వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న కూటమి ప్రభుత్వం
అగ్నికుల క్షత్రియుల ఎదురుతెన్నులు
ఐదు నెలల 21 రోజుల పరిహారం పంపిణీలో తీవ్ర జాప్యం.
జిల్లాలో 23,458 మంది లబ్ధిదారులు
సీఎం చంద్రబాబు రావాలంటూ కాలయాపన
నేటికీ అందని మత్స్యకార భరోసా
గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా పరిహారం
సాక్షి, అమలాపురం: చమురు సంస్థల కార్యకలాపాల కారణంగా నష్టపోయే అగ్నికుల క్షత్రియులకు క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన పరిహారం.. అలాగే, ఏటా అందించే మత్స్యకార భరోసా ఈ ఏడాది ఇప్పటివరకూ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతోంది.
కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆర్నెలలైనా పరిహారం పంపిణీపై ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. గత నవంబరు 21న మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఓఎన్జీసీ పరిహారంతో పాటు మత్స్యకార భరోసా అందజేస్తారని లబ్ధిదారులు ఎదురుచూశారు. కానీ, ఇప్పటికీ ఆ ఊసేలేదు. అయ్యవారు వచ్చేవరకూ అమావాస్య ఆగాల్సిందే అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం చూస్తుంటే!
ఓఎన్జీసీ పనులతో వేటకు అంతరాయం..
కోనసీమ జిల్లాలో కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం పంచాయతీ పరిధి గోదావరి పాయపై ఓఎన్జీసీ చమురు సంస్థ చేపట్టిన పైపులై¯న్ పనులతో స్థానిక మత్స్యకారులకు వేట లేకుండాపోయింది. సముద్రం లోపల ఉన్న రిగ్గు (ఆఫ్‌షోర్ బావి) నుంచి గాడిమొగ సైట్ వరకు బ్రహ్మసమేథ్యం పరిధిలోని గోదావరి పాయల వెంబడి ఓఎన్జీసీ సంస్థ పైపులై¯న్ పనులు చేపట్టింది. ఇందుకు అనువుగా నదీపాయల్లో పెద్దఎత్తున డ్రెడ్జింగ్ నిర్వహించింది.
దీనివల్ల నెలలపాటు వేటకు అంతరాయం ఏర్పడింది. కాట్రేనికోన మండలంతో పాటు ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, కె.గంగవరం.. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి చెందిన గోదావరి నదీపాయలను ఆనుకుని జీవిస్తున్న మత్స్యకారుల వేటకు బ్రేక్ పడింది. తమ కార్యకలాపాలు ముగిసే వరకూ నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందించేందుకు ఓఎన్జీసీ సంస్థ ముందుకొచ్చింది. దీంతో జిల్లాలో 23,458 మంది మత్స్యకారులకు పరిహారం అందించాలి.
ఒక్కో మత్స్యకారునికి రోజుకు రూ.460 చొప్పున నెలలో 25 రోజులకు రూ.11,500 ఇచ్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఓఎన్జీసీ అంగీకరించింది. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, పుదుచ్చేరి రాష్ట్ర ప్రత్యేక ప్రధినిధి మల్లాడి కృష్ణారావు, మత్స్యకార నాయకులతో జిల్లా కలెక్టరు సమక్షంలో బాధిత లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఓఎన్జీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి కోనసీమ జిల్లా పరిధిలో 16,408 మందికి, కాకినాడ జిల్లా, పుదుచ్చేరి యానాం పరిధిలో 7,050 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు.
జగన్ హయాంలో రూ.647.44 కోట్లు చెల్లింపు..
గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదు విడతలుగా ఒకొక్కరికి రూ.2,76,000 చొప్పున రూ.647.44 కోట్లను 8 వేల మంది లబ్ధిదారుల ఖాతాలో జమచేశారు. ఇంకా సంస్థ నుంచి సుమారుగా తొమ్మిది నెలలకు పైబడి నష్ట పరిహారం లబ్ధిదారులకు రావాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు.
కానీ, సంస్థ మాత్రం కేవలం 5 నెలల 21 రోజుల పరిహారం మాత్రమే పెండింగ్ ఉందని.. అది జిల్లా కలెక్టర్ వద్ద ఉందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెల్లిస్తామని చెబుతోంది.
ఇలా చూసినా వేట నష్టపోయిన మత్స్యకారులకు రూ.157.54 కోట్ల పరిహారం అందించాల్సి ఉంది. అయితే, ఎప్పటికప్పుడు తేదీలు మారుస్తూ కూటమి ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. అసలు నష్టపరిహారం తమకు వస్తుందో లేదో తెలీక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు..
మరోవైపు.. చమురు సంస్థలు సముద్ర జలాలు, గోదావరి పాయల్లో చేపడుతున్న చమురు నిక్షేపాల వెలికితీత పనులు, చమురు వ్యర్థాలను విడుదల చేయడం, ఓడల రాకపోకలవల్ల జరుగుతున్న శబ్ధ కాలుష్యంతో గోదావరి సహజత్వం కోల్పోయి మత్స్య సంపద తగ్గిపోతోంది. దీంతో చేపల వేటలేక జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పైగా.. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం చెల్లించే మత్స్యకార భరోసా, ఓఎన్జీసీ నష్టపరిహారం సకాలంలో చెల్లించకపోవడంతో ఉపాధి కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు రావాల్సిన ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
నిజానికి.. ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసాను రూ.20 వేలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది మత్స్యకార భరోసా కింద రూ.22.61 కోట్లు అందించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం ఈ ఊసే ఎత్తడంలేదు.
వేట లేక ఉపాధి కోల్పోతున్నాం..
గోదావరిలో పైపులైన్ పనులతో ఏర్పడిన ఇసుక మేటలు తొలగించకపోవడంతో మత్య్స సంపద తగ్గిపోతోంది. పైపులు వేసిన తరువాత పూడ్చివేత పనులు చేపట్టడంలేదు. మత్య్స సంపదపై ఇది కూడా ప్రభావం చూపుతుంది. వేట లేకపోవడంతో ఉపాధి లేకుండా పోయింది. – సంగాని చిన్న కన్నయ్య, బ్రహ్మసమేథ్యం, కాట్రేనికోన మండలం
నష్టపరిహారం చెల్లించండి..
మాకు ఓఎన్జీసీ సంస్థ నుంచి రావాల్సిన నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. ఆ పరిహారం చెల్లించకుండా.. చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా సకాలంలో ఇవ్వకపోతే మేం ఎలా బతికేది? అప్పులుచేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది.– ఓలేటి తేజ, బలుసుతిప్ప, కాట్రేనికోన మండలం
Comments
Please login to add a commentAdd a comment