ఇప్పటికే 1.44 లక్షల బాధితులకు రూ.235.72 కోట్లు ఖాతాలలో జమ
ఈనెల 24వ తేదీలోగా అర్హులందరికీ నష్టపరిహారం
జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్ట పరిహారం అందిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మెయిన్ ఎడిషన్‌లో మంగళవారం ‘అర్జీలు బుట్టదాఖలు ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్‌ఛార్జి కలెక్టర్ స్పందించారు. మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బుడమేరు వరద నష్టంలో భాగంగా గృహ, ఎంఎస్‌ఎంఈ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.235.72 కోట్లను జమ చేశామని వివరించారు.
179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పిజిఆర్‌ఎస్ ఫ్లడ్ మాడ్యూల్‌లో నమోదు చేశారన్నారు. ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేశారన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈనెల 24వ తేదీలోగా అర్హులైన బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కాగా.. సాయం కోసం కలెక్టరేట్‌కు ఎన్ని దరఖాస్తులొచ్చాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment