అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అప్పులపై అడ్డగోలు లెక్కలా?: వైఎస్‌ జగన్‌

Published Thu, Nov 21 2024 6:02 AM | Last Updated on Thu, Nov 21 2024 8:55 AM

YS Jagan fires on Chandrababu Naidu

చంద్రబాబుపై  వైఎస్‌ జగన్‌ మండిపాటు

రాష్ట్ర అప్పులపై బడ్జెట్‌లో చూపించింది తప్పైతే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావ్‌?

అందులో అంకెలన్నీ నువ్వు ప్రవేశపెట్టినవే కదా?

సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయలేక.. జనం నిలదీస్తారనే భయంతో పదేపదే అబద్ధాలు

సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది.. ప్రభుత్వ యంత్రాంగమంతా నీ చేతుల్లోనే ఉంది.. నీ చేతుల్లో ఉన్న అధికారులతో అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టావు.. అందులో అంకెలన్నీ నువ్వు పెట్టినవే.. ఆ లెక్కలను కాగ్‌(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) కూడా ధ్రువీకరించింది.. మరి నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనే 2018–19 నాటికి అంటే నువ్వు అధికారంలోకి నుంచి దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.3.13 లక్షల కోట్లు అని లెక్క చూపావు.. 2023–24 నాటికి అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారంటీలతో కలిపి రాష్ట్ర అప్పులు రూ.6.46 లక్షల కోట్లు అని తేల్చావు.. మరి ఇప్పడేమో లేదు లేదు.. రాష్ట్ర అప్పులు రూ.10.47 లక్షల కోట్లని ఒకరు.. రూ.11 లక్షల కోట్లని మరొకరు..! 

పక్కకు వస్తే వేరే నెంబర్లు చెబుతా అని అంటావా? గుంజీలు తీయిస్తానంటావా? సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు నిలదీస్తారనే భయంతో.. బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూ­డదు?’’ అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా భిన్న అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. 

కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, మోసాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామికవాదులపై అక్రమ కేసులను బనాయిస్తూ, నిర్భందిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

తప్పైతే అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?
2018–19 నాటికి రూ.3.13 లక్షల కోట్లున్న అప్పులు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్లకు చేరాయని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని నిర్థారిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పద్దులను ఆడిట్‌ చేసే కాగ్‌ ఇచ్చిన నివేదికను కూడా అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అందులోనూ రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగానే తేల్చారు. మరి వాస్తవాలు ఇలా ఉంటే.. ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా? ఇలా దుష్ఫ్రచారం చేయడం ధర్మమేనా? 

చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలోని తన వదినమ్మ, ఎల్లో మీడియాతో కలిసి అబద్ధాలకు రెక్కలు కట్టి ఎలా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌) పాల్పడుతున్నారనేందుకు రాష్ట్ర అప్పులపై వారు చేసిన దు్రష్ఫచారమే తార్కాణమని గత మీడియా సమావేశంలోనే చెప్పా. బడ్జెట్‌ ప్రవేశపెట్టాక కూడా రాష్ట్ర అప్పులపై అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు దుష్ఫ్రచారం కొనసాగిస్తున్నారు. అప్పులపై బడ్జెట్‌లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? పైగా మరో అడుగు ముందుకేసి బకాయిలపై (స్పిల్‌ ఓవర్‌ అకౌంట్స్‌) పదే పదే అబద్ధాలా? 

ప్రభుత్వం వివిధ పనులకు సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు ఏటా స్పీల్‌ ఓవర్‌ కింద మరుసటి ఏడాదికి రావడం సహజం. 2019లో చంద్రబాబు దిగిపోతూ రూ.42,183 కోట్ల బకాయిలు పెట్టారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ స్థాయిలో బకాయిలు పెట్టిన దాఖలాలు లేవు. అయినా సరే చిరునవ్వుతో ఆ బకాయిలన్నీ మేం చెల్లించాం.  ఇలా  సర్వసాధారణ విషయాన్ని బూతద్దంలో చూపిస్తూ ఏదో జరిగిపోతోందనే భ్రాంతి కలిగించడంలో చంద్రబాబు దిట్ట.

ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?..  మేమిచ్చినవీ ఊడగొట్టారు
మెగా డీఎస్సీ అని హామీ ఇచ్చారు. ఉన్న డీఎస్సీ కూడా ఆగిపోయింది. మేం 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చాం. వీళ్లు 16,347 పోస్టులతో ఇస్తున్నామన్నారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పటికి ఆర్నెల్లు గడిచిపోయాయి. అదే మేం అధికారంలోకి వచి్చన ఆర్నెళ్లు తిరగకమునుపే అక్టోబర్‌ 2వతేదీన గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.30 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 58 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశాం. 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాలు చేశాం. ఇవన్నీ ఆర్నెళ్ల లోపే చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతున్నారు. ఇప్పటికే 2.66 లక్షల మంది వలంటీర్లు, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న 15 వేల మందిని పీకేశారు.  

ఆర్థిక విధ్వంస కారుడు బాబే..
»  ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం) పరిమితికి మించి  2014–19 మధ్య రూ.28,457 కోట్లు అప్పులు చేసింది నువ్వు కాదా బాబూ? ఈ అంశాన్ని కాగ్‌ నివేదిక, కేంద్ర ఆర్థిక సంఘం నివేదిక కూడా స్పష్టం చేసింది.  చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేయడం వల్ల ఆ మేరకు మా హయాంలో అప్పులపై కోత పడింది. మా హయాంలో కేవలం రూ.1,600 కోట్లు మాత్రమే పరిమితికి మించి అప్పులు చేశాం. ఈ గణాంకాలు చాలు.. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో.. ఎవరు ఆర్థిక క్రమశిక్షణతో నడిచారో.. ప్రభుత్వాన్ని నడిపించారో చెప్పడానికి! సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అప్పులను భూతంగా చూపే కార్యక్రమాలు చేస్తున్నాడు.

»  చంద్రబాబు హయాంలో కోవిడ్‌ లాంటి మహమ్మరి లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా ప్రభావంతో రాష్ట్రానికి ఆదాయ వనరులు తగ్గిపోయాయి.  అనుకోని ఖర్చులు పెరిగిపోయాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా కోవిడ్‌ వల్ల అనూహ్య పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్సార్‌సీపీ హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్‌) తక్కువగానే ఉంది. 

నాడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్లకు చేరగా.. సీఏజీఆర్‌ 19.54 శాతంగా నమోదైంది. అనంతరం మా హయాంలో అప్పులు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 కోట్లకు చేరాయి. సీఏజీఆర్‌ 15.61 శాతంగా ఉంది. అంటేæ చంద్రబాబు హయాంలో కంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు 4 శాతం తక్కువగా ఉన్నట్లు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ గణాంకాలలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు ఆర్ధిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం. 

»   నాన్‌ గ్యారంటీ అప్పులు బడ్జెట్‌లోకి రావు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలయిన ఎస్‌బీఐ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌ లాంటి సంస్థలు చేసే అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఖాతాలో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ నాన్‌ గ్యారంటీ అప్పులు కాబట్టి. అయినా సరే ఈ నాన్‌ గ్యారంటీ అప్పులు కూడా కలిపి చూసినా నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లుగా ఉంటే ఆయన దిగిపోయే నాటికి రూ.77,229 కోట్లకు తీసుకుపోయిన ఘనత కూడా బాబుదే. 

మా హయాంలో వాటిని రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు తగ్గించాం. ఈ నాన్‌ గ్యారంటీ అప్పుల వార్షిక వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 54.98 శాతం ఉంటే మా హయాంలో అది 0.48 శాతం తగ్గింది. రాష్ట్ర అప్పులు, గ్యారంటీ అప్పులు, నాన్‌ గ్యారంటీ అప్పులు కలిపి చూస్తే  నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉన్న అప్పులు ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లకు పెరిగాయి. 

అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతంగా నమోదైంది. మా హయాంలో ఆ అప్పులు రూ.3.90 లక్షల కోట్ల నుంచి రూ.7.21 లక్షల కోట్లకు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధి రేటు 13.57 శాతం మాత్రమే. ఈ లెక్కలు చూస్తే ఎవరు ఆరి్ధక విధ్వంసకారుడో ఇట్టే అర్ధమవుతుంది.  

»   చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా హయాంలో తలసరి ఆదాయం 9 నుంచి 2 శాతానికి తగ్గినట్టు తప్పుడు లెక్కలతో మరో అబద్ధాన్ని ప్రచారం చేశాడు. చంద్రబాబు సర్కార్‌ దిగిపోయేనాటికి 2018–19లో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు మాత్రమే ఉంటే మా హయాంలో 2024 మార్చి నాటికి రూ.2,42,479గా నమోదైంది. 

తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంటే.. రెండేళ్లు కోవిడ్‌ లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ మా హయాంలో 15వ స్థానానికి ఎగబాకింది. ఈ ఏడాది లెక్కలు కూడా కలిపితే మరో 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. 2019–24 మధ్య ఏ రంగాన్ని తీసుకున్నా సరే ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీ వృద్ధి రేటు దేశం కంటే ఎక్కువగా ఉంది. అయినా సరే వాస్తవాలకు ముసుగేసి చంద్రబాబు వక్రీకరిస్తూ దు్రష్ఫచారం చేస్తున్నారు.  

ప్రతికూలతలోనూ పారిశ్రామిక వృద్ధి..
బడ్జెట్‌ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ 2014–19 వరకు రాష్ట్ర వృద్ధి రేటు 13.50 శాతం ఉంటే 2019–24 మధ్య 10.60 శాతానికి పడిపోయిందన్నారు. బాబూ..! నీ హయాంలో కోవిడ్‌ లేదు. ప్రపంచమంతా రెండేళ్ల పాటు కోవిడ్‌తో అతలాకుతలమైంది. 2014–19తో పోల్చి చూస్తే గత ఐదేళ్లలో వృద్ధి రేటు ప్రతి రాష్ట్రంలోనూ తక్కువే ఉంది. దేశ వృద్ధి రేటు చూస్తే 2014–19 మధ్య 10.97 శాతం ఉంటే 2019–24 మధ్య 9.28 శాతం ఉంది. 

2014–19 మధ్య మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సగటున 11.92 శాతం ఉండగా 2019–24 మధ్య 12.61 శాతంగా నమోదైంది. ఇవేమీ నేను చెప్పిన లెక్కలు కాదు. బడ్జెట్‌తో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికలో వెల్లడించిన అంశాలే ఇవన్నీ! రాష్ట్ర పారిశ్రామిక రంగంలో స్థూల వస్తు ఉత్పత్తి విలువ (జీవీఏ) చూస్తే 2014–19 మధ్య రూ.1.07 లక్షల కోట్ల నుంచి రూ.1.88 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 11.92 శాతంగా నమోదైంది. 

అదే 2019–24 మధ్య కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రూ1.88 లక్షల కోట్ల నుంచి రూ.3.41 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వార్షిక వృద్ధిరేటు 12.61 శాతం పెరిగింది. జాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే పారిశ్రామిక రంగంలో జీవీఏలో 2018–19లో 11 స్థానంలో ఉన్న రాష్ట్రం 2019–24 మధ్య 8వ స్థానంలోకి ఎగబాకింది. ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ (జీవీఏ) 12.61 శాతం ఉంటే దేశంలో సగటున ఉత్పత్తి విలువ 8.17 శాతంగా నమోదైంది. అంటే పారిశ్రామికాభివృద్ధి  దేశంలో కంటే రాష్ట్రంలో 4 శాతం ఎక్కువగా ఉంది.  

మేకపిల్ల – కుక్కపిల్ల కథలో గజదొంగల్లా..!
చంద్రబాబు అబద్ధాలు చూస్తే ఓ కథ గుర్తుకొస్తోంది. ఒక ఊరిలో ఓ అమాయకుడు భుజాన మేకపిల్లను వేసుకుని అమ్ముకోవాలని బజారుకు బయలుదేరతాడు. ఇంటి గడప దాటగానే ఒకడొచ్చి నీ కుక్క భలే ఉందంటాడు! దాంతో ఆ అమాయకుడు ఆలోచనలో పడతాడు. వీధి చివరికి వచ్చేసరికి మరొకడు ఎదురై నీ కుక్క పిల్ల చాలా తెల్లగా, బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చావు? అంటాడు. మళ్లీ ఆ అమాయకుడు సందిగ్ధంలో పడి.. ఇది మేకపిల్లే.. కుక్కపిల్ల కాదు.. నీకు కళ్లు కనిపించట్లేదా అనుకుంటూ ముందుకువెళ్తాడు. అక్కడి నుంచి కిలోమీటరు ముందుకు వెళ్లేసరికి ఇంకొకడు కనిపిస్తాడు. 

అరే.. నీ కుక్కపిల్ల బాగుంది.. నాకు అమ్ముతావా? అంటాడు! ఇక.. ఆ అమాయకుడిలో గందరగోళం ప్రారంభం అవుతుంది. నేను మేక పిల్లలను భుజాన వేసుకుని వెళ్తుంటే ఇంతమంది అది కుక్క పిల్లే అని అంటున్నారు. నా కళ్లకు ఏమైనా అయ్యిందా? నాకు ఏమైనా జరిగిందా? అనే అనుమానంతో మేకపిల్లను కిందకు దించి నాకు మేకపిల్లా వద్దూ.. కుక్క పిల్లా వద్దూ! అనుకుని వెళ్లిపోతాడు. ఈ కథ చంద్రబాబు వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతూ రాష్ట్రాన్ని ఎలా కబళిస్తున్నారో చెప్పేందుకు అతికినట్లు సరిపోతుంది. 

ఈ కథలో తొలి వ్యక్తి పేరు చంద్రబాబు! రెండో వ్యక్తి దత్తపుత్రుడు! మూడో వ్యక్తి బీజేపీలో ఉన్న తన వదినమ్మ..! నాలుగో వ్యక్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5..లాంటి ఎల్లో మాఫియా. వీళ్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌కు లేని అప్పులు ఉన్నట్టుగా వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవన్లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకే. 

ఈ కథలో రాష్ట్ర ప్రజలు అమాయకులు అయితే.. మేక పిల్ల మన రాష్ట్రం. ఆ నలుగురు గజదొంగలు కలసి కింద పడేసిన మేకను తీసుకెళ్లి బిర్యానీ వండుకుని పంచుకుని తిన్నట్లుగా.. ఈ నలుగురు రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దోచేసే పంచుకు తింటున్నారు.  

ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఉంటుందా?
ఆరోగ్యశ్రీ గతంలో వెయ్యి ప్రొసీజర్స్‌కు మాత్రమే పరిమితం కాగా మేం 3,300 ప్రొసీజర్స్‌కు పెంచి రూ.25 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా పథకాన్ని విస్తరించాం. గతంలో చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువే ఉన్న పరిస్థితి నుంచి మా హయాంలో ఏకంగా రూ.3,762 కోట్లకు చేరాయి.  కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సామాజిక ఆరి్థక సర్వే నివేదికను పరిశీలిస్తే 2023–24లో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం అని పేర్కొన్నారు. 

2023–24లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఉండగా దాన్ని మార్చేసి డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ స్కీంగా పెట్టేశారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద 13,22,319 మంది రోగులకు మేలు చేశారట! రూ.3,762 కోట్లు ఖర్చు చేశారట! 1–4–2023 నుంచి 31–3–2024 మధ్య ఎవరి ప్రభుత్వం ఉంది? వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.3,762 కోట్లు ఖర్చు చేసి 13 లక్షల మందికిపైగా పేదలకు వైద్యం అందిస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి వస్తుందోననే ఆందోళనతో ఇలా చేశారు.  మేం ఖర్చు పెట్టింది వాళ్లు (చంద్రబాబు) వ్యయం చేసినట్లు రాసుకుని.. దొంగ పబ్లిసిటీ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే మీకంటే (చంద్రబాబు) దిక్కుమాలిన ప్రభుత్వం ఇంకొకటి ఉంటుందా?  

నాలుగు నెలల నుంచి జీతాలు అందట్లేదని 104, 108 ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మా హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో తగినంత మంది స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నాం. 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టాం.  పులివెందుల సహా మరో రెండు కొత్త కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సీట్లను కేటాయించినా అడ్డుపడిన చరిత్ర మీది.  

32.79 లక్షల మందికి ఉద్యోగాలు..
అసెంబ్లీలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక ఆర్ధిక సర్వే నివేదికలో పేర్కొన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఎంఎస్‌ఎంఈ రంగంలో ఆయన హయాంలో 2014–19 మధ్య 8.67 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే.. వైఎస్సార్‌సీపీ హయాంలో 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడైంది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. భారీ, మెగా ప్రాజెక్టులతో మా హయాంలో 1,02,407 ఉద్యోగాలు కల్పిస్తే చంద్రబాబు హయాంలో ఉపాధి కల్పన చాలా తక్కువగా నమోదైంది.  

మేనిఫెస్టోతో మోసం..
చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ను ఉపయోగించారు. సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవన్లు అంటూ హామీలిచ్చి మేనిఫెస్టో అంటూ ఒక మాయా పుస్తకాన్ని రచించారు. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరి మనోభావాలతో ఆడుకుని, వాడుకున్నారు. ఉచిత బస్సు, గ్యాస్‌ సిలిండర్లు సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవన్లలో అతి చిన్న అంశాలు! 

కూటమి నాయకులు ఎన్నికల వేళ ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో చిన్న పిల్లలు కనిపిస్తే చాలు.. ఎంత మంది ఉన్నా సరే.. నీకు రూ.15 వేలు..  నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు..నీకు రూ.15 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. 
వాళ్ల అమ్మ.. చిన్నమ్మలు బయటకొస్తే నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. నీకు రూ.18 వేలు.. అనేవాళ్లు! 
అంతటితో ఆగకుండా ఆ ఇంట్లో పెద్ద వయసు మహిళలు కనిపిస్తే నీకు రూ.48 వేలు..నీకు రూ.48 వేలు.. నీకు రూ.48 వేలు అనేవాళ్లు. 
ఇంట్లో 26 ఏళ్ల యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. నీకు రూ.36 వేలు..నీకు రూ.36 వేలు అనేవాళ్లు.
రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అనేవాళ్లు. 
ఇవన్నీ సూపర్‌ సిక్స్‌లో భాగమే. పెద్దవి కూడా. మోసాల్లో భాగంగా ఇవన్నీ ఎలాగూ చేయరనుకుంటే చిన్న చిన్న వాటిల్లోనూ మోసాలే!  

రాష్ట్రంలో యాక్టివ్‌ గ్యాస్‌ కనెక్షన్లు 1.55 కోట్లు ఉన్నాయి. కర్నాటకలో 1.84 కోట్లు, కేరళలో 96 లక్షలు, తమిళనాడులో 2.33 కోట్లు, తెలంగాణలో 1.24 కోట్లున్నాయి. ఏపీలోని 1.55 కోట్ల కనెక్షన్లకు సిలిండర్‌కు రూ.895 చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రూ.4,200 కోట్లు ఖర్చవుతుంది. బడ్జెట్‌లో మాత్రం రూ.895 కోట్లే పెట్టారు. అంటే ఇచ్చేది ఒక్క సిలిండర్‌.. అది కూడా అందరికీ ఇవ్వరు. ఒక్కో సిలిండర్‌ ఇవ్వాలంటే ఏడాదికి రూ.1,400 కోట్లు కావాలి. 

అందరికీ ఇవ్వడానికి నీకు (చంద్రబాబు) మనసు లేదు. 40 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారని అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ఆర్థిక మంత్రి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామంటారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ సంవత్సరానికి ఒకటే ఇస్తామంటారు. ఒక మంత్రి చెప్పేదానికి.. ఇంకో మంత్రి చెప్పేదానికి పొంతన లేదు. పోనీ ఒక్కటన్నా అందరికీ ఇస్తున్నారంటే అదీ లేదు. దారుణమైన అబద్ధాలు, మోసాలకు ఇది నిదర్శనం కాదా?  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement