‘సాగర్’ ఆధునికీకరణ పెండింగ్ | 'Sagar' modernization pending | Sakshi
Sakshi News home page

‘సాగర్’ ఆధునికీకరణ పెండింగ్

Published Mon, Dec 30 2013 7:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

'Sagar' modernization pending

నిజాంసాగర్, న్యూస్‌లైన్: జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. రబీ సాగు కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి  విడుదల కొనసాగుతుండటంతో పనులు నిలిచిపోయాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు నీటి విడుదల కొనసాగుతుంది. అప్పటి వరకు ఆధునికీరణ అటకెక్కినట్టే. నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మతులను పాలకులు పట్టించుకోలేదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రధాన కాలువ ఆధునికీకరణ కోసం రూ. 549.5 కోట్ల నిధులు మంజూరు చేసి, పనులకు శంకు స్థా పన చేశారు. 15 ప్యాకేజీలుగా విభజించి పనులు ప్రారంభించారు. ఐదేళ్లు కావస్తున్నా అవి నత్తనడకనే సాగుతున్నాయి.
 
 సిమెంట్ లైనింగ్‌కు నోచుకోని ప్రధాన కాలువ
 చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తున్న ప్రధాన కాలువ ఇంకా పూర్తిస్థాయిలో సిమెంట్ లైనింగ్ పనులకు నోచుకోలేదు. నిధులు ఉన్నా ప్రయోజనం లేకుండా పో తోంది. 13 ప్యాకేజీలలో పనులు చేపట్టినా, కేవలం ఆరు ప్యాకేజీలలో మాత్రమే 10 కిలోమీటర్ల మేరకు సిమెంట్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ. 30 కోట్లు ఖర్చు చేశారు. 3, 4, 5, 7, 8 ప్యాకేజీలలో పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన కాలువకు మొదటి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న ఒకటిరెండు ప్యాకేజీలు కట్ట బ లోపేతం పనులకు పరిమితమయ్యాయి. ఈ రెండు ప్యాకేజీలలో సిమెంట్ లైనింగ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు నిండటం, ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులు పంటలు పండించడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఐదేళ్లు గడిచినా 60 శాతానికి మించలేదు.
 
 నీటి విడుదలతో
 పది రోజుల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆధునికీకరణ పనులకు ఆటంకం కలుగుతోంది. పలు ప్యాకేజీల లో సిమెంటు లైనింగ్ పనులను రెండు నెలల కిందట ప్రారంభించారు. రెండు నెలల కాలంలో రూ. 15 కోట్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. మరోవైపు ప్రధాన కాలువ కట్టకు చేపట్టిన మట్టి పనులకు ముప్పు వాటిల్లుతోంది. ఇంత జరిగినా అధికారులు మాత్రం స్పందించడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement