కడప కార్పొరేటర్లు, ముఖ్య నేతల సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
కష్టాలు శాశ్వతం కాదు.. 2027లోనే జమిలి ఎన్నికలు
ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనది
ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలా పాలన చేశాం
చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని చేతులెత్తేసింది
ప్రజా సమస్యలపై వారి తరఫున మనం పోరుబాట పట్టాం
మీ అందరి సహాయ, సహకారాలు కావాలి
వైఎస్సార్ ఘాట్‌లో తండ్రి వైఎస్సార్‌కు ఘన నివాళి
ఇడుపులపాయ చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనంరెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారందరికీ మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. కొంత ఓపిక పట్టండి. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మనందరం కలిసికట్టుగా పని చేయాలి. – వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప : ‘ఎన్నికల ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. 2027 చివర్లో జమిలి ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు, ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం. ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాం. మనం చెప్పింది చేశామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తోంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేశామని వెళ్లగలుగుతారా? వాళ్లు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది.
ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇలా ఇంట్లో ఎవరినీ వదిలి పెట్టకుండా ఆశ పెట్టారు. ఇప్పుడు వారంతా మా డబ్బులు ఏమయ్యాయని అడుగుతున్నారు. అందుకే ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
కలిసికట్టుగా పని చేద్దాం
జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు. నెలలు గడిచేకొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం. మన ప్రభుత్వం మళ్లీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారికి మంచి రోజులు వస్తాయి. ఇబ్బందులు కొంత కాలం ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. మనందరం కలిసికట్టుగా పని చేయాలి.
దేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.
మనల్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఇబ్బందులు పెట్టినా, కొంత ఓపిక పట్టండి. మీకు నా తమ్ముడు అవినాష్ అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండి. తప్పకుండా సాయం చేస్తారు. నేను కడప బిడ్డను కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను. మేము జిల్లాలో చూసుకుంటాం.. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించండంటూ మీరంతా నాకు అండగా ఒక్కతాటిపై నిలవాలి.
ప్రజాపక్షమై గళమెత్తుదాం
మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుందనుకోలేదు. చంద్రబాబు బాదుడే బాదుడులా పాలన సాగిస్తున్నారు. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్‌లేదు.. అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తోంది. హామీలు, సమస్యలపై ప్రజాపక్షమై గళమెత్తుదాం. ఇప్పటికే రైతు ధర్నా చేశాం. ఈ నెల 27న కరెంట్ బిల్లులపై మరో నిరసన కార్యక్రమం చేయనున్నాం.
జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల తరుఫున మరో కార్యక్రమం చేయాల్సి ఉంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి. సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాను. అన్ని జిల్లాల్లో పర్యటిస్తాను.
వైఎస్సార్‌కు నివాళులు
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి.. మంగళవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అరి్పంచారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు.. ఓపెన్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్, భారతి దంపతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబీకులు.. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మేయర్ సురేష్ బాబు, మాజీ మంత్రి ఎస్‌బీ అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గంగుల బిజేంద్రనాథరెడ్డి, సుదీర్‌రెడ్డి.. వైఎస్ అనిల్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment