
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిల్మ్నగర్, టోలీచౌకీ, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్లాపూర్, హఫీజ్పేట్, సరూర్నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, బండ్లగూడ, మణికొండ, కొండాపూర్, షేక్‌పేటలో వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది.
నగరంలో రోడ్లన్నీ జలమయంగా మారాయి. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్ 9.7 సెం.మీ, లింగంపల్లి 8.2, హెచ్‌సీయూ 8.1, గచ్చిబౌలి 6.6, చందానగర్ 6.4, హఫీజ్పేట్ 5.6, ఫతేనగర్ 4.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఏపీకి అలర్ట్..
విజయవాడలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురుస్తోంది. పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు విదర్భ, తెలంగాణ మరియు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో 64.5మిమీ, కె.ఉప్పలపాడులో 53.5మిమీ, వేములపాడు 47మిమీ, చిలకపాడులో 45మిమీ, విజయనగరం జిల్లా రాజాంలో 40.2మిమీ, కాకినాడలో 39మిమీ వర్షపాతం రికార్డు అయిందన్నారు.
