ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి వద్ద కేంద్ర బృందం సభ్యులకు పంట నష్టాన్ని వివరిస్తున్న రైతు
సాక్షి, ఆదిలాబాద్/కడెం/భద్రాచలం/బూర్గంపాడు: ‘వరదలతో చేలను ఇసుకమేటలు కప్పే శాయి.. పంటలు మొత్తం నష్టపోయినం.. పెట్టుబడి అంతా నీళ్ల పాలయింది.. ప్రభుత్వమే మాకు సాయం చేయాలి.. మా బాధను చూసి ఆదుకోండి అయ్యా’ అంటూ వరద ప్రాంతాల్లో నష్టాన్ని పరి శీలించేందుకు వచ్చిన కేంద్ర బృందానికి అన్న దాతలు మొర పెట్టుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, బ్రిడ్జీలను కేంద్ర బృందం సభ్యులు శుక్రవా రం సందర్శించారు. ఫొటో ఎగ్జిబిషన్లను తిలకించారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమా వేశమై వరద నష్టాన్ని అంచనా వేశారు.
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (సీఈపీఐ) సౌరవ్ రే ఆధ్వర్యంలో దీప్‌శేఖర్ సింఘాల్, కృష్ణప్రసాద్ ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం కుఫ్టి–కుమారి గ్రామంతోపాటు ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి, ఇచ్చోడ మండల కేంద్రం, నేరడిగొండ మండలంలో పర్యటించారు. జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం సభ్యులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు. మరోవైపు భారీ వరదలకు దెబ్బతిన్న నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును కేంద్ర బృందం సందర్శించింది. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. అనంతరం పాండ్వపూర్ వంతెన వద్ద దెబ్బతిన్న రోడ్లను పరిశీలించింది.
భద్రాద్రిలో...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చేరుకున్న కేంద్ర బృందం.. ఐటీడీఏ సమావేశపు మందిరంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి ఆ తర్వాత బూర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం, బూర్గంపాడు గ్రామాల్లో పర్యటించింది. వరద ముంపుతో దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, రహదారులను పరిశీలించింది. బాధిత రైతులు, ప్రజలతో మాట్లాడి నష్టం తీవ్రతపై చర్చించింది. ఈ సందర్భంగా వారికి భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు అనుదీప్, వీపీ గౌతమ్ తదితరులు నష్టం వివరాలను వెల్లడించారు. కేంద్ర బృందంలో కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శి పార్తీబన్, జూట్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ మనోహరన్, కేంద్ర జలసంఘం డైరెక్టర్ రమేశ్‌కుమార్, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ శివకుమార్ కుష్వాహ ఉన్నారు.
కేంద్ర బృందంతో సీఎస్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రెండ్రోజులుగా పర్యటించి హైదరాబాద్‌కు శుక్రవారం రాత్రి చేరుకున్న కేంద్ర ప్రభుత్వ బృంద అధికారులకు రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి ఈ నెల 20న జిల్లాల్లో పర్యటించారు. భారీ వర్షాలు, వరదలతో నీటిపారుదల వ్యవస్థకు జరిగిన నష్టం, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి, వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించడంపై కేంద్ర బృందానికి సోమేశ్‌కుమార్ కృతజ్ఞత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment