► అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ప్రాజెక్టుల ఆయకట్టుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ఒక నిర్ధిష్ట లక్ష్యంతో పనిచేస్తేనే రైతులకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాగునీటిపారుదల రంగం పురోగతికి వ్యవసాయ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో, సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి పారుదలపై ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయశాఖల లెక్కలకు పొంత న కుదరడం లేదన్నారు. ఇకపై నివేదికల్లో ఆయకట్టు లెక్కలలో తేడా రావొద్దని సూచించారు.
ప్రాజెక్టుల కింద ఆయకట్టు రైతాంగానికి లాభం చేకూర్చడానికి ఇరిగేషన్ అధికారులు ‘బెంచ్ మార్క్’ విధానాన్ని అవలంభించాలని ఆయన ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీటితో 12 నుంచి 15వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టుల కింద 22 లక్షల ఎక రాలకు గాను 15లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియం ప్రాజెక్టుల కింద 3.23 లక్షల ఎకరాల ఆయకట్టుకుగాను 2.8 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోందన్నారు. ఎప్పటికప్పుడు సాగునీటిశాఖపై ఆడిటింగ్ జరగాలని అధికారులను ఆదేశించారు. వాటర్ ఆడిటింగ్ జరగకపోవడంతో సాగునీటిపై పన్ను వసూళ్లు తగ్గుతున్నాయన్నారు.
సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని సూచించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని ఉపాధిహామీ పథకం కింద పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. సాగునీటి పంపిణీలో ముందుగా చివరి భూములకు నీరందించే ‘టేల్ టు హెడ్’ విధానాన్ని ప్రతీ జిల్లాలోని ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, కార్యదర్శి వికాస్‌రాజ్, ఈఎన్ సీ మురళీధర్‌రావు, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఓఎస్డీ దేశ్‌పాండే, సీఈలు పాల్గొన్నారు.