రాష్ట్రంలో ఇప్పుడు ఎటు వెళ్లినా ఇదే మాట వినిపిస్తోంది: వైఎస్ జగన్
సూపర్ సిక్స్‌తోపాటు 143 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన బాబు
హామీల అమలుకు గ్యారెంటీ అంటూ ఇంటింటికీ బాండ్లు కూడా పంచారు
వాటిని అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారు
మరి ఇప్పుడు ఎవరి చొక్కాలు పట్టుకోవాలి?
హామీల అమలుపై నిలదీస్తుంటే సంపాదించే మార్గం చెవిలో చెప్పమంటారా?
చీటింగ్‌లో పీహెచ్‌డీ తీసుకున్న వ్యక్తి ఒక్క చంద్రబాబే
సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికలకు ముందు చంద్రబాబు నోట ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ’ అనే మాట వినిపించేది. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అనే మాట వినిపిస్తోంది. బటన్ నొక్కడం ఏమైనా పెద్ద పనా? మూలనున్న ముసలావిడ కూడా బటన్ నొక్కుతుందంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ మేనిఫెస్టోలో 143 హామీలిచ్చారు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి టీడీపీ హామీలకు గ్యారెంటీ అంటూ బాండ్లు పంచారు.
హామీలు అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారు. మరి ఆ బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టో ఏమైంది? పంచిన కరపత్రాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబును ప్రజలు నిలదీసే పరిస్థితులు త్వరలోనే రానున్నాయన్నారు. జమిలి రూపంలో ఎన్నికలు ఎంత తొందరగా వస్తే ఆయన్ను అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
మరి ఎవరి చొక్కా పట్టుకోవాలి?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తోంది. ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి హామీలిచ్చారు. ఏ ఇంట్లో అయినా చిన్న పిల్లలు కనిపిస్తే తల్లికి వందనం కింద నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని చెప్పారు. తల్లులు కనిపిస్తే ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు. రూ.18 వేలు.. అని నమ్మబలికారు. ఆ పిల్లల అమ్మమ్మలు, అత్తమ్మలు కనిపిస్తే మీకు 50 ఏళ్లు నిండాయి కదా పెన్షన్ కింద నీకు రూ.48 వేలు నీకు రూ.48 వేలు.. అని చెప్పారు.
యువత కనిపిస్తే నిరుద్యోగ భృతి కింద నీకు రూ.36 వేలు.. రైతన్న కనిపిస్తే అన్నదాతా సుఖీభవ కింద నీకు రూ.20 వేలు ఇస్తామని ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. వీళ్లు ఇచ్చిన హామీలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 బాకా ఊదాయి. ఇప్పుడు వారు ఇచ్చిన బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టోలో హామీలు ఏమయ్యాయి? ప్రచార కరపత్రాలు ఏమయ్యాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఎవరిని నిలదీయాలి?
ఐఆర్ ఏమైంది? పీఆర్సీ ఏది?
తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ అన్నారు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నారు. పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. 1వ తేదీనే జీతాలంటూ తొమ్మిది నెలల్లో ఒకే ఒక్కసారి ఇచ్చారు. మూడు డీఏలు, ట్రావెల్ ఎలవెన్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ అన్నీ పెండింగ్.. పెండింగ్! జీఎల్‌ఐ, జీపీఎఫ్‌లను చంద్రబాబు వాడేసుకుంటున్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదీ.
కొత్తవి దేవుడెరుగు.. ఉద్యోగాలు ఊడగొట్టారు
తొమ్మిది నెలల్లో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్నవే ఊడగొట్టారు. ఎన్నికల ముందు వలంటీర్లకు నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాలను తీసేశారు. బెవరేజ్ కార్పొరేషన్‌లో 18 వేల మందిని తొలగించారు.
ఫైబర్ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగస్తులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. తద్వారా ఆయా విభాగాల్లో ఖాళీలను పూర్తిగా కుదిస్తున్నారు.
చీటింగ్‌లో బాబు పీహెచ్‌డీ..
ఎవరైనా ఎన్నికల హామీలు ఏమయ్యాయని చంద్రబాబును ప్రశ్నిస్తే.. వెటకారంగా మాట్లాడటాన్ని చూస్తున్నాం. మొన్న రాయచోటిలో ఇలాగే ప్రశ్నిస్తే.. సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అని వ్యాఖ్యానించటాన్ని చూశాం. అన్నీ తెలిసి కూడా ఆయన అడ్డగోలు హామీలిచ్చారు.
చీటింగ్‌లో పీహెచ్‌డీ తీసుకున్న వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. ఇక ఆయన నటన ఏ స్థాయిలో ఉంటుందంటే.. హామీలను ఎగ్గొట్టేసి చాలా బాధగా, ఆవేదనగా ఉంది. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. భయమేస్తోందని.. రాష్ట్రం ధ్వంసమై పోయిందని అంటారు! సినిమాల్లో దివంగత ఎన్టీఆర్‌ను మించిన హావ భావాలను ప్రదర్శిస్తారు. ఆ నటనకు కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే!!
స్లో పాయిజన్..
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే.. పులి నోట్లో తలపెట్టడమేనని నేను ముందే హెచ్చరించా. చంద్రబాబు మాయ మాటలతో మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ప్రజలను వంచించడం, మోసం చేయటాన్ని ఓ పద్ధతి ప్రకారం స్లో పాయిజన్ రూపంలో ఎక్కిస్తారు.
తన అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి ఒక్కొక్కటి బయటకు తీస్తారు. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తాయి. చంద్రబాబు తప్పేమీ లేనట్లుగా.. రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతున్నాడన్న భావన ప్రజల్లో కల్పిస్తారు.
పిల్లలకు మనం ఏం చెబుతాం..?
అబద్ధాలు ఆడకూడదు.. మోసాలు చేయకూడదు.. ఎదుటివారికి మంచి చేయాలి.. మాట తప్పకూడదు.. విలువలు ఉండాలి. విశ్వసనీయత పెంచుకోవాలి... అలాగే బతకాలని మనం పిల్లలకు చెబుతాం. ఒక్క చంద్రబాబు మాత్రమే తన కుమారుడి దగ్గర నుంచి తన పార్టీలో ఉన్నవారికి చెప్పే సిద్ధాంతం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పు.. మోసం చెయ్.. మన స్వార్ధం కోసం ఏం చేసినా తప్పు లేదు.. మోసం చేసినా తప్పు లేదు.. అదీ ఓ ఘనకార్యమే అని చెబుతూ నేర్పించే నాయకుడు చంద్రబాబు మినహా మరొకరు లేరు.
Comments
Please login to add a commentAdd a comment