khareef season
-
రైతుకు మరింత దన్ను
సాక్షి, న్యూఢిల్లీః దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న వేళ 2023–24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటల కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం చేసింది. వ్యవసాయదారుల ఉత్పత్తులకు లాభదాయక ధరలు నిర్ధారించేలా, పంటల వైవిధ్యతను ప్రోత్సహించేలా మద్దతు ధరల పెంపున కు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. వరి సాధారణ, గ్రేడ్–ఏ రకాలపై ప్రస్తుతం ఉన్న మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో ప్రస్తుతం సాధారణ రకం వరి క్వింటాల్ ధర రూ.2,040 ఉండగా, అది ప్రస్తుత కేంద్రం నిర్ణయంతో రూ.2,183కి పెరగగా, గ్రేడ్–ఏ రకం వరి ధర రూ.2,060 నుంచి రూ.2,203కి చేరింది. పప్పుధాన్యాలకు పెరిగిన మద్దతు.. ఇటీవలి కాలంలో కేంద్రం పప్పుధాన్యాలు, నూనెగింజలు, తృణధాన్యాల పంటల సాగును ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహార భద్రతా మిషన్ వంటి పధకాల ద్వారా పంటల వైవి«ధ్యం ఉండేలా రైతులను ప్రోత్సహిస్తోంది. 2022–23 మూడవ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 330.5 మిలియన్ టన్నులుగా అంచనా వేయగా, ఇది మునుపటి ఏడాది 2021–22తో పోలిస్తే 14.9 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పప్పుధాన్యాలు, నూనెగింజల ధరలను కేంద్రం గరిష్టంగా పెంచింది. పెసర ధరను ఏకంగా రూ.803కి పెంచింది. దీంతో పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెరిగింది. కంది మద్దతు ధరను రూ.400, మినప ధరను రూ.350 మేర పెంచింది. నూనెగింజల విషయంలో వేరుశనగకు రూ.527, సన్‌ఫ్లవర్ రూ.360, సోయాబీన్ రూ.300, నువ్వులు రూ.805 చొప్పున ధరలు పెంచింది. వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పటికప్పుడు మద్దతు ధరని నిర్ణయిస్తున్నామని, గత ఏడాదులతో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ధరలను పెంచామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్‌గోయల్ పేర్కొన్నారు. రైతు సంక్షేమ సంస్కరణల్లో భాగమిది: మోదీ దాదాపు 14 ఖరీఫ్ పంట రకాలకు కనీస మద్దతు ధర పెంచడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘గత తొమ్మిదేళ్లలో రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల క్రమంలో భాగమే ఈ ఎంఎస్పీ పెంపు నిర్ణయం. ఈ పెంపుతో రైతులు తమ పంటకు లాభసాటి ఆదాయం పొందటంతోపాటు వైవిధ్య పంటల సాగు విధానం మరింత పటిష్టమవనుంది’ అని మోదీ ట్వీట్‌చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. గత దశాబ్దకాలంలో ఇంతగా ధర పెంచడం ఇది రెండోసారి. గత పదేళ్లలో చూస్తే గరిష్టంగా 2018–19లో క్వింటాల్‌కు రూ.200 పెంచారు. 2023–24 ఖరీఫ్ పంటలకు 5.3 శాతం నుంచి 10.35 శాతం శ్రేణిలో కనీస మద్దతు ధర పెంచారు. -
సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ప్రారంభం అయింది. ఈ సమావేశంలో జులై 8న రైతు దినోత్సవం నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. నూతన ఐటీ పాలసీకి ఆమోదం, జగనన్న టౌన్షిప్ ప్రోగ్రాంపై చర్చ జరగనుంది. రైతుల కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. వైఎస్సార్ బీమా పథకం అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్.. జులై 1, 3, 4 తేదీల్లో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన -
రైతుబంధుకు సన్నద్ధం
మహబూబ్‌నగర్ రూరల్: ఖరీఫ్‌లో పంటల సాగుకు రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు వ్యవసాయశాఖ అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ఉండటంతో ఆ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఈ–కుబేర్ ద్వారా ఆన్లైన్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేని రైతులకు ఈ పథకం వరంగా మారింది. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు రబీ, ఖరీఫ్ సీజన్లలో పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఖరీఫ్ సీజన్లో రైతులకు చెక్కుల రూపంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. రబీలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈసారి వానాకాలం పంట (ఖరీఫ్) కోసం కూడా రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈసారి ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇవ్వనుండటంతో రైతాంగంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పెట్టుబడి సాయం పెంపు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.2 వేలు పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో రెండు పంటలకు కలిపి రూ.8 వేలు ఉన్న సహాయాన్ని ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లించనున్నారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు తమ వ్యవసాయ పంట క్షేత్రాల్లో పంటల సాగుకు పెట్టుబడి కోసం గతంలో బ్యాంకుల ముందు నిరీక్షించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అధికారులు రుణాల కోసం సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసేవారు. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులకు ఆ ఇబ్బందులన్నీ తప్పినట్లయింది. వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పు రైతులకు భారంగా మారి ఆత్మహత్యలు చేసుకునేవారు. వ్యాపారుల వడ్డీ కిందకే పండించిన పంట ఇవ్వాల్సి వచ్చేది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసి సాయం చేసింది. గత ఖరీఫ్ సీజన్లో.. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం అమలులో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని 3,35,252 మంది రైతులకు రూ.355.21 కోట్లు మంజూరు చేయగా రూ.219.67 కోట్ల పెట్టుబడి సాయం కింద 2,87,128 మంది రైతులకు అందింది. వివిధ కారణాలతో రూ.136.21 కోట్లు రైతులకు అందలేదు. రబీ సీజన్లో రూ.342.12 కోట్లు జిల్లాకు విడుదల కాగా అందులో రూ.307.7 కోట్లు పెట్టుబడి కింద 2,62,612 మంది రైతులకు పంపిణీ చేశారు. పలు కారణాల వల్ల పంపిణీకి నోచుకోని రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఆనాడు నిలిచిపోయిన పెట్టుబడి పంపిణీపై వ్యవసాయ శాఖాధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. కాగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేయడం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలన్లి రైతులు కోరుతున్నారు. గతేడాది రూ.697.33 కోట్లు 2018–19 ఖరీఫ్‌లో 2,82,783 మంది రైతులకు రూ.219.67 కోట్లు అందించారు. అలాగే రబీ సీజన్లో 2,62,612 మంది రైతులకు రూ.307.7 కోట్లు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింద జిల్లాకు రూ.697.33 కోట్లు కేటాయించినా రూ.526.33 కోట్లు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడం గమనార్హం. సమస్యలు అధిగమించేనా..? గతేడాది ఖరీఫ్ నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టారు. కొంతమంది భూస్వాములు, విదేశాల్లో ఉన్న వారు చెక్కులు తీసుకోలేదు. రెవెన్యూ రికార్డుల్లో తలెత్తిన గందరగోళంతో పలువురు చెక్కులు వచ్చినా తక్కువ భూమికి వచ్చాయని తీసుకోలేదు. దీంతో భారీగా చెక్కులు మిగిలిపోయాయి. యాసంగి సమయంలో ఎన్నికల కోడ్ వల్ల చెక్కుల పంపిణీపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ ముద్రించిన చెక్కులను పక్కన పెట్టి రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసింది. అయితే ఇతర దేశాలు, పట్టణాల్లో ఉన్న వారు బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో వారికి పెట్టుబడి సాయం అందలేదు. దీంతో 88,738 మంది రైతులు రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందుకోలేకపోయారు. ఇటీవల యాసంగికి సంబంధించిన చెల్లింపులన్నీ పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించారు. నేరుగా ఖాతాల్లో జమ ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుబంధు పథకం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెట్టుబడి సాయం పంపిణీ కొంత ఆలస్యమైంది. జిల్లా రైతులకు రైతుబంధు సాయం పంపిణీపై చర్యలు చేపడతాం. ప్రస్తుత సీజన్ నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తాం. జిల్లాలో ఇంకా కొంత మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించాల్సి ఉంది. ఏఈఓల ద్వారా వారి ఖాతా నంబర్లు సేకరిస్తాం. – సుచరిత, జేడీఏ, మహబూబ్‌నగర్ -
ఖరీఫ్‌కు సిద్ధం
మహబూబ్‌నగర్ రూరల్: ఖరీఫ్ సాగుకు ఇటు రైతులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కొన్నిరోజులుగా అధికారులు తలమునకలై కాస్త ఆలస్యంగానైనా ప్రణాళిక తయారు చేశారు. ఒకవైపు రైతు సమగ్ర సమాచార సేకరణ ప్రక్రియ కొనసాగిస్తూనే ఖరీఫ్ కోసం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉం చేందుకు అంచనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 15,977 క్వింటాళ్ల మేర విత్తనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆశల సాగుకు జూన్‌లోనే నైరుతీ రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు పొలం పనులను మొదలెట్టారు. అలాగే అధికారులు 2019 ఖరీఫ్ సాగుపై ప్రణాళిక సిద్ధం చేశారు. రాబోయే ఖరీఫ్ సాగుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా రబీలో సేద్యపరంగా వచ్చిన లాభనష్టాలను పక్కకుపెట్టి రైతన్న మళ్లీ అదృష్ట పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే సాగుకు శ్రీకారం చుట్టడానికి రైతులు సరంజామ సిద్ధం చేసుకున్నారు. సిప్పటికే పొలాలను వేసవి దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లు జిల్లాలోని 15 మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 1.25 లక్షల హెక్టార్లు సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 17,211 హెక్టార్లు, జొన్నలు 8,500 హెక్టార్లు, మొక్కజొన్న 39,000 హెక్టార్లు, రాగులు 600 హెక్టార్లు, కందులు 12,000 హెక్టార్లు, పత్తి 38,000 హెక్టార్లతో పాటు పలు రకాల చిరు ధాన్యాల పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వరిసాగు కోసం 10,435 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. వరి, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర, ఆముదం, వేరుశనగ, మినుములు, పత్తి పంటలకు ప్రాధాన్యం ఇస్తూ సాగు కోసం ప్రణాళికలు రూపొందించారు. రైతులకు అవసరమయ్యే సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు వీలుగా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి ప్రధానంగా వరి, పత్తి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి పంటల వివరాలు, భూమి స్వభావం వివరాలు సేకరిస్తున్నారు. సాగునీటి వసతులు, బోరుబావుల కింద వ్యవసాయ సాగు ఎకరాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. 1,35,322 మెట్రిక్ టన్నుల ఎరువులు ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలోని రైతాంగానికి 1,35,322 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. యూరియా 61,342 మెట్రిక్ టన్నులు, డీఏపీ 25,206 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7,222 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 38,612 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,940 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. అవసరం మేరకు తెప్పిస్తాం జిల్లాలోని రైతులకు అవసరం మేరకు విత్తనాలను అందించేందుకు చర్యలు తీసుకున్నాం. వారం పది రోజుల్లో అన్ని మండల కేంద్రాలకు విత్తనాలను పంపిస్తాం. ఎరువులు కూడా సాగుకు అవసరమయ్యే మేర కు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువుల విషయమై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేను. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ,అధికారి -
పడావు భూములకు రైతు‘బందు’?
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతుబంధు పథకంలో అన్ని భూములకు కాకుండా సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అనుమానిస్తున్నారు. రైతు సమగ్ర సర్వేలో పడావు భూములను ప్రత్యేకంగా గుర్తిస్తుండ డమే ఇందుకు కారణం.. దీంతో పడావు భూములకు పెట్టుబడి సాయం అందకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. రైతు సమగ్ర సర్వేలో ప్రత్యేక కాలం చేర్చడమే ఈ ప్రచారానికి బలం చేకూర్చు తోంది. పెట్టుబడి సాయం పేర రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎకరాకు ఒక సీజన్లో రూ. 4 వేల చొప్పున ఇంత వరకు రెండు సీజన్లకుగాను ఏడాదిలో రూ. 8వేల చొప్పున రైతులకు అందించారు. ఈ ఖరీఫ్ సీజన్‌నుంచి పెట్టుబడి సాయం పెంచుతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. సీజన్‌కు ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10వేలు అందిస్తామని తెలిపింది. పెట్టుబడి సాయం పెరుగుతుందని ఆశపడ్డ రైతులకు.. సమగ్ర సర్వేలో పొందుపరిచిన అంశం నిరాశకు గురిచేస్తుంది. పెట్టుబడి సాయంలో కోతలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో కొత్తగా పడావు భూముల వివరాలు సేకరిస్తుండడంతో.. ఆ భూములకు రైతుబంధు ఇవ్వరేమోనన్న ప్రచారం జరుగుతోంది. గతంలో రైతుబంధు వివరాలు సేకరించినప్పుడు పడావు భూముల వివరాలు లేవు. భూమి ఉంటే చాలు సాగులో ఉందా లేదా అనే అంశంతో నిమిత్తం లేకుండా రైతుబంధు పథకం వర్తింపజేశారు. ఇప్పుడు పడావు భూముల అంశం చేర్చడంతో ఎన్నికల నేపథ్యంలో ఎకరాకు ఒక సీజన్లో రూ. వెయ్యి చొప్పున పెంచిన భారాన్ని ప్రభుత్వం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగానే పడావు భూముల అంశం తీసుకువచ్చిందని రైతులు అనుమానిస్తున్నారు. -
విరివిగా రుణాలు..!
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు విరివిగా అందజేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నిర్ణయించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రైతులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలు, ఉన్నత చదువుల కోసం రైతుల బిడ్డలకు రుణాలు అందజేయనుంది. పంట రుణాలను ఇవ్వడంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న డీసీసీబీ ఈ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి మొత్తం రూ.450 కోట్ల పంట రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఖరీఫ్‌లో రూ.270 కోట్లు, రబీలో రూ.180 కోట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం సుమారు రూ.20 కోట్ల మేరకు దీర్ఘకాలిక రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయేతర రుణాలు సైతం.. జిల్లా వ్యాప్తంగా సుమారు 1000 స్వయం సహాయక సంఘాలకు డీసీసీబీ ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.40 కోట్ల వరకు రుణాలను ఇవ్వనుంది. వివిధ సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతుల బిడ్డల ఉన్నత చదువులకు లోన్స్ అందజేయనుంది. ఇందుకు అన్ని పత్రాలను సమర్పించిన వారం రోజుల్లోగా విద్యా రుణాలను అందించాలని నిర్ణయించింది. ఒక్కో విద్యార్థికి రూ.30 లక్షల వరకు రుణం ఇవ్వాలని యోచిస్తోంది. విద్యారుణాల కోసం ఎక్కువ డిమాండ్ ఉండడంతో గత సంవత్సరం కంటే రెట్టింపు స్థాయిలో విద్యార్థులకు రుణాలను ఇవ్వాలని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్ గోల్డ్ లోన్ పథకాన్ని ప్రారంభించి గ్రాము బంగారంపై రూ.2200 వరకు తక్కువ వడ్డీతో ఆరునెలల కాలపరిమితిలో చెల్లించే విధంగా రుణాలను ఇవ్వడాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అదే విదంగా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలను ఇవ్వాలని భావిస్తోంది. ఒక్కో ఉద్యోగికి రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇవ్వడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 13 ఏటీఎంలతో పాటు మొబైట్ ఏటీఎంలు సమకూర్చుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్న జిల్లా సహకార బ్యాంకు నూతనంగా మఠంపల్లి, మునగాల, మునుగోడులో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏటీఎంల ద్వారా ప్రజలకు తమ సేవలను మరింత విస్తరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం.. 2008 సంవత్సరంలో రుణమాఫీ అర్హత పొందని రైతులకు వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించా రు. అసలు వడ్డీపై 35 శాతం తగ్గించి రుణాల ను చెల్లించే వెÐðసులుబాటును కల్పిలంచారు. జూన్ 30 వరకు చెల్లించే వారికి వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దాంతో పాటు బ్యాంకులో పేరుకుపోయిన వ్యవయేతర రుణాలను చెల్లించే వారికి సైతం వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం ఇవ్వనున్నా రు. రుణానికి సమానంగా వడ్డీ చెల్లించే వెసులుబాటును కూడా కల్పించి పేరుకుపోయిన బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే రికవరీ బృందాలను ఏర్పాటు చేసి వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా బకాయిలు వసూలు చేసుకునే పనిలో బ్యాంకు అధికారులు నిమగ్నమయ్యారు. బ్యాంకు అభివృద్ధికి సహకరించాలి రైతులకు విరివి గా రుణాలు ఇ వ్వాలని నిర్ణయించాం. రైతులతో పాటు ఉ ద్యోగులు, ఇతర వ్యాపారవర్గాలు తమ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అబివృద్ధికి సహకరించాలి. పంట రుణాలను ఇవ్వడంతో అన్ని బ్యాంకులకంటే తామే ముందుం టున్నాం. పేరుకుపోయిన బకాయిల కోసం వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కల్పించాం. రుణాల ను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి దోహదపడాలి. – కె.మదన్మోహన్, డీసీసీబీ, సీఈఓ -
పెట్టుబడి రాయితీ.. ఆపేయడమే ఆనవాయితీ
సాక్షి, అమరావతి: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్న చందంగా తయారైంది రాష్ట్రంలోని రైతుల పరిస్థితి. గత ఏడాది కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.932 కోట్లు విడుదల చేసినా చంద్రబాబు సర్కారు వాటిని తన సోకులకు ఉపయోగించుకుంది. విపత్తుల వల్ల పంటలు పోగొట్టుకున్న రైతులు సాధారణంగా అప్పుల్లో కూరుకుపోతారు. ఇలాంటి వారికి తదుపరి పంటలు వేసుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా పెట్టుబడి రాయితీ చెల్లించాలని విపత్తు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.932 కోట్లు ఎప్పుడో విడుదల చేసింది. దీనికి మరికొంత మొత్తం కలిపి బాధిత రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు ఆ నిధులను ఎన్నికల తాయిలాల కోసం వినియోగించి రైతుల్ని నిలువునా ముంచింది. వారి ఖర్మకు వారే పోతారన్నట్టుగా గాలికొదిలేసింది. మరోవైపు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నడుమ అష్టకష్టాలు పడి పండించిన పంటలను కొనుగోలు చేసిన సర్కారు ఆ సొమ్ములూ చెల్లించలేదు. మొక్కజొన్నలను ప్రభుత్వానికి విక్రయించిన వారికి రూ.200 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి మొక్కజొన్నల్ని అమ్మిన పాపానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు డబ్బు కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన రైతులకూ సొమ్ములు చెల్లించలేదు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా రూ.వేల కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్నపాటి నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లుల్ని కూడా పెండింగులో పెట్టింది. దీనివల్ల కొత్తగా ఈ యూనిట్లు ఎవరికీ మంజూరు చేయడం లేదు. రాయితీ బకాయి రూ.2,950 కోట్లపైనే 2015–16లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4,96,890 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఇవ్వాల్సిన రూ.270 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. గత ఏడాది (2018) ఖరీఫ్‌లో కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.1,832 కోట్లను పెట్టుబడి రాయితీగా చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకూ నయాపైసా కూడా విదల్చలేదు. ఇందులో కేంద్రం వాటా రూ.932 కోట్లను ఎప్పుడో విడుదల చేసింది. 2018 రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 257 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 450 మండలాల్లో దుర్భిక్షం ఉన్నప్పటికీ 257 మండలాలనే కరువు ప్రాంతాల జాబితాలో చేర్చడంపై విమర్శలు రావడంతో కలెక్టర్లు మరో 90 మండలాలను చేర్చాలని ప్రతిపాదనలు పంపించారు. అవి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 2018 రబీలో ప్రభుత్వం మరో రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. వెరసి దుర్భిక్ష బాధిత రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ బకాయి మొత్తం రూ.2,950 కోట్లకు పైగా ఉంది. 2014లో బకాయిలు ఎగవేత ఓట్లు వేసి గెలిపించిన పాపానికి చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే రైతులకు కుచ్చుటోపీ పెట్టింది. 2014లో అధికారంలోకి రాగానే రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేసింది. ఇది చాలాదన్నట్టు 2014 ఖరీఫ్‌లో రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించగా.. దానిని రూ.రూ.692.67 కోట్లకు కుదించింది. 2014 నాటి రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎందుకు పెండింగులో పెట్టారని అన్నదాతలు, రైతు సంఘాల నేతలు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదిలావుంటే.. 4–5 విడతల రుణమాఫీ బకాయిలు రూ.8,830 కోట్లను ఈనెల 6వ తేదీలోగానే చెల్లిస్తామని ఎన్నికల ముందు చెప్పిర ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ మొత్తాలను విడుదల చేయలేదు. రైతులంటే ఇంత వివక్షా? ముడుపులే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు సంపన్న వ్యాపార సంస్థలకు రాయితీలు ఇస్తూ.. రైతుల విషయంలో తీవ్ర వివక్ష చూపుతోంది. విమానాల్లో తిరిగేది సంపన్నులేనన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విమానయాన సంస్థలు నష్టపోకుండా ప్రభుత్వం ఇంధన సబ్సిడీ ఇస్తోంది. ఇది చాలదన్నట్టు విజయవాడ (గన్నవరం) నుంచి దేశ, విదేశాలకు విమానాలను నడిపే సంస్థలకు నష్టం వాటిల్లితే సర్కారే ఆ మొత్తాలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయిదు నక్షత్రాల హోటళ్లు, లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు, ఫక్తు వ్యాపార దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులకు, కాగితాలకే పరిమితమైన పరిశ్రమలకు సైతం రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తోంది. -
ప్రకటన సరే..చర్యలేవీ?
కడప అగ్రికల్చర్: జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలు తీవ్ర వర్షాభావంతో ఎండిపోయి పెట్టుబడి కూడా తీరక రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఖరీఫ్‌లో కరువు పీడిత జిల్లాగా ప్రకటిస్తూ 51 మండలాల్లో కరువు నెలకొన్నట్లు తెలిపారు. అయితే జిల్లా యంత్రాంగం 22 మండలాల్లోనే కరువు ఉన్నట్లు తేల్చారు. రబీలో 51 మండలాలకు 43 మండలాలలో కరువు నెలకొన్నట్లు లెక్కలు కట్టారు.ప్రకటన కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నా ప్రభుత్వ తీరు పరిశీలిస్తే రైతులకు నిరాశ కలుగుతోంది. ప్రకటన వెలువరించాక సాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి కలుగకపోవడాన్ని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది ఇలా ఉండగా 2015నవంబరు, 2015 మే, 2016 డిసెంబరు నెలల్లో అకాల వర్షాల వల్ల పంటలు పోయాయి. దీనికి సంబంధించి రూ.60.55 ఇన్పుట్ సబ్సిడీ (పంట పెట్టుబడి రాయితీ) ఇంత వరకు ప్రభుత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయానికి ప్రతి రోజు ఏదో ఒక మండలం నుంచి రైతులు అధికారుల వద్దకు రావడం ప్రభుత్వం నుంచి రాగానే మీ ఖాతాలకు పడుతుంది పొండి అని చెప్పగానే ఇంటికి దారి పట్టడం షరామూలుగా మారింది. కానీ ఏళ్లు గడుస్తున్నా రైతు ఖాతాలకు సొమ్ములు చేరిందిలేదు. సాధారణంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కరువు మండలాల్లో రైతులు నష్టపోయిన పంటలకు పరిహారాన్ని చెల్లించడం, ఇతరత్రా సాయం ప్రకటించడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం రైతులు వీటిని అడగకుండా ఉంటే చాలని అనుకుంటోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇన్పుట్ సబ్సిడీ, బీమా సొమ్ములు రైతులకు చెల్లించాలని జిల్లాకు మంగళవారం వస్తున్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమీషనర్ మురళీధరరెడ్డికి రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రూ.115.58 కోట్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎప్పుడిస్తారో గత ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 51 మండలాల్లో 22 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 393 మిల్లీ మీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 202 మిల్లీమీటర్లు కురిసింది. ఈ సీజన్లో 1,33,556 హెక్టార్ల సాధారణ పంటల సాగు కావాల్సి ఉండగా కేవలం 47,171 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వానలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. వివరాలను సేకరించి పంపితే పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో 22 మండలాల్లో పంటలకు నష్టం జరిగిందని నివేదికలు తయారు చేసి కలెక్టర్ హరికిరణ్ ద్వారా ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ గత ఏడాది నవంబరు నెల 21న పంపింది. రూ.15.58 కోట్ల పెట్టుబడి రాయితీ రైతులు నష్టపోయారని నివేదికల్లో పేర్కొన్నారు. వెంటనే నివేదికలు పంపితే పరిహారం ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడాన్ని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌తోపాటు 2015 నవంబరు నెలలో అకాల వర్షాల కారణంగా రూ.44 కోట్లు, 2015 మే నెలలో రూ.30 లక్షలు, 2016 డిసెంబర్లో 1.27 లక్షలు నష్టం సంభవించింది. మొన్న రబీలో 1,37,154 హెక్టార్లలో ప్రధాన పంటలైన బుడ్డశనగ, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, దనియాలు దెబ్బతిన్నాయి. అయితే పంట దిగుబడులను (క్రాప్ కటింగ్) జిల్లా వ్యవసాయ గణాంక అధికారులు, ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధులు లెక్కకడుతున్నారు. కానీ పంటకోత ప్రయోగంలో దిగుబడులు ఏ మాత్రం రాలేదని స్పష్టమవుతోంది. పంట సాగు కోసం చేసిన పెట్టుబడులు రూ.100 కోట్లు నేలపాలయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో నష్టం సంభవించినా ఇంతవరకు పరిహారం ప్రభుత్వం మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో బీమా నష్టం జరిగిందని జిల్లా నుంచి కాగితాలు పోగానే వెంటనే పరిహారం వచ్చేది. రుణమాఫీ కూడా ఒకేసారి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. నేను ఏటా ఐదు ఎకరాల్లో రబీలో బుడ్డశగన, ప్రొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తున్నాను. 2012 నుంచి ఇప్పటి వరకు బీమా పూర్తి స్థాయి అందుకోలేదు. –సుధాకర్‌రెడ్డి, రైతు కొత్తపల్లె, పెండ్లిమర్రి మండలం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి ఖరీఫ్, రబీ సీజన్లలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిని రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. బ్యాంకుల్లో అప్పులు చెల్లించలేక తంటాలు పడుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ నాలుగైదు సంవత్సరాలుగా రాలేదు. అయినా ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.–సంబటూరు ప్రసాదరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం జిల్లాలో 2012 నుంచి 2018 వరకు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సక్రమంగా చెల్లించలేదని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. పట్టించుకోలేదు. జిల్లాలోని రైతులు బీమా కోసం ప్రీమియం చెల్లించి ఏళ్ల తరబడి ఎదురు చూడాలా? ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.–చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం. -
ఆశల ఆ‘వరి’!
నేలకొండపల్లి: ఈసారి ఖరీఫ్ సీజన్లో వరిపంటను సాగు చేసిన రైతులకు దోమపోటు ప్రభావంతో తీవ్ర నష్టాలే మిగులుతున్నాయి. ఎకరానికి రూ.25వేలకు పైగా పెట్టుబడి పెట్టగా..దోమపోటు సోకి రోజుల వ్యవధిలోనే ధాన్యం తాలుగా మారి దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభం కాగా..చెరువుల ఆయకట్టు కింద ముమ్మరమయ్యాయి. ఎకరానికి 40 బస్తాల దిగుబడి వరకు వస్తుందని రైతులు ఆశించగా..అందులో సగం కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టగా..అది పూడడం కష్టంగా మారింది. జిల్లాలోని మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో రైతులు 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. పాలేరు నియోజకవర్గంలో ఎక్కువగా పంటకు దోమపోటు సోకింది. పలుచోట్ల రైతులకు సలహాలు, సూచనలు చేసే వ్యవసాయాధికారి లేక ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాల వద్ద మందులు కొనుగోలు చేసి పిచికారీ చేయాల్సి వచ్చింది. అయినా..దోమపోటు తగ్గలేదని అన్నదాతలు వాపోతున్నారు. ఖరీఫ్ ఆరంభంలో వానలు బాగా కురవడంతో ఎంతో ఆనందంగా వరి పంట వేసుకున్నారు. అయితే..అదును సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో..బోరులు, బావుల్లో కూడా నీరు అడుగంటింది. పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో వరి సాగు పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు ఏ మందు వాడుతున్నారో తెలియక, ఇష్టం వచ్చినట్లుగా పిచికారీ చేయడం వలన ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చేలా లేదని వాపోతున్నారు. నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెం, అనాసాగారం, సింగారెడ్డిపాలెం, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో వరికి దోమపోటు తీవ్రత ఎక్కువగా ఉంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెడితే..చివరకు అప్పులు మిగులుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రబీ సాగు కలిసొచ్చేనా.. ఈ ఏడాది వరిపంటపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే చాలాచోట్ల దోమపోటు ప్రభావంతో దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు..తీవ్ర నిరాశకు గురై..ముందున్న రబీ (ఏసంగి) సాగును నమ్ముకుంటున్నారు. దోమపోటు ప్రభావం లేకుంటే..ధాన్యం నాణ్యత బాగుండి కలిసొస్తుందని అనుకుంటున్నారు. అయితే..ఖరీఫ్‌తో పోల్చితే..రబీలో సాగు విస్తీర్ణం తగ్గుతుంది. దీంతో..వానాకాలం పంటలో నష్టపోయిన చాలామంది తిరిగి యాసంగిలో వరి పండించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఎకరంన్నర తాలుగా మారింది.. ఎకరంన్నర వరి సాగు చేశాను. రూ.25 వేలు ఖర్చు పెట్టిన. దోమపోటుతో వరి పంట మొత్తం తాలుగా మారింది. 50 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశించాను. కానీ..గింజ ధాన్యం చేతికి వచ్చేట్లు కనిపించడం లేదు. అప్పుల పాలయ్యాను. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి. – నెల్లూరి రామయ్య, రైతు, ముజ్జుగూడెం పంటమొత్తం దెబ్బతింది.. వరి సాగు కోసం అందినకాడికల్లా అప్పులు చేసి పండించిన. దోమపోటుతో వరి పంట మొత్తం దెబ్బతింది. వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. గతేడాది ఖర్చులే ఇయాల్టీకి తీరలేదు. కొత్తగా సాగుకు చేసిన అప్పులకు కట్టాల్సి వస్తోంది. సర్కారు ఆదుకోవాలి. – కాశిబోయిన అయోధ్య, రైతు, నేలకొండపల్లి ఇది తీరని నష్టం.. వరి పంటకు సోకిన దోమపోటుకు పలు రకాల మందులు పిచికారీ చేసిన. అయినా ఏమాత్రం కూడా తగ్గలేదు. ఇది వరకు కురిసిన అకాల వర్షాలకు వరి పంట చాలా వరకు దెబ్బతింది. ఏం చేయాలో పాలుపోవట్లేదు. రైతులకు దోమపోటు తీరని నష్టం చేసింది. ఇక కోలుకోలేం. – పి.కోటేశ్వరరావు, రైతు, సింగారెడ్డిపాలెం కొంతమేర నష్టం వాస్తవమే.. జిల్లాలో 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలోనే దిగుబడి వస్తుంది. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాం. హెక్టారుకు 5,200 కిలోల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశాం. పంట భాగానే ఉన్నా..కొన్నిచోట్ల దోమపోటు ప్రభావం కనిపించింది. అక్కడ దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. – ఝాన్సీలక్ష్మీకుమారి, జేడీఏ, ఖమ్మం -
మళ్లీ ప్రా‘ధాన్యం’!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరించాల్సిన లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది 1.40 మెట్రిక్ టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనేందుకు నిర్ణయించారు. జిల్లాలో 89 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాలవి 73 ఉండగా, ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) కేంద్రాలు 16 ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల సభ్యులకు శిక్షణను ఇవ్వనున్నారు. జిల్లాలో 64,200 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. ఈసారి వర్షాలు కూడా బాగానే ఉండడంతో దిగుబడి కూడా అధికంగా వస్తుందనే ఆలోచనతో రైతులున్నారు. 2016–17లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా నిర్ణయించగా 1.40లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. నాడు ఖమ్మం జిల్లాలోని 21మండలాల పరిధిలో 34,835.609మెట్రిక్ టన్నులే సేకరించారు. గతేడాది (2017–18) ధాన్యం కొనుగోళ్లను పెంచాలని నిర్ణయించారు. 56వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించగా..మొత్తం 39,323.040మెట్రిక్ టన్నులు కొన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 89 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రైతుల నుంచి వచ్చే ధాన్యం తీవ్రతను బట్టి..మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా..? లేకపోతే ఉన్నవాటిని తగ్గించాలా..? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ముందస్తుగా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం అమ్మే రైతులు నాణ్యత ప్రమాణాలు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మే రైతులు తమవెంట ఆధార్‌కార్డు, గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ (బ్యాంక్ పాస్ పుస్తకం జత చేయాలి.), బ్యాంకులో ఖాతా పనిచేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ధ్రువీకరించాలి. రైతు మొబైల్ నంబర్ లేనిపక్షంలో కుటుంబ సభ్యుల ఫోన్‌నంబర్ ఇవ్వాల్స ఉంటుంది. క్వింటా ధర రూ.200పెంపు గతంలో గ్రేడ్–ఏ రకానికి క్వింటా ధర రూ.1590 ఉండగా..కామన్ రకం రూ.1540 ఉండేది. అయితే రైతులను ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాకు రూ.200 ధర పెంచుతూ నిర్ణయించింది. ఈ ధర ఈ ఖరీఫ్ నుంచి అమలు కానుంది. వీటికి గ్రేడ్–ఏ రకం క్వింటా «ధాన్యం ధర రూ.1790, కామన్ రకం క్వింటా ధాన్యం ధర రూ.1740గా నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో 48 గంటల్లో నగదు చెల్లింపులు చేయనున్నారు. గతంలో ఆన్లైన్ తదితర సమస్యలు ఎదురవగా..ఈ సారి ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. 22న శిక్షణకు ప్రణాళిక.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు..ఆయా సంఘాల మహిళలకు ఈనెల 22వ తేదీన ఖమ్మంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా ధాన్యం తేమశాతం లెక్కించడం, ధాన్యంలో గ్రేడ్‌ను గుర్తించడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ అనంతరం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేయనున్నారు. -
ఎరువు .. బరువు
యల్లనూరు: పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా అన్నదాతల ఆర్థిక ప్రగతిలో మార్పు రావటం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదని నిరంతరం ఉపన్యాసాలు చెప్పి పాలిస్తున్న ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి మరచి రైతుపై మరో అదనపు భారం మోపుతున్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభానికి ముందే ప్రభుత్వం మరోసారి ఎరువుల ధరలు పెంచటంతో అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కో ఎరువు బస్తాపై రూ.100 నుంచి రూ.120 వరకు ధరలు పెరిగాయి. వ్యవసాయం భారంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల అన్నదాతలు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. పెరిగిన వ్యవసాయ ఖర్చులకు తోడు ఎరువుల ధరలకు రెక్కలు రావటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరలేవీ? రైతులు ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఉత్సాహం చూపని ప్రభుత్వాలు ఎరువుల ధరల పెరుగుదలకు మాత్రం ఆసక్తి చూపుతున్నాయని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఎరువుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని మండిపడుతున్నారు. మూడేళ్లుగా వ్యవసాయానికి సాగునీరు, వర్షాలు లేకపోవడంతో కరువు కాటకాలతో అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం ధరలు పెంచటం సరికాదంటున్నారు. రైతులకు నిరంతరం అండగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడతామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వాలు ఎరువుల ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతన్నలను నిండాముంచుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టంగా మారనుంది. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీలు తదితర ఖర్చులకు తోడు ప్రకృతి కరుణించకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు నియంత్రించాలి ప్రభుత్వాలు ఎరువుల ధరలు పెంచడం చాలా దారుణం. రైతులు సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంతో విఫలమైన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచడం సరికాదు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – రామచంద్రారెడ్డి, సీపీఐ నాయకుడు, యల్లనూరు -
ఖరీఫ్ సాగు .. మేల్కొంటే బాగు
గుమ్మఘట్ట: జూన్ మొదటి వారం నుంచి ఖరీఫ్ ఆరంభం అవుతుంది. ఈ ఏడాది ముందస్తుగా రుతుపవనాలు వస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న ఖరీఫ్‌లో ఏ భూముల్లో ఎలాంటి పంటలు వేయాలి. ఎరువులు, పంటల యాజమాన్యం, దుక్కులు దున్నడం తదితర అంశాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెపుతున్నారు. భూసారాన్ని బట్టి పంట ఖరీఫ్ ముందే ప్రతి రైతు తమ భూమిలో భూసార పరీక్ష చేయించుకుంటే బాగుంటుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భూ సారాన్ని బట్టి అనుకూలమైన పంటలను మాత్రమే వేసుకోవాలి. దీని వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతోంది. భూసారానికి అనుగుణంగా ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి. దీంతో భూసారం పాడవుకుండా ఉంటుంది. భూసార పరీక్ష ద్వారా భూమిలో ఉన్న పోషక స్థాయిని తెలుసుకోవచ్చు. భూమిలో ఏ పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుస్తుంది. చౌడు నేలల్లో ఉన్న ఆమ్ల, క్షార నేలలను తెలుసుకుని భూమిని సరిదిద్దుకోవచ్చు. పత్తి సాగు చేసే రైతు తన భూమిలో పంట మార్పిడి చేయాలి. నాలుగు ఎకరాల్లో పత్తి వేస్తారనుకుంటే ఎకరంలో పత్తివేసి మిగత మూడు ఎకరాల్లో ఇతర పంటలు వేసుకోవడం మంచిది. ఆశించిన స్థాయిలో పంటలు పండాలని రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. గుమ్మఘట్ట మండల వ్యాప్తంగా 14 వేల హెక్టార్లలో వేరుశనగ సాగయ్యే అవకాశం ఉంది. మోతాదులోనే ఎరువులు వాడాలి ఎరువుల యాజమాన్య పద్ధతులను రైతులు సరిగ్గా పాటించాలి. భాస్వరం, ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. నత్రజని, ఎరువులను విడతల వారీగా వేసుకోవాలి. పంటకు వేయాల్సిన పొటాషియాన్ని సగం దుక్కితో వేయాలి. సగం పంటకు వేయాలి. యూరియాను నేరుగా కాకుండా వేప పిండితో గానీ, బంక మట్టితో గానీ కలిపి వేయాలి. ఇలా చల్లుకున్నట్లయితే యూరియా ఆవిరికాకుండా ఉండడంతో పాటు 100 శాతం పంటకు ఉపయోగపడుతుంది. వరికి, పత్తికి రెండో విడతగా భాస్వారాన్ని అసలు వాడకూడదు. – ఆంజినేయులు, వ్యవసాయ విస్తరణ అధికారి, గుమ్మఘట్ట సేంద్రియం మంచిది జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ పథకం ద్వారా భూసార పరీక్షలు నిర్వహిస్తే భూమిలో సేంద్రియ పదార్థాం తక్కువగా ఉందని తెలిసింది. ఇది ప్రమాదకర పరిస్థితులకు సంకేతం. ఇప్పటికైనా ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాల్సిందే. ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం వల్ల పంటల దిగుబడిలో పలు సమస్యలు ఎదురవుతాయి. పశువుల ఎరువులు, వర్మీకంపోస్టు ఎరువుల ద్వారా భూసారం పెరగడంతో పాటు నాణ్యమైన దిగుబడిని కూడా సాధించవచ్చు. రైతుకు సరిపడ విత్తనాలు సబ్సిడీ పంపిణీ చేసేందుకు సిద్ధం చేశాం. – రంగనేతాజీ, ఏఓ, గుమ్మఘట్ట -
ఆహారధాన్యాలు.. 27.74 కోట్ల టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఆహారధాన్యాల ఉత్పత్తి అంచనా భారీగా పెరిగింది. దేశంలో 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లో ఆహారధాన్యాలు రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతాయ ని కేంద్రం అంచనా వేసింది. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ రెండో అంచనా నివేదికను బుధవారం విడుదల చేసింది. 2016–17 సీజన్లో 27.51 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2017–18 సీజన్లో 27.74 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతాయని తెలిపింది. గతేడాది కంటే 23 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి కానున్నాయి. అందులో వరి ఉత్పత్తి గతేడాది 10.97 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.10 కోట్ల టన్నులు దిగుబడి రానుంది. పప్పుధాన్యాల ఉత్పత్తి గతేడాది 2.31 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కానున్నాయి. గతేడాది నూనెగింజల ఉత్పత్తి 3.12 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.98 కోట్ల టన్నులకు పడిపోనున్నాయి. పత్తి ఉత్పత్తి గతేడాది 3.25 కోట్ల బేళ్లు కాగా, ఈసారి 3.39 కోట్ల బేళ్లు ఉత్పత్తి కానుందని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నులకే పరిమితమైంది. వరి ఉత్పత్తి లక్షం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని వెల్లడించింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 2.94 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి గణనీయంగా 3.71 లక్షల టన్నులకు చేరింది. అందులో కంది ఉత్పత్తి లక్ష్యం 2.03 లక్షల టన్నులు కాగా, 2.84 లక్షలకు చేరింది. మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 15.70 లక్షల టన్నులకు పడిపోయింది. పెసర 64 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా, 59 వేల టన్నులకు పడిపోయింది. మినుముల ఉత్పత్తి లక్ష్యం 26 వేల టన్నులు కాగా, నూటికి నూరు శాతం ఉత్పత్తి అయింది. ఖరీఫ్‌లో నిరాశపరిచిన ఆహారధాన్యాల ఉత్పత్తి, రబీలో పుంజుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 44.72 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. అందులో వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నులు అవుతుందని అంచనా వేసింది. -
15 వేల కోట్లతో మద్దతు ధరకు యోచన
న్యూఢిల్లీ: పంటకు కనీస మద్దతు ధర లభించేలా చేసేందుకు ప్రభుత్వం త్వరలో ఓ కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 12 నుంచి 15 వేల కోట్ల రూపాయల వరకు వ్యయమవ్వొచ్చని అంచనా వేస్తోంది. ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలకు పెట్టుబడి కంటే 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండేలా చేస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ తాజా బడ్జెట్లో ప్రకటించారు. ఇందుకోసం నీతి ఆయోగ్ త్వరలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో ఓ సమావేశం నిర్వహించనుంది. కనీస మద్దతు ధర విషయంలో రైతులకు లబ్ధి చేకూర్చేలా తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను ఆ సమావేశంలో చర్చించనున్నారు. -
మార్క్‌ఫెడ్ ద్వారా ముతక ధాన్యం కొనుగోలు
జొన్న, సజ్జ తదితరాలకు మద్దతు ధర ప్రకటించిన కేంద్రం అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలుకు రాష్ట్రం సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ (2016-17)లో మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ వంటి ముతక ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముతక ధాన్యం దిగుబడులను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం సేకరించే బాధ్యతను రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలకు ముతక ధాన్యం అవసరం లేకున్నా.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇటీవల ముతక ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అనుగుణంగా.. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. 2016-17 ఖరీఫ్ సీజన్‌కు గాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,365, సజ్జకు రూ.1,330, జొన్న (హైబ్రిడ్)కు రూ.1,625, జొన్న (సాధారణ) రూ.1,650, రాగులకు రూ.1,725 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. కాగా, ప్రస్తుత సీజన్లో 2.5 లక్ష ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నతో పాటు.. ఇతర ధాన్యాలను దిగుబడి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, జిల్లాల వారీగా దిగుబడిని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. మెరుగైన పనితీరు ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు (డీసీఎంఎస్‌లు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు), గ్రామైఖ్య సంఘాలను కూడా కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా.. ముతక ధాన్యాన్ని ఎక్కువగా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ముతక ధాన్యం సేకరణను ప్రారంభించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్ల బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీకి అప్పగించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాల్సిన బాధ్యతను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో పీడీ (డీఆర్డీఏ), డీసీఓ, జేడీ (అగ్రికల్చర్), ఏడీ (మార్కెటింగ్), జిల్లా మేనేజర్ (మార్క్‌ఫెడ్), ఏరియా మేనేజర్ (ఎఫ్‌సీఐ) తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రవాణా, గన్నీ సంచుల ధరలు తదితరాలను కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలు.. తదితరాలను నిర్ణయించేందుకు స్థానికంగా కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ధాన్యం నిలువ చేసేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు, ఎఫ్‌సీఐ, వ్యవసాయ మార్కెట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఆదెరువు..ఆగం
ఆగస్టులో చినుకు రాలని వాన వేలాది ఎకరాలలో పంటలకు నష్టం అన్నదాత విలవిల జిల్లాలోని వివిధ మండలాల్లో కరువు కరాళ నత్యం చేస్తోంది.. సరైన వర్షాలు కురియక వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, కంది పంటలకు నష్టం వాటిల్లింది.. వరుసగా రెండేళ్ల నుంచి వర్షాభావ పరిస్థితుల నుంచి తేరుకోక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నకు, ఈసారి ఖరీఫ్ సీజన్ ఆరంభంలో కురిసిన వర్షాలు ఊరటనిచ్చినా ఆ తర్వాత మొహం చాటేశాయి.. దీంతో రైతులు విలవిలలాడుతున్నారు. మిడ్జిల్ : ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు మండలంలో మొక్కజొన్న 60వేల ఎకరాల్లో, పత్తి 20వేల ఎకరాల్లో, కంది ఐదు వేల ఎకరాల్లో, వరి ఇతర పంటలు మరో ఐదు వేల ఎకరాల్లో సాగు చేశారు. జూన్‌లో సాధారణ వర్షపాతం 74మి.మీ.కుగాను 84మి.మీ. కురియడంతో రైతులు ఎంతో సంతోషించారు. జూలైలో సాధారణ వర్షపాతం 123మి.మీ.కుగాను కేవలం 20మి.మీ. మాత్రమే కురిసింది. ఆగస్టులో 113మి.మీ. కురియాల్సి ఉండగా నేటికీ చినుకు జాడలేదు. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు వలస బాట పట్టారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అట్టడుగు స్థాయికి పడిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది 30శాతం పంట దిగుబడి రాగా, ఈసారి పూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశలన్నీ..డియాసలే! నవాబుపేట : ఆరుతడి పంటలు వేసి ఈసారి అప్పులు తీర్చుకుందామనుకున్నా అన్నదాతకు ఖరీఫ్ కాస్తా షాక్ ఇచ్చింది. పంటలు వేయగానే ఏపుగా పెరగటంతో ఇక పంటలు బాగా పండుతాయనుకున్న తరుణంలో వరుణుడు కాస్తా మెహం చాటేశాడు. దీంతో రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. మండలంలో సుమారు పదివేల హెక్టార్లలో ఆరుతడి పంటలు వేశారు. వీటిలో మొక్కజొన్న 8,447హెక్టార్లు, జొన్న 548హెక్టార్లు, రాగి 34హెక్టార్లు, కంది 653హెక్టార్లలో వేశారు. చాలా చోట్ల మొక్కజొన్న ఎండిపోయింది. పంట బాగా దిగుబడి వస్తే క్వింటాల్‌కు రూ.1,300 ప్రభుత్వ మద్దతు ధర ఉంటే ఎకరాకు 20క్వింటాళ్ల ధాన్యం వచ్చేది. ఈ లెక్కన వర్షాభావం కారణంగా ఈసారి మొక్కజొన్నకు రూ.53కోట్లు, ఇతర పంటలు రూ.ఏడు కోట్ల వరకు నష్టపోయే అవకాÔ¶ ముంది. వరి విషయానికి వస్తే మండలంలో 739 హెక్టార్లలో వేశారు. ఇది కాస్తా నెర్రెలు వారటంతో సగానికిపైగా నష్టపోయే అవకాశం ఏర్పడింది. కష్టాలు తప్పడంలేదు మాగనూర్ : అన్నదాతలకు ఈసారి కష్టాలు తప్పడంలేదు. మాగనూర్ మండలంలో వరి రెండు వేల ఎకరాల్లో, పత్తి 7,215ఎకరాల్లో, ఆముదాలు 5,634ఎకరాల్లో, కందులు 16,556ఎకరాల్లో, పెసర 642ఎకరాల్లో, మినుములు 37ఎకరాల్లో సాగుచేశారు. 25రోజులుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ పంటలన్నీ ఎండుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో ఏకధాటిగా వర్షాలు కురియడంతో చాలా వరకు ఆముదం పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రైతులు ఎకరానికి సుమారు రూ.పదివేల చొప్పున పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో పత్తి పూత, పిందే దశలో; మరికొన్ని గ్రామాల్లో నెల రోజుల మొక్కలు ఉన్నాయి. ఓ మోస్తరుగా పెరిగినా వర్షం కురియకపోవడమేగాక ఎర్రతెగులు సోకింది. దీంతో వారు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి దాపురించింది. పంటంతా ఎండిపోయింది గత నెలలో కురిసిన తొలకరి వర్షాలకు మొక్కజొన్న పంట సాగు చేశాం. ఆ తర్వాత యూరియా వేయడంతో పంట వేపుగా పెరిగింది. అయితే 50రోజుల నుంచి వాన లేకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. – ప్రసాద్, రైతు, ఊర్కొండ విచారణ జరుపుతున్నాం మండలంలో వర్షాభావ పరిస్థితులతో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. – కష్ణకిశోర్, ఏఓ, మిడ్జిల్ -
ఏరువాక సాగారో..
► ఊపందుకున్న ఖరీఫ్ ఇప్పటివరకు 28 లక్షల ఎకరాల్లో పంటల సాగు ► మెదక్ జిల్లాలో అత్యధికంగా 43 శాతం నల్లగొండ జిల్లాలో అత్యల్పంగా 6 శాతమే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు ఊపందుకుంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గత వారంతో పోలిస్తే ఈ వారం రెట్టింపు స్థాయిలో పంటల సాగు నమోదైంది. ఇప్పటివరకు 26 శాతం పంటల సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 28 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి 12.12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైంది. గతేడాది పత్తి సాధారణ విస్తీర్ణం 40.31 లక్షల ఎకరాలు కాగా... ఈసారి 26.28 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఏకంగా 14.03 లక్షల ఎకరాలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటికే సాధారణ సాగు విస్తీర్ణంలో దాదాపు సగం వరకు సాగైంది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌ను సాగు చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చినా... ఇప్పటివరకు కేవలం 4.02 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈసారి సాధారణ సాగు విస్తీర్ణాన్ని 12.39 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు మూడో వంతుకే పరిమితమైంది. సోయా వేయడానికి ఈ నెలాఖరు వరకే అవకాశముంది. ఆ తర్వాత సోయా సాగుకు అనుకూల సమయం కాదు కాబట్టి వచ్చే నెలంతా పత్తినే సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఆహారధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 48 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 11.27 లక్షల ఎకరాల్లో సాగైంది. అందులో పప్పుధాన్యాల సాగు 55 శాతం ఉంది. - సాక్షి, హైదరాబాద్ మెదక్‌లో ఎక్కువ.. నల్లగొండ లో తక్కువ రాష్ట్రంలోనే అధికంగా మెదక్ జిల్లాలో పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో 42.91 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 11.36 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాధారణ సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 4.87 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నల్లగొండ జిల్లాలో మాత్రం అతి తక్కువగా పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 14.50 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 94,952 ఎకరాల్లోనే (6.55%) పంటలు సాగయ్యాయి. ఆదిలాబాద్‌లో 39.59 శాతం, నిజామాబాద్‌లో 36.12 శాతం, రంగారెడ్డిలో 33.84 శాతం, ఖమ్మంలో 24.99 శాతం, వరంగల్‌లో 23.59 శాతం, మహబూబ్‌నగర్‌లో 23.13 శాతం, కరీంనగర్ జిల్లాలో 18.37 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. జోరుగా వర్షాలు తెలంగాణలో గత వారంలో ఐదు శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. ఈ వారంలో వర్షాలు విస్తారంగా కురిశాయి. 25 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 93 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాలో సాధారణంగా జూన్ ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు 66.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఏకంగా 127.5 మి.మీ. నమోదైంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 84 శాతం అధిక వర్షపాతం రికార్డు అయింది. ఆ జిల్లాలో ఇప్పటివరకు సాధారణంగా 118.5 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. 217.5 మి.మీ. కురిసింది. తర్వాత నల్లగొండ జిల్లాలో 85.2 మిల్లీమీటర్లకు గాను 133.1 మిల్లీమీటర్లు (56 శాతం అధికం) కురిసింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదవుతోంది. మిరప, కంది, పెసర విత్తనాలకు కొరత దాదాపు అన్ని విత్తనాలనూ అందుబాటులో ఉంచిన సర్కారు.. మిరప, కంది, పెసర విత్తనాలను మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేదు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌తోపాటు కంది, పెసర అధికంగా సాగు చేయాలని వ్యవసాయశాఖ పిలుపునిచ్చింది. కానీ ఆయా విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. కంది విత్తనాలు 8,100 క్వింటాళ్లు, పెసర 10 వేల క్వింటాళ్లు, మినప 6 వేల క్వింటాళ్లు సరఫరా చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడంతో ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిరప విత్తనాలను ప్రైవేటు కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. అయితే వాటి సరఫరాపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం.. కంపెనీలు పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో కొరత ఏర్పడింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రైతులు బ్లాక్మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. పంటల సాగు విస్తీర్ణం (లక్షల ఎకరాల్లో) జిల్లా సాధారణ ఇప్పటివరకు సాగు సాగు సాగైంది శాతం రంగారెడ్డి 5.43 1.83 33.84 నిజామాబాద్ 8.07 2.91 36.12 మెదక్ 11.36 4.87 42.91 మహబూబ్‌నగర్ 19.19 4.44 23.13 నల్లగొండ 14.50 0.95 6.55 వరంగల్ 12.80 3.02 23.59 ఖమ్మం 9.87 2.46 24.99 కరీంనగర్ 13.03 2.39 18.37 ఆదిలాబాద్ 14.32 5.67 39.59 మొత్తం 108.60 28.57 26.31 -
ఖరీఫ్‌లో సమష్టిగా పనిచేయండి: హరీష్
► అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ప్రాజెక్టుల ఆయకట్టుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ఒక నిర్ధిష్ట లక్ష్యంతో పనిచేస్తేనే రైతులకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాగునీటిపారుదల రంగం పురోగతికి వ్యవసాయ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో, సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి పారుదలపై ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయశాఖల లెక్కలకు పొంత న కుదరడం లేదన్నారు. ఇకపై నివేదికల్లో ఆయకట్టు లెక్కలలో తేడా రావొద్దని సూచించారు. ప్రాజెక్టుల కింద ఆయకట్టు రైతాంగానికి లాభం చేకూర్చడానికి ఇరిగేషన్ అధికారులు ‘బెంచ్ మార్క్’ విధానాన్ని అవలంభించాలని ఆయన ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీటితో 12 నుంచి 15వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టుల కింద 22 లక్షల ఎక రాలకు గాను 15లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియం ప్రాజెక్టుల కింద 3.23 లక్షల ఎకరాల ఆయకట్టుకుగాను 2.8 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోందన్నారు. ఎప్పటికప్పుడు సాగునీటిశాఖపై ఆడిటింగ్ జరగాలని అధికారులను ఆదేశించారు. వాటర్ ఆడిటింగ్ జరగకపోవడంతో సాగునీటిపై పన్ను వసూళ్లు తగ్గుతున్నాయన్నారు. సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని సూచించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని ఉపాధిహామీ పథకం కింద పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. సాగునీటి పంపిణీలో ముందుగా చివరి భూములకు నీరందించే ‘టేల్ టు హెడ్’ విధానాన్ని ప్రతీ జిల్లాలోని ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, కార్యదర్శి వికాస్‌రాజ్, ఈఎన్ సీ మురళీధర్‌రావు, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఓఎస్డీ దేశ్‌పాండే, సీఈలు పాల్గొన్నారు. -
ఈ ఖరీఫ్‌పై కోటి ఆశలు
రెండేళ్ల వరస కరువు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశలు రేకెత్తిస్తూ తొలకరి పలకరించింది. సంప్రదాయానుసారం మృగశిర కార్తె పున్నమి రోజైన సోమవారం ఇష్ట దైవాలకు పూజలు చేసి అన్నదాతలు చేలో సాలు పట్టారు. ఈ ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ఉండబోతున్నదన్న వార్తలు వారిలో ఉత్సాహాన్ని పెంచాయి. గత కొన్నేళ్లుగా రైతులపై ప్రకృతి పగబట్టినట్టు వ్యవహరిస్తోంది. 2013లో ఏదో మేరకు వర్షాలు కురవడం తప్ప అంతకు ముందు మూడేళ్లూ...ఆ తర్వాత రెండేళ్లూ అదునుకు వాన జాడ లేదు. నీటి సదుపాయం ఉన్న పరిమిత ప్రాంతాల్లో పంటల పరిస్థితి కొద్దో గొప్పో బాగున్నదనుకుంటే అకాల వర్షాలు, వడగండ్లు దెబ్బతీశాయి. నిరుడు ఖరీఫ్‌కు ఏపీ, తెలంగాణల్లో నిర్దేశించిన లక్ష్యాలతో పోలిస్తే వాస్తవంగా సాగు జరిగిన విస్తీర్ణం తక్కువ. పర్యవసానంగా పంటల దిగుబడి కూడా అంతంత మాత్రమే. ఇలా ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉన్న రైతన్నలు ఈ ఖరీఫ్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. తమకు ఈసారి అంతా మంచే జరుగుతుందన్న భావనతో ఉన్నారు. ప్రకృతి సృష్టిస్తున్న అవరోధాలెన్నిటినో అనునిత్యం ఎదుర్కొంటున్నా నిబ్బరంగా అడుగులేస్తున్న అన్నదాతలను ప్రభుత్వాల నిర్లక్ష్యం, వాటి అపసవ్య విధానాలు ఎంతో కుంగదీస్తున్నాయి. తొలకరి ముంగిట్లోకొచ్చిన ఈ దశలో కూడా ఇరు రాష్ట్రాల్లోనూ రైతులకు రుణలభ్యత అంతంతమాత్రంగానే ఉందని వార్తలొ స్తున్నాయి. ఈ ఏడాది రైతులకు రూ. 29,101 కోట్ల పంట రుణాలివ్వాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా అందులో ఖరీఫ్ వాటా రూ. 17,640 కోట్లు. కానీ ఇప్పటివరకూ బ్యాంకులిచ్చిన రుణాలు రూ. 1,000 కోట్లకు మించి లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయకపోవడం వల్ల పంట రుణాలివ్వడానికి బ్యాంకులు ముఖం చాటేస్తున్నాయి. ఏపీలో పరిస్థితి ఇంతకన్నా అధ్వాన్నంగా ఉంది. పాత బకాయిలు చెల్లించలేదంటూ కొత్త రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఈసారి వర్షాలు బాగా ఉంటాయని మన వాతావరణ విభాగం అంచనాలిచ్చి రెండు నెలలవుతున్నా తన వంతుగా చేయాల్సిందేమిటోనన్న స్పృహ బాబు సర్కారుకు లేకపోయింది. రెండేళ్ల వరస కరువుతో రైతులు దిక్కుతోచక విలవిల్లాడుతున్నారని తెలిసినా పాత రుణాలపై వడ్డీ మాఫీ, వాటి రీషెడ్యూల్, కొత్త రుణాల మంజూరు వగైరా అంశాలపై బ్యాంకులతో మాట్లాడి ఒప్పించడంలాంటివేవీ చేయలేక పోయింది. వీటి సంగతలా ఉంచి రెండు రాష్ట్రాలకూ కేంద్రం నుంచి రెండు నెలల క్రితమే విపత్తు సాయం అందినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకూ చేరలేదు. ఈసారి ఖరీఫ్‌కు కేంద్రం దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల టన్నుల దిగుబడిని లక్ష్యంగా నిర్దేశించింది. అందులో రెండు రాష్ట్రాల వాటాలూ గణనీయంగానే ఉన్నాయి. అందుకనుగుణంగా ఏపీలో కోటికిపైగా ఎకరాల్లోనూ...తెలంగాణలో 1.12కోట్ల ఎకరాల్లోనూ సాగు చేయాలని ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించు కున్నాయి. అయితే దానికి కొనసాగింపుగా తమ వైపుగా చేయాల్సినవి చాలా ఉన్నాయని ప్రభుత్వాలు గుర్తించాలి. వెనువెంటనే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయడం, బ్యాంకులనుంచి రుణాలిప్పించడం, రుణ మంజూరులో సమస్యలు ఎదురైతే అధికారులు జోక్యం చేసుకుని పరిష్కరించేలా చూడటం అవసరం. ఇప్పటికే అనేకమంది రైతులకు బ్యాంకుల మొండిచేయి చూపడంతో ఎప్పటిలా వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వైపు వెళ్తున్నారు. ఇన్నాళ్ల కరువుతో అన్నివిధాలా నష్టపోయి ఉన్న రైతును ఇది మరింత కుంగదీస్తుంది. రుణాల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషాద వర్తమానం మన కళ్లముందు ఉంది. ఇది పునరావృత్తం కానీయరాదనుకుంటే రైతులందరికీ బ్యాంకులు రుణాలిచ్చేవిధంగా చూడాలి. విత్తనాల సమస్య కూడా రైతులను కుంగదీస్తున్నదే. మేలు రకం విత్తనాలు రైతులకు చేరేలా చర్య తీసుకోవడం ముఖ్యం. వాటి ధరలు అందుబాటులో ఉండేలా చూడటం అత్యవసరం. విత్తనాలకు కొరతేమీ లేదని, ఎలాంటి హడావుడీ పడొద్దని ప్రభుత్వాలు చెప్పడం... తీరా వాటి లభ్యత, నాణ్యత అంతంతమాత్రంగా ఉండటం...ధర ఆకాశాన్నంటడం గత అనుభవం. ఈ విషయంలో అధికార యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ధరల్ని పెంచేస్తున్నాయి. ఆఖరికి భూసారం పెంచడానికి వినియోగించే పచ్చిరొట్ట పైర్ల విత్తనాల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. నాసిరకం ఎరువులపైనా కన్నేయవలసి ఉంది. అవసరమైన భూసార పరీక్షలు జరిపించి ఎరువుల వినియో గానికి సంబంధించి తగిన సలహాలు, సూచనలు అందించాలి. అనవసరంగా లేదా మోతాదుకు మించి ఎరువుల వాడకంవల్ల అనర్ధాలొస్తున్నాయని గుర్తించి... సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకోసం పరంపరాగత్ కృషి వికాస్ యోజన కార్యక్రమం పేరిట నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దీన్ని వినియోగించుకోవాలి. సాగుబడి సమయంలో రైతులను ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు మొదలుకొని విత్తన వ్యాపారులు, ఎరువుల వ్యాపారుల వరకూ అందరి దయాదాక్షిణ్యాలకూ ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి. తీరా దిగుబడి చేతికందే సమయంలో సరైన గిట్టుబాటు ధరలు ప్రకటించక... కనీసం ఆ ధరలైనా వారికి దక్కేలా చూడక దెబ్బతీస్తున్నాయి. రైతుల్ని మార్కెట్లో వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నా చోద్యం చూస్తున్నాయి. ఈ స్థితి మారాలి. చాన్నాళ్ల తర్వాత వచ్చిన ఈ అనుకూల వాతావరణాన్ని ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోగలిగితే మంచి దిగుబడి సాధ్యం కావడంతోపాటు రైతుల ఆర్ధిక పరిస్థితి ఎంతోకొంత మెరుగవుతుంది. వరస నష్టాలను చవిచూస్తున్న రైతన్నకు కాస్తంత ఓదార్పు లభిస్తుంది. ఏపీలోని కోనసీమ ప్రాంతంలో ఇప్పటికే కొన్నిచోట్ల రైతులు మళ్లీ సాగు సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మే 15వ తేదీకల్లా కాల్వల ఆధునికీకరణ పూర్తిచేసి సాగునీరు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోవడం రైతుల ఆగ్రహానికి కారణం. ఇప్పటికైనా పాలకులు చురుగ్గా వ్యవహరించి తమ లోపాల్ని సరిచేసుకోవాలి. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండటం తమ కనీస ధర్మమని గుర్తించాలి. -
కరవు మండలాలు ప్రకటించిన ఏపీ సర్కార్
హైదరాబాద్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కుగానూ 196 మండలాలను కరవు మండలాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికంగా కర్నూలులో 40, అత్యల్పంగా శ్రీకాకుళంలో 10 కరవు మండలాలు ఉన్నాయి. అనంతపురంలో 39, చిత్తూరులో 39, కడప 33, ప్రకాశంలో 21, నెల్లూరులో 14 కరవు మండలాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.