పెట్టుబడి రాయితీ పెంచండి: కిరణ్‌కుమార్‌రెడ్డి | Investment Subsidy to be hiked, Appeals Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

పెట్టుబడి రాయితీ పెంచండి: కిరణ్‌కుమార్‌రెడ్డి

Published Fri, Nov 22 2013 4:12 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

పెట్టుబడి రాయితీ పెంచండి: కిరణ్‌కుమార్‌రెడ్డి - Sakshi

పెట్టుబడి రాయితీ పెంచండి: కిరణ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్: విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని హెక్టారుకు రూ. ఆరు వేల నుంచి పది వేలకు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. పై-లీన్ తుపాను, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాలను పరిశీలించి వచ్చిన కేంద్ర బృందం ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో సంభవిస్తున్న వరుస విపత్తుల వల్ల కలిగిన భారీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదారంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆయన కేంద్ర బృందాన్ని కోరారు.
 
 రాష్ట్రానికి తక్షణమే రూ. 2,145 కోట్ల సాయం అందించేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రస్తుతం పంటల బీమా రైతులకు అనువుగా లేదు. రైతులకు మేలు జరిగేలా ఈ పథకంలో మార్పులకు సిఫార్సు చేయండి. పది, పదిహేనేళ్లుగా ప్రతి యేటా జరిగిన నష్టంలో పది, పదిహేను శాతానికి మించి కేంద్రం ఇవ్వడంలేదు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది’ అని సీఎం వివరించారు. పై-లీన్ తుపాను వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ. 500 చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం నిర్ణయించారు.
 
 సవరించిన నివేదిక ఇవ్వండి: కేంద్ర బృందం
 వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం ప్రతినిధులు అంగీకరించారు. ‘నష్టం భారీగానే జరిగింది. మీరు గతంలో కేంద్రానికి పంపిన నివేదికలో చేరని నష్టాలు ఇంకా ఉంటే వాటిని కూడా కలిపి సమగ్రంగా తుది నివేదికను కేంద్రానికి పంపండి. మేం కూడా ఇతోధిక సాయానికి సిఫార్సు చేస్తాం’ అని కేంద్ర బృందం నాయకుడు, కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ పి.గౌరీ శంకర్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర బృందం సూచన ప్రకారం రూ. ఏడు వేల కోట్ల సాయం కోరుతూ సవరించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సోమవారం పంపుతామని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి మీడియాకు తెలిపారు.
 
 బాధితులను ఆదుకోవాలి: పార్టీలు
 పై-లీన్ తుపాను సహా అకాల వర్షాలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు కేంద్ర బృందానికి నివేదించాయి. ఈ మేరకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర బృందం ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశాయి.
 
 ‘పంటనష్టం’ సర్వేలను పూర్తిచేయండి: కన్నా
 పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా ఇటీవల సంభవించిన పంటనష్టం వివరాల సేకరణను వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. రబీ పంటల సాగుపై ఆయన గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రబీలో ఎరువులకు, విత్తనాలకు కొరత లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ యాంత్రీకరణలో లక్ష్యాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంటల బీమాకు సంబంధించి ఈ రబీలో పాత విధానమే అమలులో ఉండేలా చూడాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి లేఖ రాసినట్లు కన్నా తెలిపారు.  
 
 నష్టాల నివేదికపై సర్కారు నిర్లక్ష్యం
 సాక్షి, హైదరాబాద్: పైలీన్ తుపాను, ఆ తరువాత కురిసిన భారీ వర్షాలవల్ల జరిగిన నష్టాలపై సమగ్రమైన తుది నివేదికను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వర్షాలు ఆగిపోయి 24 రోజులు అవుతున్నా వర్షాలు, వరద నష్టాలపై తుది నివేదిక ఇంకా పూర్తికాలేదు. రాష్ట్రం నుంచి తుది నివేదిక అందిన వారం పది రోజుల తరువాతే కేంద్ర బృందం తమ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తరువాత హైపవర్ కమిటీ సమావేశమై జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రాష్ట్రానికి ఎంత మొత్తం కేటాయించాలో నిర్ణయిస్తుంది.
 
  పైలీన్ తుపాను, భారీ వర్షాల వల్ల రూ. 7 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేశారు. అయితే, దీనిపై తుది నివేదికను రూపొందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంపై అధికార వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ‘గత ఏడాది కరవుపై నివేదిక అందించడంలో కూడా చాలా ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపడంలో జాప్యం చేయడం వల్ల కేంద్రం నుంచి నిధులు పొందడంలో విఫలమవుతోంది. అందుకే మనకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 1145 కోట్లు రావడంలేదు’ అని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement