు సభ్యుల కేంద్ర ఉన్నతస్థాయి బృందంలో రాయ్‌పూర్, న్యూఢిల్లీ ఎయిమ్స్ సభ్యులు పీఎంఎస్ఎస్వై, పీజీఐ ఛండీగఢ్ సభ్యులతో పాటు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి చెందిన ఒకరు ఉన్నారు. -
అబ్బూరు సందర్శన
సత్తెనపల్లి: బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా ఎంపికైన సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామాన్ని కేంద్ర బృందం సోమవారం సందర్శించింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి విశ్వనాథ్ గ్రామంలో ఇంటింటికి నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక శ్మశానవాటికలు, గ్రామంలో నాటిన మొక్కలు, ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందని, అబ్బూరు గ్రామం ఆదర్శవంతంగా ఉందన్నారు. ఆయనతోపాటు ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ఈ భానువీరప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ సోదరి, డ్వామా పీడీ పులి శ్రీనివాసులు, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రామకృష్ణ తదితరులున్నారు. -
‘స్వైన్’పై పోరుకు సర్వసన్నద్ధం: కేసీఆర్
⇒ ఏ సమస్యనైనా ఎదుర్కొనేలా వైద్యారోగ్య శాఖను తీర్చిదిద్దుతాం ⇒ ప్రజల్లో ముందుగా అవగాహన కల్పించేందుకు చర్యలు ⇒ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరికరాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం ⇒ కేంద్ర బృందంతో సమావేశంలో ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: వైద్యపరమైన సమస్యలు, సంక్షోభాలు వచ్చినప్పుడు హడావుడి చేయడం కాకుండా... ఏ సమయంలో ఏం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖను తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. రుతువులను బట్టి ప్రజలు పలు రకాల రోగాలకు గురవుతున్నారని, నీరు, ఆహారం కలుషితం కావడం ద్వారానే అవి వ్యాపిస్తున్నాయని వ్యా ఖ్యానించారు. రాష్ట్రంలో ‘స్వైన్‌ఫ్లూ’ విజృంభిస్తుండడంతో పరిశీలన జరిపి, సలహాలు సూచనలివ్వడానికి వచ్చిన కేంద్ర బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిసింది. తమ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు సమస్య వచ్చినప్పుడు హడావుడి చేసి, ఆ తరువాత పట్టించుకోలేదని విమర్శించారు. ఏ కాలంలో ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకునే విధంగా వైద్య ఆరోగ్య శాఖను సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఏయే కాలాల్లో ఏయే వ్యాధులు ప్రబలుతాయోనన్న అంశంపై ప్రజల్లో ముందుగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. స్వైన్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించి సాయం అందించడంతోపాటు వైద్య బృందాన్ని పంపినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘స్వైన్‌ఫ్లూ’ నిర్ధారణకు అవసరమైన పరికరాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా సామాజిక బాధ్యత పంచుకోవాలన్నారు. కేంద్ర బృందంతో సమావేశం జరుపుతున్న సమయంలోనే కేంద్రమంత్రి నడ్డాకు సీఎం కేసీఆర్ ఫోన్‌చేసి మాట్లాడారు. మరోసారి వైద్యు ల బృందాన్ని పంపించాలని, అన్ని జిల్లాల్లో నూ పర్యటించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ చర్యలు భేష్.. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం కేంద్ర బృందం నాయకుడు అశోక్‌కుమార్ మాట్లాడారు. ‘స్వైన్‌ఫ్లూ’ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు బాగుందని ప్రశంసించారు. వివిధ ఆసుపత్రులను సందర్శించినప్పుడు అక్కడి వైద్యసేవలు సంతృప్తినిచ్చాయని... కానీ పత్రికల్లో వచ్చిన కథనాలు తమకు షాక్ కలిగించాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధాని నుంచి ఏరియా ఆసుపత్రుల వరకు స్వైన్‌ఫ్లూ మందులను అందుబాటులోకి తేవడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్వైన్‌ఫ్లూ ప్రభావం ఉందని, చలికాలంలో ఇది ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడం మంచిదన్నారు. బాధితులకు ఉచిత చికిత్స చేయడంతో పాటు ఆరోగ్యశ్రీలో చేర్చడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం రాజయ్య, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా, కేంద్ర బృందం సభ్యులు శశిఖరే, మహేశ్, ప్రణయ్‌కుమార్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. వైద్యులే రోగులను భయపెడితే ఎలా? ‘బాధితులకు భరోసా ఇవ్వాల్సిన వైద్యులే తమ ముఖానికి రెండేసి మాస్కులు ధరించి వారిని భయపెడితే ఎలా?’ అని మాస్కులతో తమకు ఎదురుపడిన ఒక వైద్యుడికి కేంద్ర వైద్య బృందం చురకంటించింది. సీఎంతో భేటీకి ముందు కేంద్ర వైద్య బృందం నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)ను, అనంతరం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిని సందర్శించింది. వైరస్ అంత ప్రమాదకరంగా ఏమీ లేదని, మాస్కులు ధరించి తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫీవర్ ఆస్పత్రిలోని రెండు, మూడో వార్డులకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై కేంద్ర బృందం ఆరా తీసింది. ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయకుండా రోగులందరినీ ఒకే వార్డులో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో వెంటనే ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. గ్రేటర్లో 24 ప్రత్యేక బృందాలు స్వైన్‌ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనంలో ఒక వైద్యుడితో పాటు ఇద్దరు నర్సులు, స్థానిక కమ్యూనిటీ హాల్ ఆర్గనైజర్‌ను నియమించారు. వీరంతా శనివారం ఉదయం నుంచి బస్తీల్లో పర్యటించి ‘స్వైన్‌ఫూ’్ల బారిన పడకుండా తీసుకో వాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. అనుమానితులను ఆస్పత్రులకు తరలిస్తారు. ఈ మేరకు శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ గ్రేటర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫీవర్ ఆస్పత్రిలోనూ ‘స్వైన్‌ఫ్లూ’ పరీక్ష పరికరాలను ఏర్పాటు చేశారు. -
మాకే సాయమూ అందలేదు
రాకాసి గాలులకు పడిపోయిన చెట్లకు చిన్న చిన్న చిగుళ్లు వచ్చాయి. కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్తవి రూపుదిద్దుకుంటున్నాయి. చిందరవందరగా మారిన తీరం ఇప్పుడు సర్దుకుంటోంది. ఇదిగో ఇప్పుడు వచ్చారు అధికారులు ‘మీ నష్టమెంత’ అని అడగడానికి. తుపాను వెళ్లిన నలభై రోజుల తర్వాత కేంద్ర బృందం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఈ సందర్భం గా స్థానికులతో అధికారులు మాట్లాడారు. అయితే అధికారుల ప్రశ్నలకు మెజారిటీ ప్రజలు ఇచ్చిన జవాబు మాత్రం ‘మాకే సాయమూ అందలేదు’ అనే... భోగాపురం: తుపాను వెలిసిన నలభై రోజుల త ర్వాత వచ్చిన కేంద్ర బృందం వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మండలంలోని హుద్‌హుద్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. ముందుగా కవులవాడలో పడిపోయిన ఇళ్లను, కొబ్బరి తోటలను పరిశీలించింది. అనంతరం తూడెం గ్రామంలో కూలిన కొబ్బరి తోటలను అధికారులు పరిశీలించారు. దీనిపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడ స్థానికులతో అధికారులు నష్టంపై మాట్లాడారు. అనంతరం దిబ్బలపాలెం గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి తమకు బియ్యం తప్పించి ఎలాంటి సాయం అందలేదని బాధితులు తెలిపారు. ఇల్లు కూలిపోయినా నమోదు చేయలేదన్నారు. అనంతరం అధికారులు బమ్మిడి పేట వద్ద తుపానుకు కొట్టుకుపోయిన ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించారు. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 20వంతెనలు పాడయ్యాయని దానికి రూ.65లక్షలు అవసరం అవుతుందని సంబంధిత శాఖ అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తారు రోడ్లకు కిలోమీటరుకి రూ.10లక్షల చొప్పున మెయింటనెన్స్‌కి నిధులు అవసరమని తెలిపారు. అనంతరం ముక్కాం గ్రామంలో పర్యటించారు. ఇక్కడ మత్స్యశాఖ ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు అందాల్సిన సాయంపై మ త్స్యశాఖ ఏడి ఫణిప్రకాష్ వివరించారు. ఇక్కడి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన కేంద్ర బృందం దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం భోగాపురం గ్రామానికి చేరుకుని పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడారు. తుపాను కారణంగా చనిపోయిన పశువులు, కోళ్ల పారాల్లో కోళ్లు, గొర్రెలు తదితర ఫొటోలను పరిశీలించారు. కార్యక్రమంలో బృంద సభ్యులు కృష్ణ, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఎస్ఈ ఎం. రమేష్‌బాబు, ఫైనాన్స్ కమిషన్ సీనియర్ డెరైక్టరు రాజీబ్ కుమార్, కేంద్ర పశుసంవర్ధక శాఖ విభాగం డిప్యూటీ సెక్రటరీ పి.ఎస్. చక్రబర్తీ, గ్రామీణాభివృద్ది మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ రామవర్మ తోపాటు జెడ్పీ చైర్మన్ శోభా స్వాతి రాణి, ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ‘తీరని శోకమిది’ పూసపాటిరేగ: మండలంలోని తిప్పలవలస గ్రామంలో హుద్‌హుద్ కారణంగా మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని కేంద్రబృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. తీర ప్రాంతంలో జరిగిన నష్టాన్ని మత్స్యశాఖ ఏడీ ఫణిప్రకాష్ కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. తుపాను ప్రభావంతో 22 మత్స్యకార గ్రామాల్లో రూ.కోట్లలో నష్టం జరిగిందని, వలలు, పడవలతో పాటు ఇళ్లకు కూడా నష్టం జరిగిందని బృంద సభ్యులకు వివరించారు. స్థానిక సర్పంచ్ భర్త వాసుపల్లి అప్పన్న గ్రామంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి తెలియజేశారు. అలాగే కలెక్టర్ ఎం.ఎం నాయక్ తీరప్రాంతంలో జరిగిన నష్టం,తుపాను సమయంలో అప్రమత్తమైన విధానాన్ని తెలిపారు. బృంద సభ్యులతో పాటు జేసీ రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, ప్రత్యేక అధికారి వి.ఆదినారాయణ, తహశీల్దార్ జి.జయదేవి, ఎంపీడీఓ డి.లక్ష్మి, ఎంపీపీ మహం తి చిన్నంనాయుడు, జెడ్పీటీసీ ఆకిరి ప్రసాదరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పంటనష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ మండలంలోని కుమిలి గ్రామం పరిధిలో దెబ్బతిన్న పంటలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి తిలకించారు. తుపాను కారణంగా నష్టపోయిన పంటలు విషయమై కుమిలి సర్పంచ్ దల్లి ముత్యాలురెడ్డి కేంద్రబృందం సభ్యులకు వివరించారు. రామతీర్థసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరఫున నిదులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు కోరారు. దీంతో బృందం సభ్యులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ ట్యాంకును పరిశీలించారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. -
అయ్యో... ఎంత నష్టం !
విజయనగరం కంటోన్మెంట్ : భీకర గాలులతో జిల్లాను కుదిపేసిన హుద్‌హుద్ తుపాను మిగిల్చిన నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం చలించిపోయింది. జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు బుధవారం వచ్చిన కేంద్ర బృందంలోని సభ్యులు పూసపాటిరేగ, భోగాపురంమండలాల్లో పర్యటించి, అక్కడ జరిగిన నష్టాన్ని కళ్లారా చూశారు. కొన్నిచోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో, అక్కడ జరి గిననష్టాలను ఫొటో ఎగ్జిబిషన్లో తిల కించారు. కేజీ బేసిన్ ఎస్ఈ ఆర్. రమేష్‌కుమార్, ఫైనాన్స్ కమిషన్ డివిజన్లోని వ్యయ శాఖ ైడె రెక్టర్ రాజీబ్ కుమార్‌సేన్, ఏహెచ్డీ అండ్ ఫైనాన్స్ శాఖకు చెందిన ఉప కార్యదర్శి పీఎస్ చక్ర బర్తి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ కె రామవర్మ జిల్లాలోని తుపాను బీభత్స ప్రాంతాల్లో పర్యటించారు. ముక్కాం, భోగాపురం, కుమిలి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తుపాను దృశ్యాలను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో జరిగిన తీవ్రమైన నష్టాలను చూసి చలించిపోయారు. భోగాపురం, ముక్కాం తదితర ప్రాంతాల్లోని బాధితులనుద్దేశించి వారు మాట్లాడుతూ తుపాను గాలులు తీవ్రంగా వీచాయని విన్నాం! ఆ సమయంలో ఎలా గడిపారు,ఏం తిన్నారని ప్రశ్నించారు. వారు చెప్పిన విషయాలను కలెక్టర్ తర్జుమా చేసి కేంద్ర బృందానికి వివరించారు వీరి భృతికి ఏం చేశారని కలెక్టర్ ఎంఎం నాయక్‌ను అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు బియ్య ం, ఉల్లిపాయలు, బంగళాదుంపలు, పప్పు, పంచదార, కిరోసిన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు తక్కువ ధరకు కూరగాయాలు అందజేశామని తెలిపారు. జిల్లాలోని 12 మండలాల్లో పైన పేర్కొన్న సరుకులను పూర్తిగా ఉచితంగా ఇచ్చామని, పాక్షికంగా నష్టం ఏర్పడిన 22 మండలాల్లో బియ్యం, పంచదార ఉచితంగా అందంజేశామన్నారు. రాజాపులోవ నుంచి కవులవాడ, తూడెం, దిబ్బపాలెం, ముక్కాం, భోగాపురం గ్రామాల్లో ఉదయం తొమ్మిదిన్నర గం టల నుంచి మధ్యాహ్నం వరకూ పర్యటించారు. జిల్లాలో జరిగిన నష్టాలపై శాఖల వారీగా పంపిన అంచనాలను పరిశీలించామని, దీనిపై కేంద్రానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. శాఖల వారీగా పంపిన అంచనాలను సరిపోల్చేందుకే వచ్చామని, ఈ పరిశీలన తరువాత నివేదికలను కేంద్రానికి పంపిస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. బాధితులతో మాట్లాడినప్పుడు తుపాను సమయంలో ఎటువంటి సహాయం అందిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పడిపోయిన చెట్లకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చిందని, వాటిని తొలగించి, వేరే చోట వేయడానికి కూడా ఆ సొమ్ము సరిపోలేదనీ బాధితులు కేంద్రబృందానికి తెలిపారు. రహదారులు బాగు చేయాలని కోరారు. కూలిన టేకు, కొబ్బరి చెట్లు, విద్యుత్‌స్తంభాలను, ముక్కాంలో మత్స్య కారులకు జరిగిన నష్టాన్ని, కుమిలిలో వరి,చెరకు పంటలకు జరిగిన నష్టాలను బృందం సభ్యులు పరిశీలించారు. బృందం వెంట జేసీ బి రామారావు, ఏజేసీ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ జి రాజకుమారి, ఆర్డీఓ జే వెంకటరావు, సంబంధిత జిల్లా అధికారులు ఉన్నారు. -
నేటి నుంచి కేంద్రం బృందం పర్యటన
విశాఖపట్నం: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నుంచి నాలుగురోజులపాటు కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కె.కె.పాఠక్, కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.పి.సింగ్, కేంద్ర రూరల్ వాటర్ అండ్ శానిటేషన్ కన్సల్టెంట్ బ్రిజేష్ శ్రీవాత్సవ, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ డివిజన్ డెరైక్టర్ రాజిబ్ కుమార్‌సేన్, రూరల్ డెవలెప్మెంట్ అండర్ సెక్రటరీ రామవర్మ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డెరైక్టర్ వివేక్ గోయల్, కృష్ణాగోదావరి బేసిన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.రమేష్‌కుమార్‌లతో పాటు రాష్ర్ట వ్యవసాయశాఖ డీవోడీ డెరైక్టర్ ఎస్.ఎం.కోలాట్కర్ ఈబృందంలో సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ నుంచి విమానంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖ చేరుకోనున్న ఈ బృందం సభ్యులు తొలుత ఎయిర్‌పోర్టులో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తుంది. తుపాను నష్టంపై కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. బుధవారం విశాఖపట్నం నగరంతో పాటు జిల్లాలోని అనంతగిరి, అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి, కశింకోట మండలాల్లో పర్యటిస్తారు. గురువారం తూర్పు గోదావరి జిల్లాలోని తుని, యు.కొత్తపల్లి మండలాల్లో పర్యటించి విశాఖకు చేరుకుంటారు. విశాఖలో అధికారులతో సమీక్ష అనంతరం అదేరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. -
పెట్టుబడి రాయితీ పెంచండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని హెక్టారుకు రూ. ఆరు వేల నుంచి పది వేలకు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. పై-లీన్ తుపాను, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాలను పరిశీలించి వచ్చిన కేంద్ర బృందం ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో సంభవిస్తున్న వరుస విపత్తుల వల్ల కలిగిన భారీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదారంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆయన కేంద్ర బృందాన్ని కోరారు. రాష్ట్రానికి తక్షణమే రూ. 2,145 కోట్ల సాయం అందించేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రస్తుతం పంటల బీమా రైతులకు అనువుగా లేదు. రైతులకు మేలు జరిగేలా ఈ పథకంలో మార్పులకు సిఫార్సు చేయండి. పది, పదిహేనేళ్లుగా ప్రతి యేటా జరిగిన నష్టంలో పది, పదిహేను శాతానికి మించి కేంద్రం ఇవ్వడంలేదు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది’ అని సీఎం వివరించారు. పై-లీన్ తుపాను వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ. 500 చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం నిర్ణయించారు. సవరించిన నివేదిక ఇవ్వండి: కేంద్ర బృందం వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం ప్రతినిధులు అంగీకరించారు. ‘నష్టం భారీగానే జరిగింది. మీరు గతంలో కేంద్రానికి పంపిన నివేదికలో చేరని నష్టాలు ఇంకా ఉంటే వాటిని కూడా కలిపి సమగ్రంగా తుది నివేదికను కేంద్రానికి పంపండి. మేం కూడా ఇతోధిక సాయానికి సిఫార్సు చేస్తాం’ అని కేంద్ర బృందం నాయకుడు, కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ పి.గౌరీ శంకర్రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర బృందం సూచన ప్రకారం రూ. ఏడు వేల కోట్ల సాయం కోరుతూ సవరించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సోమవారం పంపుతామని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి మీడియాకు తెలిపారు. బాధితులను ఆదుకోవాలి: పార్టీలు పై-లీన్ తుపాను సహా అకాల వర్షాలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు కేంద్ర బృందానికి నివేదించాయి. ఈ మేరకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర బృందం ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశాయి. ‘పంటనష్టం’ సర్వేలను పూర్తిచేయండి: కన్నా పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా ఇటీవల సంభవించిన పంటనష్టం వివరాల సేకరణను వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. రబీ పంటల సాగుపై ఆయన గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రబీలో ఎరువులకు, విత్తనాలకు కొరత లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ యాంత్రీకరణలో లక్ష్యాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంటల బీమాకు సంబంధించి ఈ రబీలో పాత విధానమే అమలులో ఉండేలా చూడాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి లేఖ రాసినట్లు కన్నా తెలిపారు. నష్టాల నివేదికపై సర్కారు నిర్లక్ష్యం సాక్షి, హైదరాబాద్: పైలీన్ తుపాను, ఆ తరువాత కురిసిన భారీ వర్షాలవల్ల జరిగిన నష్టాలపై సమగ్రమైన తుది నివేదికను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వర్షాలు ఆగిపోయి 24 రోజులు అవుతున్నా వర్షాలు, వరద నష్టాలపై తుది నివేదిక ఇంకా పూర్తికాలేదు. రాష్ట్రం నుంచి తుది నివేదిక అందిన వారం పది రోజుల తరువాతే కేంద్ర బృందం తమ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తరువాత హైపవర్ కమిటీ సమావేశమై జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రాష్ట్రానికి ఎంత మొత్తం కేటాయించాలో నిర్ణయిస్తుంది. పైలీన్ తుపాను, భారీ వర్షాల వల్ల రూ. 7 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేశారు. అయితే, దీనిపై తుది నివేదికను రూపొందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంపై అధికార వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ‘గత ఏడాది కరవుపై నివేదిక అందించడంలో కూడా చాలా ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపడంలో జాప్యం చేయడం వల్ల కేంద్రం నుంచి నిధులు పొందడంలో విఫలమవుతోంది. అందుకే మనకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 1145 కోట్లు రావడంలేదు’ అని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
బాధిత రైతులను ఆదుకుంటాం
చీపురుపల్లి రూరల్/భోగాపురం, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర బృందం సభ్యు డు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డెరైక్టర్ పి.గౌరీశంకర్ భరోసా ఇచ్చా రు. గత నెలలో కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మంగళవారం సాయంత్రం కేంద్ర బృందం చీపురుపల్లి మండలం జి.ములగాం, కరకాం గ్రామాల్లో పర్యటించింది. పాడైన పత్తి, బొప్పారుు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ తాను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చానని, 30 ఏళ్లు వ్యవసాయం కూడా చేసినందున రైతు కష్టం తెలుసునని చెప్పారు. రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా పంట నష్టం క్షేత్రస్థాయిలో నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాన్ని నియమించిందన్నారు. బృందంలో తనతో పాటు సీఈఎస్ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, డ్రింకింగ్ వాటర్ అండ్ క్వాలిటీ కంట్రోలర్ వి.కె.భట్ ఉన్నారని చెప్పారు. అంతకుముందు ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ 50 శాతానికి పైగా నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామని పెట్టిన నిబంధన కారణంగా చాలా మంది రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. హెక్టారును ఒక యూనిట్‌గా చేసి నష్టాన్ని అంచనా వేసేలా నివేదిక అందజేయాలని కోరారు. మండలంలో నాలుగు వందల హెక్టార్లలో బొప్పాయి పంట పాడైనా నేటికీ పరిహారం అందలేదని జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఎంపీ బొత్స ఝాన్సీ, జేడీ లీలావతి మాట్లాడుతూ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 16,936 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. 4124 హక్టార్లలో వరి, 2641హెక్టార్లలో మొక్కజొన్న, 9025 హెక్టార్లలో పత్తి, 79 హెక్టార్లలో చెరుకు, 420 హెక్టార్లలో పెసర, 355 హెక్టార్లలో మినప, 140 హెక్టార్లలో కొర్రా, 51 హెక్టార్లలో చోడి, 233 హెక్టార్లలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. అనంతరం ములగాంలో వర్ష బీభత్సానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను బృందం పరిశీలించింది. అంతకుముందు కేంద్ర బృందం భోగాపురం మండలం రావాడ గ్రామంలో పర్యటించింది. అక్కడ ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శనను సభ్యులు పరిశీలించారు. కల్వర్టులు, రోడ్లు కోతకు గురైన విషయూన్ని ఎంపీ ఝాన్సీ కేంద్ర బృందానికి వివరించారు. ఇళ్లను ప్రభుత్వమే నిర్మించాలని ఎస్సీ కాలనీవాసులు ఎంపీ వద్ద మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ పి.శోభ, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యాలయ జేడీ లక్ష్మణదాస్, స్టేట్ కన్సల్టెంట్ ఎన్డీఆర్.శర్మ, మండల ప్రత్యేకాధికారి పి.బాంధవరావు, చీపురుపల్లి తహశీల్దార్ టి.రామకృష్ణ, ఎంపీడీఓ కె.రాజ్‌కుమార్, ఏడీఏ ఆర్.శ్రీనివాసరావు, ఏఓ ఎస్.రవీంద్రనాద్, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, భోగాపురం తహశీల్దార్ రాజకుమారి, ఎంపీడీఓ ఎన్.సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ, సర్పంచ్ నిడిగొట్టు పైడినాయుడు, దంతులూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు మళ్లీ నిరాశే..
విపత్తులతో కుంగిపోయిన రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర బృందం అటువంటి చర్యలు చేపట్టకపోగా కనీసం వారితో మాట్లాడడానికి తీరిక కూడా కల్పించుకోలేదు. సుడిగాలి పర్యటన జరిపి, పంటపొలాలను చూసీచూడకుండా కేవలం గంటా 15 నిమిషాల్లో పర్యటనను ముంగించేసింది. గత నెలలో వారం రోజులకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షాలకు జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకోలేక....నీరింకని కళ్లతో, బరువెక్కిన గుండెతో... ఎలా బతికేది భగవంతుడా అంటూ బెంగపెట్టుకుని సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అన్నదాతలను ఆదుకోవలసిన కేంద్ర బృందం కనీసం వారిని పలకరించలేదు...గుండె బరువు దిగేలా రెండు మాటలు కూడా చెప్పలేదు... ఓదార్చే ప్రయత్నమే చేయలేదు. కేంద్ర బృందం వస్తుంది... తమ బాధలు వింటుంది... కన్నీరు తుడుస్తుంది... కనికరిస్తుంది అని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులకు మాత్రం చాలా సమయాన్ని కేటాయించడం విశేషం. దీంతో ఈ బృందం పరిశీలనకు వచ్చిందా... లేక ఇది అధికార పార్టీ ప్రచారమా అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. చీపురుపల్లి, న్యూస్‌లైన్: వర్షాలకు జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతినగా, వాటిని అంచనా వేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించగా, పరిశీలనకు వచ్చిన కేంద్రం బృందం కూడా అన్నదాతకు నిరాశే మిగిల్చింది. మంగళవారం భోగాపురం, చీపురుపల్లి మండలాల్లో నాలుగు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తొలుత భోగాపురం మండలంలోని భోగాపురం, రావాడ గ్రామాల్లో పర్యటించిన బృందం ఆ రెండు చోట్లా పంట నష్టపోయిన ఒక్క రైతుతోనూ మాట్లాడలేదు. ఆ రెండు గ్రామాల్లో ఒక్క పంట పొలాన్ని పరిశీలించలేదు. రైతులు తమ బాధలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టు పరిశీలించి కేవలం 15 నిమిషాలలో పర్యటన ముగించింది. మధ్యాహ్నం 2.45 గంటలకు వచ్చిన బృందం 3 గంటలకు తిరుగు ప్రయాణమైంది. అక్కడకు చేరుకున్న విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కేంద్రబృందానికి నివేదికలను అందజేశారు. అనంతరం చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం, కరకాం గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పత్తి, బొప్పాయి పంటలను పరిశీలించిన అనంతరం గొల్లలములగాంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర బృంద సభ్యులు మాట్లాడారు. ఈ గ్రామంలో 4.45 గంటల నుంచి 5.50 గంటల వరకూ ఉన్నారు. తరువాత కరకాం గ్రామంలో పంటపొలాలకు వెళ్లి కేవలం 10 నిమిషాల పాటు పరిశీలించి వెళ్లిపోయారు. అక్కడ కూడా రైతులతో మాట్లాడలేదు. ఒకరిద్దరు రైతులు మాట్లాడేందుకు ప్రయత్నించినా వారికి కూడా అవకాశం కల్పించలేదు. దీంతో రైతులు నిరాశ చెందారు. అధికార పార్టీ నేతలైన ఎంపీ ఝాన్సీలక్ష్మి, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, సర్పంచ్‌లు, ఇతర నేతలతోనే కేంద్ర బృందం ముచ్చటించింది. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ, జేడీ లీలావతి మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లాలో 16,936 హెక్టార్లలో పంటలు పాడయ్యాయని బృందం దృష్టికి తీసుకువెళ్లారు. 4,124 ెహ క్టార్లలో వరి, 2,641హెక్టార్లలో మొక్కజొన్న, 9,025 హెక్టార్లలో పత్తి, 79హెక్టార్లలో చెరుకు,420హెక్టార్లలో పెసర,355 హెక్టార్లలో మినప,140 హెక్టార్లలో కొర్రా,51 హెక్టార్లలో చోడి, 233హెక్టార్లలో వేరుశనగ పంటలు పాడయ్యాయని తెలిపారు. తాను కూడా రైతు బిడ్డనే అని చెప్పుకున్న కేంద్ర బృందంలో ఒక సభ్యుడు గోపీకృష్ణకు రైతుల బాధలు వినాలని అనిపించలేదాని పలువురు రైతులు అనుకుంటున్నారు. ఇలా వచ్చారు...అలా వెళ్లారు కరకాం గ్రామంలో పాడైన పంటలను మంగళవారం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇలావచ్చి అలా వెళ్లింది. రోడ్డు పక్కన ఉన్న పంటలను పరిశీలించి వెళ్లిపోయారు. సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం లే కుండా పోయింది. ఎంతో ఆశతో ఎదురుచూశాం కాని కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించలేదు. - మీసాల అప్పలనాయుడు,కరకాం, రైతు రైతులతో మాట్లాడలేదు నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం మాతో ఏమీ మాట్లాడలేదు. నేను ఈ ఏడాది బొప్పాయి పంటను సాగుచేశాను. ఇటీవల కురిసిన వర్షాలకు బొప్పాయి పంట పూర్తిగా పాడైపోయింది. అధికారులు వస్తే చూపిద్దామనుకున్నాను. కానీ వచ్చిన వెంటనే వెళ్లిపోయారు. దీంతో నా పంటను చూపించలేకపోయాను. - మీసాల సూరినాయుడు, రైతు, కరకాం గ్రామం పొద్దుపోయాక వచ్చారు... పంటలను పరిశీలించ డానికి అధికారులు వచ్చేసరికి పొద్దుపోయింది. అధికారులు ముందే వచ్చి ఉంటే మా పంటలను చూపించి కష్టాలను చెప్పుకోవడానికి వీలయ్యేది. అధికారులు కూడా పంటపొలం వరకు వచ్చి వెళ్లిపోయారే తప్ప గ్రామంలోకి రాలేదు. ఒక పంటపొలంలో మాత్రమే పంటను పరిశీలించారు. మిగిలిన రైతుల పంటలను పరిశీలించలేదు. నష్టపరిహారం వస్తుందో రాదో తెలియదు. - గంగుపల్లి వెంకన్న,రైతు, కరకాం -
వచ్చారు.. చూశారు
అనకాపల్లి రూరల్/ యలమంచిలి రూరల్/రాంబిల్లి, న్యూస్‌లైన్: భారీ వర్షాలు, బెంబేత్తించిన వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పర్యటించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధించిన తాగునీరు, పారిశుద్ధ్య విభాగం సహాయ సలహాదారు భాటియా, ఆర్థికశాఖ జేడీ పీజీఎస్ రావు, రహదారులు,రవాణాశాఖ నాణ్యత నియంత్రణ విభాగం ఎస్ఈ కృష్ణప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. వరద తీవ్రతను, అక్కడి పరిస్థితులను కలెక్టర్ ఆరోఖ్యరాజ్ వివరించారు. అనకాపల్లి సమీపంలోని ఆవఖండం పొలాలను తొలుత పరిశీలించిన బృందం సభ్యులు అక్కడి పరిస్థితులపై రైతుతో మాట్లాడారు. ముంపునకు కారణాలను ఆరా తీశారు. ఏలేరు కాలువకు తరచూ గండ్లు కారణంగా పంటపొలాలు ముంపునకు గురవుతున్నాయని, శారదానది ముంచెత్తడం కూడా మరో కారణమని రైతులు వివరించారు. ఏటా సమస్య పునరావృతమవుతోందని వాపోయా రు. కుళ్లిన వరిదుబ్బులను అధికారులకు చూ పించారు. తోటాడ రెగ్యులేటర్‌ను ఆధునీకరిస్తే ముంపు బాధ నుంచి తప్పించుకోవచ్చని రైతు లు సూచించారు. పంట నష్టంపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని, శాశ్వత నివారణ చర్యల గురించి కలెక్టర్‌కు సూచిస్తామని బృందం సభ్యులు తెలిపారు. బాధితుల ఆవేదన యలమంచిలి పట్టణం ఏఎస్‌ఆర్‌కాలనీ, ఫైర్ ఆఫీస్కాలనీ, శేషుగెడ్డ ప్రాంతాల్లోని వరద బాధితులు కేంద్రబృందం వద్ద బావురుమన్నారు. అధికారులు శేషుగెడ్డకు పడిన గండిని పరిశీలించారు. గతేడాది నీలం తుఫాన్ సంభవించినప్పుడు శేషుగెడ్డకు గండి పడ్డ చోటే మళ్లీ గండి పడడంపై ఆరా తీశారు. గతేడాది గండిపడినపుడు పటిష్టంగా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. వరదలో తమ కష్టాలను ఈరుగుల పోలయ్య అనే వ్యక్తి కేంద్ర బృందానికి వివరించాడు. తమను అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. ఈసందర్భంగా పలువురు బాధితులు కేంద్రబృందం వద్ద రోదించారు. శేషుగెడ్డనుంచి వరదనీరు ఉప్పొంగి ఇళ్లలోకి రావడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నామన్నారు. ఎకరాకు రూ. 10 వేలు భారీవర్షాల వల్ల మేజర్, మైనర్ శారద నదులకు గండ్లు పడడం వల్ల తీవ్రంగా నష్టపోయామని కేంద్ర బృందం వద్ద రైతులు వాపోయా రు. పంచదార్లలో బృందం పర్యటించి, దెబ్బతిన్న వరిని పరిశీలించినప్పుడు రైతులు వారి తో మాట్లాడారు. గతేడాదీ ఇలాగే జరిగిందని,నదుల గట్లు శాశ్వత ప్రాతిపదికన పటిష్టపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం నారాయణపురం వద్ద మైనర్ శారద నదికి పడిన గండి కారణంగా వాటిల్లిన నష్టం గురించి కలెక్టర్ ఆరోఖ్యరాజ్ బృందం సభ్యులకు వివరించారు. ఈ పర్యటనలో అనకాపల్లి ఆర్డీవో వసంతరాయుడు, అనకాపల్లి నీటిపారుదల శాఖ ఏఈ హరిప్రసాద్, అనకాపల్లి తహశీల్దార్ పాండురంగారెడ్డి, ఎంపీడీవో సందీప్, వ్యవసాయ శాఖ అధికారి భాస్కరరావు పాల్గొన్నారు. మున్సిపల్ ఆర్జేడీ ఆశాజ్యోతి, యలమంచిలి తహశీల్దార్ రాణి అమ్మాజీ, యలమంచిలి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌లు ఉన్నారు. రాంబిల్లి మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. పాఠశాల పరిశీలన కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో వరద తాకిడికి గురైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం కేంద్ర పరిశీలన బృందం సభ్యులు పరిశీలించారు. మామిడిగెడ్డ నుంచి వరద నీరు ప్రవేశించడంతో పాడైన కంప్యూటర్ ల్యాబ్‌ను, దెబ్బ తిన్న భవనాలను, ప్రహారీని పరిశీలించారు. కేంద్ర బృందంతో సమావేశమైన కలెక్టర్ విశాఖ రూరల్: ఇటీవల వచ్చిన వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం మంగళవారం జిల్లా లో పర్యటించింది. ఉదయం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లతో ఈ బృందం సభ్యులు ప్రభుత్వ అతిథి గృహంలో భారీ వర్షాలు, వరద నస్టాలను సమీక్షించారు. అనంత రం సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిల కించారు. కలెక్టర్ వరద నష్టం ఫొటోలను చూపిస్తూ వరదల వల్ల కలిగిన పరిస్థితులను సభ్యులకు వివరించారు. అనంతరం బృందం జిల్లాలో పర్యటనటకు వెళ్లింది. -
ఒనగూరేదెంత..?
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించనుంది. వారం రోజులకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా అన్నదాతల ఆరుగాలం శ్రమ, అప్పులు చేసిన పెట్టిన మదుపులు మట్టికొట్టుకుపోయాయి. ఆదుకోవలసిన అధికారులు అంచనాలు రూపొందించడంలో వంచన చేశారు. దీంతో కేంద్ర బృందంపైనే రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో కేంద్రం బృందం జిల్లా పర్యటన ఖరారైంది. అయితే ఆ బృందం పర్యటన షెడ్యూల్, పర్యటించే సమయం వివరాలు తెలుసుకున్న రైతులు మళ్లీ అవాక్కయ్యారు. ఈ బృంద సభ్యుల రాక కోసం ఎంతో ఆత్రుతగా వేచిచూస్తున్న అన్నదాతకు నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల వల్ల అన్ని మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లగా ఇప్పుడొస్తున్న కేంద్ర బృందం కేవలం రెండు మండలాల్లోనే పర్యటించనుంది. అది కూడా గంటా 45 నిమిషాల సమయంలో ఈ పర్యటన పూర్తవుతుంది. ఈ సమయంలోనే మొదట భోగాపురం మండలం, తరువాత జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి మండలాల్లో పర్యటించనుంది. అయితే ఈ పర్యటన షెడ్యూల్ అంతా రాజకీయ కోణంలో రూపొందించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా మంత్రి బొత్స రాజకీయం కోసమే సొంతనియోజకవర్గంలో కేంద్ర బృంద పర్యటన షెడ్యూల్‌ను ఏర్పాటు చేసినట్లు విమర్శలువస్తున్నాయి. దీంతో జిల్లాకు కేంద్ర బృందం వచ్చినప్పటికీ ఎంత వరకు వారు నష్టం అంచనాలు కచ్చితంగా వేస్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. పర్యటన సాగేదిలా.. కేంద్ర బృందం మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ నుంచి విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావాడ చేరుకుంటుంది. అక్కడ పాడైన ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించి, ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది. 2.50 నిమిషాలకు భోగాపురం చేరుకుని పెద్ద చెరువు గండిని పరిశీలించి మత్స్యకారులతో ముఖాముఖి సంభాషిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు చీపురుపల్లి మండలం గొల్లల ములగాం చేరుకుని 200 ఎకరాల్లో నష్టపోయిన పత్తిపంటను పరిశీలిస్తుంది. అక్కడ ఏర్పాటు చేసే ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది. 4.10 నిమిషాలకు అదే మండలం కరకాం గ్రామంలో 25 ఎకరాల్లో పాడైన బొప్పాయి పంటను పరిశీలిస్తుంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే 4.15 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి రణస్థలం మీదుగా శ్రీకాకుళం జిల్లా పరిశీలనకు వెళుతుంది. వినతులిచ్చేందుకు అవకాశం భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు తమ సర్పంచ్ల ఆధ్వర్యంలో బృంద సభ్యులకు వినతులు సమర్పించేందుకు కలెక్టర్ కాంతిలాల్‌దండే అవకాశం కల్పించారు. అయితే వినతుల సమర్పణలో ప్రశాంతత పాటించాలని, పరిశీలనకు ఆటంకం కలిగించరాదని కలెక్టర్ సూచించారు. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా జిల్లాలో సంభవించిన నష్టాన్ని పూర్తి స్థాయిలో బృందానికి వివరించడంలో అధికారులు విఫలం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. -
తేల్చుతారా?
= విశాఖ వచ్చిన కేంద్ర బృందం = పంట నష్టం పరిశీలనకు నేడు జిల్లాలో పర్యటన =నేటితో పూర్తికానున్నా అధికారుల అంచనాలు = ప్రభుత్వ ఆంక్షలతో ఆందోళనలో రైతన్నలు కష్టాలతో, కడగండ్లతో బతుకు నెట్టుకొస్తున్న అన్నదాతకు ఆపాటి ఊరటైనా ఎందుకు మిగల్చాలనుకుందేమో.. గత నెల ప్రకృతి పల్లెల్లో విలయతాండవం చేసింది. పొలాల్లోనే కాదు.. ఇళ్లలో సైతం కన్నీటి గంగా ప్రవాహాన్ని సృష్టించింది. ఆరుగాలం శ్రమించిన రైతన్న కష్టాన్ని ఎగరేసుకు పోయింది. వీధుల్లో ఉప్పొంగిన వరద అందరినీ బెంబేలెత్తించింది. అయితే ఇంత కష్టంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరోవైపున వరదలు వచ్చిన మూడు వారాల తరువాత నష్టం పరిశీలనకు కేంద్ర బృందం సోమవారం విశాఖకు వచ్చింది. నేడు గ్రామీణ జిల్లాలో పర్యటించనుంది. ఈసారైనా రైతాంగానికి న్యాయం జరుగుతుందా? కళ్లముందే నష్టం కనిపిస్తున్నా.. నివేదికల్లో మాత్రం కుదించుకుపోతుందా? అన్న సందేహం అన్నదాతను మళ్లీ వెంటాడుతోంది. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: భారీ వర్షం బీభత్సం సృష్టిం చింది. గత నెలలో కురిసిన వర్షం అన్నదాత జ్ఞాపకాల్లో పీడకలగా మిగిలిపోతుంది. 21 నుంచి 27వ తేదీ వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి, 143 హెక్టార్లలో జొన్న, 653 హెక్టార్లలో రాజ్మా, 255 హెక్టార్లలో పొగాకు, 70 హెక్టార్లలో వేరుశెనగ, 813 హెక్టార్లలో రాగి, 155 హెక్టార్లలో పెసలు, 50 హెక్టార్లలో కంది... ఇలా మొత్తంగా 27,285 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రూ.54.57 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కూరగాయలు 811 హెక్టార్లలో, తమలపాకు 135, పువ్వులు 101, అరటి 20, బొప్పాయి 65 హెక్టార్లలో దెబ్బ తిన్నాయి. రూ. 5.05 కోట్లు నష్టం జరిగింది. కేంద్ర బృందం పర్యటన: అధికారులు ప్రాథమిక అంచనా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. దాన్ని ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. ఆ నివేదిక ప్రకారం నష్ట తీవ్రతను స్వయంగా పరిశీలించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం సోమవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. అధికారుల నివేదిక ప్రకారం అనకాపల్లి, యల మంచిలి నియోజకవర్గాల్లో ఈ బృందం పర్యటించనుంది. అనకాపల్లిలో ఆవఖండం, రాంబిల్లి మండలంలో పంచదార, నారాయణపురం గ్రామాల్లో పంట నష్టంతో పాటు గట్లకు పడిన గండ్లను స్వయంగా పరిశీలించనుంది. అలాగే యల మంచిలిలో దెబ్బతిన్న ఇళ్లను కూడా సందర్శించనుంది. ఇదిలా ఉంటే వరదలు తగ్గిన మూడు వారాలకు జిల్లాలో పం ట నష్టం అంచనాల జాబితా తుది దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రంతో తుది జాబితా కలెక్టర్‌కు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర బృందం అధికారులు తయారు చేసిన జాబితాను కూడా పరిశీలించే అవకాశముంది. దాని ప్రకారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతరం కేంద్ర బృందం ఒక జాబితాను కేంద్ర ప్రభుత్వానికి స మర్పిస్తుంది. జిల్లా అధికారులు, కేంద్ర బృందం ఇచ్చిన నివేదికలు ఆధారంగా కేంద్రం పరిహారం మంజూరు చేయనుంది. ఈసారైనా న్యాయం జరిగేనా? అధికారుల నష్టం అంచనాల నివేదికపై రైతన్నల్లో ఆందోళన నెలకొంది. 2012 నవంబర్ మొదటి వారంలో వచ్చిన తుఫాన్ కారణంగా జిల్లాలో 80,915 ఎకరాల్లో పంటలు నీటమునగడంతో 1,45,487 మంది రైతులు నష్టపోయారు. రూ.97.8 కోట్లు నష్టం వాటిల్లగా.. పెట్టుబడి రాయితీ కోసం కేవలం రూ.30.24 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. అవి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంజూరు కాలేదు. ఇంకా రూ.7 కోట్లు విడుదల కావాల్సి ఉంది. 50 శాతం కంటే అధికంగా పంట నష్టపోతేనే పరిగణలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ నిబంధన కారణంగా ఈసారి కూడా అన్యాయమే జరుగుతుందన్న భయం రైతుల్లో అలుముకుంది. ఈసారి ఏ వి దంగా నష్టం నివేదికలు తయారు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లోనే నష్టం అంచనాలు జాబి తాను అధికారులు ప్రభుత్వానికి పంపించే అకాశముంది. బృందం సభ్యులు.. జిల్లాలో పైలీన్ తుఫాన్ వల్ల, భారీ వర్షాల వల్ల జరిగి న నష్టాన్ని పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ముగ్గురు సభ్యుల బృందం విశాఖ చేరుకుంది. క్వాలిటీ కంట్రో ల్ (రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్) ఎస్ఈ కార్యాలయం లో రీజినల్ ఆఫీసర్ ఎ.కృష్ణప్రసాద్, ఫైనాన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జాయిం ట్ డెరైక్టర్ డాక్టర్ పి.జి.ఎస్.రావు, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అసిస్టెంట్ అడ్వైజర్ వి.కె.బాట్ల బృందంలో సభ్యులు. పర్యటన ఇలా.. కేంద్ర బృంద సభ్యులు మంగళవారం ఉదయం 10.10కి అనకాపల్లి బయలుదేరుతారు. ఆవఖండం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. 10.50కి రాంబిల్లి మండలంలో పంచదార్ల, నారాయణపురం గ్రామాల్లో పంటలను, వరదలకు పడిన గండ్లను, అలాగే 11.30కి యలమంచిలిలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.40కి ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. 1.30కి ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళతారు. ఇదీ నష్టం.. గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి ప్రధానంగా దెబ్బ తిన్నాయి. మొత్తం మీద 27,285 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా రూ.54.57 కోట్లు నష్టం వాటిల్లింది. -
19, 20 తేదీల్లో కేంద్ర బృందం పర్యటన
శ్రీకాకుళంకలెక్టరేట్,న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, ప్రభుత్వ ఆస్తులను పరిశీలించేందుకు.. నష్టాలను అంచనా వేసేందు కు ఈ నెల 19, 20 తేదీల్లో కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి శంభుసింగ్ నేతృత్వంలో హోం, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ కమిషన్, రోడ్స్ అండ్ హైవేస్, వాట ర్‌సప్లై, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఆర్.పి.సింగ్, వి.కె.భట్ల, కె.రాంవర్మ, ఎ.చంద్రశేఖర్, ఎ.కృష్ణప్రసాద్, పి.జి.ఎస్.రావులతో కూడిన ఈ బృం దం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఇదీ షెడ్యూల్ 19వ తేదీ: మధ్యాహ్నం 3 గంటలకు రణస్థలం మండలం బంటుపల్లిలో దెబ్బతిన్న చెరువులు, కాలువలు, రోడ్లను పరిశీలిస్తుంది. 3.30 గంటలకు లావేరు మండలం ఆదపాక, బుడుమూరుల్లో జరిగిన పంట నష్టం, చెరువులకు పడిన గండ్లు, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలిస్తుంది. అనంతరం బుడుమూరు ఎస్సీ కాలనీని సందర్శిస్తుంది. 4.10 గంటలకు పొందూరు మండలం లోలుగులోని కుమ్మరి గుంట చెరువు, ఇరిగేషన్ కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం ఎచ్చెర్ల టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకిస్తుంది. అనంతరం ఫరీద్‌పేట వద్ద నాగావళి కుడి కాలువ గట్టుకు పడిన గండిని పరిశీలించి ఆక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుంది. రాత్రికి శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తుంది. 20వ తేదీ: ఉదయం 10.30 గంటలకు సోంపేట మండలం ఇస్కలపాలెంలో పర్యటిస్తుంది. అనంతరం కవిటి మండలం రాజపురం ప్రాంతంలో కొబ్బరి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. తర్వాత పలాస మండలం సున్నాదేవి గ్రామంలో పర్యటిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు పలాస నుంచి బయలుదేరి కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, బోరుభద్ర మీదుగా పోలాకి మండలం డీఎల్ పురం, సుసరాం వరకు వరి పంటకు జరిగిన నష్టాన్ని, వంశధార కాలువలకు పడిన గండ్లను పరిశీలిస్తుంది. అనంతరం నరసన్నపేట మండలం కోమర్తిలో అరటి తోటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎచ్చెర్ల మండలం ముద్దాడకు వెళ్లి అక్కడ వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తుంది. అనంతరం కేంద్ర బృందం విశాఖపట్నం వెళుతుంది. -
ఒడిశాకు రేపు కేంద్ర పరిశీలన బృందం
పై-లిన్ తుపాన్ తాకిడితో ఒడిశా రాష్ట్రం అతలాకుతలమైంది. ఆ తుపాన్ సృష్టించిన బీభత్సంపై అధ్యయనం చేసేందుకు కేంద్రం బృందం సోమవారం ఒడిశా రానుందని ఆ రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. ఆ బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రష్మీ గోయెల్ నేతృత్వం వహిస్తారని తెలిపారు. ఆ కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోతుందని చెప్పారు. పైలిన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న గంజాం, పూరీ, బాలసోర్, మయూర్ బంజ్ జిల్లాల్లో ఆ బృందాలు పర్యటిస్తాయని తెలిపారు. ఆ బృందాలు ఈ నెలాఖరు వరకు ఒడిశాలో పర్యటిస్తాయని చెప్పారు. పై లిన్ తుపాన్‌తో వచ్చిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల 60 మంది మృత్యువాత పడ్డారు. అలాగే వీపరితమైన ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు మూడు లక్షల చెట్లు నెలకొరిగాయి. రోడ్డు, రవాణా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఒడిశాలో పై లిన్ తుపాన్ వల్ల నెలకొన్న నష్టంపై కేంద్ర బృందం అధ్యాయనం చేసి కేంద్రానికి నివేదిక అందజేయనుంది.