జగ్గయ్యపేటలోని బాలుర హైస్కూల్‌లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తున్న కేంద్ర బృంద సభ్యులు. చిత్రంలో డీఈవో రేణుక
జగ్గయ్యపేట అర్బన్: ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానం, స్కూళ్ల ఆధునికీకరణ, సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర బృంద సభ్యులు కొనియాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్లు కతక్ శుక్లా, దేవస్మిత చక్రవర్తి తదితరులతో కూడిన కేంద్ర బృందం గురువారం జగ్గయ్యపేటలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్‌ను సందర్శించింది.
మనబడి నాడు–నేడు, తరగతుల విలీనం చేసిన ప్రక్రియ, ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక తదితర పథకాల అమలు తీరును పరిశీలించారు. నాడు–నేడు ద్వారా చేపట్టిన పనులు, నిధుల వినియోగం, తల్లిదండ్రుల కమిటీ పాత్ర తదితర అంశాలను ఎంఈఓ రవీంద్ర, ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత వారికి వివరించారు.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెనూ గురించి తెలియజేయగా.. రోజుకొక వెరైటీ వంటకమా అంటూ వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, డిజిటల్ రూమ్, తరగతుల నిర్వహణ, భోజనశాల తదితరాలను పరిశీలించారు. 10, 9, 8 తరగతుల విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు.
ప్రొఫెసర్ దేవస్మిత చక్రవర్తి మాట్లాడుతూ.. స్కూల్‌లోని మౌలిక సదుపాయాలన్నీ బాగున్నాయని.. నాడు–నేడు పనులైతే అద్భుతమని కితాబిచ్చారు. ఈ సందర్శనలో డీఈవో రేణుక, డీవైఈవో బి.గౌరీశంకర్, సీమెట్ ప్రొఫెసర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment