పేద అక్కచెల్లెమ్మల మేలే లక్ష్యం
మురమళ్ల నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల్లోని అక్కచెల్లెమ్మల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి కలిగేలా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి 50 –100 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున నియమించిన వ్యవస్థ ద్వారా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ సేవలు అందిస్తున్నామని చెప్పారు.
మత్స్యకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని తెలిపారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో శుక్రవారం ఆయన నాలుగో ఏడాది మత్స్యకార భరోసాతోపాటు ఓఎన్జీసీ నష్ట పరిహారం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మనందరికీ పరిచయం ఉన్న మల్లాడి సత్యలింగ నాయకర్ 180 ఏళ్ల క్రితం ఇక్కడ పుట్టారు. ఈయన ఒక మత్స్యకారుడు. ఆ రోజుల్లో చదువుకోలేకపోయారు. సముద్రాన్నే నమ్ముకుని, ఆ సముద్రాన్ని దాటి బర్మాకు చేరుకున్నారు.
అక్కడ ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించి, రంగూన్లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారు. సొంత గడ్డ మీద మమకారంతో తను సంపాదించినదంతా అమ్మేసి.. ఈ ప్రాంతంలో భూములు కొని ఒక ట్రస్టు పెట్టారు. దాదాపుగా 110 సంవత్సరాలుగా వేల మంది పేదలకు మంచి చేశారు. అదే స్ఫూర్తితో పేదరికంలో ఉన్న అక్కచెల్లెమ్మలను నా వాళ్లుగా భావించి దాదాపు 32 పథకాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
మీ కష్టాలు కళ్లారా చూశాను
► మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను. చేపల వేట నిషేధ సమయంలో వారిని ఆదుకునేందుకు వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ మత్స్యకార భరోసాలో భాగంగా 1,08,755 మందికి ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు చొప్పున మొత్తంగా రూ.109 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కూడా ఇలా సహాయం చేసిన చరిత్ర లేదు.
► మరోవైపు ఇక్కడే ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) పైప్లైన్ కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని 69 గ్రామాల్లో 6078 బోట్లకు పని లేకుండా పోయింది. దీంతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు మనందరి ప్రభుత్వమే చొరవ తీసుకుని మొదటి విడదతగా ఒక్కో కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున, 4 నెలలకు రూ.46 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇలా ఇస్తున్న సొమ్ము రూ.108 కోట్లు. మత్స్యకార భరోసాగా ఇస్తున్న సొమ్ము మరో రూ.109 కోట్లు. మొత్తంగా ఇవాళ రూ.217 కోట్లు నేరుగా ఇస్తున్నాం.
► గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జీఎస్పీసీ వాళ్లు డ్రిల్లింగ్ చేయడం వల్ల అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి రూ.47,250 చొప్పున మొత్తం రూ.70 కోట్లు మన ప్రభుత్వం విడుదల చేసింది. ఇది గత ప్రభుత్వ పాలనకు, మన ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడా.
వలసల నివారణకు చర్యలు
► మత్స్యకారుల వలసలు నివారించాలని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నాం. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ చేస్తున్నాం. వీటి కోసం రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే మచిలీపట్నం, ఉప్పాడ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మిగిలినవి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
► ఫిష్ ఆంధ్రా పేరిట నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రూ.333 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 70 ఆక్వా హబ్లు, వాటికి అనుసంధానంగా సుమారు 14 వేల రిటైల్ దుకాణాల ఏర్పాటు దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. వీటివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మందికి ఉపాధి లభించనుంది.
ఎంత తేడానో మీరే చూడండి
► చేపల వేట నిషేధ సమయంలో అందించే సహాయం అప్పట్లో రూ.4వేలు ఉంటే దాన్ని రూ.10 వేలకు పెంచాం. గతంలో కొంతమందికి మాత్రమే ఇచ్చేవారు. ఇవాళ అర్హులందరికీ ఇస్తున్నాం. గతంలో చంద్రబాబు పాలనలో 2014–15 కాలంలో కేవలం 12,128 కుటుంబాలకు మాత్రమే మత్స్యకార భృతి కేవలం రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో రూ.4 వేలకు పెంచుతూ 2018–19లో 80 వేల కుటుంబాలకు పెంచారు.
► 2014–15లో మత్స్యకార భృతికి ఇచ్చిన మొత్తం కేవలం రూ.2.50 కోట్లు. 2018–19లో రూ.32 కోట్లు. ఈ రోజు మీ బిడ్డగా సంవత్సరానికి రూ.109 కోట్లు బటన్ నొక్కి ఇస్తున్నాను. ఆ పెద్దమనిషి చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు. మన ప్రభుత్వంలో ఈ ఏడాది ఇచ్చిన రూ.109 కోట్లతో కలుపుకుంటే మొత్తం రూ.419 కోట్లు మీ చేతుల్లో పెట్టాం.
► డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.9కి పెంచాం. మత్స్య శాఖకు చెందిన 6 డీజిల్ బంకులతో పాటు 93 ప్రై వేటు బంకుల్లో కూడా డీజిల్ పట్టుకునేటప్పుడే సబ్సిడీ అందేలా స్మార్ట్ కార్డ్స్ జారీ చేశాం. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3 వేల లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్లు చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. మొత్తం 17,770 బోట్లకు మూడేళ్లుగా సబ్సిడీపై డీజిల్ ఇస్తున్నాం.
► సముద్రంలో చనిపోయిన వారికి గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఇస్తామనే వారు. కానీ అది ఎప్పుడొస్తుందో.. అసలు రాదో తెలియని పరిస్థితి. మన ప్రభుత్వం రాగానే ఆ పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచి ఇస్తున్నాం. ఇప్పటిదాకా ఇలా 116 కుటుంబాలకు మేలు చేయగలిగాం.