చినకాకాని ఎన్‌ఆర్‌ఐ కోవిడ్ ఆసుపత్రిలో వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం
మంగళగిరి/కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో త్వరలో ప్లాస్మా థెరపీని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని కేంద్ర బృందం ప్రతినిధి, ఆలింఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైజీస్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బబ్బిపాల్ చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. గుంటూరు జిల్లా చినకాకాని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిని సందర్శించి వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో ఏమన్నారంటే..
► వైరస్ నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న పరీక్షల కారణంగా అత్యధిక కేసులు బయటపడుతున్నాయి.
► నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్‌ల గుర్తింపు, క్వారంటైన్‌ల నిర్వహణ తదితర కార్యకలాపాల్లో మరింత వేగంగా పనిచేయాలి.
► కాంటాక్ట్‌ల గుర్తింపులో వలంటీర్‌లు, సచివాలయ సిబ్బంది విజయవంతం అయిన కారణంగానే కరోనా నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.
► కార్యక్రమంలో కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ నందినీ భట్టాచార్య, ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ ఉపేంద్రనాథ్ తదితరులున్నారు.
వందశాతం నివారణ అసాధ్యం
► కరోనా వైరస్‌ను వందశాతం నివారించడం సాధ్యం కాదని కేంద్ర బృందం సభ్యురాలు డాక్టర్ మధుమిత దూబే చెప్పారు. కర్నూలు పెద్దాస్పత్రి (రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రి)లో కరోనా కట్టడిపై కేంద్ర బృందం సభ్యుడు ప్రొఫెసర్ సంజయ్‌కుమార్ సాధూఖాన్, కలెక్టర్ జి.వీరపాండియన్‌తో కలిసి ఆస్పత్రి హెచ్‌వోడీలు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు.
► డాక్టర్ సంజయ్‌కుమార్ సాధూఖాన్ మాట్లాడుతూ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అవసరమైన వారికి అజిత్రోమైసిన్ మాత్రలు కూడా ఇవ్వాలని సూచించారు.
► కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా బాధితులు 95 శాతం మంది కోలుకుంటున్నారని కేంద్ర బృందానికి నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment