సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందం వస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాజాగా కేంద్ర బృందం సభ్యులతో కిషన్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. కాగా, కేంద్ర బృందానికి హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేపీ సింగ్ నేతృత్వం వహించనున్నారు.
ఇక, ఈనెల 11న(బుధవారం) రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరు పర్యటించి నష్టం అంచనా వేయనున్నారు. అలాగే, బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.
అయితే, ఆరుగురు సభ్యులతో కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment