పర్చూరు, చిలకలూరిపేట టీడీపీ నేతల వాటా రూ.2.64 కోట్లు
నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి నేతలకు రూ.2.20 కోట్లు
రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులకు నెలకు రూ.60 లక్షలు
ఖరారు చేసిన పర్చూరు ముఖ్యనేత అనుచరులు
నెలకు రూ.16.80 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి
వాటాలపై గొట్టిపాటి, ఏలూరి వర్గాల మధ్య విభేదాలతో టీడీపీ పెద్దల వద్దకు పంచాయితీ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి, అధికార పార్టీ నేతలకు కప్పం చెల్లిస్తూ మార్టూరు నుంచి పాలి‹Ù్డ గ్రానైట్ పలకలను జీరో దందాతో అక్రమంగా తరలిస్తున్నారు. జీరో దందా కోసం వ్యాపారులు అధికార పార్టీ పర్చూరు ముఖ్యనేత అనుచరులకు ఒక్కో లారీకి రూ.40 వేలు చొప్పున కప్పం చెల్లిస్తున్నారు. రోజుకు 80 లారీలకుపైగా గ్రానైట్ తెలంగాణకు తరలిపోతుండగా అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతోంది.
పర్చూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల టీడీపీ నేతలు ఇందులో వాటాలు పంచుకుంటున్నారు. దందా నడిపిస్తున్న పర్చూరు ముఖ్యనేత, చిలకలూరిపేట నేతకు నెలకు రూ. 2.64 కోట్లు చొప్పున చెల్లిస్తుండగా నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నేతలు ముగ్గురికీ నెలకు రూ.2.20 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
ఇక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, కమర్షియల్ టాక్స్ అధికారులకు కలిపి నెలకు రూ.60 లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రోజుకు ఒక్కో లారీకి రూ. 40 వేల చొప్పున 80 లారీలకు రూ.32 లక్షలు వంతున దందా నిర్వాహకులు నెలకు రూ. 9.60 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ నేతలు, అధికారులకు రూ.5.44 కోట్లు చెల్లిస్తుండగా రూ.4.17 కోట్లు దందా నిర్వాహకుల వాటాగా చెబుతున్నారు.
ఖజానాకు భారీగా గండి
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తుండటంతో ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిష్డ్ రాయికి సేల్స్ టాక్స్ రూ.1,300, మైనింగ్ టాక్స్ రూ.700 చొప్పున మొత్తం రూ.2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ.70 వేలు టాక్స్ కట్టాలి. రోజుకు 80 లారీలు దొడ్డి దారిన గ్రానైట్‌ను తరలిస్తుండగా నిత్యం రూ.56 లక్షలు చొప్పున నెలకు రూ.16.80 కోట్లు టాక్స్ ఎగ్గొడుతున్నారు.
గ్రానైట్ పాలి‹Ù్డ రాయి అక్రమ రవాణా వ్యవహారం అధికార పార్టీలో కాక రేపుతోంది. ప్రధానంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వర్గాల మధ్య నెలకొన్న వివాదం టీడీపీ పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పంచాయితీ నిర్వహించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment