సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర బృందం, పనితీరుపై ప్రశంసలు | Central Team Meets With CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర బృందం, పనితీరుపై ప్రశంసలు

Published Mon, Nov 29 2021 11:42 AM | Last Updated on Mon, Nov 29 2021 8:59 PM

Central Team Meets With CM YS Jagan - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు తెలిపిన కేంద్ర బృందం.. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను సీఎం జగన్‌కు కేంద్ర బృందం వివరించింది. కేంద్ర బృందం తరఫున కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఎన్‌ఎండీఏ సలహాదారు కునాల్‌ సత్యార్థి వివరాలు అందించారు.

ఈ సందర్భంగా కునాల్‌ సత్యార్థి మాట్లాడుతూ.. 3 రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినట్లు తెలిపారు. వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించామని,  కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆ గ్రామాలను కూడా పరిశీలించామని, పశువులు చనిపోవడం, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు.. ల్లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం జగన్‌ నాయకత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని,  వీరంతా తమకు మంచి సహకారాన్ని అందించారన్నారు.

ఇంకా ఆయనమాట్లాడుతూ.. ‘యువకులు, డైనమిక్‌గా పనిచేసే అధికారులు ఉన్నారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారు. మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం.  ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు. అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి. ఇంత స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదు. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయి. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయి.

కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తీరందాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదు, అది చాలా రోజులు కొనసాగింది. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉంది. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది. కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికందుతున్న సమయంలో నీట పాలైంది.

శనగ పంట కూడా తీవ్రంగా దెబ్బతింది. వాటర్‌ స్కీములు కూడా దెబ్బతిన్నాయి. అన్నమయ్య నుంచి వెళ్లే తాగునీటి సరఫరా వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరిగేషన్‌కూ తీవ్ర నష్టం ఏర్పడింది. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు చాలా బాగా పనిచేశారు. విద్యుత్‌  సహా అన్నిరకాల శాఖలు చాలా బాగా పనిచేశాయి. అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం. 

సహాయ కార్యక్రమాలకోసం కలెక్టర్లకు వెంటనే నిధులు ఇచ్చారు. దీనివల్ల పనులు చాలా వేగంగా జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఏర్పాటును మేం చూడలేదు. ఈ డబ్బును బాధితులను వెంటనే ఆదుకునేందుకు వాడుకున్నారు. అలాగే జేసీబీలు పెట్టి.. అవసరమైనచోట యుద్ధ ప్రాతిపదికిన పనులు చేపట్టారు. సహాయక శిబిరాలను తెరిచి ముంపు బాధితులను ఆదుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రశంసనీయం. వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాలు ల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్‌ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగింది. వీలైనంత మేర ఆదుకోవడానికి మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని సత్యార్థి పేర్కొన్నారు.

కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్‌
అయితే ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నంటున తేమ, ఇతరత్రా నిబంధనల విషయలో సడలింపులు ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగా కేంద్ర బృందంతో సీఎం జగన్‌.. ఇలాంటి విపత్తు హృదయవిదారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనాల కోసం కేంద్ర బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంపై ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరారు. తాము పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదని స్పష్టం చేశారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో తమకు సమర్థవంతమైన వ్యవస్థ ఉందన్నారు. 

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉందని, ప్రతి రైతు పంటకూడా ఇ–క్రాప్‌ అయ్యింది. సోషల్‌ ఆడిట్‌ కూడా చేయించాం. ఇ– క్రాప్‌కు సంబంధించి రశీదు కూడా రైతుకు ఇచ్చారు.  నష్టపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను తమకు అందించాం. కోవిడ్‌ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయి. మామ ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారు.

పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటాం. దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. వీలైనంత త్వరగా పెద్దమొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతాం. ఆటోమేటిక్‌ వాగర్‌ గేజ్‌ సిస్టంపైనా దృష్టిపెడతాం’ అని సీఎం జగన్‌ వెల్లడించారు.

ఈ  సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కే.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: AP: నష్టం అపారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement