సాక్షి, అమరావతి: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న చందంగా తయారైంది రాష్ట్రంలోని రైతుల పరిస్థితి. గత ఏడాది కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.932 కోట్లు విడుదల చేసినా చంద్రబాబు సర్కారు వాటిని తన సోకులకు ఉపయోగించుకుంది. విపత్తుల వల్ల పంటలు పోగొట్టుకున్న రైతులు సాధారణంగా అప్పుల్లో కూరుకుపోతారు. ఇలాంటి వారికి తదుపరి పంటలు వేసుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా పెట్టుబడి రాయితీ చెల్లించాలని విపత్తు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.932 కోట్లు ఎప్పుడో విడుదల చేసింది. దీనికి మరికొంత మొత్తం కలిపి బాధిత రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు ఆ నిధులను ఎన్నికల తాయిలాల కోసం వినియోగించి రైతుల్ని నిలువునా ముంచింది. వారి ఖర్మకు వారే పోతారన్నట్టుగా గాలికొదిలేసింది.
మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నడుమ అష్టకష్టాలు పడి పండించిన పంటలను కొనుగోలు చేసిన సర్కారు ఆ సొమ్ములూ చెల్లించలేదు. మొక్కజొన్నలను ప్రభుత్వానికి విక్రయించిన వారికి రూ.200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి మొక్కజొన్నల్ని అమ్మిన పాపానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు డబ్బు కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన రైతులకూ సొమ్ములు చెల్లించలేదు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా రూ.వేల కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్నపాటి నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లుల్ని కూడా పెండింగులో పెట్టింది. దీనివల్ల కొత్తగా ఈ యూనిట్లు ఎవరికీ మంజూరు చేయడం లేదు.
రాయితీ బకాయి రూ.2,950 కోట్లపైనే
2015–16లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4,96,890 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఇవ్వాల్సిన రూ.270 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. గత ఏడాది (2018) ఖరీఫ్‌లో కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.1,832 కోట్లను పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకూ నయాపైసా కూడా విదల్చలేదు. ఇందులో కేంద్రం వాటా రూ.932 కోట్లను ఎప్పుడో విడుదల చేసింది. 2018 రబీ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 257 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 450 మండలాల్లో దుర్భిక్షం ఉన్నప్పటికీ 257 మండలాలనే కరువు ప్రాంతాల జాబితాలో చేర్చడంపై విమర్శలు రావడంతో కలెక్టర్లు మరో 90 మండలాలను చేర్చాలని ప్రతిపాదనలు పంపించారు. అవి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 2018 రబీలో ప్రభుత్వం మరో రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. వెరసి దుర్భిక్ష బాధిత రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ బకాయి మొత్తం రూ.2,950 కోట్లకు పైగా ఉంది.
2014లో బకాయిలు ఎగవేత
ఓట్లు వేసి గెలిపించిన పాపానికి చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే రైతులకు కుచ్చుటోపీ పెట్టింది. 2014లో అధికారంలోకి రాగానే రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేసింది. ఇది చాలాదన్నట్టు 2014 ఖరీఫ్‌లో రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించగా.. దానిని రూ.రూ.692.67 కోట్లకు కుదించింది. 2014 నాటి రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎందుకు పెండింగులో పెట్టారని అన్నదాతలు, రైతు సంఘాల నేతలు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదిలావుంటే.. 4–5 విడతల రుణమాఫీ బకాయిలు రూ.8,830 కోట్లను ఈనెల 6వ తేదీలోగానే చెల్లిస్తామని ఎన్నికల ముందు చెప్పిర ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ మొత్తాలను విడుదల చేయలేదు.
రైతులంటే ఇంత వివక్షా?
ముడుపులే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు సంపన్న వ్యాపార సంస్థలకు రాయితీలు ఇస్తూ.. రైతుల విషయంలో తీవ్ర వివక్ష చూపుతోంది. విమానాల్లో తిరిగేది సంపన్నులేనన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విమానయాన సంస్థలు నష్టపోకుండా ప్రభుత్వం ఇంధన సబ్సిడీ ఇస్తోంది. ఇది చాలదన్నట్టు విజయవాడ (గన్నవరం) నుంచి దేశ, విదేశాలకు విమానాలను నడిపే సంస్థలకు నష్టం వాటిల్లితే సర్కారే ఆ మొత్తాలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయిదు నక్షత్రాల హోటళ్లు, లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు, ఫక్తు వ్యాపార దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులకు, కాగితాలకే పరిమితమైన పరిశ్రమలకు సైతం రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment