సాక్షి, హైదరాబాద్: పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్నది.. సూర్యాపేట–దంతాలపల్లి రోడ్డు. వానాకాలం వరదలతో ఇలా మారింది. ఇప్పటికీ ఇదే దుస్థితిలో ఉంది. చేతిలో నిధుల్లేక అధికారులు మరమ్మతు చేయలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్య. భారీ వానలతో పరిస్థితి అదుపుతప్పినప్పుడు కేంద్రం వరద సాయం అందిస్తుంటుంది. అలా కేంద్ర నిధులతో రోడ్లను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
కానీ ఆ నిధులు రాక గోతుల రహదారులతో జనం నానా పాట్లు పడుతున్నారు. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రూ.వేయి కోట్ల నిధులు విడుదల చేసేందుకు ఓకే చెప్పింది. దీంతో లాంఛనాలు త్వరగా పూర్తిచేసి రోడ్లను బాగు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
గతేడాది కురిసిన రికార్డుస్థాయి వానలతో రోడ్లకు భారీ నష్టం వాటిల్లింది. వాటిని బాగు చేసేందుకు రూ.800 కోట్లు కావాలని అప్పట్లో ప్రతిపాదించారు. అత్యవసరం కింద కొన్ని నిధులు అందడంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. కానీ రోడ్లు పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సంతరించుకోలేదు. మరుసటి ఏడాది కూడా అదే స్థాయిలో వానలు కురవటంతో మళ్లీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా గండ్లు, గుంతలు పడ్డ రోడ్లే దర్శనమిస్తున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో 4,461 కి.మీ. మేర రోడ్డు ఉపరితలం దెబ్బతినగా, 15,721 మీటర్ల మేర రోడ్లకు గండ్లు పడ్డాయి.
తక్కువ ఎత్తుతో కాజ్‌వేలున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఇలాంటి 60 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందుబాటులో ఉన్న రూ.60 కోట్ల నిధులతో అత్యవసర పునరుద్ధరణ పనులు చేపట్టారు. వీటితో పాట్‌హోల్స్ పూడ్చటం, భారీ గండ్లు పడి వాహనాలు ముందుకు కదలటమే కష్టంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు చేశారు. రాష్ట్రంలో గత ఆరేళ్లలో 7,500 కి.మీ. రోడ్లను విస్తరించారు. ఇవి మెరుగ్గా ఉన్నాయి. ఇటీవలి వర్షాలకు ఇవి పెద్దగా దెబ్బతినలేదు. మరో 21 వేల కి.మీ. రోడ్లు మాత్రం అంత మెరుగ్గా లేవు. వీటిల్లో పంచాయితీరాజ్ శాఖ నుంచి బదిలీ అయినవి 6 వేల కి.మీ. మేర ఉన్నాయి. ఇవి మరీ దారుణంగా తయారయ్యాయి. వీటికి రూ.700 కోట్లు కావాలంటూ అధికారులు ప్రతిపాదనలు పంపారు.
దాన్ని రోడ్లు భవనాల శాఖ ఢిల్లీకి నివేదించింది. కానీ నిధులు అందలేదు. చూస్తుండగానే ఆరు నెలలు గడిచిపోయాయి. ఆ రోడ్ల మీదుగా ప్రయాణం నరకప్రాయం కావటంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు కూడా పనులు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచారు. ఇటీవల అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, జిల్లాల వారీగా రూ.వేయి కోట్ల నిధులు కావాలంటూ ప్రతిపాదించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరో వారం రోజుల్లో మెయింటెనెన్స్ గ్రాంటు నిధులు విడుదల కాబోతున్నట్టు తెలిసింది. వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి 2,789 కి.మీ మేర రోడ్ల పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment