
నాణ్యమైన విత్తనాలు అభివృద్ధి చేస్తున్న వ్యవసాయ వర్సిటీ
వాటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాగు చేయించనున్న సర్కారు
తొలి విడతలో 2.5 లక్షల ఎకరాల్లో ఈ వరి సాగుకు నిర్ణయం
నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగవుతున్న వరికి ఉన్న డిమాండ్‌ను వాణిజ్య పరంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ భూముల్లో పండే వరి ధాన్యానికి విదేశాల్లో ఆదరణ ఉండడంతో ప్రభుత్వమే మరింత నాణ్యమైన వరి పండించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. పిలిప్పీన్స్‌తో ఇప్పటికే బియ్యం ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలకు కూడా బియ్యం ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం ఆయా దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపింది.
వియత్నాం మన బియ్యం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే తమకు నాణ్యమైన, ప్రమాదకర రసాయనాలు వాడకుండా పండించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పంపాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎంపికచేసిన ప్రాంతాల్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి ఎక్స్‌పోర్టు క్వాలిటీతో బియ్యం ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.
పిలిప్పీన్స్‌కు పంపింన ఐఆర్–64, ఎంటీయూ 1010 రకాలతో పాటు ఆ దేశ ప్రజలు ఇష్టపడే రీతిలో ఎంపిక చేసిన బియ్యాన్ని ప్రత్యేకంగా పండించి ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోనుంది. సోమవారం కాకినాడలో పిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేసే కార్యక్రమానికి హాజరైన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య.. మంత్రి ఉత్తమ్, విదేశీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఆసక్తి చూపిన వియత్నాం
మనదేశంలో తెలంగాణలో పండించిన ధాన్యం నాణ్యత మిగతా రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉంది. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులు, సారవంతమైన భూమి, మట్టిలో ఉన్న పోషకాలు వెరసి నాణ్యమైన ధాన్యం పండుతోందని వియత్నాం ప్రతినిధులు తేల్చారు. పిలిప్పీన్స్‌కు పంపుతున్న బియ్యం నాణ్యతలో నంబర్ వన్‌గా ఉంది.
వియత్నాం మ రింత నాణ్యమైన బియ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ సహకారంతో లక్ష హెక్టార్లలో (2.5 లక్షల ఎకరాలు) నాణ్యమైన వరిని పండించి, ఆ బియ్యాన్ని వియత్నాంతో పాటు ఇండోనేషియా తదితర దేశాలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దక్షిణ తెలంగాణ, నిజామాబాద్‌లో సాగు..
వ్యవసాయ విశ్వ విద్యాలయం ఇచ్చే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రభుత్వం రైతుల చేత సాగుచేయించనుంది. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతోపాటు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్ జిల్లాలో కలిపి ఖరీఫ్‌లో 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నీటి వనరులున్న సారవంతమైన భూమి ఉన్న గ్రామాలను ఎంపిక చేసి, ఆ గ్రామాల్లోని రైతుల ద్వారా వరిని పండించి ధాన్యాన్ని సేకరించాలని భావిస్తున్నారు.
ఇందుకోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వియత్నాం, ఇండోనేషియా ప్రజలు ఇష్టపడే నాణ్యత గల వరి వంగడాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వియత్నాంకు అవసరమైన బియ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని వియత్నాంకు చెందిన బియ్యం డీలర్ వివేక్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ వరికి విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎగుమతి అవకాశాలను సది్వనియోగం చేసుకోనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.