సాక్షి, నిజాంసాగర్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా సరైన వర్షాల జాడ లేదు. నీరు లేక చెరువులు, కుంటలు కూడా వెలవెలబోతున్నాయి. దీంతో ముంచుకొస్తున్న కరువును ఎదుర్కొనేందుకు కర్షకులు సన్నద్ధమవుతున్నారు. శిఖం భూమిలోనే అదృష్టాన్ని వెతుక్కుంటూ ప్రత్యామ్నయ పంటల సాగుపై దృష్టి సారించారు. వారం రోజుల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాల్లో దున్నకాలు సాగిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పెసర, మినుము పంటలు వేస్తున్నారు. జొన్న కూడా సాగు చేస్తున్నారు.
సుమారు 300 ఎకరాల్లో..
నిజాంసాగర్ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరియాలో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని నారాయణఖేడ్, కల్హేర్, శంకరంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన వందలాది మంది రైతులు శిఖం భూముల్లో పంటలను సాగు చేస్తున్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాలకు చెందిన రైతులు ప్రాజెక్టులో శనగ, జొన్న పంటలు వేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు శిఖం భూముల్లో హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. అరకలు, ట్రాక్టర్ల ద్వారా భూములను దుక్కి చేసి శనగ, జొన్న విత్తనాలను విత్తుకుంటున్నారు. ప్రాజెక్టు పరిధిలో సుమారు 300 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. అయితే భారీ వర్షాలు కురిసి వరదలొస్తే రైతులకు పెట్టుబడులు కూడా తిరిగిరావు. అయినా ఆశతో పంటలు సాగు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment