Investment subsidy
-
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్‌కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్‌కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం -
కరువు రైతులకు బాబు వంచన
సాక్షి, అమరావతి: విపత్తు బాధిత రైతులకు సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. 2018 ఖరీఫ్‌లో కరువు వల్ల పంటలు కోల్పోయి నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వం రూ.932 కోట్లు విడుదల చేసినా కరువు బాధిత రైతులకు బాబు సర్కారు ఇప్పటి వరకూ నయాపైసా కూడా విదల్చలేదు. 2018 రబీలో కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఊసే లేదు. గతంలో రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు అన్నదాతలకు ఇవ్వకుండా చంద్రబాబు ఎగనామం పెట్టారు. తీవ్ర దుర్బిక్షం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు పశువులకు మేత కూడా అందించలేని దుస్థితిలో అష్టకష్టాలు పడుతున్నారు. చాలామంది బతుకుదెరువు మార్గం కానరాక పొట్ట చేతపట్టుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాలకు వలస వెళ్లారు. ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న రైతులకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీని విడుదల చేయడానికి కూడా సర్కారుకు చేతులు రాలేదు. పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తే భారీగా కమీషన్లు వస్తాయి.. రైతులకు ఇస్తే నయాపైసా కూడా రాదనే ఉద్దేశంతోనే బాబు ఇలా చేశారు’ అని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇది వాస్తవమేనని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. డ్రాట్ మాన్యువల్ చెబుతున్నదేమిటి? పంటలు ఎండిపోయిన రైతులు పెట్టుబడులు కూడా కోల్పోతారు. అప్పు చేసిన వారు రుణ ఊబిలో చిక్కుకుపోతారు. పైర్లు ఎండిపోయి నష్టపోయిన వారు పంటలు వేసుకోవడానికి పెట్టుబడుల్లేక అవస్థలు పడతారు. అందువల్ల తిరిగి పంటలు వేసుకోవడానికి వీలుగా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డ్రాట్ మాన్యువల్ స్పష్టంగా చెబుతోంది. అందువల్లే కరువు మండలాలను ప్రకటించి నష్టం వివరాలతో సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన తర్వాత కేంద్ర బృందం పర్యటించి నష్టాలను అంచనా వేసి నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం కరువు సాయం కింద నిధులు విడుదల చేస్తుంది. ఇలా వచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం జత చేసి బాధిత రైతులను ఆదుకోవాలి. ఇందులో భాగంగానే 2018 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి.. కేంద్రం తన వాటాగా రూ.932 కోట్లు మూడు నెలల క్రితమే విడుదల చేసింది. ఈ నిధులను సర్కారు ఇతర పనులకు బదలాయించి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018 రబీలో కూడా రాష్ట్రంలో కరువు తాండవమాడింది. బాబు సర్కారు 257 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. 450 మండలాల్లో కరువు ఉంటే ఇలా కొన్నింటినే కరువు జాబితాలో చేర్చారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు మరో 90 మండలాలను కరువు జాబితాలో చేర్చాలని ప్రతిపాదనలు పంపించారు. బాబు సర్కారు వీటిని పక్కన పెట్టేసింది. గత ఏడాది రబీలో నష్టపోయిన వారికి పెట్టుబడి రాయితీ అతీగతీ లేదు. రైతులంటే ఇంత వివక్షా? ముడుపులే లక్ష్యంగా బాబు సర్కార్ తన అనుకూలురైన పారిశ్రామిక సంస్థల యజమానులకు భారీ రాయితీలు ఇస్తూ రైతుల విషయంలో మాత్రం తీవ్ర వివక్ష చూపింది. ఆరుగాలం కష్టపడే రైతులకు ఇవ్వాల్సిన రూ. 2,350 కోట్ల పెట్టబడి రాయితీ బకాయిలను ఎగవేసింది. ఇది చాలదన్నట్లు రూ. 12,102 కోట్లకు పైగా రైతులకు చెల్లించాల్సిన బిల్లులను పెండింగులో పెట్టేసింది. 2014 ఖరీఫ్‌లో రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిన తర్వాత దానిని రూ.రూ.692.67 కోట్లకు కుదించి రూ.375 కోట్లు కోత వేసింది. రైతులకు బాబు సర్కారు తీవ్ర అన్యాయం చేసిందనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏమి కావాలి’ అని రైతుల సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 2015 –16లో నష్టపోతే... 2015–16లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4,96,890 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఇవ్వాల్సిన రూ.270 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. గత ఏడాది (2018) ఖరీఫ్‌లో కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.1,832 కోట్ల పెట్టుబడి రాయితీలో నయాపైసా కూడా విదల్చలేదు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 932 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడో వచ్చేసింది. 2018 రబీ సీజన్లో దుర్భిక్ష బాధిత రైతులకు ప్రభుత్వం మరో రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అనధికారిక అంచనా. ఇవన్నీ కలిపితే ప్రస్తుతం రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ మొత్తం రూ. 2852 కోట్లు బాబు సర్కారు ఇవ్వకుండా పెండింగులో పెట్టినట్లు స్పష్టమవుతోంది. -
పెట్టుబడి రాయితీ.. ఆపేయడమే ఆనవాయితీ
సాక్షి, అమరావతి: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న చందంగా తయారైంది రాష్ట్రంలోని రైతుల పరిస్థితి. గత ఏడాది కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.932 కోట్లు విడుదల చేసినా చంద్రబాబు సర్కారు వాటిని తన సోకులకు ఉపయోగించుకుంది. విపత్తుల వల్ల పంటలు పోగొట్టుకున్న రైతులు సాధారణంగా అప్పుల్లో కూరుకుపోతారు. ఇలాంటి వారికి తదుపరి పంటలు వేసుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా పెట్టుబడి రాయితీ చెల్లించాలని విపత్తు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.932 కోట్లు ఎప్పుడో విడుదల చేసింది. దీనికి మరికొంత మొత్తం కలిపి బాధిత రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు ఆ నిధులను ఎన్నికల తాయిలాల కోసం వినియోగించి రైతుల్ని నిలువునా ముంచింది. వారి ఖర్మకు వారే పోతారన్నట్టుగా గాలికొదిలేసింది. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నడుమ అష్టకష్టాలు పడి పండించిన పంటలను కొనుగోలు చేసిన సర్కారు ఆ సొమ్ములూ చెల్లించలేదు. మొక్కజొన్నలను ప్రభుత్వానికి విక్రయించిన వారికి రూ.200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి మొక్కజొన్నల్ని అమ్మిన పాపానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు డబ్బు కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన రైతులకూ సొమ్ములు చెల్లించలేదు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా రూ.వేల కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్నపాటి నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లుల్ని కూడా పెండింగులో పెట్టింది. దీనివల్ల కొత్తగా ఈ యూనిట్లు ఎవరికీ మంజూరు చేయడం లేదు. రాయితీ బకాయి రూ.2,950 కోట్లపైనే 2015–16లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4,96,890 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఇవ్వాల్సిన రూ.270 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. గత ఏడాది (2018) ఖరీఫ్‌లో కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.1,832 కోట్లను పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకూ నయాపైసా కూడా విదల్చలేదు. ఇందులో కేంద్రం వాటా రూ.932 కోట్లను ఎప్పుడో విడుదల చేసింది. 2018 రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 257 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 450 మండలాల్లో దుర్భిక్షం ఉన్నప్పటికీ 257 మండలాలనే కరువు ప్రాంతాల జాబితాలో చేర్చడంపై విమర్శలు రావడంతో కలెక్టర్లు మరో 90 మండలాలను చేర్చాలని ప్రతిపాదనలు పంపించారు. అవి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 2018 రబీలో ప్రభుత్వం మరో రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. వెరసి దుర్భిక్ష బాధిత రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ బకాయి మొత్తం రూ.2,950 కోట్లకు పైగా ఉంది. 2014లో బకాయిలు ఎగవేత ఓట్లు వేసి గెలిపించిన పాపానికి చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే రైతులకు కుచ్చుటోపీ పెట్టింది. 2014లో అధికారంలోకి రాగానే రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేసింది. ఇది చాలాదన్నట్టు 2014 ఖరీఫ్‌లో రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించగా.. దానిని రూ.రూ.692.67 కోట్లకు కుదించింది. 2014 నాటి రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎందుకు పెండింగులో పెట్టారని అన్నదాతలు, రైతు సంఘాల నేతలు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదిలావుంటే.. 4–5 విడతల రుణమాఫీ బకాయిలు రూ.8,830 కోట్లను ఈనెల 6వ తేదీలోగానే చెల్లిస్తామని ఎన్నికల ముందు చెప్పిర ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ మొత్తాలను విడుదల చేయలేదు. రైతులంటే ఇంత వివక్షా? ముడుపులే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు సంపన్న వ్యాపార సంస్థలకు రాయితీలు ఇస్తూ.. రైతుల విషయంలో తీవ్ర వివక్ష చూపుతోంది. విమానాల్లో తిరిగేది సంపన్నులేనన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విమానయాన సంస్థలు నష్టపోకుండా ప్రభుత్వం ఇంధన సబ్సిడీ ఇస్తోంది. ఇది చాలదన్నట్టు విజయవాడ (గన్నవరం) నుంచి దేశ, విదేశాలకు విమానాలను నడిపే సంస్థలకు నష్టం వాటిల్లితే సర్కారే ఆ మొత్తాలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయిదు నక్షత్రాల హోటళ్లు, లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు, ఫక్తు వ్యాపార దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులకు, కాగితాలకే పరిమితమైన పరిశ్రమలకు సైతం రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తోంది. -
గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ.5 కోట్ల రాయితీ
సాక్షి, హైదరాబాద్: ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోవల్ ఓరం పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.కోటి వరకు రాయితీతో గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని, దాన్ని రూ.5 కోట్లకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. శుక్రవారం మారియట్ హోటల్లో జరిగిన నేషనల్ ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్ కాన్క్లేవ్–2018ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల పట్ల వివక్ష ఇప్పటికీ కొనసాగుతోందని, కేంద్ర మంత్రి హోదాలోనూ వివక్షకు గురైన తీరును సభకు వివరించారు. ‘1999లో ఎంపీగా ఎన్నికై వాజ్‌పేయి ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, చాంబర్లోకి వెళ్దామని బయల్దేరా. కానీ నాకు ప్రత్యేక చాంబర్ లేదు. దాంతో అందుకోసం పోరాడి సాధించా’అని వివరించారు. గిరిజనులు రిజర్వేషన్లతో లాభపడుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వివక్షకు కూడా గురవుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల వల్ల విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయని, దీంతో వారి అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. అదేక్రమంలో గిరిజనులు తమ పేర్లను వారి సంప్రదాయాల ప్రకారం పెట్టుకోవడంతో సమాజంలో కొంత చిన్నచూపునకు గురవుతున్నారన్నారు. గిరిజన యువతలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగా ప్రత్యేక రాయితీలిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. డిక్కీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. నైపుణ్యమున్న గిరిజనులకు పెట్టుబడి రాయితీ: ఈటల రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గిరిజనుల్లో నైపుణ్యం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. మహిళలకు 45%, పురుషులకు 35% పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనుల్లోనూ గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. ఓన్ యువర్ కార్ పథకం కింద ఒక్క వాహనంపై రూ.5 లక్షలు రాయితీ ఇచ్చామని, గిరిజన రైతులకు 95% రాయితీతో ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని, వ్యవసాయ పనిముట్లన్నీ 95% రాయి తీతో అందిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ల దగ్గర ప్రాజెక్టు రిపోర్టు ఉందని, కానీ గిరిజనుల దగ్గర కమిట్మెంట్ ఉందని అన్నారు. 45 మంది కార్పొరేట్లకు రూ.7.3 లక్షల కోట్ల రుణం ఇచ్చిన బ్యాంకులు నైపుణ్యం ఉన్నవారికి మాత్రం రుణం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయన్నారు. అనంతరం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని నూరుశాతం అమలు చేయాలంటే అధికారుల చిత్తశుద్ధి తోడవ్వాలన్నారు. ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే గిరిజనుల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, ఎంపీ సీతారామ్ నాయక్, ఎమ్మెల్యే రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
జాడలేని పరిహారం
సాక్షి, అమరావతి: కరువు, అకాల వర్షాలు, పెనుగాలులు లాంటి విపత్తులతో పంటలు కోల్పోయి అప్పుల పాలైన రైతులు పెట్టుబడి రాయితీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జూన్ 1వతేదీ నుంచి ఖరీఫ్ ప్రారంభం కానున్న తరుణంలో కనీసం పెట్టుబడి రాయితీ అయినా విడుదల ఇస్తే దుక్కులు, విత్తనాలకు పనికొస్తుందని ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నారు. రాయితీని ఎగ్గొట్టేందుకు... గత ఖరీఫ్‌లో 500కిపైగా మండలాల్లో వర్షాభావం నెలకొన్నా పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కరువు లేదని ప్రకటించింది. పంటలు ఎండిపోయినా రైతులకు పైసా పరిహారం రాలేదు. ఇక గత రబీలో చినుకు జాడ లేక మూడొంతుల మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. పరిస్థితి తీవ్రతను పట్టించుకోకుండా ప్రభుత్వం కేవలం 121 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి అన్నదాతలకు అన్యాయం చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన, పెనుగాలులకు పలుచోట్ల ధాన్యం మట్టి పాలైంది. మామిడి కాయలు రాలిపోయాయి. అరటి, బొప్పాయి తోటలు నేలకూలాయి. సుమారు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు దారుణంగా నష్టపోయారు. ప్రభుత్వ గణాంకాలే రుజువు గత రబీలో 475 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 239 మండలాల్లో 20 నుంచి 60 శాతం తక్కువ వర్షం కురిసింది. 236 మండలాల్లో కురవాల్సిన వర్షం కంటే 60 శాతానికి పైగా తక్కువ వాన కురిసింది. 60 శాతం వర్షపాత లోటు ఉన్న మండలాలను వాతావరణశాఖ పెను దుర్బిక్ష ప్రాంతాలుగా పరిగణిస్తుంది. ఈ రబీలో ఇలాంటి మండలాలు 236 ఉండగా కనీసం వీటిని కూడా కరువు మండలాలుగా ప్రకటించలేదు. రాష్ట్రానికి తీవ్ర నష్టం ప్రభుత్వం కరువును కుదించడం వల్ల రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగింది. 121 మండలాల్లో కరువు ఉపశమన చర్యల కోసం రూ.680 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. రైతులకు రూ.166.7 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాల్సి ఉందని పేర్కొంది. వర్షపాత గణాంకాల ప్రకారం 475 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి ఉంటే ఇదే ప్రాతిపదికన కేంద్రం నుంచి అధిక మొత్తంలో సాయం పొందే అవకాశం ఉండేది. కరువును కుదించడంవల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గి రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన మండలాల్లో రైతులకైనా రూ.166.7 కోట్ల పెట్టుబడి రాయితీని ప్రభుత్వం విడుదల చేయలేదు. -
చెక్కులు, ఖాతాలకే రైతుల మొగ్గు
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్మును ఎలా అందజేయాలన్న దానిపై తాము నిర్వహించిన సర్వేలో 60 శాతం మంది రైతులు చెక్కులు ఇవ్వాలని లేదా తమ బ్యాంకు ఖాతాలో వేయాలని సూచించారని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. సర్వే వివరాలను బుధవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము ఆరు పద్ధతులపై 62,677 మంది రైతులతో సర్వే నిర్వహించామన్నారు. వాటిలో పై రెండింటికి మెజారిటీ రైతులు మొగ్గు చూపారన్నారు. సర్వే ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ♦ చెక్కు రూపేణా ఇవ్వాలని కోరిన రైతులు– 31.58 శాతం. (జిల్లాల వారీగా చూస్తే సర్వేలో పాల్గొన్న రైతులలో మేడ్చల్ 63.8 శాతం మంది, నిజామాబాద్ 57.1 శాతం, ఆదిలాబాద్ 50 శాతం మంది, అలాగే 40 శాతానికి పైగా ఈపద్ధతిని కోరిన జిల్లాల్లో కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులున్నారు) ♦ తమ బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న రైతులు– 27.55 శాతం. (వరంగల్ అర్బన్ 81.55 శాతం, రాజన్న సిరిసిల్ల 62.38 శాతం, వరంగల్ రూరల్ 49 శాతం, జనగాంలో 44.94 శాతం మంది ఉన్నారు. అలాగే 30 శాతానికి పైగా కోరిన వారిలో నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మెదక్, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల రైతులున్నారు) ♦ నగదు రూపంలో ఇవ్వాలన్నవారు– 26.59 శాతం. (జిల్లాల వారీగా చూస్తే – ఆసిఫాబాద్ 62.17 శాతం, వికారాబాద్ 48 శాతం, జోగుళాంబ గద్వాల 46.08 శాతం, రంగారెడ్డి జిల్లాలో 42 శాతంమంది ఉండగా, 30 శాతానికిపైగా నగదు రూపంలో కోరిన జిల్లాల్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ రైతులున్నారు) ♦ పోస్టాఫీసుల ద్వారా ఇవ్వాలన్నవారు– 6.81 శాతం ♦ ప్రీలోడెడ్ కార్డులు/ఇతర రూపాల్లో కోరినవారు– 6.44 శాతం ♦ c ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కోరినవారు– 1.03 మంది -
సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల
వ్యవసాయశాఖ మంత్రి పోచారం ► గ్రామాల్లో రైతు సమావేశ మందిరాలు ► ఒక్కో భవన నిర్మాణానికి రూ.15 లక్షలు ► తొలిసారి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ► మే 15వ తేదీలోగా పెట్టుబడి రాయితీ సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా సర్ధాపూర్లో రూ.9.60 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో మంత్రి పోచారం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రైతు సమావేశ మందిరాలు నిర్మిస్తామన్నారు. ఏఈవోలు ఉండే గ్రామాల్లో ఒక్క భవన నిర్మాణానికి రూ.15 లక్షలు వెచ్చిస్తామని తెలిపారు. ఒకేపంట వేసి రైతులు నష్టపోకుండా క్రాప్కాలనీను ఏర్పాటు చేస్తామన్నారు. దిగుబడులు పెరగాలని, రైతుల అప్పులు తీరి, బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని వివరించారు. వచ్చేఏడాది మే 15వ తేదీలోగా రైతులకు పెట్టుబడి రాయి తీని విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. రైతులు తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించి అమ్ముకునే స్థితికి చేరాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని పోచారం తెలిపారు. గ్రామాల్లో రైతులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ అనుబంధం కూరగాయలు, పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆత్మహత్యలులేని తెలంగాణను నిర్మిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ఇదంతా అభూతకల్పన అన్నారు. ఎంపీ బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, కలెక్టర్ డి.కృష్ణభాస్కర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడి రాయితీ దేశానికే ఆదర్శం: కేటీఆర్ రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం దేశానికే ఆదర్శమని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సర్ధాపూర్ సభలో కేటీఆర్మాట్లాడుతూ, గిరకతాళ్ల పెంపకం కోసం ప్రతీ గ్రామంలో గీత కార్మికులకు ఐదెకరాలు కేటాయిస్తామనిప్రభుత్వ పనితీరుపై ఏం మాట్లాడలేక అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. సిరిసిల్ల నేతన్నలకు ఏడాదిలో రూ.225 కోట్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చి, రూ.15 వేలకు మించి నెల వేతనం వచ్చేలా చేశామని మంత్రి వివరించారు. -
రైతులకు శఠగోపం!
⇒పంటల బీమాతో పెట్టుబడి రాయితీ ముడి ⇒రూ.500 కోట్లు నష్టపోనున్న అన్నదాతలు ⇒అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు రూ.370 కోట్లు నష్టం అమరావతి: రాష్ట్రంలో కరువుబారిన పడి అల్లాడుతున్న రైతుల నెత్తిన మరోమారు శఠగోపం పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంటల బీమాకు, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టి అన్నదాతలకు రూ.500 కోట్లు ఎగవేసేందుకు కుట్ర పన్నింది. 2016 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి రాయితీ ఇవ్వకుండా మొండిచేయి చూపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి ఇచ్చేందుకు అధికారులు నివేదిక రూపొందించినట్లు సమాచారం. దీనివల్ల కరువుకు మారుపేరైన రాయలసీమ రైతులు దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది.ఒక్క అనంతపురం జిల్లా వేరుశనగ రైతులే రూ.370 కోట్లకుపైగా పెట్టుబడి రాయితీని కోల్పోవాల్సి వస్తుందని అంచనా. హక్కులను హరించడమే పంటల బీమా, పెట్టుబడి రాయితీని ముడిపెట్టడ మంటే రైతుల హక్కులను హరించడమే. రైతులు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ చేసుకుంటే వచ్చేది పంటల బీమా. విపత్తుల వల్ల పంట దెబ్బతింటే మళ్లీ సాగు చేసుకోవడానికి చట్టబద్ధంగా ఇవ్వాల్సింది పెట్టుబడి రాయితీ. రెండింటినీ పొందే హక్కు రైతులకు ఉంది. అయితే, పంట కోల్పోయిన రైతులకు ఏదైనా ఒకదాని కిందే పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోకపోతే ఈ ఏడాది రైతులకు జరిగే నష్టం రూ.500 కోట్లు. ఇది ఈ ఏడాదికే పరిమితం కాదు. ఏటా రైతులు ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల దీనికి వ్యతిరేకంగా పోరాడాలి’’ అని పేర్కొంటున్నారు. హెక్టార్‌కు గరిష్టంగా రూ.15,000 ప్రస్తుతం విపత్తుల వల్ల వేరుశనగ పంట దెబ్బతింటే హెక్టార్‌కు రూ.15 వేలు పెట్టుబడి రాయితీ అమల్లో ఉంది. గత ఖరీఫ్‌లో రాయలసీమలో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎండిపోయింది. బీమా కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి హెక్టార్‌కు గరిష్టంగా రూ.16,000 చెల్లించాలని లెక్కగట్టారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు చెల్లించేందుకు బీమా సంస్థ రూ.576 కోట్లు మంజూరు చేసింది. అయితే, ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీ కలిపి హెక్టార్‌కు రూ.15,000 చొప్పున చెల్లించాలని నివేదికలు రూపొందించింది. ఒక రైతుకు పంటల బీమా హెక్టార్‌కు రూ.11,000 వచ్చిందనుకుంటే దానికి రూ.4,000 పెట్టుబడి రాయితీ కలిపి రూ.15,000 చెల్లిస్తారు. బీమానే రూ.15,000 వస్తే పెట్టుబడి రాయితీ అస్సలు ఇవ్వరు. పంటల బీమా, పెట్టుబడి రాయితీని కలపడమంటే బీమా చేసిన వారిని, చేయని వారిని ఒకే గాటన కట్టినట్లవుతుందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అంటున్నారు. రూ.576 కోట్ల పంటల బీమా మంజూరైనప్పటికీ ఇంకా రైతులకు చెల్లించకపోవడానికి కారణం పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టాలని నిర్ణయించడమేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మాట మార్చిన చంద్రబాబు నాయుడు హరియాణా ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలోని ముఖ్యమంత్రుల సాధికార కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రైతులకు పెట్టుబడి రాయితీతో సంబంధం లేకుండా హెక్టార్‌కు రూ.15,000 నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు 2010లో హైదరాబాద్‌లో దీక్ష చేశారు. దీనికి జాతీయ స్థాయి నేతలను సైతం ఆహ్వానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నష్టపరిహారం అంశాన్ని మర్చిపోయారు. పైపెచ్చు పంటల బీమా, పెట్టుబడి రాయితీకి ముడిపెట్టారు. రెతన్నలకు అన్యాయం చేస్తున్నారు. వేర్వేరుగానే ఇవ్వాలి.. ‘‘ప్రస్తుత విధానం ప్రకారం రైతులకు పెట్టుబడి రాయితీ, పంటల బీమాను వేర్వేరుగానే ఇవ్వాలి. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా పెట్టుబడి రాయితీని పెంచాలి. ప్రస్తుతం ఇస్తున్న పెట్టుబడి రాయితీ సాగు ఖర్చులకు ఏమాత్రం సరిపోదు. ఖర్చులకు సమానంగా పెట్టుబడి రాయితీని నిర్ధారించాలి. పెట్టుబడి రాయితీ, పంటల బీమాను కలిపేయొద్దు’’ – రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు ‘‘పంట నష్టపోగానే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడానికి ఇవ్వాల్సింది పెట్టుబడి రాయితీ. రైతులు ప్రీమియం చెల్లించినందుకు వచ్చేది పంటల బీమా. విపత్తుల వల్ల పంటలు దెబ్బతిన్నందుకు ఇవ్వాల్సింది నష్ట పరిహారం. నష్ట పరిహారం ఎటూ ఇవ్వడం లేదు. ఎప్పటి నుంచో వేర్వేరుగా ఇస్తున్న పంటల బీమా, పెట్టుబడి రాయితీని కలిపేసి, రైతులకు ఒక్కటే ఇవ్వాలని నిర్ణయించడం దారుణం. పెట్టుబడి రాయితీ గురించి అడిగితే వారంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టిన ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారు’’ – నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు -
పెట్టుబడి రాయితీ పెంచండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని హెక్టారుకు రూ. ఆరు వేల నుంచి పది వేలకు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. పై-లీన్ తుపాను, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాలను పరిశీలించి వచ్చిన కేంద్ర బృందం ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో సంభవిస్తున్న వరుస విపత్తుల వల్ల కలిగిన భారీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదారంగా సాయం అందించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆయన కేంద్ర బృందాన్ని కోరారు. రాష్ట్రానికి తక్షణమే రూ. 2,145 కోట్ల సాయం అందించేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రస్తుతం పంటల బీమా రైతులకు అనువుగా లేదు. రైతులకు మేలు జరిగేలా ఈ పథకంలో మార్పులకు సిఫార్సు చేయండి. పది, పదిహేనేళ్లుగా ప్రతి యేటా జరిగిన నష్టంలో పది, పదిహేను శాతానికి మించి కేంద్రం ఇవ్వడంలేదు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది’ అని సీఎం వివరించారు. పై-లీన్ తుపాను వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు రూ. 500 చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం నిర్ణయించారు. సవరించిన నివేదిక ఇవ్వండి: కేంద్ర బృందం వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం ప్రతినిధులు అంగీకరించారు. ‘నష్టం భారీగానే జరిగింది. మీరు గతంలో కేంద్రానికి పంపిన నివేదికలో చేరని నష్టాలు ఇంకా ఉంటే వాటిని కూడా కలిపి సమగ్రంగా తుది నివేదికను కేంద్రానికి పంపండి. మేం కూడా ఇతోధిక సాయానికి సిఫార్సు చేస్తాం’ అని కేంద్ర బృందం నాయకుడు, కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ పి.గౌరీ శంకర్రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర బృందం సూచన ప్రకారం రూ. ఏడు వేల కోట్ల సాయం కోరుతూ సవరించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సోమవారం పంపుతామని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి మీడియాకు తెలిపారు. బాధితులను ఆదుకోవాలి: పార్టీలు పై-లీన్ తుపాను సహా అకాల వర్షాలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు కేంద్ర బృందానికి నివేదించాయి. ఈ మేరకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర బృందం ప్రతినిధులను కలిసి వినతిపత్రం అందజేశాయి. ‘పంటనష్టం’ సర్వేలను పూర్తిచేయండి: కన్నా పై-లీన్ తుపాను, భారీ వర్షాల కారణంగా ఇటీవల సంభవించిన పంటనష్టం వివరాల సేకరణను వెంటనే పూర్తి చేయాలని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. రబీ పంటల సాగుపై ఆయన గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రబీలో ఎరువులకు, విత్తనాలకు కొరత లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ యాంత్రీకరణలో లక్ష్యాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంటల బీమాకు సంబంధించి ఈ రబీలో పాత విధానమే అమలులో ఉండేలా చూడాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి లేఖ రాసినట్లు కన్నా తెలిపారు. నష్టాల నివేదికపై సర్కారు నిర్లక్ష్యం సాక్షి, హైదరాబాద్: పైలీన్ తుపాను, ఆ తరువాత కురిసిన భారీ వర్షాలవల్ల జరిగిన నష్టాలపై సమగ్రమైన తుది నివేదికను రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వర్షాలు ఆగిపోయి 24 రోజులు అవుతున్నా వర్షాలు, వరద నష్టాలపై తుది నివేదిక ఇంకా పూర్తికాలేదు. రాష్ట్రం నుంచి తుది నివేదిక అందిన వారం పది రోజుల తరువాతే కేంద్ర బృందం తమ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ తరువాత హైపవర్ కమిటీ సమావేశమై జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రాష్ట్రానికి ఎంత మొత్తం కేటాయించాలో నిర్ణయిస్తుంది. పైలీన్ తుపాను, భారీ వర్షాల వల్ల రూ. 7 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా వేశారు. అయితే, దీనిపై తుది నివేదికను రూపొందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంపై అధికార వర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ‘గత ఏడాది కరవుపై నివేదిక అందించడంలో కూడా చాలా ఆలస్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపడంలో జాప్యం చేయడం వల్ల కేంద్రం నుంచి నిధులు పొందడంలో విఫలమవుతోంది. అందుకే మనకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 1145 కోట్లు రావడంలేదు’ అని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.