మత్స్యకార భరోసాపై కూటమి సర్కారు మీనమేషాలు
వైఎస్ జగన్ హయాంలో వేట నిషేధ సమయంలోనే ఏటా మత్స్యకార భరోసా
ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో 5.38 లక్షల మందికి లబ్ధి
ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి భరోసాను అడ్డుకున్న కూటమి నేతలు
ఇప్పట్లో ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడుతున్న మత్స్యకార సంఘాలు
రూ.20 వేల చొప్పున ఇస్తామన్న హామీ అమలు కోసం ఉద్యమానికి సన్నాహాలు
భరోసా ఇవ్వకుండా ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలెందుకంటూ నిరసన
వైఎస్ జగన్ ఉండి ఉంటే ఈపాటికే తమకు భరోసాతోపాటు సంక్షేమ పథకాలు అందేవంటున్న మత్స్యకారులు
పంపాన వరప్రసాదరావు బాపట్ల జిల్లా వాడరేవు నుంచి ‘సాక్షి’ ప్రతినిధి : కూటమి పార్టీల నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక ఇలా మొండిచెయ్యి చూపుతారని అనుకోలేదని గంగపుత్రులు మండిపడుతున్నారు. బాపట్ల జిల్లా వాడరేవు గ్రామంలో ఏ గడపకు వెళ్లినా ఇదే మాట వినిపిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు వేట నిషేధ సమయంలోనే ఏటా రూ.10 వేల చొప్పున మత్స్యకార భరోసా వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు.
రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా ఇస్తామని నమ్మబలికి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఆర్నెల్లలో తమకు ఎలాంటి సాయం అందించలేదని వాపోతున్నారు. 8 వేలకుపైగా జనాభా ఉన్న ఒక్క వాడరేవు గ్రామంలోనే 2,035 మంది మత్స్యకారులు ఐదేళ్లలో రూ.6.30 కోట్లు మత్స్యకార భరోసాగా అందుకున్నారు.
ఈ ఏడాది గ్రామంలో 1,450 మంది అర్హత పొందగా ఆర్నెల్లుగా వేట నిషేధ భృతి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంలకు లేఖలు రాసినా, కలసి విన్నవించినా పట్టించుకోలేదంటూ గంగపుత్రులు మండిపడుతున్నారు. ఇప్పట్లో ఇవ్వలేమని తాజాగా అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భరోసా ఇవ్వకుండా ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఎందుకని నిలదీస్తున్నారు.
ఐదేళ్లలో రూ.538 కోట్లు..
వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలతో పాటు రూ.2 వేలు నగదు ఇస్తుండగా చంద్రబాబు హయాంలో నిత్యావసరాలను నిలిపివేసి రూ.4 వేలు చొప్పున వేట నిషేధం ముగిసిన ఆర్నెల్లకో.. ఏడాదికో తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పాదయాత్ర హామీ మేరకు నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు.
ఏటా వేట నిషేధ గడువు ముగిసేలోగా అర్హుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాకుండా తెప్పలు, ఇతర సంప్రదాయ నావలపై వేటకు వెళ్లే వారికి సైతం సాయాన్ని అందచేశారు. ఇలా ఐదేళ్లలో ఏటా సగటున 1.23 లక్షల మందికి రూ.538 కోట్ల మేర మత్స్యకార భరోసాతో లబ్ధి చేకూర్చారు.
ఈసీకి కూటమి నేతల ఫిర్యాదుతో..
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఎన్నికల కమిషన్ అనుమతితో ఈ ఏడాది కూడా మే 2వ తేదీ నుంచి అర్హులను గుర్తించి జాబితాలను సిద్ధం చేసింది. 2023–24లో 1.23 లక్షల మంది అర్హత పొందగా 2024–25లో 1.30 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
అయితే ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఫిర్యాదు చేయడంతో గత ప్రభుత్వం మత్స్యకార భృతిని జమ చేసేందుకు ఈసీ అనుమతించలేదు. అనంతరం ఎన్నికల హామీ మేరకు రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే రూ.260.26 కోట్లు కావాలని మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.
ఐదేళ్లలో వివిధ పథకాలతో లబ్ధి ఇలా..
మత్స్యకారులకు లీటర్ డీజిల్‌పై సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా సగటున 23 వేల బోట్లకు రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో తొలి మూడేళ్లలో 460 బోట్లకు, తర్వాత రెండేళ్లకు 1,100 బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తొలి ఏడాదే మెకనైజ్డ్, మోటరైజ్డ్‌తోపాటు సంప్రదాయ బోట్లు కలిపి 14,229 బోట్లకు డీజిల్ సబ్సిడీ ఇచ్చారు.
గరిష్టంగా 2023–24లో 23,209 బోట్లకు డీజిల్‌పై సబ్సిడీ ఇచ్చారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఐదేళ్లలో 175 మందికి రూ.17.71 కోట్ల పరిహారాన్ని అందించింది. వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4,913 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు.
డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్‌పీసీ (గెయిల్) పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు రూ.485.58 కోట్లు చొప్పున అందచేసి తోడుగా నిలిచింది.
రూ.5 లక్షల అప్పు తీర్చిన ‘ఆసరా’..
బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన సూరాడ ఎల్లయ్యమ్మ భర్త మత్స్యకారుడు కాగా ఆమె చేపలను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత ఐదేళ్లపాటు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఏటా రూ.10 వేలు చొప్పున జమయ్యాయి. ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘంలో ఉన్న రూ.5 లక్షల అప్పు అణా పైసలతో సహా మాఫీ అయ్యింది. వారి కుమారుడు కాకినాడలో ఎమ్మెస్సీ చదువుతుండగా కుమార్తె డిగ్రీ చదువుతోంది.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి, విద్యాదీవెన అందాయి. ఎల్లయ్యమ్మ మామ పింఛన్ పొందుతుండగా ఆమె అత్త వైఎస్సార్ చేయూత కింద నాలుగేళ్ల పాటు ఏటా రూ.18,750 చొప్పున లబ్ధి పొందింది. జగనన్న పాలనలో లబ్ధి పొందని మత్స్యకార కుటుంబం లేదు.. చంద్రబాబు పాలనలో ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదని ఎల్లయ్యమ్మ చెబుతోంది.
నేను బతికున్నానంటే జగన్ బాబు చలవే..
మైలు సంజీవ్ 40 ఏళ్లుగా చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్నాడు. ఆయనకు గత ఐదేళ్ల పాటు మత్స్యకార భరోసా అందింది. కుమార్తెకు అమ్మ ఒడి వచ్చింది. పొదుపు సంఘంలో ఆయన భార్య అప్పు మాఫీ అయ్యింది. సంజీవ్ అమ్మకు చేయూత వచ్చింది. నాలుగేళ్ల క్రితం సంజీవ్‌కు గుండెపోటు రావడంతో వలంటీర్ ధైర్యం చెప్పి ఆరోగ్యశ్రీ కార్డుతో గుంటూరు ఆస్పత్రికి పంపించాడు.
రూ.4 లక్షలు ఖరీదైన బైపాస్ సర్జరీని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించారు. డిశ్చార్జీ అనంతరం ఇంటికి పంపేటప్పుడు చేతికి డబ్బులిచ్చి పంపారు. ఏడాది పాటు మందులు ఉచితంగా ఇచ్చారు. నేను ఇప్పుడిలా బతికి ఉన్నానంటే జగన్ బాబు చలవే అంటూ సంజీవ్ కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు వచ్చి ఆర్నెళ్లు అవుతున్నా వేట సాయం కూడా ఇవ్వలేదని వాపోయాడు.
ఐదేళ్లూ అందుకున్నా..
మా తాతముత్తాల నుంచి చేపల వేటే జీవనాధారం. 20 ఏళ్లుగా వేటకు వెళ్తున్నా. జగన్ పాలనలో ఐదేళ్లూ మత్స్యకార భరోసా అందుకున్నా. మా పిల్లలకు అమ్మఒడి, అమ్మకు చేయూత వచ్చింది. నా భార్యకు పొదుపు సంఘంలో అప్పు మాఫీ అయింది.
రేషన్ కూడా ఇంటికే వచ్చేది. వలంటీర్ల వల్ల గడప దాటాల్సిన అవసరం లేకుండా అన్నీ అందేవి. ఇప్పుడు ఏ పని కావాలన్నా వేట మానుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఓపక్క వేటకు వెళ్తే సరైన చేపలు పడడం లేదు. మరోవైపు వేట నిషేధ భృతి ఇవ్వడం లేదు. ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. – ఎస్.పోలయ్య, వాడరేవు, బాపట్ల జిల్లా
హామీని నిలబెట్టుకోకుంటే ఉద్యమిస్తాం...
వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతున్నా హామీని నెరవేర్చలేదు. బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉండగానే ఈసీ అనుమతితో అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. ఇప్పుడు మత్స్యకార భరోసాని ఎగ్గొట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడంతో తీరని అన్యాయం జరుగుతోంది. ఇచి్చన హామీని నిలబెట్టుకోకుంటే మత్స్యకారుల తరపున ఉద్యమిస్తాం. – కొండూరు అనీల్‌బాబు, మాజీ ఆప్కాఫ్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment