nizamsagar project
-
‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రాంతాలకు మందులు
సాక్షి, కామారెడ్డి: దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణలో మందులు (మెడిసిన్స్) ఆకాశమార్గాన తరలిస్తూ మారుమూల ప్రాంతాలకు చేరువ చేసేలా ‘డ్రోన్ డెలివరీ’ విధానం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఆ డ్రోన్ విధానం ఎంతో ఉపయోగపడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు మందుల సరఫరా సులువుగా మారింది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రారంభమైన మందుల డ్రోన్ డెలివరీ కామారెడ్డి జిల్లాలో కూడా మొదలైంది. తాజాగా సోమవారం ఓ గ్రామానికి డ్రోన్ డెలివరీ విధానంలో మందులు అందించారు. చదవండి: హెచ్‌సీఏ వివాదం.. హైకోర్టులో అజారుద్దీన్‌కు ఊరట జిల్లాలో విస్తారంగా వానలు పడుతుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో పిట్లం మండలంలోని కుర్తి గ్రామానికి వెళ్లే రహదారి నీట మునిగి రాకపోకలు స్తంభించాయి. అయితే గ్రామంలో ఒకరికి అత్యవసరంగా మందులు అవసరం ఉండడంతో అధికారులు డ్రోన్ ద్వారా పంపించారు. డ్రోన్ ద్వారా మందుల రాకను గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. ఈ విధానంపై ప్రశంసలు కురిపించారు. చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! -
కొండపోచమ్మ టు నిజాంసాగర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కొత్త ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అమల్లోకి తెచ్చే కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి సింగూరుకు అటు నుంచి నిజాంసాగర్‌కు నీటిని తరలించే ప్రణాళికలు ఇప్పటికే ఉన్నప్పటికీ, భారీ టన్నెళ్ల నిర్మాణాలతో నీటి తరలింపులో జాప్యం జరుగుతుండటంతో మరో కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చి.. దాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తోంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వా యర్ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వల నుంచి హల్దీవాగు మొదలయ్యే ఖాన్ చెరువుకు లింక్ కెనాల్‌ను తవ్వి నీటి మళ్లింపు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఒకటి కాకుంటే.. ఇంకొక మార్గం కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో చాన్నాళ్లూ సందిగ్ధత ఉన్నా, చివరికి మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించేందుకు మొగ్గుచూపారు. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18.62 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. ప్యాకేజీ–17లోని ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి కాకుండా మల్లన్నసాగర్ నుంచి హల్దీకి, అటు నుంచి సింగూరుకు నీటిని తరలించే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయా లను ఆలోచించిన ప్రభుత్వం కొత్తగా కొండ పోచమ్మ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీకి నీటిని తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంగారెడ్డి కాల్వ 6.25వ కిలోమీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి ఖాన్‌చెరువు మీదుగా హల్దీవాగుకు నీటిని తరలించేందుకు 1.3 కిలోమీటర్ల లింక్ కెనాల్ తవ్వాలని నిర్ణయించారు. ఈ కెనాల్ పనులు ఇప్పటికే చివరి దశలో ఉన్నాయి. మరో పది పదిహేను రోజుల్లోనే ఈ లింక్ కెనాల్ ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ లింక్ కెనాల్ పూర్తయితే కొండపోచమ్మ నుంచి తరలించే నీరు సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీ వాగులో కలిసి... అటునుంచి గ్రావిటీతో మంజీరాలో కలిసి నేరుగా నిజాంసాగర్‌కు చేరుతాయి. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్‌లో 8 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇందులోంచి 1,600 క్యూసెక్కుల నీటిని లింకు కాల్వ ద్వారా నిజాంసాగర్‌కు పంపాలన్నది ప్రస్తుతం లక్ష్యంగా ఉంది. నిజాంసాగర్‌లో ప్రస్తుతం 17.80 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం దీనికింద 2 లక్షల ఎకరాలకు అవసరమైన నీటి విడుదల జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి లభ్యత పెంచేందుకు వీలుగా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించి అటునుంచి నిజాంసాగర్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. -
నిజాంసాగర్‌పై మూడు ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: నిజాంసాగర్ నుంచి జలాలు శ్రీరాంసాగర్‌కు వెళ్లే దారిపై సాగర్ ప్రధాన కాల్వలపై రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో ఒకటి మంజీరా ఎత్తిపోతలను చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలపగా, కొత్తగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల పరధిలో జకోరా, చండూరు ఎత్తిపోతలు చేపట్టేందుకు ప్రతిపాదించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే ప్రణాళికను రూపొందించాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. నిజాం సాగర్, సింగూరు జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీళ్లు అందించేందుకు ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళికను రూపొందించాలని సూచించారు. గుత్ప, అలీ సాగర్ మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు సాగునీరు అందివ్వాలని సూచించారు. దీనికి వెంటనే సర్వే చేసి, లిఫ్టులు ఎక్కడెక్కడ పెట్టాలి.. వాటి ద్వారా ఏయే గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించవచ్చో తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దీనికనుగుణంగా అధికారులు బాన్సు వాడలో నిజాం సాగర్ ప్రధాన కాల్వపై రెండు ఎత్తిపోతలు ప్రతిపాదించి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. జకోరా ఎత్తిపోతలతో రూ.4,200 ఎకరాలు, చండూర్ ఎత్తిపోతలతో 2,850 ఎకరాలకు నీరిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే నిజాంసాగర్ దిగువన మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. నిజాం సాగర్ మండలం మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. -
ప్రాజెక్టు ఏరియాలో పంటల సాగు
సాక్షి, నిజాంసాగర్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాల జాడ లేదు. నీరు లేక చెరువులు, కుంటలు కూడా వెలవెలబోతున్నాయి. దీంతో ముంచుకొస్తున్న కరువును ఎదుర్కొనేందుకు కర్షకులు సన్నద్ధమవుతున్నారు. శిఖం భూమిలోనే అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రత్యామ్నయ పంటల సాగుపై దృష్టి సారించారు. వారం రోజుల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల్లో దున్నకాలు సాగిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పెసర, మినుము పంటలు వేస్తున్నారు. జొన్న కూడా సాగు చేస్తున్నారు. సుమారు 300 ఎకరాల్లో.. నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని నారాయణఖేడ్, కల్హేర్, శంకరంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన వందలాది మంది రైతులు శిఖం భూముల్లో పంటలను సాగు చేస్తున్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాలకు చెందిన రైతులు ప్రాజెక్టులో శనగ, జొన్న పంటలు వేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు శిఖం భూముల్లో హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. అరకలు, ట్రాక్టర్ల ద్వారా భూములను దుక్కి చేసి శనగ, జొన్న విత్తనాలను విత్తుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు 300 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. అయితే భారీ వర్షాలు కురిసి వరదలొస్తే రైతులకు పెట్టుబడులు కూడా తిరిగిరావు. అయినా ఆశతో పంటలు సాగు చేస్తున్నారు. -
జల రాజకీయం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో జల జగడం కొనసాగుతోంది. రైతుల నీటి కష్టాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాయి. కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతు లు పది రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. ఒక్క తడి ఇచ్చినా తమ పంటలు గట్టెక్కుతాయని, నీటి ని ఇవ్వాలని కోరుతూ పలుమార్లు ఎస్సారెస్పీ కా ర్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు మద్దతు గా ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. రైతుల సాగునీటి సమస్యను ఒక అవకాశంగా భావించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. వారం రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అఖిలపక్షంగా ఏర్పడిన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు శుక్రవారం చలో ఎస్సా రెస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కాకతీయ కాలువకు అర టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం నుంచి ఆయకట్టు రైతుల గ్రామాలకు తరలివెళ్లాలని నిర్ణయించాయి. మరోవైపు ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు కూడా రైతుల సమస్యలపై స్పందిస్తున్నారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు మద్దతు తెలిపేందుకు జిల్లాకు వచ్చారు. బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేత్ రాష్ట్ర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇ లా పది రోజులుగా జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నేత ల ఆందోళనలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీల ఆందోళనల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రైతులకు సంబంధించిన అంశం కావడంతో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజె క్టులో నీటి నిల్వ పరిమితంగా ఉన్న నేపథ్యంలో కాకతీయ కాలువకు నీటి విడుదల ప్రస్తుతానికి వీలు పడదని ఆయన ప్రకటించారు. నేతల అరెస్టులు ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళన నేపథ్యంలో జిల్లా లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఎస్సా రెస్పీ పరీవాహక గ్రామాల్లో వందలాదిగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. శనివారం ఎస్సారెస్పీ వెళ్తున్న కాంగ్రెస్ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డిని డిచ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో... కామారెడ్డి జిల్లాలోనూ సాగునీటి సమస్యపై ఆందోళన చేపట్టారు. సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నాట్లు వేసుకున్నారు. సింగూరు నుంచి జిల్లా వాటా కింద రావాల్సిన తొమ్మిది టీఎంసీల నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నిజాంసాగర్‌లో సుమారు రెండున్నర టీఎంసీల నీరుంది. జిల్లా వాటా కింద రావాల్సిన నీటిని విడుదల చేయాలని రైతులు కూడా కోరుతున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఒక అవకాశంగా భావించి ఆందోళన చేపట్టింది. మొత్తం మీద రెండు జిల్లాల పరిధిలో సాగునీటి అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలను కొనసాగించడంతో రాజకీయ వేడి రాజుకున్నట్లవుతోంది. -
మొరాయిస్తున్న ఫ్లడ్ గేట్లు
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టుకు మూడుచోట్ల 48 వరదగేట్లతో పాటు 9 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న హెడ్‌స్లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీరందించేందుకు 11 ఇరిగేషన్ గేట్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వరదగేట్లతో పాటు ఇరిగేషన్ గేట్ల నిర్వహణపై నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇంతవరకు వరదగేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో అవి మొరాయిస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభానికి ముందే వరద గేట్లకు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. కానీ గ్రీసింగ్, ఆయిలింగ్ పనులూ చేయలేదు. గతేడాది వరద గేట్లకు చేపట్టిన గ్రీజింగ్, ఆయిలింగ్ పనులకు సంబందించిన నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం పనులు చేపట్టలేదు. ఎగువ ప్రాంతం నుంచి వరదనీటి తాకిడి అధికం కావడంతో అడ్డుగోడకు పగుళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టు మట్టికట్టపై చెట్లు పెరగడంతో కట్ట బలహీనంగా మారింది. ఆరేళ్ల క్రితం ప్రాజెక్టు కట్టపై ఉన్న సిమెంటు రోడ్డు కుంగిపోయింది. చైన్నంబరు 201 వద్ద అడ్డుగోడ పక్కకు వంగిపోయింది. అయినా అధికారులు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. మూడు రోజుల నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ప్రాజెక్టు కట్టపై ఉన్న ఆరేడ్ డిస్ట్రిబ్యూటరీ తూము కుంగింది. అంతేకాకుండా ప్రాజెక్టు వరద గేట్లు కొన్ని పైకి లేవడం లేదు. మరికొన్ని కిందకు దిగడం లేదు. అనుకోకుండా భారీ వర్షాలు కురిసి వరద ఉధృతి అధికమైతే ప్రాజెక్టు గేట్లను నిర్వహించడం ఇరిగేషన్ సిబ్బందికి కష్టంగా మారనుంది. -
త్వరలో సీఎం నిజాంసాగర్ సందర్శన
నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రెండు రోజుల్లో రానున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద హెలీపాడ్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. చాలా ఏళ్ల తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతుండటంతో మంజీర నది జలకళను తిలకించడానికి సీఎం వస్తున్నారన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని, రాష్ట్రానికి వచ్చిన సీఎం నిజాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరదనీటిని తెలుసుకున్నారన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని సీఎంకు ఫోన్ ద్వారా చెప్పగా, ప్రాజెక్టుకు వస్తానని చెప్పినట్లు మంత్రి పోచారం పేర్కొన్నారు. ప్రాజెక్టు సందర్శన కోసం ముఖ్యమంత్రి వస్తుండటంతో హెలీపాడ్ స్థలాన్ని ఎంపిక చేయాలని ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, పోలీస్‌శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. -
ఖరీఫ్‌లో సమష్టిగా పనిచేయండి: హరీష్
► అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ప్రాజెక్టుల ఆయకట్టుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ఒక నిర్ధిష్ట లక్ష్యంతో పనిచేస్తేనే రైతులకు మేలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాగునీటిపారుదల రంగం పురోగతికి వ్యవసాయ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో, సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీటి పారుదలపై ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయశాఖల లెక్కలకు పొంత న కుదరడం లేదన్నారు. ఇకపై నివేదికల్లో ఆయకట్టు లెక్కలలో తేడా రావొద్దని సూచించారు. ప్రాజెక్టుల కింద ఆయకట్టు రైతాంగానికి లాభం చేకూర్చడానికి ఇరిగేషన్ అధికారులు ‘బెంచ్ మార్క్’ విధానాన్ని అవలంభించాలని ఆయన ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీటితో 12 నుంచి 15వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. భారీ ప్రాజెక్టుల కింద 22 లక్షల ఎక రాలకు గాను 15లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియం ప్రాజెక్టుల కింద 3.23 లక్షల ఎకరాల ఆయకట్టుకుగాను 2.8 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోందన్నారు. ఎప్పటికప్పుడు సాగునీటిశాఖపై ఆడిటింగ్ జరగాలని అధికారులను ఆదేశించారు. వాటర్ ఆడిటింగ్ జరగకపోవడంతో సాగునీటిపై పన్ను వసూళ్లు తగ్గుతున్నాయన్నారు. సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించాలని సూచించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని ఉపాధిహామీ పథకం కింద పనులు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. సాగునీటి పంపిణీలో ముందుగా చివరి భూములకు నీరందించే ‘టేల్ టు హెడ్’ విధానాన్ని ప్రతీ జిల్లాలోని ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, కార్యదర్శి వికాస్‌రాజ్, ఈఎన్ సీ మురళీధర్‌రావు, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఓఎస్డీ దేశ్‌పాండే, సీఈలు పాల్గొన్నారు. -
నిజాంసాగర్ నుంచి నీటి విడుదల
నిజామాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా శుక్రవారం రాత్రి 7 గంటలకు విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ నీటిని విడుదల చేసినట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్సిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) సత్య శీలా రెడ్డి తెలిపారు. (నిజాంసాగర్) -
ఆశలు ఆవిరి
⇒ కలవర పెడుతున్న నిజాంసాగర్ ప్రాజెక్టు ⇒ కనిష్ట మట్టానికి చేరువలో నీటి నిల్వలు ⇒ తాగునీటి అవసరాలకే అధికారుల ప్రాధాన్యం ⇒ ఆరుతడి పంటలకూ సాగునీరు అనుమానమే ⇒ ఆందోళనలో ఆయకట్టుదారులు నిజాసాంగర్: ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీటిని జిల్లా కేంద్రంతో పాటు బోధన్ పట్టణ ప్రజలకు తాగునీరు అందించడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఆయకట్టు రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రబీ పంటకు నీళ్లులేనట్లే! నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో చివరి ఆయకట్టు వరకు 2.4 లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. చివరి ఆయకట్టుకు చెరువులు, కుంటలతోపాటు బోరుబావులు ఆధారంగా ఉన్నాయి. మొదటి ఆయకట్టు ప్రాంతంలోని లక్ష ఎకరాలకు ప్రధాన కాలువే జీవనాధారం. ఖరీఫ్‌లో వరుణుడు కరుణించకపోవడంతో అక్కడ ఉన్న సుమారు 15వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. ప్రధాన కాలువను నమ్ముకుని బీర్కూర్, వర్ని, కోటగిరి, ఎడపల్లి, బోధన్ తదితర మండలాలలోని రైతులు సుమారు 80 వేల ఎకరాలలో వరి సాగు చేశారు. వీటికి అధికారులు ప్రాజెక్టు నుంచి నాలుగు విడతలలో 4.1 టీఎంసీల నీటిని ప్రధాన కాలువ ద్వారా అందించారు. ఫలితంగా అక్కడ పంటలు సాగు చేసిన రైతులు గట్టెక్కారు. మొదటి ఆయకట్టు పరిధిలోని నిజాంసాగర్, సుల్తాన్‌నగర్, గున్కుల్, మహమ్మద్‌నగర్, బూర్గుల్, తుంకిపల్లి, కోమలంచ, గాలిపూర్, ముగ్దుంపూర్, కొత్తాబాది, తిర్మాలాపూర్, తాడ్కోల్, బుడ్మి, బాన్సువాడ ప్రాంతాలలో వందల ఎకరాలు బీళ్లుగా మారాయి. ఆయా ప్రాంతాల రైతులు రబీలో మొక్క జొన్న, జొన్న, పెసర, మినుము తదితర ఆరుతడి పంటలను వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. వీటికి ప్రస్తుతం సాగు నీరు అత్యవసరంగా మారింది. నీటి తడులు లేక పంటలు వాడిపోతుండటంతో రైతులు కలవరపడుతున్నారు. తాగునీటికే ప్రాధాన్యం నిజాంసాగర్ ప్రాజెక్టులో రోజు రోజుకూ జలాలు అడుగంటుతున్నాయి. అవిరి రూపంతోపాటు వ్యవసాయ పంపుసెట్ల ఎత్తిపోతలతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. రోజుకు 75 నుంచి వంద క్యూసెక్కుల మేర నీరు తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు, 17 .8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,381 అడుగులతో 1.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీటిని జిల్లా ప్రజల తాగునీటి కోసం ఉపయోగించడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. రబీ సీజన్లో ప్రధాన కాలువకు ఎట్టిపరిస్థితులలోనూ నీటిని వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు. బెల్లాల్, అలీసాగర్ నుంచి పట్టణాలకు తాగునీరు జిల్లా కేంద్రంతోపాటు బోధన్ పట్టణ ప్రజలకు వేసవిలో తాగునీటి కొరత రాకుండా నీటి నిల్వలున్నాయి. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్, బోధన్ మండలంలోని బెల్లాల్ చెరువులో పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయి. అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా జిల్లా కేంద్రానికి రోజుకు 1.25 ఎంసీఎఫ్‌టీల నీటిని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నారు. బెల్లాల్ చెరువు ద్వారా రోజు 1.5 ఎంసీఎఫ్‌టీల నీటిని బోధన్ పట్టణానికి తాగునీరందిస్తున్నారు. అలీసాగర్, బెల్లాల్ చెరువులో నీటినిల్వలున్నందున మార్చి నెలాఖరు వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రధాన కాలువ మొద టి ఆయకట్టు కింద పంటలను సాగు చేసే రైతులకు ఇక బోరుబావులు, చెరువులు, కుంటలే శరణ్యంగా మారనున్నాయి. -
పట్టాలి అరక.. దున్నాలి మెరక
వానలు లేవు. ఎండలు మండుతున్నయి. పంటలు మాడిపోయినయి. కరువు తరుముకొస్తోంది. తీరని దుఃఖంతో కొందరు రైతులు ఎండిన పంటలకు నిప్పు పెట్టిండ్రు. ధైర్యం సడలని మరి కొందరు రైతులు నిజాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో ‘నాగేటి సాల్లల్లో నా తెలంగాణ.. నా తెలంగాణ’ అంటూ పంటల సాగుకు సమాయత్తమవుతుండ్రు. మనసుంటే మార్గం లేదని నిరూపిస్తుండ్రు. ఆశల వేటను ఆనందంగా సాగిస్తుండ్రు. సింగూరుతో ప్రమాదముందని తెలిసినా వారు ముందుకే ‘సాగు’తుండ్రు. - నిజాంసాగర్ క్యాచ్మెంట్ ఏరియా * శిఖం భూములలో నాగేటి సాళ్లు * దుక్కులు దున్నుతున్న రైతన్నలు * శనగ, మొక్కజొన్న విత్తుతున్నరు * ఊరును విడిచి, పట్టాభూములు వదిలి * ఆశల సాగుకు అన్నదాత అడుగులు నిజాంసాగర్: ఉన్న ఊరు.. పట్టా భూములను వదిలి శిఖం భూములలో అన్నదాతలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. వానలు ఆశిం చిన మేరకు కురవకపోవడంతో.. నీళ్లులేక నల్ల రేగడి మట్టి తేలిన నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖం భూములలో ఆరుతడి పంటలను వే స్తున్నారు. వారం రోజుల నుంచి ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల లో నాగటి సాల్లు జోరందుకున్నాయి. అరక చేతపట్టిన రైతన్నలు శిఖం భూముల్లో శనగ, జొన్న విత్తనాలు చల్లుతున్నారు. మంజీరా నదిపై ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు ప్ర స్తుతం నీళ్లులేక బోసి పోయి ఉన్నా, పచ్చని పంటల సాగుకు నిలయం కానుంది. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన రైతులు ఇక్కడ శనగ, జొన్న పంటలను సాగు చేస్తున్నారు. వేల ఎకరాలలో నీటి నిల్వ సామర్థ్యంతో విస్తరించిన ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా అపరాల సాగుకు దోహదపడుతోంది. ఖరీఫ్ సీజన్లో వానలు కురవక పోవడంతో ఖరీఫ్ పంటలను నష్టపోయిన రైతులు రబీ పంటల సాగుకు సన్నద్ధమయ్యారు. ఉపాధి కోసం అన్వేషిస్తున్న రైతులు పట్టాభూములలో పంటలు వేయలేక శిఖం భూములను ఆశ్రయించారు. మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, కల్హేర్, శంకరంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన వందలాది మంది రైతులు శిఖం భూములలో పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాలకు చెందిన రైతులు ప్రాజెక్టులో శనగ, జొన్న పంటల సాగుకు సమాయత్తమయ్యారు. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు శిఖం భూములలో హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. నాగళ్లు, ట్రాక్టర్ల ద్వారా భూములను దుక్కి చేసి శనగ, జొన్న విత్తనాలను విత్తుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలోని సుమా రు 300 ఎకరాలలో పంటలను సాగు చేస్తున్నారు. సింగూరు నీరొస్తే మునిగినట్టే... నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో శిఖం భూములలో రైతులు పండిస్తున్న శనగ, జొన్న పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రమాదం కూడా పొంచి ఉంది.సాగర్ ఆయకట్టు కింద పండిస్తున్న పంటల కోసం, ఒక వేళ సింగూరు ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్‌కు నీటి విడుదల చేస్తే శిఖం భూములు మునిగిపోతాయి. రైతన్నలు ఆశతో సాగు చేస్తున్న పంటలు సైతం నీటి పాలవుతాయి. అయినా కుటుం బపోషణ కోసం ధైర్యం చేసి వేల రూపాయలు ఖర్చు చేస్తూ పంటలను సాగు చేస్తున్నారు. కరువును జయించేందుకు కర్షకులు పడరాని పాట్లు పడుతున్నారు. -
నిరాశాజనకంగా నిజాం‘సాగర్’
నిజాంసాగర్ : ఈ ఏడాది వరణుడు కరుణించకపోవడంతో జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశజనకంగా ఉంది. వానకాలం దాటిపోతున్నా వర్షాల జాడలేక ప్రాజెక్టులోకి చుక్కనీరు చేరలేదు. ప్రతిఏటా ఆగస్టు రెండోవారానికి కొత్తనీటితో కళకళలాడే ప్రాజెక్టు ఈసారి వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు కురవక పోవడంతో వరద రాలేదు. ప్రాజెక్టును నమ్ముకొని ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారంది. చివరి ఆయకట్టు వరకు సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను పండిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారుల అంచనా. ప్రధాన కాలువపై ఆధారపడకుండా వ్యవసాయ బోరుబావులతో చాలామంది రైతులు వరి వేశారు. ప్రధాన కాలువను నమ్ముకుని పంటలు సాగు చేసే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. పంట చేతికి వచ్చే దాకా నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. నేటి నుంచి ప్రధాన కాలువకు నీరు జిల్లా ప్రజల గొంతు తడపడానికి సోమవారం నుంచి ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ పట్టణ ప్రాంతాల ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎత్తిపోతలతో పాటు అలీసాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి నీటివిడుదల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ప్రాజెక్టులో 1392.20 అడుగులతో 5.090 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అందులో నుంచి జిల్లా ప్రజల దాహార్తి కోసం 0.2 టీఎంసీల నీటి విడుదల కోసం అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. బాన్సువాడ, బోధన్ , నిజామాబాద్‌ల కోసం ప్రధాన కాలువకు నీటిని అందించడానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నీటిపారుదలశాఖ అధికారుల సమీక్షలో సుముఖత తెలిపినట్లు తెలిసింది. -
రొయ్యల పెంపకంపై లొల్లి
నిజాంసాగర్: వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్యల పెంపకం చేపట్టవద్దని మత్య్సకార్మికుల ఆందోళ నకు దిగారు. చేపపిల్లలను పెంచాలని కొందరు, రొయ్యలను పెంచాలని మరికొందరు కార్మికులు ఒకరినొకరు దూషించుకున్నారు. మంగళవారం మండలంలోని అచ్చంపేట చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రం వద్ద స్థానిక మత్య్సకార్మిక సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా మత్స్యశాఖ ఏడీ, సంఘం అధ్యక్షుడు బాలక్రిష్ణ అధ్యక్షత వహించారు. సమావేశ ముఖ్య ఉద్దేశాన్ని ఏడీ కార్మికులకు వివరించారు. అంతలోనే కొం దరు కార్మికులు నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్యల పెంపకాన్ని నిషేధించాలంటూ నినాదాలు చేశారు. ప్రాజెక్టులో చేప పిల్లల పెంపకం నాలుగేళ్ల నుంచి చేపట్టకపోవడంతో దళారులు రొయ్యల పెంపకానికి అలవాటుపడ్డారన్నారు. చేప పిల్లలను నాశనం చేస్తున్న రొయ్యల పెంపకాన్ని నిషేధించాలని సమావేశంలో నినాదాలు చేశారు. మరికొందరు కార్మికులు చేప పిల్లలతో పాటు రొయ్యల పెంపకాన్ని చేపట్టాలని డిమాం డ్ చేయడంతో సమావేశంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కార్మికులు ఒకరిని ఒకరు తోసుకుంటూ వేదిక వద్దకు వచ్చి మత్య్సశాఖ అధికారులను నిల దీశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత నెలకొనడంతో అధికారులు జోక్యం చేసుకున్నారు. కార్మికుల నిర్ణయం మేరకు ప్రాజెక్టులో చేపపిల్లలను పెంచుతామన్నారు. ప్రైవేట్ వ్యాపారులు కాకుండా ప్రభుత్వ పరంగా రొ య్యల పెంపకానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నాలుగేళ్ల నుంచి చేప పిల్లల పెంపకం లేకపోవడంతో ఉపాధి కోల్పోయామని, తమను ఆదుకోవాలని అధికారులతో కార్మికులు మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో స్థానిక మత్స్యశాఖ అధికారులు రాములు, రూపేందర్, రాజేంద్రప్రసాద్, స్థానిక మత్య్సకార్మిక సంఘం నాయకుడు రాములు పాల్గొన్నారు. -
‘సాగర్ ’కు జీవం పోసిన రాజన్న
ఆ‘పాత’ మధురం న్యూస్‌లైన్, బాన్సువాడ, నిజాంకాలంలో నిర్మించిన జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టును పాలకులు పూర్తిగా విస్మరించారు. ప్రధాన కాలువ అస్తవ్యస్తంగా మారి, పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి ఆయకట్టుకు రెండు తడులు కూడా అందని పరిస్థితి. 2004లో ముఖ్యమంత్రిగా వచ్చిన రైతుబాంధవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. పల్లెబాటలో భాగంగా 2005లో సాగర్‌ను సందర్శించారు. ప్రధాన కాలువల ఆధునికీకరణకు 549 కోట్లను కేటాయించారు. ఈ పనులకు శంకుస్థాపన వేసేందుకు 2008లో రాజన్న నిజాంసాగర్ వచ్చారు. అప్పుడు ఆయన వెంట షబ్బీర్‌అలీ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్‌రెడ్డి, సౌదాగర్ గంగారాం, కేఆర్ సురేష్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్.వెంకట్రాంరెడ్డి, డి.రాజేశ్వర్, జనార్దన్‌గౌడ్, నేరేళ్ల ఆంజనేయులు ఉన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కలిసి ఉన్న వీరిలో ఇప్పుడు చాలామంది వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. -
‘సాగర్’లో తగ్గుతున్న నీటిమట్టం
నిజాంసాగర్, న్యూస్‌లైన్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వదులుతున్న నీటిపై అధికారులు కాకి లెక్కలు వేస్తున్నారు. ఖరీఫ్ పూర్తవడంతో ఆయకట్టు కింద రబీ పంటల సాగు కోసం రైతులు ముందస్తుగా సమాయత్తమయ్యారు. రబీ పంటలకు నాల్గు విడతల్లో 9 టీఎంసీల నీటిని అంది స్తామని ప్రకటించిన అధికారులు మొదటి విడతలోనే మూడు టీఎంసీల మేరనీటిని వదిలారు. ఇంకా ప్రధాన కాలువకు నీటి విడుదల జరుగుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. అయినా ఆయకట్టు కింద పంటల సాగు 60 శాతం పూర్తవలేదు. మొదటి ఆయకట్టు కింద పంటల సాగు కోసం రైతులు నారుమళ్లు వేసుకొని సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. డీఐబీ సమావేశంలో నాల్గు విడతలకు తీర్మానం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయ కట్టుకు నీటివిడుదల కోసం జిల్లా కేంద్రంలో రెండు నెలల క్రితం డీఐబీ (నీటిపారుదల శాఖ సలహా మండలి) సమావేశం నిర్వహించారు. చివరి ఆయకట్టు వరకు రబీ సీజన్లో పం టల సాగుకు అవసరం ఉన్న నీటి నిల్వలు జలాశయాలు, ఎత్తిపోతల పథకాల్లో పూర్తిస్థాయిలో ఉన్నా యి. దీంతో పంటల సాగు అవసరం ఉన్న నీటి తడులపైన జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయకట్టు కింద సమారు 2.10 లక్షల ఎకారల్లో పంటలను సాగు చేయనున్నట్లు వారు అంచనా వేశారు. అలీసాగర్ రిజర్వాయర్ ప్రాంతం వరకు ఉన్న సుమారు 1.38 లక్షల ఎకరాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుం చి నాల్గు విడతల్లో 9 నుంచి 10 టీఎంసీల నీటి విడుదల కోసం వారు ప్ర తిపాదించారు. ఆయకట్టు కింద వరి, ఆరుతడి పంటల సాగు కోసం ప్రతి పాదించి అందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఆరుతడి కోసం ప్రారంభించి.. ఆరుతడి పంటల కోసం ప్రాజెక్టు నుంచి డిసెంబర్ 21న ప్రధాన కాలువకు నీటివిడుదల చేపట్టారు. డిస్ట్రిబ్యూటరీ 28, 30 ప్రాంతాల్లో రైతులు పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారని నీటిని వదిలారు. అప్పటి నుంచి నిర్విరామంగా నీటివిడుదల కొనసాగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమక్రమంగా తగ్గు తున్నా, ఆయకట్టు కింద పంటల సాగు 60 శాతం కూడా పూర్తికాలేనట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 15 రోజుల పాటు ఆయకట్టుకు 1.5 నుంచి 2 టీఎంసీలు, రెండో విడతలో 15 రోజుల పాటు 1.5 నుంచి 2 టీఎంసీ లు, మూడో విడతలో 20 నుంచి 25 రోజుల పాటు 2 నుంచి 3 టీఎంసీలు, నాల్గో విడతలో 20 నుంచి 25 రోజుల పాటు 2 నుంచి 3 టీఎంసీల నీ టి విడుదలకు ప్రతిపాదించారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటల ను గట్టెక్కించడానికి అవసరం ఉన్న నీటి నిల్వలు ప్రాజెక్టులో పుష్కలంగా ఉన్నాయి. కాని ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు వదులుతున్న నీరు వృథా కాకుండా పంటలకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసు కోకపోవడంతో నీరు వృథా అవుతున్నట్లు తెలుస్తోంది. తగ్గుతున్న నీటిమట్టం ఆయకట్టుకింద సాగు చేస్తున్న పంటల కోసం ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్ర మక్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1402.5 అడుగులతో 14.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
నవాబ్ కృషి ఫలితమే నిజాంసాగర్
నిజాంసాగర్, న్యూస్‌లై న్: నిజాం పాలనలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు వ ంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం.. నాటి చీఫ్ ఇంజి నీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కృషి ఫలితమేనని భారీ నీటిపారుదల మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి కొనియాడారు. సోమవారం ఆయన ప్రాజెక్టు గుల్దస్తా వద్ద బహదూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటికి అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా ప్రధాన కాలువ లైనింగ్ పనులు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్న ఈ ప్రాజెక్టుతోపాటు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాం తంలో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించిన బహదూర్ విగ్రహ ఏర్పాటుకు తాను కృషి చేయగా, ఇంజినీర్ కుటుంబ సభ్యులు సానుకూలం గా స్పందించారని పేర్కొన్నారు. గుల్దస్తా వద్ద గార్డెన్‌ను అభివృద్ధి చేస్తే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గార్డెన్‌గా నామకరణం చేస్తామన్నారు. అం దుకు కృషిచేయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యానాథ్దాస్కు సూచించారు. అతిథి గృహంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చే యాల న్నారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, గేట్ల పెయిం టింగ్ పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి పను లు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో రూ. 4 వేల కోట్ల పంటలు పండుతున్నాయి జిల్లాలోని ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 4 వేల కోట్ల విలువగల పంటలను రైతులు పండిస్తున్నారని మం త్రి అన్నారు. సింగూరు జలాశయం ద్వారా వాటా ప్రకారంగా నిజాం సాగర్ కు నీటిని తెస్తామన్నారు. పోచారం ప్రాజెక్టు వల్ల నిజాంసాగర్ నిండిందన్నా రు. దిగువన ఉన్న సింగితం రిజర్వాయర్, కళ్యాణి ప్రాజెక్టుల వల్ల నిజాంసాగర్ ఆయకట్టు పంటలకు ఖరీఫ్‌లో సాగునీరందిందన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జిల్లా ప్రజానీకానికే కుటుం బ పెద్దలా నిలిచిపోయారన్నారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానం లో ఉన్నఇందూరుకు సాగునీటి కేటాయింపులో సీమాంధ్ర పాలకులు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లాలో నిర్మించిన సింగూరు ప్రాజెక్టుతో నిజాంసాగర్‌కు నీళ్లురాని పరిస్థితులు దాపురించాయన్నారు. నాగార్జునసాగర్ జలాలను హైద రాబాద్‌కు తరలించి, సింగూరు జలాలను పూర్తిగా నిజాం సాగర్‌కు కేటాయించాలని కోరారు. సింగూ రు నీటి కోసం జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డితో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు పటిష్టంగా జరిగితే చివరి ఆయకట్టుకు మేలు జరుగుతుందన్నారు. హర్షణీయం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ 1923-31 సంవ త్సరాల కాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టును కట్టిన అప్పటి చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహాన్ని అవిష్కరించడం హర్షణీయమన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ హన్మంత్ సింధే తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, నాయకులు ఆకుల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ పట్వారి గంగాధర్, మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, సర్పంచులు మణేమ్మ, రాజు తదిరతరులు పాల్గొన్నారు. బహదూర్ మనుమళ్లు, మనుమరాళ్లు మీర్ అహ్మద్ అలీ,అక్మర్ అలీ,అఫీజ్ అ లీ, ఉన్నత్ ఉన్నీ సా బేగం హాజరయ్యారు. అం త కు ముందు బహదూర్ విగ్రహావిష్కరణ ఆడంబరంగా జరిగింది. -
‘సాగర్’ ఆధునికీకరణ పెండింగ్
నిజాంసాగర్, న్యూస్‌లైన్: జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. రబీ సాగు కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల కొనసాగుతుండటంతో పనులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు నీటి విడుదల కొనసాగుతుంది. అప్పటి వరకు ఆధునికీరణ అటకెక్కినట్టే. నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మతులను పాలకులు పట్టించుకోలేదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రధాన కాలువ ఆధునికీకరణ కోసం రూ. 549.5 కోట్ల నిధులు మంజూరు చేసి, పనులకు శంకు స్థా పన చేశారు. 15 ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. ఐదేళ్లు కావస్తున్నా అవి నత్తనడకనే సాగుతున్నాయి. సిమెంట్ లైనింగ్‌కు నోచుకోని ప్రధాన కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తున్న ప్రధాన కాలువ ఇంకా పూర్తిస్థాయిలో సిమెంట్ లైనింగ్ పనులకు నోచుకోలేదు. నిధులు ఉన్నా ప్రయోజనం లేకుండా పో తోంది. 13 ప్యాకేజీలలో పనులు చేపట్టినా, కేవలం ఆరు ప్యాకేజీలలో మాత్రమే 10 కిలోమీటర్ల మేరకు సిమెంట్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. 3, 4, 5, 7, 8 ప్యాకేజీలలో పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన కాలువకు మొదటి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ఒకటిరెండు ప్యాకేజీలు కట్ట బ లోపేతం పనులకు పరిమితమయ్యాయి. ఈ రెండు ప్యాకేజీలలో సిమెంట్ లైనింగ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు నిండటం, ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పంటలు పండించడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఐదేళ్లు గడిచినా 60 శాతానికి మించలేదు. నీటి విడుదలతో పది రోజుల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆధునికీకరణ పనులకు ఆటంకం కలుగుతోంది. పలు ప్యాకేజీల లో సిమెంటు లైనింగ్ పనులను రెండు నెలల కిందట ప్రారంభించారు. రెండు నెలల కాలంలో రూ. 15 కోట్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. మరోవైపు ప్రధాన కాలువ కట్టకు చేపట్టిన మట్టి పనులకు ముప్పు వాటిల్లుతోంది. ఇంత జరిగినా అధికారులు మాత్రం స్పందించడం లేదు. -
విషాదయాత్ర
నిజాంసాగర్ /బోధన్ టౌన్, న్యూస్‌లైన్: సరదాగా నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన శనివారం చోటుచేసుకుంది. బోధన్ పట్టణానికి చెందిన అల్తాఫ్ హైమద్, మహమ్మద్ అబ్దుల్ బారి, నిసాక్, ఉమర్, వాహబ్ స్నేహితులు. బక్రీద్ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇళ్లకు వచ్చిన వీరు నిజాంసాగర్ ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చారు. ప్రాజెక్టు 12 గేట్ల కింది భాగంలో ఉన్న నీటి మడుగు వద్ద విందు చేసుకున్నారు.అనంతరం స్నా నం చేసేందుకు మడుగులోకి దిగిన అల్తాఫ్ హైమద్, మహమ్మద్ అబ్దుల్ బారి నీటిలో మునిగి పోయారు. స్నేహితులు ఇద్దరు కళ్లముందే నీట మునుగుతుండగా మిగతా వారు రక్షించాలంటూ కేకలు వేశారు. చుట్టుపక్కల ఉన్న పర్యాటకులు మడుగు వద్దకు వచ్చేలోగా ఇద్దరు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ప్రొబెషనరీ ఎస్సై ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీయించారు. మృత్యువులోనూ వీడని స్నేహం.. మృతులు సయ్యద్ అల్తాఫ్ హైమద్, అబ్దుల్ బారీలు చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. మృత్యువులోను వీడకుండా ఉన్నారు. ఇద్దరు స్థానిక విజయసాయి కళా శాలలో ఇంటర్ చదివారు. బీటెక్ స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తిచేశారు. బక్రీద్ పండుగ కోసం ఒకరు హైదరాబాద్ నుంచి మరొకరు దుబాయి నుంచి వచ్చా రు. మిత్రులతో విహారయాత్రకు వెళ్లి మృత్యు ఒడిలోకి చేరడం ఆనందరినీ కంటతడి పెట్టించింది. శక్కర్‌నగర్‌లో విషాదఛాయలు బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీకి చెందిన సయ్యద్ అబ్దుల్ రజాక్, వసీమాబేగంల నాలుగో సంతానం సయ్యద్ అల్తాఫ్ హైమద్ (22) స్థానిక ఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో బీటేక్ పూర్తి చే సి ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. బక్రీద్ సెలవులకు వచ్చిన అల్తాఫ్ మిత్రులతో నిజాంసాగర్‌కు వెళ్లి నీటిలో పడి మృతిచెందడం, తల్లిదండ్రులు హజ్‌యాత్రలో ఉండడం అందరిని కలిచి వేసింది. ఇంటి వద్ద గల అన్నదమ్ములు కన్నీరు మున్నీరవుతున్నారు. దుబాయ్ నుంచి వచ్చి .. అబ్దుల్‌బారీ మృతి వార్త విని కుటంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ చౌరస్తాలోగల అబ్దుల్‌బారీ ఇంటి వద్ద విషాదఛాయ లు అలుముకున్నాయి.బారీ మరణవార్త తెలిసిన బం ధువులు, మిత్రులు ఇంటి వద్దకు చేరుకుని కుటుంబీ లకును ఓదార్చారుు. అబ్దుల్ బారీ(23) స్థానిక ఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో బీటేక్ పూర్తిచేసి దుబాయిలో సాప్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బక్రీద్ పండు గ కు బోధన్‌కు వచ్చాడని బంధువులు తెలిపారు. మృతు డికి ఇద్దరు చెల్లెలు, ఇద్దరు అన్నలు ఉన్నారు.