మొరాయిస్తున్న ఫ్లడ్ గేట్లు
మొరాయిస్తున్న ఫ్లడ్ గేట్లు
Published Tue, Sep 27 2016 1:13 PM | Last Updated on Wed, Aug 1 2018 3:55 PM
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టుకు మూడుచోట్ల 48 వరదగేట్లతో పాటు 9 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న హెడ్‌స్లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీరందించేందుకు 11 ఇరిగేషన్ గేట్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వరదగేట్లతో పాటు ఇరిగేషన్ గేట్ల నిర్వహణపై నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇంతవరకు వరదగేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో అవి మొరాయిస్తున్నాయి. ఖరీఫ్ ఆరంభానికి ముందే వరద గేట్లకు మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. కానీ గ్రీసింగ్, ఆయిలింగ్ పనులూ చేయలేదు. గతేడాది వరద గేట్లకు చేపట్టిన గ్రీజింగ్, ఆయిలింగ్ పనులకు సంబందించిన నిధులు విడుదల కాకపోవడంతో ప్రస్తుతం పనులు చేపట్టలేదు.
ఎగువ ప్రాంతం నుంచి వరదనీటి తాకిడి అధికం కావడంతో అడ్డుగోడకు పగుళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టు మట్టికట్టపై చెట్లు పెరగడంతో కట్ట బలహీనంగా మారింది. ఆరేళ్ల క్రితం ప్రాజెక్టు కట్టపై ఉన్న సిమెంటు రోడ్డు కుంగిపోయింది. చైన్‌నంబరు 201 వద్ద అడ్డుగోడ పక్కకు వంగిపోయింది. అయినా అధికారులు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. మూడు రోజుల నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ప్రాజెక్టు కట్టపై ఉన్న ఆరేడ్ డిస్ట్రిబ్యూటరీ తూము కుంగింది. అంతేకాకుండా ప్రాజెక్టు వరద గేట్లు కొన్ని పైకి లేవడం లేదు. మరికొన్ని కిందకు దిగడం లేదు. అనుకోకుండా భారీ వర్షాలు కురిసి వరద ఉధృతి అధికమైతే ప్రాజెక్టు గేట్లను నిర్వహించడం ఇరిగేషన్ సిబ్బందికి కష్టంగా మారనుంది.
Advertisement