Granite
-
సీఎం సొంత నియోజకవర్గంలో అక్రమ గ్రానైట్ రవాణా
-
ఒక్క బిల్లు.. 40 లారీలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ ఎమ్మెల్యేల గ్రానైట్ దందా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకే బిల్లు.. 40 లారీల తరలింపు అనే చందంగా సాగిపోతోంది. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే గ్రానైట్ కంటైనర్లకు బిల్లు తప్పనిసరిగా చూపించాలి. అయితే.. ప్రతి కంటైనర్‌కు బిల్లు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీ కింద రూ.40 వేలు చెల్లించాలి. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకుల అండదండలతో ఒక కంటైనర్‌కు మాత్రమే బిల్లు చెల్లించి.. దానినే చూపిస్తూ సుమారు 40 కంటైనర్లను పొరుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఇలా తమిళనాడు, తెలంగాణకు రోజుకు 150కి పైగా కంటైనర్లు అక్రమంగా తరలిపోతున్నాయని విశ్వసనీయ సమాచారం. రోజూ అక్రమ రవాణాదారులు ఒక్కో కంటైనర్‌కు రూ.15 వేల లెక్కన.. టీడీపీ నేతలకు కప్పం కడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ పెద్దలు జేబులు నింపుకోవడం కోసం ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్ల మేర గండి కొడుతున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆడియో లీక్‌తో బండారం బట్టబయలుగ్రానైట్ అక్రమ రవాణాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న వసూళ్ల వ్యవహారంపై బయటకొచ్చిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఓ ఎమ్మెల్యే రూ.కోట్లు సంపాదిస్తుంటే.. ఇంకో ఎమ్మెల్యే అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. జిల్లా నడిబొడ్డున ఉన్న చీమకుర్తి నుంచి కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరుకు కొందరు వ్యాపారులు అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్నారు. ఒంగోలు, సింగరాయకొండ మీదుగా కృష్ణపట్నం వైపు.. పొదిలి, మార్కాపురం, యర్రగొండపాలెంల మీదుగా హైదరాబాద్ వైపు అక్రమ రవాణా సాగిపోతోంది. బేస్తవారిపేట జంక్షన్, రాచర్ల, గిద్దలూరు మీదుగా బెంగళూరు తరలిస్తున్నారు. ఈ మూడు రహదారులపై టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు పట్టుబిగించారు. రూట్లను వేలం వేసి మరీ..ఒక్కో రూట్‌ను ఎమ్మెల్యే మనుషులు రూ.40 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు వేలం నిర్వహించి మరీ పంచుకున్నారు. వేలం సొమ్మును ఎమ్మెల్యేకు ముట్టచెబుతున్నారు. ఈ క్రమంలో ఎవరైనా ఆ మార్గాల్లో గ్రానైట్ తరలించాలంటే టీడీపీ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు చీమకుర్తి కంపెనీల వద్ద గల లారీల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పేరు చెప్పి నగదు వసూలు చేయడం మొదలెట్టారు. ఈ విషయంలో టీడీపీకే చెందిన మరో వ్యాపారి తాను కంపెనీకి బిల్లు చెల్లించానని, కనుక డబ్బులు ఇవ్వనని వారికి స్పష్టం చేశారు. దాంతో వారి మధ్య వివాదం చోటుచేసుకొంది. పొదిలి ఎస్సై వేమన, తాడివారిపల్లిలో బ్రహ్మనాయుడు, గిద్దలూరులో రామకోటయ్య, మార్కాపురంలో సుబ్బారావు ఉన్నారని, ఎలాంటి ఇబ్బంది ఉండదని, బండి చేయి దాటిపోతే మాత్రం విమానం ఎక్కిస్తానంటూ కందుల అనుచరులు బెదిరింపులకు దిగడం కలకలం సృష్టించింది. ఈ మొత్తం వివాదాన్ని సదరు వ్యక్తి రికార్డు చేసి ఆడియో విడుదల చేయడంతో గ్రానైట్ రవాణాలో జీరో వ్యాపారం వెనుక ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల ముసుగు తొలిగింది.ఇతర ఎమ్మెల్యేలకూ వాటాలుమార్కాపురం ఎమ్మెల్యే కందుల మాత్రమే కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ దందాలో వాటాలు ముడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఒంగోలులో జరిగిన స్వర్ణాంధ్ర విజన్ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని గ్రానైట్ దందాపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై చిందులు తొక్కారు. కుక్కలు మొరుగుతుంటాయంటూ నోరుపారేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు ఒక్కడు కూడా రాయలేదని ఎదురుదాడికి ప్రయత్నించారు. గ్రానైట్ అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. -
గ్రానైట్ దందాకు వెల కట్టి వేలం!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి, అధికార పార్టీ నేతలకు కప్పం చెల్లిస్తూ మార్టూరు నుంచి పాలి‹Ù్డ గ్రానైట్ పలకలను జీరో దందాతో అక్రమంగా తరలిస్తున్నారు. జీరో దందా కోసం వ్యాపారులు అధికార పార్టీ పర్చూరు ముఖ్యనేత అనుచరులకు ఒక్కో లారీకి రూ.40 వేలు చొప్పున కప్పం చెల్లిస్తున్నారు. రోజుకు 80 లారీలకుపైగా గ్రానైట్ తెలంగాణకు తరలిపోతుండగా అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతోంది. పర్చూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల టీడీపీ నేతలు ఇందులో వాటాలు పంచుకుంటున్నారు. దందా నడిపిస్తున్న పర్చూరు ముఖ్యనేత, చిలకలూరిపేట నేతకు నెలకు రూ. 2.64 కోట్లు చొప్పున చెల్లిస్తుండగా నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నేతలు ముగ్గురికీ నెలకు రూ.2.20 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ఇక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, కమర్షియల్ టాక్స్ అధికారులకు కలిపి నెలకు రూ.60 లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రోజుకు ఒక్కో లారీకి రూ. 40 వేల చొప్పున 80 లారీలకు రూ.32 లక్షలు వంతున దందా నిర్వాహకులు నెలకు రూ. 9.60 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ నేతలు, అధికారులకు రూ.5.44 కోట్లు చెల్లిస్తుండగా రూ.4.17 కోట్లు దందా నిర్వాహకుల వాటాగా చెబుతున్నారు. ఖజానాకు భారీగా గండి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తుండటంతో ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిష్డ్ రాయికి సేల్స్ టాక్స్ రూ.1,300, మైనింగ్ టాక్స్ రూ.700 చొప్పున మొత్తం రూ.2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ.70 వేలు టాక్స్ కట్టాలి. రోజుకు 80 లారీలు దొడ్డి దారిన గ్రానైట్‌ను తరలిస్తుండగా నిత్యం రూ.56 లక్షలు చొప్పున నెలకు రూ.16.80 కోట్లు టాక్స్ ఎగ్గొడుతున్నారు. గ్రానైట్ పాలి‹Ù్డ రాయి అక్రమ రవాణా వ్యవహారం అధికార పార్టీలో కాక రేపుతోంది. ప్రధానంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వర్గాల మధ్య నెలకొన్న వివాదం టీడీపీ పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పంచాయితీ నిర్వహించనున్నట్లు తెలిసింది. -
కోట్లు కొల్లగొట్టి అక్రమాల్లో ఘనా'పాటి'
అక్రమాల్లో ఆయన ఘనాపాటి. అవినీతి పనులకు పెట్టింది పేరు. ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టడంలో దిట్ట. ఆయనే బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లోని క్వారీల నుంచి అక్రమంగా గ్రానైట్ తరలించి కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టి దానినుంచి బయటపడేందుకు కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. ఈ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. వందలకోట్ల మేర అక్రమ రవాణా జరిగినట్టు నిర్ధారణ అయింది. రూ. 275కోట్ల అపరాథ రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దానిని ఎలా ఎగ్గొట్టాలా అని ఇప్పుడు చూస్తున్నారు. ఆది నుంచి అవినీతిలో ఆరితేరి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారంటూ గొట్టిపాటిపై కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆరోపణలు వచ్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో ఆయన తమ్ముడు కిశోర్‌రెడ్డితో మంతనాలు చేసి పన్ను చెల్లించకుండా తప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే లోకేశ్‌ను కలిసి అక్రమ రవాణా వ్యవహారంపై ఆయనతో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గొట్టిపాటి అక్రమాల చిట్టా... ♦ ఎమ్మెల్యే గొట్టిపాటికి సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో 20 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆరు క్వారీలు ఉన్నాయి. ఇవికాక బినామీలతో మరికొన్నింటిని నడుపుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు కేటాయించిన ప్రాంతంలోనే కాక ఎక్కువ విస్తీర్ణంలో మైనింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ♦ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టిన గొట్టిపాటి టీడీపీలో చేరాక పెద్దఎత్తున అక్రమ మైనింగ్ చేసినట్లు ఆధారాలతో సహా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మైనింగ్ విభాగం నిర్థారించింది. ♦ బల్లికురవ మండలం కొణిదెలలో కిశోర్ స్లాబ్ అండ్ టైల్స్ పేరుతో 6.4 హెక్టార్లలో గ్రానైట్ క్వారీ ఉండగా 2019 నవంబర్ 23న తనిఖీలు నిర్వహించి 42,676 క్యూబిక్ మీటర్ల మేర రా యిని అనుమతి లేకుండా విక్రయించినట్లు ని ర్థారించి రూ.87.45 కోట్ల జరిమానా వేసింది. ♦అదే గ్రామంలో అంకమచౌదరి పేరుతో సర్వేనంబర్ 103లో 4 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న క్వారీలో 43,865 క్యూబిక్ మీటర్ల రాయిని కూడా అక్రమంగా తరలించినట్టు గుర్తించిన విజిలెన్స్ బృందం తనిఖీలు చేసి రూ .54. 23 కోట్లు జరిమానా వేసింది. ♦ఇదే గ్రామ పరిధిలో కిశోర్ గ్రానైట్స్ పేరుతో 3.093 హెక్టార్లలో ఉన్న క్వారీలో కూడా 42,056 క్యూబిక్ మీటర్ల అక్రమ తవ్వకాలు చేయడంతో రూ.87.30 కోట్లు జరిమానా వేశారు. ♦ సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద కిశోర్‡ గ్రానైట్స్ పేరుతో గొట్టిపాటికి 4.10 హెక్టార్లలో క్వారీ ఉండగా 19,752 క్యూబిక్ మీటర్ల మేర తరలించినట్లు గుర్తించిన విజిలెన్స్ రూ.45.68 కోట్లు అపరాధ రుసుం వి ధించింది. మొత్తంగా రూ.274.66 కోట్ల ప న్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ♦ఆయన ఎటువంటి పన్నులు, జరిమానాలను చెల్లించకపోవడంతో చాలా క్వారీల లీజులను రద్దు చేసింది. దీంతో గొట్టిపాటి ఈ అంశంపై హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించి, స్టే తెచ్చుకున్నారు. -
‘జగనన్న భూహక్కు –భూరక్ష’కు సర్వే రాళ్లు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకే జగనన్న భూహక్కు–భూరక్ష పథకం కోసం వినియోగించే సర్వే రాళ్ల ఆర్డర్లిస్తున్నామని రాష్ట్ర గనులు, ఇంధన, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మూడో దశలో అక్టోబర్ 15 నాటికి 25.42 లక్షల సర్వే రాళ్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులతో సర్వే రాళ్ల సరఫరాపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని, సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూతనిస్తూ స్లాబ్ సిస్టమ్ తెచ్చారని, విద్యుత్ రాయితీలు కల్పించారని తెలిపారు. సర్వే రాళ్ల తయారీ ఆర్డర్లను గ్రానైట్ ఫ్యాక్టరీలకే ఇవ్వడం వల్ల ఆయా కర్మాగారాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, వీటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 44.03 లక్షల సర్వే రాళ్లు సరఫరా చేశామని, ఇందుకు రూ.1,153.2 కోట్లను సరఫరాదారులకు, రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్లు చెల్లించామన్నారు. రీసర్వే కోసం గతంలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో రోజుకు లక్ష సర్వే రాళ్లు కావాలని కోరామన్నారు. యూనిట్లకు రా మెటీరియల్‌ను కూడా గనుల శాఖ అధికారులు సమకూర్చారని, మొదట రూ.270 ఉన్న రేటును రూ.300కి పెంచామన్నారు. ఇంత చేస్తున్నా ఫ్యాక్టరీలకు బదులు బయటి నుంచి ట్రేడర్లు సర్వే రాళ్లు సరఫరా చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీలకు నష్టం జరుగుతోందని, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం..లారీ నుంచి ఆటో పైపడ్డ గ్రానైట్ రాయి
-
ఫెమా ఉల్లంఘన కేసులో ఈడీ కార్యాలయానికి గ్రానైట్ వ్యాపారులు
-
ఈడీ విచారణకు హాజరైన PSR గ్రానైట్స్ అధినేత పాలకుర్తి శ్రీధర్
-
Hyderabad: ఈడీ, ఐటీ దాడులపై స్పందించిన మంత్రి గంగుల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. బుధవారం పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈడీ, ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, దుబాయ్ పర్యటనకు వెళ్లిన మంత్రి గంగుల ఈడీ దాడులపై సమాచారం అందుకుని వెళ్లిన 17 గంటల్లోనే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ ఈడీ, ఐటీ దాడులపై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఇంట్లోని లాకర్లను తానే వీడియో కాల్లో ఉండి ఓపెన్ చేయించినట్లు చెప్పారు. 'ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ సోదాలు నిర్వహించారు. 31 సంవత్సరాల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాం. మాపై చాలామంది చాలా సార్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మేము ఎక్కడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాం' అని మంత్రి పేర్కొన్నారు. చదవండి: (మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే) -
గ్రానైట్ దందాపై కన్నెర్ర
అధిక లోడుతో గ్రానైట్‌ను రవాణా చేస్తున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా కొద్దిరోజులుగా పోలీస్, విజిలెన్స్ శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్‌ను తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. దీంతో అధికారులు పలు వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షలకు పైగా అపరాధ రుసుం వసూలు చేశారు. తనిఖీల్లో కొన్ని వాహనాలు మాత్రమే పట్టుబడుతుండగా అధికారుల కళ్లుగప్పి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉంది. నెల్లూరు(టౌన్): మన రాష్ట్రంలో లభించే గ్రానైట్‌కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి, గురుజేపల్లి, బల్లికురువ, శ్రీకాకుళం టెక్కలి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి నెల్లూరు మీదుగా కృష్ణపట్నం, చెన్నై, హొసూరు, బెంగళూరు ప్రాంతాలకు నిత్యం 200కు పైగా గ్రానైట్ వాహనాలు వెళ్తుంటాయి. వాటిలో అధికశాతం ఓవర్ లోడుతో ఉంటాయి. గ్రానైట్‌ను ఎక్కువగా 22 చక్రాల లారీలు రవాణా చేస్తుంటాయి. ఒక్కో దాంట్లో 57.750 టన్నుల సరుకు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు యజమానులు 90 నుంచి 100 టన్నుల వరకు రవాణా చేయిస్తుంటారు. అధిక లోడు కారణంగా వాహనం అదుపులో ఉండదని అధికారులు చెబుతున్నారు. కాగా తనిఖీల్లో ఓవర్ లోడు ఉన్నట్లు గుర్తిస్తే ప్రాథమికంగా రూ.20 వేలు, దీంతోపాటు వాహన పరిమితికి మించి అధికంగా ఉంటే ఒక్కో టన్నుకు రూ.2,000 చొప్పున అపరాధ రుసుం విధిస్తున్నారు. తనిఖీల సమయంలో రోడ్డుపై వాహనాన్ని ఆపి డ్రైవర్ కనిపించకుండా వెళ్తే దానికి రూ.40 వేలు ఫైన్ వేస్తున్నారు. ఆ వాహనాన్ని ఫొటో తీసి రవాణా శాఖ వెబ్సైట్లో ఉంచుతారు. అక్కడే కేసులు రాస్తే.. అధిక లోడుతో వస్తున్న వాహనాలు అవి మొదలయ్యే పాయింట్లలోనే కేసులు నమోదు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరులో ఆపి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుండడంతో యజమానులు దుర్భాషలాడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నారని చెబుతున్నారు. కాగా అధిక లోడుతో తిరుగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక తదితర వాహనాలపై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. వాటిపై కూడా కేసులు నమోదు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. దెబ్బతింటున్న రోడ్లు అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతింటున్నాయి. దీనికితోడు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలపై నేషనల్ హైవే అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో అధిక లోడు గ్రానైట్ వాహనాల వల్లే రహదారులు దెబ్బతినడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి నెల్లూరు జిల్లా వరకు యాక్సిడెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ అధిక లోడు వాహనాలను అరికడితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు నివేదించారు. తనిఖీలు ముమ్మరం జిల్లా మీదుగా అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కొద్దిరోజులుగా రవాణా శాఖ, పోలీసు, విజిలెన్స్ శాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అయితే పట్టుబడుతున్న వాహనాల సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో 234 వాహనాలను పట్టుకుని రూ.కోటికి పైగా అపరాధ రుసుము విధించి వసూలు చేశారు. వాటిలో అధిక శాతం గ్రానైట్ లారీలే ఉన్నాయి. అధిక లోడు వాహనాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి కేసులు నమోదు చేస్తే సర్కారుకి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటాం ఓవర్‌లోడుతో వెళ్లే వా హనాలపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.1.38 కోట్ల లక్ష్యాన్ని విధించింది. దీనిని చేరుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాం. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మా వంతు కృషి చేస్తాం. – బి.చందర్, ఉపరవాణా కమిషనర్, నెల్లూరు -
సీఎం జగన్‌ను కలిసిన జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) భారీ విరాళాన్ని అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కంపెనీ ప్రతినిధులు కలిసి రూ.కోటి ఐదు లక్షల డీడీని అందించారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని ఈ సందర్భంగా జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఛైర్మన్ ఆర్.వీరమణి సీఎంకు వివరించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో జెమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఆర్.గుణశేఖరన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి చెన్నైకి చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రెవేట్ లిమిటెడ్ (జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) రూ. 1,05,00,000 విరాళం. కోవిడ్ – 19 నివారణకు తీసుకున్న సమర్ధవంతమైన చర్యలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని సీఎంకి వివరించిన కంపెనీ చైర్మన్ ఆర్. వీరమణి. pic.twitter.com/V5kW0YADcc — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 16, 2022 చదవండి: (3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే: సీఎం జగన్) -
కుప్పం గ్రానైట్.. అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్
కుప్పంలో గ్రానైట్ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడ లభించే అరుదైన గ్రీన్ గ్రానైట్‌కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన రాళ్లు తక్కువ ధరకే అందుబాటులో ఉండడంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి భారీగా విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. రాతి బంగారం లావాదేవీల కారణంగా స్థానిక ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతోంది. సాక్షి, చిత్తూరు/శాంతిపురం: జిల్లా సరిహద్దు ప్రాంతంలోని కుప్పం నియోజకవర్గం గ్రానైట్ వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. పొరుగునే తమిళనాడు, కర్ణాటక ఉండడంతో లావాదేవీలకు మరింత అనుకూలంగా మారింది. ఈ ప్రాంతంలో వివిధ రకాల గ్రానైట్ రాళ్లు లభిస్తుంటాయి. అయితే గ్రీన్ గ్రానైట్‌కు మాత్రం మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరకే అధిక నాణ్యత గల రాళ్లు ఇక్కడ దొరుకుతుండడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తుంటారు. ప్రధానంగా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు, సి.బండపల్లె, రామకుప్పం మండలం బగళనత్తం, ముద్దనపల్లె, గుడుపల్లె మండలం ఓయన్ పుత్తూరు, పాపానూరులో సుమారు 100 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడే గ్రానైట్ రాళ్లను వివిధ సైజ్‌ల్లో తీర్చిదిద్దుతారు. ప్లేట్లు, క్యూబ్స్, కర్బ్స్గా పల ఆకృతుల్లో రాళ్లను మలుస్తుంటారు. వేలాది మందికి ఉపాధి కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్ క్వారీల్లో సుమారు 20వేల మంది ఉపాధి పొందుతున్నారు. తమిళనాడు, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులే అధికంగా పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 20వేల మందికి జీవనోపాధి లభిస్తోంది. మొత్తం 40వేల కుటుంబాల వరకు గ్రానైట్ పరిశ్రమ మీదే ఆధారపడి ఉన్నాయి. ఇక్కడి కార్మికులు ఒక్కో గ్రానైట్ పీస్‌కు కూలీ కింద రోజుకు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. ఆకర్షణీంగా డిజైన్లు కుప్పం పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల గ్రానైట్ రాళ్లు లభిస్తుంటాయి. ఆకుపచ్చ (గ్రీన్), బూడిద రంగు (గ్రే), గ్రీన్ అండ్ గ్రే రాళ్లు ఆకర్షణీయమైన లేన్లుగా ఉంటాయి. వీటి బేస్ తెల్లటి మచ్చలు, లైనింగ్‌తో చూడగానే ఆకట్టుకుంటాయి. ఇక తక్కువ పరిమాణంలో బ్లాక్‌స్టోన్ కూడా దొరుకుతుంటాయి. వీటిలో గ్రీన్ గ్రానైట్ అధికంగా విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. బ్రిటీష్ కాలంలోనే.. బ్రిటీష్ వారి పాలనలోనే కుప్పం గ్రానైట్ ఎగుమతి ప్రారంభమైనట్లు రికార్డుల్లో ఉంది. 1925లో ఇక్కడి నుంచి లండన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సమాధి రాళ్ల కోసం తెల్లదొరలు కుప్పం గ్రానైట్‌ను తీసుకెళ్లినట్లు పేర్కొని ఉంది. అయితే అధికారిక లెక్కల ప్రకారం సుమారు 35 ఏళ్లుగా కుప్పం గ్రానైట్ ఎగుమతులు సాగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే.. గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా గ్రానైట్ వ్యాపారం డీలా పడింది. లావాదేవీలు నిలిచిపోవడంతో పరిశ్రమ తీవ్ర సంక్షభాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యథావిధిగా పుంజుకుందని స్థానిక వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఎగుమతులు కూడా బాగా సాగుతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్: తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు.. ఇవి గమనించండి!) రూ.కోట్ల లావాదేవీలు.. కుప్పం గ్రీన్ గ్రానైట్‌కు అధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ గ్రానైట్‌ను కొనుగోలు చేసేందుకు దేశ,విదేశీ వ్యాపారులు పోటీపడుతుంటారు. అంతర్జాతీయ స్థాయిలో పలు కార్పొరేట్ కంపెనీలు తమ నిర్మాణాల్లో వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే కుప్పం నుంచి ప్రతి నెలా సుమారు 2వేల టన్నుల వరకు గ్రీన్ గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. రూ.కోట్ల లావాదేవీలు సాగిస్తున్నారు. భారీ గ్రానైట్ బండలను స్థానికంగానే ట్రిమ్మింగ్ చేసి వివిధ సైజుల్లో తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి సైతం పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. రాతి పనే జీవనాధారం మాకు రాతి పనే జీవనాధారం. గ్రానైట్ డ్రస్సింగ్ క్యాంపుల్లో నేను, నా భార్య జయమ్మ పనిచేస్తున్నాం. ఒక్కో పీస్‌కు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వస్తోంది. ఈ డబ్బుతోనే మా పిల్లలను చదివిస్తున్నాం. వాళ్లు మాలాగా కాయకష్టం చేయకుండా ఉద్యోగాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. గ్రానైట్ వ్యాపారం బాగా సాగితే కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుంది. – సుబ్రమణ్యం, రాళ్లబూదుగూరు మరో పని తెలియదు చదువు ఒంట బట్టక మా నాన్నతో కలిసి చిన్నతనం నుంచి రాయిని తొలిచే పనులకు వచ్చేవాడిని. సుమారు 20 ఏళ్లుగా రాతి పని చేస్తుండటంతో మరో వృత్తి తెలియదు. పనులు బాగా దొరికితే రోజుకు రూ వెయ్యి వరకు వస్తుంది. అయితే కరోనా సమయంలో పనిలేక తీవ్రంగా ఇబ్బందిపడ్డాం. ప్రభుత్వం, దాతల సాయంతో పొట్ట పోసుకున్నాం. ఇప్పుడు మళ్లీ పనులు పెరుగుతున్నాయి. – కార్తీక్, కార్మికుడు, సోలిశెట్టిపల్లె -
కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు వారి ‘వ్యాపార రహస్యం’ బట్టబయలైంది. ఏళ్లుగా సాగుతున్న గ్రానైట్ బాగోతం వెలుగుచూసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు గ్రానైట్ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. కలర్ గ్రానైట్‌ను అక్రమ తరలించడమే కాకుండా అడ్డగోలుగా విక్రయాలు జరిపారు. ఈ మొత్తం వ్యవహారం గనుల శాఖ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసింది. దీనిపై పక్కా ఆధారాలతో అధికారులు కోట»ొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చదవండి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు కోటబొమ్మాళి మండలం పెద్ద బమ్మిడి గ్రామంలో సర్వే నంబర్ 106/1,104/9లో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్‌కుమార్ పేరున శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. 2018 ఏప్రిల్ 23 నుంచి 2038 ఏప్రిల్ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల పాటు మినరల్ డీలర్ లైసెన్స్ తీసుకున్నారు. దీంట్లో నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావు భాగస్వాములుగా ఉన్నారు. జిల్లాలో అనేక కలర్ గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ బ్లాక్‌లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ, అచ్చెన్న కుటుంబీకులకు చెందిన ఈ ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. మే 8న వచ్చిన సమాచారం మేరకు కంచిలి మండలం భైరీపురం గ్రామంలోని రానా గ్రానైట్ అండ్ మినరల్ క్వారీ నుంచి గ్రానైట్ బ్లాక్‌లను తరలిస్తున్న వాహనాన్ని(ఏపీ30టీఎ 1089) గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి గడువు దాటిన పరి్మట్‌తో అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. మే 8వ తేదీ మ«ధ్యాహ్నం 3.11గంటల వరకే ఉన్న పర్మిట్‌ను ఆధారంగా చేసుకుని ఆ తర్వాత గ్రానైట్ బ్లాక్‌ల తరలింపు చేసినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది స్టేట్మెంట్ తీసుకుని వాహనం సీజ్ చేశారు. ఈ సందర్భంలో తమ యాజమాన్యం చెప్పినట్టుగా వాహనం బ్రేక్ డౌన్ అయిన కారణంగా ఆలస్యమైందని, దానివల్ల గడువు సమయం దాటి రవాణా చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ జరిపారు. పలాస దగ్గర ఉన్న టోల్ ప్లాజాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా పట్టుకున్న ఏపీ 30టీఎ 1089వాహనం నిర్దేశిత ట్రాన్సిట్ గడువు సమయంలో మూడు సార్లు లోడింగ్, అన్‌లోడింగ్‌తో అటు ఇటు వెళ్లినట్టు రికార్డైంది. దీంతో ఒక ట్రాన్సిట్ ఫారంతో రెండు మూడు సార్లు గ్రానైట్ బ్లాక్‌ల అక్ర మ తరలింపు జరిగినట్టు అభిప్రాయానికొచ్చారు. దీని వెనుక గుట్టు తేల్చేందుకు ఈ గ్రానైట్ బ్లాక్‌లు రవాణా జరిగిన అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీని, అటు కంచిలిలో ఉన్న గ్రానైట్ క్వారీని పరిశీలించి, విచారణ జరిపారు. దీంతో దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీ బాగోతం బయటపడింది. అ«ధికారుల విచారణను దృష్టిలో ఉంచుకుని అప్పటికప్పుడు గ్రానైట్ బ్లాక్‌ల నంబర్లు దిద్దుబాటు చేయడం, నంబర్ల టాంపరింగ్‌కు పాల్పడటం వంటివి చేశారు. అంతేకాకుండా ఒకే నంబర్‌తో ఉన్న వివిధ గ్రానైట్ బ్లాక్‌లను గుర్తించారు. అలాగే, ఆన్లైన్లో ఉన్నదానికి, భౌతికంగా ఉన్న బ్లాక్‌ల నిల్వల తేడాను సైతం పట్టుకున్నారు. 172.87 క్యూబిక్ మీటర్ల బరువైన 23 బ్లాక్‌లకు సంబంధించి తేడాలు ఉన్నాయి. ఇవన్నీ గ్రానైట్ క్వారీల నుంచి అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీని విలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. దానిని అచ్చెన్న ఫ్యామిలీ వ్యూహాత్మకంగా గండి కొట్టి దోచుకుంది. కేసు నమోదు అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రభుత్వ ప్రాపర్టీ దొంగతనం, టాంపరింగ్, డూప్లికేషన్, ఉన్న స్థితిని మార్చడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్‌కుమార్, భాగస్వాములైన నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావుపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో శ్రీకాకుళం గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. -
గ్రానైట్ ఎగుమతులు ఆపాలని చైనా, హాంకాంగ్ నుంచి ఆదేశాలు
-
రాయచోటి రాక్ గార్డెన్స్.. శిలల సొగసు చూడతరమా!
వైఎస్సార్ జిల్లా: రాయచోటి ప్రాంతంలోని కొండల్లో వివిధ ఆకృతులతో ఏర్పడిన శిలలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెద్ద రాతి గుండుపై మరో గుండు, దానిపై ఇంకొకటి...ఇలా ఎవరో పేర్చినట్లు ఉంటాయి. కొన్ని శిలలు అడుగు భాగాన కొద్దిపాటి ఆధారంతో నిలుచుని ఎప్పుడూ పడిపోతాయో అన్నట్లు ఉంటాయి. లక్కిరెడ్డిపల్లె మండలం గంధం వాండ్లపల్లె సమీపాన ఉన్న కొండపై అచ్చం ఓ మనిషి మద్దెల వాయిస్తున్నట్లుగా ఉన్న ఓ రాయి విశేషంగా ఆకట్టుకుంటోంది. స్థానిక ప్రజలు దీన్ని బొమ్మ కొండ లేదా మద్దెల కొండ అని పిలుస్తారు. ఇక్కడికి సమీపంలోనే మరో కొండలోని ఓ రాయి వెలిగించిన కొవ్వొత్తి రూపంలో ఉంది. కడప నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలో గువ్వల చెరువు దాటాక వచ్చే మేదరపల్లె వద్దనున్న చెరువులో ఉన్న రాయి ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. పాలకడలిలో శేష తల్పాన్ని పోలినట్లు ఈ రాయి కనబడుతుంది. శిలలు వివిధ ఆకృతుల్లో ఏర్పడటానికి గల శాస్త్రీయ కారణాలు తెలియని ప్రజలు ఒక్కొ రాయి చుట్టూ ఒక్కొ కథను అల్లారు. అవే నేటికీ ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి గుట్టకు, ప్రతి రాయికి ఏదో ఒక కథ ప్రచారంలో ఉంది. రాయచోటి రాక్ గార్డెన్స్ వెనుక ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. జియాలజిస్టులు చెబుతున్న ప్రకారం లావా చల్లబడుతూ వచ్చిన క్రమంలో ఇలాంటి కొండలు, గుట్టలు ఏర్పడ్డాయి. టెంపరేచర్, ప్రెషర్‌ను బట్టి రకరకాల రూపాలు ఏర్పడ్డాయి. రాయచోటి ప్రాంతంలోని శిలలు ఇగ్నస్ రాక్స్ లేదా మాగ్నాటిక్ రాక్స్ అంటారు. ఆర్కియన్ యుగంలో ఇవి ఏర్పడ్డాయి. కొన్ని లక్షల సంవత్సరాలు గాలి, వాన, నీరు రాపిడి వల్ల శిలలు వివిధ ఆకృతులను సంతరించుకున్నాయి. అడుగు భాగాన చిన్నపాటి ఆధారంతో ఎప్పుడు మీద పడుతాయో అన్నట్లుగా ఉండే శిలలను టార్స్ అని పిలుస్తారు. గ్రానైట్‌లో ఉండే సిలికా కంటెంట్ సాలిడ్ అయ్యి గువ్వల చెరువు ప్రాంతంలో క్వార్ట్జైట్స్ ఏర్పడ్డాయి. రాయచోటి ›ప్రాంతంలోని రాక్ గార్డెన్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల స్టోన్ క్రషింగ్ యజమానులు ఇష్టమొచ్చిన రీతిలో కొండలను ధ్వంసం చేస్తున్నారు. చాలాచోట్ల అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇందువల్ల అందమైన శిలలు క్రమేపీ ధ్వంసం కావడం ప్రకృతి ప్రేమికులను ఆందోళన పరుస్తోంది. అరుదైన శిలలను కాపాడి భావి తరాలకు అందించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
జమ్మూకశ్మీర్: బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని భద్రత సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా- శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జమ్ముకశ్మీర్ పరిధిలోని బారాముల్లాలో బిఎస్ఎఫ్ భద్రత దళాలపై.. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాగా, ఉగ్రవాదులు.. గ్రనైడ్లు, రాకేట్ లాంచర్లతో దాడిచేశారు. దీన్ని భద్రత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ కాల్పులలో ఒక ఉగ్రవాదిని భద్రత సిబ్బంది హతమార్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న(గురువారం) అర్ధరాత్రి భద్రత సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు కాల్పులలో మరణించిన ఉగ్రవాది.. పాకిస్థాన్ కు చెందిన ఉస్మాన్‌గా అధికారులు తెలిపారు. బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఎకె-47 రైఫిల్స్, గ్రనైడ్లు, రాకెట్ లాంఛర్లను స్వాధీనం చేసుకున్నట్టు భద్రత సిబ్బంది ప్రకటించారు. కాగా, వరుస ఉగ్రదాడులతో ప్రస్తుతం బారాముల్లాలో అధికారులు హైఅలర్ట్‌ను ప్రకటించారు. -
ఎన్నికల్లో ఓడిపోయా.. డబ్బులు ఇయ్యి: టీడీపీ నేత
అనంతపురం: తెలుగు దేశం పార్టీ నాయకుడు బరి తెగించాడు. గ్రానైట్ మేనేజర్‌ను రూ.50 వేలు చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేశానని.. వాటిని తిరిగి సంపాదించేందుకు సహకరించాలని మేనేజర్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ ఘటన అనంతపురము జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురము జిల్లా కుర్తికోటలో టీడీపీ నేత రెడ్డి శేఖర్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఓటుకు రూ.2 వేలు పంచానని.. ఆ డబ్బులు తిరిగి సంపాదించేందుకు సహకరించాలని మేనేజర్‌ను శేఖర్ కోరాడు. దీంతో తనకల్లులో మారుతి గ్రానైట్ మేనేజర్‌ను బెదిరించాడు. నెలకు రూ.50 వేలు రౌడీ మామూళ్లు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బు కోసం ఈ విధంగా పట్టపగలు బెదిరింపులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో టీడీపీ నేత రెడ్డి శేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బద్ధికొండపై ‘పచ్చ’ కన్ను
ఇది రొళ్ల మండలం పరిధిలోని గొట్టుగుర్కి సమీపంలో ఉన్న బద్ధికొండ. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండ 60 శాతం కర్ణాటక పరిధిలో.. మిగిలిన 40 శాతం మన రాష్ట్ర పరిధిలో ఉంది. ఇక్కడున్న కొండలోని 40 ఎకరాల్లో గ్రానైట్ ఉన్నట్లు టీడీపీ నేతలు గుర్తించారు. అప్పటి నుంచి ఇక్కడ గ్రానైట్ తవ్వకాలకు అనుమతులకోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ బద్ధికొండపై తవ్వకాలకు అనుమతి ఇస్తే తమ గ్రామమే వల్లకాడవుతుందని గొట్టుగుర్కివాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ పంచభూతాలను కబ్జా చేసిన టీడీపీ నేతలను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బుద్ధిమార్చుకోలేదు. ఏకంగా ఓ ఊరంతా నాశనమైనా సరే తమ జేబులు నిండితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. తమ స్వార్థం కోసం నాలుగు గ్రామాలకు అండగా ఉన్న బద్ధి కొండను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పచ్చని పొలాలను.. గలగలపారే సెలయేళ్లను.. వాటిపై ఆధారపడి జీవిస్తున్న గ్రామీణులను బలి చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ప్రజలంతా ఏకమై పచ్చనేతల తీరును తూర్పారపడుతున్నారు. రొళ్ల : మండల పరిధిలోని గొట్టుగుర్కి సమీపంలో ఉన్న బద్ధికొండపై టీడీపీ నేతల కన్ను పడింది. కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకా మిగిగేశి హోబళి రెడ్డిహళ్లి గ్రామంతో పాటు గొట్టుగుర్కి గ్రామాల మధ్య ఉన్న ఈ కొండలో విలువైన గ్రానైట్ ఉన్నట్లుగా పసిగట్టిన టీడీపీ నేతలు.. ఎప్పుడెప్పుడు కొండను కరిగిద్దామని ఉవ్విళ్లూరుతున్నారు. గ్రానైట్ తవ్వకానికి అనుమతి ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు సంబంధిత అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. చారిత్రాత్మక కొండ బుద్ధికొండకు చాలా చారిత్రక నేపథ్యముంది. ఈ కొండ పై చిన్నపాటి కోటగోడ కూడా ఉంది. దళితుల కులదైవం ఓబుళనరసింహస్వామి దేవాలయం కూడా ఈ కొండలోనే ఉంది. కొండపై ఉన్న కన్నేరమ్మదొణ ప్రాధాన్యత సంతరించుకుంది. కుంటల నిలయం బద్ధికొండ బద్ధికొండ ప్రాంతంలో బావులు, కుంటలు, చెక్‌డ్యాంలు అధికంగా ఉన్నాయి. నాగన్న, పెద్దపులి, కృష్ణప్ప, రామాంజప్ప, భూతప్ప, రాజప్ప, కర్ల, పాతన్న, బాపనోళ్ల, నల్లప్ప కుంటలు ఈ కొండ ప్రాంతంలోనే ఉన్నాయి. గ్రామస్తులు భూతప్ప జలధి చేసే స్థలం కూడా ఈ కొండ ప్రాంతంలోనే ఉంది. వర్షాకాలంలో ఈ కొండ ప్రాంతంలోని కుంటలు, కట్టలన్నీ పూర్తిగా నిండుతాయి. ఫలితంగా ఈ గ్రామ పరిధిలో 165 బోర్లల్లో భూగర్భజల మట్టం పెరిగి సాగుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు చెబుతున్నారు. 150 ఎకరాల్లో విస్తరించిన పూలతోటలు బుద్ధికొండ సమీపంలోని దాదాపు 150 ఎకరాల్లో రైతులు చామంతి, బంతి, కనకాంబరం ఇతరాత్ర పూలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా పూర్ణిమ, పచ్చ, గుండు పచ్చ, డోన్ పచ్చ, కర్నూలు రకం, కలర్ చామంతి, చాందిని, బంతి, మల్లె తదితర వంటి చామంతి రకాల పూలను పండిస్తున్నారు. ఈ పూలకు డిమాండ్ ఎక్కువగా ఉండగా.. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు తరలించి అమ్ముకుంటారు. ఈ నేపథ్యంలో ఈ కొండపై గ్రానైట్ తవ్వకాలకు అనుమతిస్తే దుమ్ము, ధూళి చెలరేగి పూలతోటలన్నీ నాశమవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. దళితులకు తీరని నష్టం బద్ధికొండకు అరకిలోమీటరు దూరంలోనే గొట్టుగుర్కి గ్రామం ఉంది. ఎస్సీ కాలనీ ఈ కొండకు పూర్తిగా ఆనుకుని ఉంది. ఈ గ్రామంలో సుమారు 350 కుటుంబాలుండగా.. ఇందులో 20 దళిత కుటుంబాలు కొండకు ఆనుకునే ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కొండపై గ్రానైట్ తవ్వకానికి అనుమతిస్తే ఎక్కువగా నష్టపోయేది దళిత కుటుంబాలే. అందుకే వారు ఇప్పటికే కలెక్టర్, సంబంధిత మంత్రితో పాటు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతపురం అర్బన్: రొళ్ల మండలం గుడ్డగుర్కి పంచాయతీ గొట్టుగుర్కి గ్రామం చుట్టూ ఉన్న రత్నగిరి గ్రామ సర్వే నెంబర్లు 152, 157, 93 లోని బద్దికొండ, మాలకొండల్లో గ్రానైట్ తీసేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని రైతులు రోడ్డెక్కారు. సోమవారం కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు తిమ్మారెడ్డి, శ్రీరాములు, మూర్తి, రాయుడు మాట్లాడారు. బద్దికొండ, మాలకొండ.. కొండల చుట్టూ గొట్టుగుర్కి, గుడ్డగుర్కి, క్యాతప్ప పాళ్యం, వన్నప్పపాళ్యం, దాసప్ప పాళ్యం, గిరేనాయకుని పాళ్యం, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాడప్ప పాళ్యం, రెడ్డిహళ్లి గ్రామాలు ఉన్నాయన్నారు. ఈ కొండపై తవ్వకాలకు అనుమతి ఇస్తే ఆయా గ్రామాలన్నీ కనుమరుగవుతాయన్నారు. అనంతరం స్పందనలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు లింగరాజు, నాగేంద్ర, తదితరులు ఉన్నారు. ప్రజలు రోగాల బారిన పడతారు బద్ధికొండపై తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. కొండపై క్వారీ పనులు ప్రారంభిస్తే కుంటలు మాయమై భూగర్భజలం పూర్తిగా అడుగంటి పోతుంది. దుమ్ముధూళి వల్ల పంటలన్నీ దెబ్బతింటాయి. ప్రజలు కూడా రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. – శ్రీరామప్ప, గొట్టుగుర్కి, రొళ్ల మండలం పర్యావరణానికి హాని బద్ధికొండలో గ్రానైట్ తవ్వకానికి అనుమతి ఇస్తే మా గ్రామం మొత్తం నష్టపోతుంది. ప్రధానంగా కొండలోని కుంటలన్నీ కనుమరుగవుతాయి. దుమ్మూ ధూళికి పూల తోటలన్నీ దెబ్బతింటాయి. పర్యావరణానికి కూడా హాని జరుగుతుంది. – నరసింహమూర్తి, గొట్టుగుర్కి, రొళ్ల మండలం -
‘ఖనిజం’లో కంత్రీలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో ఖనిజ సంపదకు లోటు లేదు. అపారమైన ఖనిజ సంపద మన జిల్లా సొంతం. కానీ ప్రభుత్వానికి ఆదాయం మాత్రం అంతంతే. జిల్లా వ్యాప్తంగా గరివిడి, దత్తిరాజేరు, బొబ్బిలి, రామభద్రపురం, కొత్తవలస, చీపురుపల్లి, మెరకముడిదాంతో పాటు పలు ప్రాంతాల్లో ఖనిజ సంపద ఉన్నా ప్రభుత్వానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదాయం రావట్లేదు. మార్కెట్లో ఎంతో విలువున్న ఈ ఖనిజ సంపద తరలించేందుకు గత ప్రభుత్వాలు అమలు చేసిన గంపగుత్త విధానం ఒక కారణమైతే... అనధికార తవ్వకాలు.. అక్రమంగా తరలింపు రెండో కారణం. గనుల శాఖ లెక్కలను బట్టి జిల్లాలో గతేడాది కన్నా ఈ ఏడాది మరీ ఘోరంగా ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీని వల్ల రవాణా కూడా తగ్గింది. ఇప్పుడు కరోనా కారణంగా అదికాస్తా మరింత దిగజారింది. అనుమతులు తక్కువ.. తవ్వకాలు ఎక్కువ... జిల్లాలో ఏడాదిన్నరగా ఖనిజ సంపద ఉన్నా తవ్వకాలు, రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. లేబర్ కొరతతో పాటు అనుమతులున్న కంపెనీలను మించిన అనధికార కంపెనీల నిర్వహణ ఒక కారణంగా ఉంది. జిల్లాలో ఉన్న క్వారీల్లో ఒకరి పేరున క్వారీ అనుమతులుంటే మరొకరు నిర్వహించడం సాధారణమయిపోయింది. దీనిని గతంలో అధికారులు గుర్తించినా... వారికి నామమాత్రపు జరిమానాలు వేసి ఆ తరువాత వారికే పేర్లు మార్చుకునే అవకాశాలు ఇచ్చారని తాజాగా బొబ్బిలి ప్రాంతంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగ్గిన క్వార్ట్జ్, కలర్ గ్రానైట్ల తవ్వకాలు జిల్లాలో ఆరు రకాల క్వారీలుండగా అందులో కలర్ గ్రానైట్, క్వార్ట్జ్ల తవ్వకాలు తగ్గిపోయాయి. మరో పక్క మాంగనీస్, తదితర క్వారీల తవ్వకాల్లోనూ వృద్ధి కానరావడం లేదు. 2018–19 సంవత్సరంతో పోలి్చతే 19–20 సంవత్సరంలో భారీగా తవ్వకాలు పడిపోయాయి. ఈ ఏడాది నుంచి చూసుకుంటే గత ఆరు నెలలుగా తవ్వకాలు, ఉత్పత్తి నెమ్మదిగానే కనిపిస్తోంది. గంపగుత్త కాంట్రాక్టులతోనే అనధికారిక క్వారీలు గత ప్రభుత్వం ఎటువంటి అంచనాలు, రిపోర్టులు లేకుండా గంపగుత్తగా లైసెన్సులు జారీ చేసిందనీ, అందుకు కాంట్రాక్టర్లు(లైసెన్సుదారులు) తమకు ఇష్టం వచ్చిన రీతిలో తవ్వకాలు జరుపుకుని లబి్ధపొందారన్న ఆరోపణలు గతంలోనే వినిపించాయి. దీనికి తోడు ఒక క్వారీ దగ్గర తవ్వి మరో క్వారీ పేరున(లీజు కాలం అయిపోయినందున)రవాణా చేసుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలా మైనింగ్ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించి జరిమానాలు తూతూమంత్రంగా వేసినట్టు ఇప్పటికీ పలువురు చెబుతుంటారు. కొత్తగా వేలం విధానం ప్రభుత్వం కొత్తగా క్వారీలను వేలం విధానంలో ఇచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. జీఎస్ఐ(జియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో కొన్ని చోట్ల సర్వే చేసి ఏ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజం ఉన్నదో దానిని విలువ కట్టి, తవ్వకాలు, నిర్వహణలను బేరీజు వేసుకుని ధర నిర్ణయిస్తారు. దీనికి సంబంధించిన శాఖా పరమైన సిబ్బంది తక్కువ ఉండటంతో అన్ని చోట్లా ఈ విధానం అమలుకు వీలు పడదు. కాబటివ్ట కొన్ని చోట్ల థర్డ్ పార్టీ ద్వారా సర్వే చేయించి వేలం పద్ధతిలో కేటాయించే ఆలోచన చేస్తోంది. కొత్తవిధానానికి కసరత్తు చేస్తున్నాం జిల్లాలో కొత్త ఖనిజ తవ్వకాలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమలు పరిచేందుకు కసరత్తు చేస్తున్నాం. ఉన్న ఖనిజ సంపదను సక్రమ మార్గంలో రవాణా చేసి ప్రభుత్వాదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పూర్ణ చంద్రరావు, డిప్యూటీ డైరెక్టర్, మైన్స్ అండ్ మినరల్స్, విశాఖపట్నం -
గ్రానైట్ రైట్ ‘రాతి’రేల కాసుకో
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వస్తున్న గ్రానైట్ ఓవర్‌లోడ్ వాహనాల నిమిత్తం చెల్లించాల్సిన జరిమానా ఎగ్గొట్టేందుకు అక్రమార్కులు పన్నాగం పన్నారు. దీంతో వాహనాలు రాత్రుళ్లు దొడ్డిదారిన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో రాజమండ్రి–హైదరాబాద్ హైవేపై ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వద్ద తెలంగాణ సర్కారు, పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి వద్ద ఆంధ్రా ప్రభుత్వం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకున్నాయి. ఓవర్‌లోడ్‌తో వస్తున్న గ్రానైట్ వాహనాలు ఈ చెక్ పోస్టుల ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ఏపీలోకి వచ్చే వాహనాల నుంచి ఓవర్లోడింగ్కు టన్నుకు రూ.వెయ్యి చొప్పున అధికారులు వసూలు చేస్తారు. ఒక్కో లారీ 20 టన్నుల వరకూ ఓవర్‌లోడ్‌తో వస్తున్నాయి. అంటే ఒక్కోవాహనానికి రూ.20 వేల వరకూ జరిమానా ఎగ్గొట్టడానికి అక్రమార్కులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. తెలంగాణ నుంచి రోజూ వందలాది గ్రానైట్ లారీలు మన రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడ, విశాఖ పోర్టులకు వెళ్తున్నాయి. దీంతో రాష్ట్ర ఆదాయానికి గండిపడుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో ఉదయం బయలుదేరి..! తెలంగాణలోని ఖమ్మం, ఇతర జిల్లాల నుంచి గ్రానైట్ కాకినాడ, విశాఖపట్నం పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. దీంతో గ్రానైట్ లోడ్ వాహనాలు ఉదయం తెలంగాణలో బయలుదేరి సాయంత్రం, రాత్రికి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకుంటాయి. ఇవి ఎక్కువ ఓవర్‌లోడింగ్‌తో వస్తుంటాయి. ఒక్కో లారీపై సుమారు 60 టన్నుల వరకూ లోడింగ్‌కు అనుమతి ఉంటుంది. అయితే 75 నుంచి 80 టన్నులకుపైగా బరువైన గ్రానైట్ రాళ్లతో ఇవి వస్తున్నాయి. ఓవర్‌లోడ్ ఉంటే బోర్డర్ చెక్‌పోస్టు వద్ద టన్నుకు రూ.వెయ్యి వరకూ జరిమానా చెల్లించాలి. అంటే ఒక్కో లారీకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా కట్టాలి. అయితే ఎక్కువ శాతం రవాణాదారులు జరిమానా ఎగ్గొట్టేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. చాలా వరకూ గ్రానైట్ నకిలీ వే బిల్లులతో రవాణా అవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, మైనింగ్ టాక్స్‌లూ ఎగ్గొడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి పన్నులను చెల్లించకుండా కోట్ల రూపాయల విలువైన రాయిని కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నారు. ఈ విషయం వాణిజ్యపన్నుల శాఖ అధికారులకుతెలిసినా వారు పట్టించుకోరు. వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లడానికి అభ్యంతర పెట్టకుండా ఉండేందుకు ఆయా శాఖలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. రోజుకు 40 నుంచి 60 లారీల వరకూ ఓవర్‌లోడ్ తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండురోజల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే 11 లక్షల రూపాయల వరకూ జరిమానా వసూలైంది. కళ్లుగప్పేదిలా..! గ్రానైట్ వాహనాలు అధికారుల కళ్లుగప్పి ఆంధ్రాలోకి ప్రవేశించడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు వెళ్తున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలు అశ్వారావుపేట, జీలుగుమిల్లి మీదుగా కాకుండా, గంగారం నుంచి రాఘవాపురం మీదుగా ఏలూరు చేరుకుని విజయవాడ– కోల్‌కతా హైవే ఎక్కుతున్నాయి. అదేవిధంగా మేడిశెట్టివారిపాలెం, అడ్డరోడ్డు నుంచి మళ్ళి యర్రగుంటపల్లి, మక్కినవారిగూడెం, లక్ష్మీపురం మీదుగా హైదరాబాద్ –రాజమండ్రి హెవేపైకి చేరుకుని మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఏపీకి రావాల్సిన ఆదాయానికి రూ.కోట్లల్లో గండి పడుతోందని సమాచారం. సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి దొడ్డి దారిన వెళ్తున్న వాహనాల నుంచి పన్నులు వసూలు చేస్తే మన ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. రోజూ ఆంధ్రా సరిహద్దులోకి చేరుకున్నాక రాత్రి 9 గంటల తరువాతే ఈ వాహనాలన్నీ చెక్ పోస్టులు లేని దారుల్లో నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేసిస్తున్నాయి. ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో మరిన్ని చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం ఖాయం. తనిఖీలు నిర్వహిస్తాం చెక్‌పోస్టులు తప్పించుకునేందుకు భారీ వాహనాలు వేరే మార్గాలను ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నాం. వాణిజ్యపన్నుల శాఖ, రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ఈ అక్రమ రవాణాను అడ్డుకుంటాం. మాపై ఎటువంటి ఒత్తిళ్లూ లేవు.– రేవు ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్ -
క్వారీ.. కొర్రీ
అనంతపురం టౌన్: క్వారీ నిర్వాహకులు...ప్రభుత్వ ఖజానాకు కొర్రీ పెడుతున్నారు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే సహజ వనరులను సరిహద్దు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మైనింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం విజిలెన్సు అధికారులు జిల్లాలో వ్యాప్తంగా క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన 60 క్వారీలకు రూ.100కోట్లకుపైగా జరిమానాలు విధించారు. అయినా నేటికీ పైసా వసూలు కాలేదు. దీనిపై దృష్టి సారించాల్సిన గనులశాఖ అధికారులు ఏమాత్రం పట్టిచుకోకపోవడం లేదు. దీంతో క్వారీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. వసూళ్లు శూన్యం.. 2018 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 40 క్వారీలపై విజిలెన్సు అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వానికి చెల్లించిన రాయలీ్టకి.. క్వారీల్లో చేపట్టిన తవ్వకాలకు పొంతన లేకపోవడంతో దాదాపు 30 క్వారీలకు రూ.46.84 కోట్లు జరిమానా విధించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 37 కేసులు నమోదు చేసి రూ.32.19 కోట్ల మేర జరిమానా విధించారు. గనులశాఖ అధికారులు నేటికీ పైసా వసూలు చేయలేదు. యథేచ్ఛగా తవ్వకాలు.. క్వారీ నిర్వాహకులు జరిమానాలు చెల్లించకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. జరిమానా కట్టని క్వారీలను సీజ్ చేయాలని గనులశాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో గనులశాఖ విజిలెన్స్ అధికారులు నెలరోజులుగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మడకశిర, పెనుకొండ, గోరంట్ల మండలాల క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ వాహనాలను సీజ్ చేశారు. ఇక శెట్టూరు మండలంలోని గ్రానైట్ క్వారీలకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక సరిహద్దు ఉండగా... అక్కడి క్వారీల నిర్వాహకులు తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి అధిక మొత్తంలో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్‌ను తరలిస్తున్నారు. దీంతోపాటు పెనుకొండ నియోజకవర్గంలో రోడ్డు మెటల్ క్వారీలకు దాదాపు రూ.10 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయితే అక్కడ సైతం తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ నిర్వాహకులు జరిమానా విధించిన క్వారీల్లోనే తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. నోటీసులు జారీ చేశాం జరిమానా విధించిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఇప్పటికే క్వారీ నిర్వాహకులకు నోటీసులను జారీ చేశాం. నిర్ణీత గడువులోగా జరిమాన సొమ్ము చెల్లించకపోతే క్వారీలు సీజ్ చేస్తాం. జరిమానా విధించిన క్వారీల్లో అక్రమంగా తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులకు సిఫార్సు చేస్తాం. – ఓబుల్‌రెడ్డి, గనులశాఖ ఏడీ -
ముదురుతున్న గ్రానైట్ యుద్ధం
సాక్షి, కరీంనగర్: ‘కరీంనగర్లో లక్షలాది మందికి ఉపాధిగా మారిన గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడబోతుందా..? ఇప్పటికే చైనాలో మార్కెట్ లేక నష్టాల బాట పట్టిన వ్యాపారులు ఎనిమిదేళ్ల క్రితం నాటి సీనరేజీ ఫీజు, అపరాధ రుసుం రూ.729 కోట్లు చెల్లిస్తారా? ఇప్పటికే క్వారీ పరిశ్రమ నుంచి తప్పుకున్న క్వారీ యజమానుల జాబితాలోకి మిగతా వారు కూడా చేరుతారా..?’ గత కొద్ది రోజులుగా కరీంనగర్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఇలాంటి సందేహాలు రాకమానవు. కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన బండి సంజయ్‌కుమార్ గ్రానైట్ వ్యాపారంలో జరు గుతున్న అవకతవకలనే తొలి టార్గెట్‌గా భావించారు. ఎనిమిదేళ్ల క్రితం నమోదైన రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్‌ను ఎగుమతి చేస్తున్న కారణంగా సీనరేజీ ఫీజుపై 5 రెట్ల అపరాధ రుసుం కింద వసూలు చేయాల్సిన రూ.749 కోట్లు సర్కారు ఖజానాకు జమ చేయడం లేదని పాత కేసును తెరపైకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ గనుల శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు పంపారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడమే గాక, గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి విచారణ జరిపించాలని కోరారు. దీంతో గ్రానైట్ యుద్ధం పతాక స్థాయికి చేరింది. మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగుల కమలాకర్ సోదరుడికి గ్రానైట్ వ్యాపారంతో సంబంధాలున్నాయి. ఆయనతోపాటు కరీంనగర్‌కు చెందిన సుమారు 300 మందికి గ్రానైట్ వ్యాపారంలో ప్రవేశం ఉంది. గత కొంతకాలంగా వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం 300 నుంచి 28 క్వారీలకు వ్యాపారం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పులిమీద పుట్రలా రూ.749 కోట్ల ఎగవేత అంశం తెరపైకి తేవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రాజ్యాంగ సంస్థలను కూడా సంజయ్ ఆశ్రయించడం గ్రానైట్ వ్యాపారులకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు పరిశ్రమను మూసివేసి బంద్ పాటించాలని నిర్ణయించడం గమనార్హం. నోటీసులు జారీ చేసిన గనుల శాఖ ఎంపీ సంజయ్ గ్రానైట్ వ్యాపారంలో ఎగవేతలపై సాగిస్తున్న పోరు నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ అప్రమత్తమైంది. వరంగల్ భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డికి ఈ కేసును అప్పగించారు. ఆయనే స్వయంగా 2011 నాటి సీనరేజీ ఎగవేత, పెనాల్టీ విధింపు అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు కరీంనగర్ గనుల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు క్వారీ యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేశారు. సుమారు 125 మందికి ఇప్పటికే నోటీసులు పంపించిన అధికారులు మిగతా వారికి కూడా సోమవారం వరకు పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ వ్యాపారులు తమ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్ జిల్లా గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం మీడియా ముందుకు వచ్చి వేధింపులకు నిరసనగా మూడు రోజుల పాటు గ్రానైట్ పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. గ్రానైట్ పరిశ్రమ వల్ల 2లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని, రాజకీయ కక్షతో ఒక వ్యక్తి పరిశ్రమనే నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. తాము న్యాయబద్దంగా ప్రభుత్వానికి సీనరేజీ ఫీజు చెల్లించే వ్యాపారం చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అసలెక్కడివీ రూ.749 కోట్లు 2011లో కరీంనగర్ నుంచి 8 రైల్వే యార్డుల ద్వారా 8 ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలు చైనాకు ఎగుమతి చేసేందుకు పంపించిన గ్రానైట్ బ్లాకులకు కాకినాడ పోర్టు వద్ద తనిఖీలు నిర్వహించిన గనుల శాఖ, ప్రభుత్వానికి రూ.125 కోట్ల సీనరేజీ ఫీజు చెల్లించకుండా రవాణా చేస్తున్నారని కేసు నమోదు చేసింది. గనుల శాఖ నిబంధనల ప్రకారం రాయల్టీ ఎగవేత కింద సీనరేజీ ఫీజు రూ.125 కోట్లతోపాటు పెనాల్టీగా + 5 రెట్లు నిర్ణయించారు. తద్వారా కరీంనగర్‌కు చెందిన 8 ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీల ద్వారా గ్రానైట్ రవాణా చేసిన సుమారు 200 మంది క్వారీ యజమానులకు ఈ జరిమానా విధించడం జరిగింది. ఈ అంశంపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో గ్రానైట్ వ్యాపారులు చర్చలు జరిపారు. గ్రానైట్ బ్లాకుల పరిమాణాల్లో తేడాలున్నాయని, క్వారీల వారీగా కొలతలు వేయాలని, కట్ చేసిన గ్రానైట్ రాయికి మార్కెట్ చేసే రాయికి మధ్య వ్యత్యాసం ఉంటుందని వాదనలు వినిపించారు. ఐదు రెట్లు అదనంగా కాకుండా 1+1 ప్రాతిపదికన అపరాధరుసుం చెల్లించేందుకు సిద్ధమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు కోర్టును కూడా ఆశ్రయించారు. కరీంనగర్‌కు చెందిన 200 మంది వ్యాపారులు భాగస్వామ్యంగా గల ఈ కేసును విచారించేందుకు గనుల శాఖ వద్ద సరైన యంత్రాంగం లేకపోవడం, ఇతర కారణాల వల్ల 2011 నాటి కేసు మూలన పడింది. సంజయ్ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ అంశంపై యుద్ధమే ప్రకటించారు. గతంలో జరిగిన అవకతవకలను వేటినీ వదిలేది లేదని, కరీంనగర్లో గ్రానైట్ మాఫియా తయారైందని ఆయన బాహాటంగానే చెబుతున్నారు. గంగుల కుటుంబం వ్యాపారంతో రాజకీయ రంగు మంత్రి గంగుల కుటుంబానికి గ్రానైట్ వ్యాపారంతో సంబంధాలు ఉండడంతో వ్యాపారులు కూడా సహజంగానే ఆయనకు మద్దతుదారులుగా నిలిచారు. ఎగుమతి చేస్తున్న 8 క్వారీలకు చెందిన గ్రానైట్‌కు సంబంధించి సీనరేజీ ఫీజు చెల్లించలేదని సంజయ్ వాదన. ఈ 8 క్వారీలదే రూ.125 కోట్ల సీనరేజీ ఫీజు కాగా, పెనాల్టీ 625 కోట్లు కలిపి రూ.749 కోట్లు అని చెబుతున్నారు. కానీ 8 ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీల ద్వారా కరీంనగర్‌లోని 200 క్వారీలకు చెందిన రాయి కాకినాడకు వెళ్లిందని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. గనుల శాఖ కూడా ఇప్పటికే 125 మందికి పైగా నోటీసులు జారీ చేసిందంటే 8 క్వారీల లెక్క సరికాదని అర్థమవుతోంది. గంగుల కుటుంబానికి చెందిన ఓ కంపెనీ పేరును పోలీన ఏజెన్సీ పట్టుబడిన ఎనిమిదింట ఉండడమే ఈ వివాదానికి కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. -
అక్రమార్కుల్లో బడా బాబులు?
సాక్షి, ప్రకాశం(మార్టూరు) : నకిలీ వేబిల్లులతో గ్రానైట్ రాయిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఎనిమిది వాహనాలను విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రం మార్టూరులో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ భూషణం కథనం ప్రకారం.. మార్టూరు కేంద్రంగా నకిలీ వేబిల్లుల వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ముందస్తు సమాచారంతో ఒంగోలు, విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు 16 మంది నాలుగు బృందాలుగా ఏర్పడి శనివారం అర్ధరాత్రి మార్టూరులో నలుమూలలా నిఘా పెట్టారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి నాలుగు గంటల వరకు అధికారుల నిర్వహించిన తనిఖీల్లో గ్రానైట్ రాయిని అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. నాగరాజుపల్లి రోడ్డు నుంచి జాతీయ రహదారి వైపు వస్తున్న 8 లారీలకు ఎలాంటి వే బిల్లులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించారు. తెల్లవారే సరికి విషయం గుప్పుమనడంతో ఏడు లారీల్లోని సరుకుకు చెందిన అసలు యజమానులు తమ వద్ద సంబంధింత వే బిల్లులు ఉన్నాయంటూ పోలీసుస్టేషన్‌కు వచ్చి అధికారులతో అన్ని రకాల సంప్రదింపులు జరిపారు. ఎనిమిదో వాహనానికి ఎలాంటి బిల్లు లేనట్లు అధికారులు ధ్రువీకరించారు. ఏడు వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన అధికారుల దృష్టికి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వే బిల్లులు ఒరిజినల్ అయినప్పటికీ ఆ బిల్లులు ఆదివారం తరలిస్తున్న గ్రానైట్ వాహనాలకు సంబంధించినవి కావని అధికారులు గుర్తించారు. అంతేగాక రవాణా జరిగే సరుకుకు సంబంధించిన ఎలాంటి బిల్లులైనా సంబంధిత వాహనంలో సిబ్బందితో ఉండాల్సి ఉంది. వాహనాల తనిఖీ అనంతరం యజమానులు ఇవిగో బిల్లులు అంటూ తీసుకొచ్చి అధికారులకు చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. యజమానులు అధికారులకు చూపించిన వే బిల్లులు పాతవని తెలుస్తోంది. గతంలో ఒకసారి వాహనాలను అవే వే బిల్లులతో విడిపించుకెళ్లినట్లు సమాచారం. ఇప్పుడు అవే బిల్లులను రెండోసారి గ్రానైట్ రాయిని తరలించేందుకు ఉపయోగిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. అంటే ఒకసారి జనరేటైన బిల్లులతో యజమానులు పలుమార్లు గ్రానైట్ రాయిని రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ క్రమంలో గ్రానైట్ రాయి యజమానులు అధికారులను రకరకాల ప్రలోభాల ద్వారా లొంగదీసుకునేందుకు పైరవీలు జరపడం విశేషం. ఎనిమిది వాహనాల్లోని ముడిరాయి విలువ 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒంగోలు మైనింగ్ శాఖ ఆర్ఐ నాగిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో దర్యాప్తు చేస్తే పెద్ద మనుషుల్లా చలామణి అయ్యే బడా బాబుల జాతకాలు వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. విజిలెన్స్ సీఐలు ఎం.శ్రీనివాసరావు, బి.నాయక్, ఎస్ఐలు మహ్మద్ జానీ, కోటేశ్వరరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ సుధాకర్, ఏఓ ఉమాపతి, సిబ్బంది ప్రసాద్, వెంకట్, నరసయ్య పాల్గొన్నారు. పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన మార్టూరు: పోలీసులు తమ కాలనీకి చెందిన యువకుడిని వేధించారంటూ స్థానిక సంపత్‌నగర్ వాసులు ఆదివారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంతలో స్థానిక గొట్టిపాటి హనుమంతురావు కాలనీకి చెందిన మరొక కేసుకు సంబంధించిన వారు రావడంతో పోలీసుస్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు.. నకిలీ వేబిల్లుల కేసులో విచారణలో భాగంగా స్థానిక సంపత్‌నగర్ కాలనీకి చెందిన కుంచాల వంశీకృష్ణను ఎస్ఐ కె.మల్లికార్జున గత శనివారం పోలీసుస్టేషన్‌కు పిలిపించి విచారించారు. విచారణలో భాగంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టడమేగాక చెవుల వద్ద కరెంట్‌షాక్ పెట్టారనేది వంశీకృష్ణ ఫిర్యాదు. జిల్లా వడ్డెర సంఘ అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు ఆధ్వర్యంలో 70 మంది మహిళలు ఇదేమని ప్రశ్నించేందుకు 7 గంటల ప్రాంతంలో పోలీసుస్టేషన్‌కు వచ్చారు. అదే సమయానికి రేణింగివరం ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో స్టేషన్‌కు చేరుకున్నారు. విలేకరులతో మాట్లాడుతూ కేసులో నిందితుడిగా ఉంటే ప్రశ్నించాలేగానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సరికాదన్నారు. ఎస్ఐపై మంత్రి బాలినేని, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఎస్ఐ మల్లికార్జునను వివరణ కోరగా వం«శీకృష్ణ నకిలీ వేబిల్లుల వ్యాపారంలో నిందితుడని, కొన్నేళ్లుగా ఈ వ్యాపారం సాగిస్తున్నాడని, ఓ కేసులో భాగంగా అతడిని స్టేషన్‌కు పిలిచి విచారించామేగానీ కరెంట్ పెట్టడం వంటి చర్యలకు పాల్పడలేదని చెప్పారు. ఇదే సమయంలో ఇటీవల గొట్టిపాటి హనుమంతురావు కాలనీలో మూడేళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేయాలంటూ కాలనీకి చెందిన 30 మంది స్టేషన్ వద్దకు చేరడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
తళుకులపై మరకలు!
చార్మినార్: కాలిబాట పథకం పనుల్లో (చార్మినార్ పెడస్ట్రీయన్ ప్రాజెక్టు– సీపీపీ) భాగంగా రూ.35 కోట్లతో చేపట్టిన గ్రానైట్ పనులతో చార్మినార్ పరిసరాలు ఆకట్టుకుంటున్నాయి. గుల్జార్‌హౌజ్– చార్మినార్, చార్మినార్– సర్దార్ మహల్ భవనం, మక్కా మసీదు– చార్మినార్,చార్మినార్– లాడ్‌బజార్ వరకు ప్రధాన రహదారులన్నింటినీ గ్రానైట్ పనులతో అందంగా తీర్చిదిద్దారు. చార్మినార్, మక్కా మసీదు రోడ్డులో చేపట్టిన గ్రానైట్ అభివృద్ధి పనులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గ్రానైట్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన వెంటనేచార్మినార్– మక్కా మసీదు కట్టడాల వరకు సాధారణ వాహనాల రాకపోకలకు నో ఎంట్రీ విధించారు. చార్మినార్ కట్టడానికి నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారి మళ్లించారు. చార్మినార్ అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డును అందుబాటులోకి తేచ్చారు. వాహనదారులు చార్మినార్– మక్కా మసీదు రోడ్డు ద్వారా వెళ్లడం లేదు. అందమైన గ్రానైట్ రోడ్డుతో పాటు వాహనాల రాకపోకలు లేకపోవడంతో చార్మినార్– మక్కా మసీదు రోడ్డులో విశాలంగా ఖాళీ స్థలం ఏర్పడింది. దీంతో దేశ, విదేశాల పర్యాటకులు చార్మినార్– మక్కా మసీదును సందర్శించడానికి వచ్చినప్పుడు రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సెల్ఫీలు దిగితూ సందడి చేస్తున్నారు. సహజత్వం కోల్పోతున్న గ్రానైట్ రోడ్లు.. కొంత కాలంగా ఇక్కడి టిఫిన్ సెంటర్లు, హోటళ్లలోని వ్యర్థాలను గ్రానైట్ రోడ్డుపై వేస్తుండడంతో ఆయా పరిసరాలు అపరిశుభ్రతతో కనిపిస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ లోపం కారణంగా గ్రానైట్ రోడ్ల సహజత్వం దెబ్బతింటోంది. జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి రోజు చార్మినార్–మక్కా మసీదు రోడ్లలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఉత్సవాలు, పండగ వేళల్లో చార్మినార్, చార్‌కమాన్, మక్కా మసీదు, సర్దార్ మహల్ రోడ్డు, లాడ్‌బజార్ రోడ్లను నీటితో శుభ్రంగా కడుగుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు చెత్త చెదారం మాత్రమే తొలగిపోతోంది తప్ప.. హోటల్ వ్యర్థాలతో పాటు మురుగునీటి నిల్వతో గ్రానైట్ రోడ్లు సహజ రంగును కోల్పోతున్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రమైన చార్మినార్ వద్ద నిరంతర పర్యవేక్షణ అవసరమని సందర్శకులు కోరుతున్నారు. వాటర్ గన్స్‌తో శుభ్రపరుస్తాం.. కొన్ని వ్యర్థాలను స్థానిక వ్యాపారులు గ్రానైట్ రోడ్డుపై వేస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అక్కడ కొంత మందికి అవగాహన కల్పించాం. వినిపించుకోని వారికి చలానాలు సైతం విధించాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటర్ గన్స్ ద్వారా గ్రానైట్ రోడ్లను కడిగిస్తాం. ఇప్పటికే అవసరమైన పరికరాలను ఖరీదు చేశా. కార్యాచరణ ప్రారంభించాల్సి ఉంది.– బి.శ్రీనివాస్‌రెడ్డి, చార్మినార్ జోనల్ కమిషనర్ -
డెడ్ రెంట్లతో కాలక్షేపం
సాక్షి , చీమకుర్తి (ప్రకాశం): లీజు కావాలని దరఖాస్తు చేస్తారు. తీరా లీజు పొందిన తర్వాత క్వారీయింగ్ చేయకుండా ఏళ్ల తరబడి మైనింగ్ డిపార్టుమెంట్‌కు డెడ్‌రెంట్ చెల్లించి కాలక్షేపం చేస్తుంటారు. కాలక్షేపం చేయటం వెనుక వారు అంతకుముందే మరికొన్ని లీజులు పొంది ఉంటారు. వాటిలోనే సంవత్సరాల నుంచి క్వారీయింగ్ చేస్తుండటం వలన రెండోదశలో లీజులను పొందిన భూముల్లో క్వారీయింగ్ చేసే తీరిక, ఆర్థిక వనరులు, మ్యాన్‌పవర్, మిషన్ పవర్ లేక సంవత్సరాల తరబడి కాలం వెళ్లదీస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చీమకుర్తి మండల పరిధిలోని గ్రానైట్ భూముల్లోనే కనిపిస్తుంది. లీజులను పొందిన విలువైన గ్రానైట్ భూముల్లో రాళ్లను సంవత్సరాల తరబడి వెలుపలకు తీయకుండా కేవలం డెడ్‌రెంట్ చెల్లించి ఆ భూములను కొంతమంది బడా గ్రానైట్ నేతలు తమ గుత్తాధిపత్యం కింద ఉంచుకుంటున్నారనే విమర్శలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు చీమకుర్తిలోని గ్రానైట్ రంగంలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఐరన్‌ఓర్, గార్నెట్, సిలికా, క్వార్టజ్, కలర్ గ్రానైట్, రోడ్మెటల్, గ్రావెల్ విభాగాల్లో కనిపిస్తుంది. మైన్స్ డిపార్టుమెంట్ కార్యాలయం నుంచి సేవకరించిన గణాంకాలు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... లీజులు పొందిన గ్రానైట్, ఇతర భూముల వివరాలు జిల్లాలోనున్న పలు ఖనిజ సంపద కలిగిన భూముల్లో 1687.6 హెక్టార్లలో 375 లీజులను ప్రభుత్వం మైనింగ్ కార్యాలయం ద్వారా జారీ చేసింది. వాటిలో ప్రభుత్వానికి చెందిన భూములు 1316.6 హెక్టార్లు ఉన్నాయి. ప్రైవేటు రంగానికి చెందిన భూములు 366 హెక్టార్లు ఉన్నాయి. కానీ పొందిన 375 లీజుల్లో 132 లీజులు ఏళ్ల తరబడి నాన్‌వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. లీజు పొంది నాన్‌వర్కింగ్ కండిషన్లో ఉన్న భూములు దాదాపు 600 హెక్టార్లలో ఉన్నట్లు అంచనా. వర్కింగ్ కండిషన్లో ఉన్న మిగిలిన వెయ్యి హెక్టార్లలో కూడా క్వారీయింగ్ చేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా నాలుగో వంతు భూమిలో మాత్రమే క్వారీయింగ్ చేస్తున్నట్లు స్థానిక వాస్తవ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. డెడ్‌రెంట్ వసూలు చేసే విధానం ప్రభుత్వం నుంచి లీజులు పొందిన భూములకు భూమి రకం, ఖనిజం విలువను బట్టి డెడ్‌రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. మైనింగ్ డిపార్టుమెంట్ అధికారులు నిర్ణయించిన ప్రకారం అత్యంత ఖరీదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు డెడ్‌రెంట్ కింద హెక్టార్‌కు ఏడాదికి రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో బ్లాక్ గెలాక్సీ భూములు ఒక్క చీమకుర్తి మండలంలోని రామతీర్థం పరిధిలో లీజులను పొందిన భూములు 474 హెక్టార్లు ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి డెడ్‌రెంట్ ద్వారా రూ.4.74 కోట్లు కేవలం డెడ్‌రెంట్ ద్వారానే ఆదాయం వస్తుంది. ఇక తర్వాత స్థానం బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ బల్లికురవ, కనిగిరి ప్రాంతాల్లో ఉన్నాయి. వాటికి కూడా హెక్టార్‌కు రూ.1 లక్ష వంతున డెడ్‌రెంట్ చెల్లించాలి. బ్లాక్‌గ్రానైట్ భూములు 115.9 హెక్టార్లలోను, 281.8 హెక్టార్లలో జిల్లాలో విస్తరించి ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.3.96 కోట్లు డెడ్‌రెంట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇక 212 హెక్టార్లలో ఉన్న రోడ్‌మెటల్‌కు హెక్టార్‌కు రూ.50 వేలు వంతున, 45 హెక్టార్లలో ఉన్న గ్రావెల్‌కు రూ.40 వేలు వంతున డెడ్‌రెంట్ చెల్లిస్తుంటారు. 18.9 హెక్టార్ల పరిధిలోనున్న సిలికా శాండ్‌కు, 28.8 హెక్టార్ల పరిధిలోనున్న కార్టజ్కు సమానంగా హెక్టార్‌కు రూ.15 వేలు వంతున, 505 హెక్టార్ల విస్తీర్ణంలోనున్న ఐరన్ఓర్కు రూ.4 వేలు వంతున, 4.7 హెక్టార్ల పరిధిలోనున్న గార్నెట్ భూములకు రూ.2 వేలు వంతున లీజులను పొందిన యజమానుల నుంచి ప్రభుత్వం డెడ్‌రెంట్ వసూలు చేస్తుంది. ఇలా 375 లీజుల ద్వారా 1687 హెక్టార్లపై ప్రభుత్వానికి ఏడాదికి రూ.12.35 కోట్లు ఆదాయం వస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరుసగా 2 సంవత్సరాలు పనిచేయకపోతే లీజు రద్దు మైనింగ్ చట్టాల ప్రకారం లీజుపొందిన యజమాని వరుసగా రెండు సంవత్సరాలు లీజు పొందిన భూమిలో క్వారీయింగ్ చేయకపోతే లీజు రద్దవుతుంది. కానీ మైనింగ్ చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని లీజు పొందిన కాలం 2 సంవత్సరాలు పూర్తి కాబోయే లోపే దానిని మళ్లీ లీజు కోసం దరఖాస్తు చేసుకోవడం, అడ్డదారులలో దక్కించుకోవడం వలన క్వారీయింగ్ చేయకుండానే విలువైన భూములను కొంతమంది బడా నేతల యజమానుల గుప్పెట్లో ఉండిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లకు పడగలెత్తిన గ్రానైట్ వ్యాపారవేత్తలు కావడం, పలుకుబడి కలిగి ఉండటం వలన లీజు పొందిన తర్వాత కేవలం డెడ్‌రెంట్ చెల్లించి వారి గుత్తాధిపత్యం కిందనే ఉంచుకుంటూ ఇతరులకు భూములను దక్కకుండా చేస్తున్నారనే విమర్శలు స్థానికుల్లో వెల్లువెత్తుతున్నాయి. అందు వలనే రామతీర్థం పరిధిలోని గ్రానైట్ భూములు ఒకే సంస్థ కింద వందల ఎకరాల విస్తీర్ణం కలిగిన గ్రానైట్ భూములు పొందిన వ్యక్తులు పదుల సంఖ్యలో ఉన్నారు. సంస్థ పేరులో చిన్న పదాలను మార్పులు చేసి ఒకే కార్పొరేట్ శక్తిగా ఎదిగిన గ్రానైట్ పెద్దలు వందల కొలది ఎకరాల భూములను తమ గుప్పెట్లో పెట్టుకొని పెత్తనం చేస్తున్నారని, గ్రానైట్ రంగంలోకి కొత్తగా రావాలనుకునే వారికి అవకాశం ఇవ్వకుండా ముందు మిగిలి భూములను దక్కించుకున్న వారే తమ ఆధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలున్నాయి. 2 సంవత్సరాలు పనిచేయకపోతే లీజు రద్దు చేస్తాం లీజులను పొందిన గ్రానైట్, ఇతర భూముల్లో వరుసగా 2 సంవత్సరాలు పాటు పనిచేయకపోతే వారు పొందిన లీజులను రద్దు చేసే అధికారం మైనింగ్ డిపార్టుమెంట్‌కు ఉంటుంది. కానీ లీజు కాలం 2 సంవత్సరాలు పూర్తయ్యేలోపు వారే మళ్లీ లీజు పొంది కంటిన్యూ చేసుకుంటున్నారు. క్వారీయింగ్ చేయకుండా ఖాళీగా ఉంటే ఆ భూములకు డెడ్‌రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. జీ.రామచంద్రరావు, ఏడీ, ఒంగోలు -
గ్రానైట్ క్వారీయింగ్‌పై టీఎస్ఎండీసీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఖనిజాన్వేషణ, ఖనిజాల వెలికితీత, క్వారీ లీజుల ద్వారా రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని క్వారీయింగ్‌కు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఇప్పటికే డైమెన్షనల్ మార్బుల్ డిపాజిట్లను గుర్తించింది. అయితే మార్బుల్ నిల్వలు ఉన్న ప్రాంతం షెడ్యూలు ఏరియాలో ఉండటంతో లీజు అనుమతుల్లో సాధ్యాసాధ్యాలపై టీఎస్ఎండీసీ అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఖమ్మం జిల్లాల్లో డైమన్షనల్ మార్బుల్ స్టోన్ నిల్వలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మార్బుల్ నిల్వల వెలికితీతను ప్రైవేటు సంస్థలకు లీజు విధానంలో అప్పగించారు. రాష్ట్రంలో గ్రానైట్, మార్బుల్‌కు రోజురోజుకూ డిమాండు పెరుగుతుండగా, భవన నిర్మాణదారులు ఎక్కువగా రాజస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంతోపాటు దక్షిణ భారతదేశంలో మార్బుల్, గ్రానైట్‌కు ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని గ్రానైట్, మార్బుల్ క్వారీయింగ్‌ను సొంతంగా చేపట్టాలని టీఎస్ఎండీసీ నిర్ణయించింది. ఈ మేరకు గ్రానైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఊట్కూరులో ఓ బ్లాక్‌ను కూడా గుర్తించింది. అయితే ఈ ప్రాంతం షెడ్యూలు ఏరియాలో ఉండటంతో క్వారీయింగ్ చేపట్టడంపై 1/70 చట్టం నిబంధనలు అడ్డు వస్తున్నాయి. డైమన్షనల్ స్టోన్ నిల్వలపైనా అధ్యయనం ఖమ్మం జిల్లాలో నాణ్యమైన బ్లాక్ గ్రానైట్, మార్బుల్ నిల్వలు ఉన్నట్లు 80వ దశకం ఆరంభంలోనే గనులు, భూగర్భ వనరుల శాఖ గుర్తించింది. 22 మైళ్ల పొడవు, 1.5 మైళ్ల వెడల్పు, 200 మీటర్ల లోతు కలిగిన నిల్వల నుంచి 92 లక్షల క్యూబిక్ మీటర్ల డైమన్షన్ స్టోన్ వెలికి తీయవచ్చని గతంలోనే అంచనా వేశారు. ఈ మేరకు కొందరికి లీజు అనుమతులు ఇచ్చినా, 1/70 చట్టం నిబంధనలతో వెలికితీత సాధ్యం కాలేదు. అయితే కేవలం ఇసుక తవ్వకాలకే పరిమితం కాకుండా, ఇతర ఆదాయ మార్గాలపైనా దృష్టి సారించాలని టీఎస్ఎండీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా గ్రానైట్ నిల్వలపై మరోమారు దృష్టి సారించింది. గత ఏడాది నమూనాలు సేకరించి ఫార్ములేషన్లు విశ్లేషించి, నాణ్యతను పరిశీలించారు. మార్బుల్, గ్రానైట్ (డైమన్షనల్ స్టోన్) క్వారీయింగ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే కొందరు ఔత్సాహికులు టీఎస్ఎండీసీకి దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రం నుంచి నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీగా గుర్తింపు పొందిన టీఎస్ఎండీసీ ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో సున్నపు రాయి అన్వేషణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆదాయం పెంచుకునేందుకే క్వారీయింగ్ వివిధ ఖనిజాల మైనింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. 2016–17లో రూ. 3,143 కోట్లు, 2017–18లో రూ.3,704 కోట్లు ఆదాయం రాగా, 2018–19లో సుమారు రూ.4వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే ఇందులో అత్యధికంగా ఇసుక విక్రయాల ద్వారానే రాష్ట్ర ఖజానాకు ఎక్కువగా ఆదాయం వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇసుక విక్రయాల ద్వారా రూ. 2,415 కోట్లు ఖజానాకు సమకూరాయి. 2017–18లో రూ.678 కోట్లు, 2018–19లో రూ.886 కోట్లు ఇసుక విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ప్రస్తుతం గ్రానైట్ వెలికితీత ద్వారా కన్సిడరేషన్ రూపంలో రూ.50 లక్షల లోపు మాత్రమే టీఎస్ఎండీసీకి ఆదాయం వస్తోంది. గ్రానైట్ క్వారీయింగ్ ప్రణాళిక ఆచరణలోకి వస్తే టీఎస్ఎండీసీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
గచ్చు అందం రెట్టింపు..!
సాక్షి, హైదరాబాద్: గ్రానైట్, మార్బుల్ కొత్తలో ఇట్టే ఆకట్టుకుంటాయి. నిర్వహణలో శ్రద్ధ లేకపోతే గచ్చుపై మురికి పేరుకుపోయి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు వద్దనుకుంటే నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదు. మల్లెకన్నా తెల్లనిది మార్చుల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంత ప్రత్యేకత గత పాలరాతిని ఎంత ఇష్టంగా ఎంచుకుంటామో.. శుభ్రపరిచే విషయంలోనూ అంతే ఇష్టాన్ని కనబర్చాలి. ఠి ఫ్లోర్ మీద పడిన దుమ్ము, ధూళిని ఎప్పుడూ మెత్తని గుడ్డతో తుడవాలి. నీళ్లతో కడగాలనిపిస్తే గోరువెచ్చని నీటిని వాడండి. ఈ నీటిలో తక్కువ శక్తిగల డిటర్జెంట్ పౌడర్లను వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఎక్కువ వేడి గల నీటిని వినియోగించవద్దు. మరకల్ని తొలగించేందుకు పదునైన సాధనాలను వాడరాదు. ఠి నేలను కడిగాక మెత్తటి పేపర్ టవల్‌తో తుడిస్తే సరిపోతుంది. మార్కెట్లో నాణ్యమైన మార్బుల్ క్లీనర్లు దొరకుతున్నాయి. ధర తక్కువని నాసిరకం క్లీనర్లను వాడితే ఖరీదైన మార్బుల్ వెలవెలబోతుంది. ఠి మార్బుల్ కాంతులు వెలసిపోవద్దనుకుంటే కాఫీ, టీ వంటి ఇతరత్రా ద్రవ పదార్థాలను నేల మీద పడకుండా జాగ్రత్త పడితే మంచిది. నిత్యం మెరవాలంటే.. గట్టిదనానికి మారుపేరు గ్రానైట్. నిర్వహణ కూడా సులువే. ఈ ఫ్లోరింగ్ ఎప్పటికప్పుడు మెరిసిపోతూ ఉండాలంటే.. పాత్రలను తోమే డిటర్జెంట్ పౌడరును కలిపి గోరు వెచ్చని నీటితో ప్రతిరోజు కడిగి మెత్తటి బట్టతో తుడిస్తే గ్రానైట్ ఫ్లోర్ తళతళమెరుస్తుంది. ఠి వంట గదిలో కూరగాయలు, తదితరాలను కోసేందుకు గ్రానైట్ ఐల్యాండ్‌ను వాడొద్దు. అలాచేస్తే గీతలు పడి అసహ్యంగా కనిపిస్తుంది. ఠి గ్రానైట్‌ను కడిగే నీటిలో నాసిరకం డిటర్జెంట్ పౌడర్లను వాడొద్దు. అవి గ్రానైట్‌ను కాంతి విహీనం చేస్తాయి. ఠి మార్కెట్లో స్టోన్ పాలిష్ లభిస్తున్నాయి. వీటితో అప్పుడప్పుడు ఫ్లోర్‌ను పాలిష్ చేయించండి. -
కార్మికుల ప్రాణాలు పోతున్నా నిద్రలేవరా?
-
అక్రమాలకు అనుమతి
అనంతపురం టౌన్: గ్రానైట్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను సైతం పక్కనపెడుతుండటం చూస్తే ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఎవరెవరికి ఎంత ముట్టజెప్పాలో తెలిసిన అక్రమార్కులు.. నకిలీ పర్మిట్లతో దందా సాగిస్తున్నారు. అధికారులు చుట్టపుచూపు పర్యవేక్షణతో సరిపెడుతుండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల గండి పడుతోంది. జిల్లాలో అధికారికంగా 320 క్వారీలకు గనుల శాఖ అనుమతించింది. ఇందులో 70 పైగా గ్రానైట్ క్వారీలు, 250 రోడ్డు మెటల్ క్వారీలు ఉన్నాయి. ఇటీవలగనుల శాఖ అధికారుల బృందం జిల్లాలోని క్వారీలను పరిశీలించారు. చాలా వరకు క్వారీల్లో అనుమతులకు మించి త్వకాలు జరిపినట్లు నిర్ధారణ కావడంతో వాటిని సీజ్ చేయాలని.. అనుమతుల్లేని క్వారీల నిర్వాహకులకు జరిమానా విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ దిశగా ఇప్పటి వరకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఒక్క పర్మిట్‌తో పదులసంఖ్యలో వాహనాలు అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మిన్నకుండిపోతుండటంతో గ్రానైట్ అక్రమ రవాణా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. ఒక్క పర్మిట్‌తో పదుల సంఖ్యలో వాహనాలు అత్యంత విలువైన గ్రానైట్‌ను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక్కడి గ్రానైట్‌కు కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా మడకశిర, శెట్టూరు, గోరంట్ల, పెనుకొండ ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రానికి సమీపంలో ఉండడంతో వీరి అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోతోంది. కర్ణాటక సరిహద్దులో దాదాపు 18కిపైగా చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ దొడ్డిదారిన గ్రానైట్ తరలిస్తున్నారు. చోద్యం చూస్తున్న గనులశాఖ అధికారులు గడిచిన ఏడాది కాలంలో అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న ఒక్క వాహనాన్ని మాత్రమే సీజ్ చేయడం చూస్తే అధికా రుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. అదికూడా పెనుకొండ పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఎలాంటి పర్మిట్లు లేకుండా గ్రానైట్ తరలిస్తుండడంతో వాహనాన్ని సీజ్ చేశారు. అది మినహా ఇప్పటి వరకు గనులశాఖ అధికారులు గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకున్న పాపనపోలేదు. ఎంతో విలువైన ప్రకృతి సంపద కళ్లెదుటే జిల్లా సరిహద్దులు దాటిపోతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం కావడం వల్లే అధికారులు కూడా మౌనం దాలుస్తున్నట్లు తెలుస్తోంది. పైగా నెలవారీ మామూళ్ల కారణంగా కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాధానం చెప్పలేక.. జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా విషయమై గనులు, భూగర్భ శాఖ ఏడీ వెంకట్రావును ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరే ప్రయత్నం చేసింది. అయితే ప్రతిసారీ ఆయన సమాధానం దాటవేస్తూ ఫోన్ కట్ చేయడం చూస్తే వాస్తవాన్ని అంగీకరించినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న గ్రానైట్ క్వారీ గోరంట్ల మండలం గంగం పల్లి గ్రామంలోనిది. ఇక్కడ గ్రానైట్ తవ్వకానికి ఎలాంటి అనుమతల్లేవు. క్వారీని సీజ్ చేయాలని గనుల శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయినప్పటికీ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్‌ను కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారు. -
ఊరికొక్కడు
-
గ్రానైట్ రాయిపడి కూలీ దుర్మరణం
దామరగిద్ద (నారాయణపేట): పొట్ట కూటికోసం వలస వెళ్లి గ్రానైట్ కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు గ్రానైట్ రాయి మీదపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని లోకుర్తిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్(30) గత మూడేళ్లుగా ఉపాధి కోసం షాద్‌నగర్‌లోని మహి గ్రానైట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం ప్రమాదవశాత్తు యంత్రంలో నుంచి గ్రానైట్ రాయి మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్, సుదర్శన్, ఎంపీటీసీ సభ్యుడు రాచప్ప, రాష్ట్ర సీపీఎం నాయకులు భూపాల్‌తోపాటు 40 మంది గ్రామస్తులు కంపెనీ ఎదుట బైటాయించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. ఎండీ అందుబాటులో లేకపోవడంతో అక్కడి అదనపు సిబ్బందితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.13 లక్షలు ఆర్థికసాయం చేయాలని కోరగా అంగీకరించడంతో ఆందోళన విరమించినట్లు చెప్పారు. అశోక్‌కు భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. -
GST దెబ్బకు గ్రానైట్ పరిశ్రమ కుదేలు
-
తొమ్మిది గ్రానైట్ లారీల పట్టివేత
కర్నూలు: పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు సీజ్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి రాయల్టీతో పాటు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు ఆదేశాల మేరకు మొత్తం 9 లారీలను పట్టుకొని కర్నూలు జిల్లా శిరివెళ్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన సుబ్బరావు, నాయుడుతో పాటు మరికొంతమంది కొంత కాలంగా లారీల్లో గ్రానైట్ తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాడిపత్రికి చెందిన అధికార పార్టీ నేత అండదండలతో యథేచ్ఛగా ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఏపీ 02 టీబీ 0477, ఏపీ 02 టీఈ 2799, ఏపీ 02 టీసీ 0495, ఏపీ 02 టీబీ 9855, ఏపీ 02 టీఈ 2277, ఏపీ 02 టీఈ 2268, ఏపీ 02 టీఈ 2727, ఏపీ 02 టీబీ 6228 నెంబర్లు గల లారీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాక్ గ్రానైట్ తరలిస్తుండగా కాపుకాసి వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇందులో నాలుగు వాహనాలు పూర్తిగా బిల్లులు లేకుండా వెళ్తుండగా.. మరో ఐదు వాహనాలు మూడు మీటర్లకు మాత్రమే బిల్లు చెల్లించి, మిగితా గ్రానైట్‌ను జీరో పైన తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయట పడింది. ఒక్కొక్క లారీలో 15 క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను తరలిస్తుండగా అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. అందులో ఏడు వాహన యజమానుల నుంచి రూ.7 లక్షలు వాణిజ్య పన్ను, రాయల్టీతో పాటు అపరాధ రుసుము వసూలు చేసి శుక్రవారం సాయంత్రం ఏడు వాహనాలను వదిలేశారు. మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై ఆ ప్రాంత అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చి తక్కువ మొత్తం అపరాధ రుసుము చెల్లించి వాహనాలను తీసుకెళ్లినట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో కూడా ఈ తరహా వ్యాపారం జోరుగా సాగుతోంది. జొన్నగిరి, ఆస్పరి, డోన్, కృష్ణగిరి ప్రాంతాల నుంచి తాడిపత్రికి భారీ ఎత్తున గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్, గ్రానైట్ అక్రమ రవాణా తదితరాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటి బాబురావు వెల్లడించారు. -
గ్రానైట్‌కు జీఎస్టీ పాలిష్
►ఫినిష్డ్ గ్రానైట్ మార్బల్‌పై 28శాతం పన్ను ►రా మెటీరియల్‌పై 12 శాతం ►రిటైల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం ►ఆందోళనలో పరిశ్రమ వర్గాలు పాలిష్ చేసిన గ్రానైట్‌కు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) పెనుభారంగా మారింది. ఫినిష్డ్ గ్రానైట్‌పై 28 శాతం పన్ను విధించడంతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు 2.5 శాతం మాత్రమే టాక్స్ రూపంలో చెల్లించేవారు. అధిక పన్ను విధించడం వల్ల గ్రానైట్‌కు డిమాండ్ తగ్గి మార్కెట్ కుప్పకూలుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యాలు వాపోతున్నాయి. చిత్తూరు, సాక్షి: పాలిష్ చేసిన గ్రానైట్‌కు జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) పెంచ డం అటు యాజమాన్యాలకు, ఇటు కొనుగోలుదారులకు గుదిబండగా మారింది. గ్రానైట్ రా మెటీరియల్ (క్వారీ నుంచి తీసిన బండ)పై 12 శాతం, ఫినిష్డ్ గ్రానైట్ మార్బుల్ అమ్మకాలపై 28శాతం పన్ను శ్లాబులో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమల్లోకి రాక ముందు వ్యాట్ కింద కేవలం 14.5 శాతం మాత్రమే పన్ను చెల్లించేవారు. రాష్ట్రంలో అమ్మకాలు సాగిస్తే 14.5 వ్యాట్‌లో 12 శాతం ఇన్పుట్ సబ్సిడీగా తిరిగొస్తుంది. అంటే 2.5 శాతం మాత్రమే టాక్స్ రూపంలో యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం గుది బండ మోపడంతో గ్రానైట్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గ్రానైట్ యాజమాన్యాల ఆందోళన ఎందుకంటే.. ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చిన రా మెటీరియల్‌ను ప్రాసెస్ చేసి తిరిగి మార్కెట్లో రీటైల్ లెక్కన విక్రయించాలంటే కొనుగోలుదారులు కచ్చితంగా 28 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఒక ఇంటి యజమాని రూ.2 లక్షల పాలిష్ చేసిన గ్రానైట్‌ను కొనుగోలు చేస్తే దానిపై రూ.5వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో టాక్స్ రూపంలో చెల్లించాలంటే సామాన్యుడు వెనకడుగువేసే అవకాశం ఉంది. పాలిషింగ్ యూనిట్ల నుంచి మెటీరియల్ ఎలా కదులుతుం దని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అధిక పన్ను విధించడం వల్ల సరుకు పేరుకుపోయి.. గ్రానైట్‌కు డిమాండ్ తగ్గి మార్కెట్ కుప్పకూలుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యాలు పేర్కొం టున్నాయి. దీని ప్రభావం జిల్లాలోని దాదాపు 1000 గ్రానైట్ ఫ్యాక్టరీలపై పడనుందని అంటున్నారు. అసంబద్ధ నిర్ణయం.. ఎగుమతి చేసే గ్రానైట్‌పై 28 శాతం జీఎస్టీ విధిస్తే పన్ను కట్టేందుకు రెడీగా ఉన్నాం. కానీ జిల్లాలో లభించేది నాసిరకం గ్రానైట్. దీనివల్ల గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం వల్ల ఫ్యాక్టరీలు మూసుకునే పరిస్థితి దాపురిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని చిన్నాచితక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. కార్మికులు రోడ్డు న పడే అవకాశం ఉంది. ప్రభుత్వం పునరాలోచించాలి. తగిన కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – విజయానందరెడ్డి, మ్యాక్గ్రానైట్స్ అధినేత, చిత్తూరు -
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు?
జరిమానాతో లారీలను వదిలిపెట్టిన విజిలెన్స్ అధికారులు ప్యాపిలి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు అడ్డదారిలో అక్రమార్జనకు తెరతీశారు. అయితే అధికారులు తరచూ దాడులు నిర్వహించి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు యత్నించినా చివరకు అధికారపార్టీ నేతలదే పైచేయి అవుతోంది. మండల కేంద్రం ప్యాపిలి వద్ద ఇటీవల విజిలెన్స్ అధికారులు అక్రమంగా గ్రానైట్‌ను తరలిస్తున్న రెండు లారీలను స్వాధీనం చేసుకుని చివరకు జరిమానాతో వాటిని వదిలేయడం చర్చనీయాంశమైంది. కర్నూలు వైపు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి అక్రమంగా గ్రానైట్ ఖనిజాన్ని తరలిస్తున్న ఏపీ 02ఎక్స్ 6277, ఏపీ 02 టీఏ 6255 నంబర్లు గల లారీలను ఈ నెల 14న కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్యాపిలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. లారీలను ప్యాపిలి పోలీస్‌స్టేషన్ అప్పగించిన అధికారులపై తాడిపత్రికి చెందిన అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం ప్యాపిలికి చేరుకున్న విజిలెన్స్ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న లారీలపై ఫెనాల్టీ వేసి వదిలేశారు. అయితే ఈ లారీలు ఎవరి పేరుతో ఉన్నాయన్న విషయం, ఫెనాల్టి ఎంత వేశారన్న వివరాలు తెలియరాలేదు. -
దళితుల భూముల్లోని గ్రానైట్‌పై కన్నేసిన మంత్రి
-
బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు..
గ్రానైట్ కోటలో పాగాకు ప్రత్తిపాటి పక్కా స్కెచ్ ► 416 ఎకరాల దళితుల భూములు కొట్టేసేందుకు మంత్రి వ్యూహం ► అందులో ఉన్న రూ.2 వేల కోట్ల విలువైన గ్రానైట్ ఖనిజంపై కన్ను ► వివిధ శాఖల అనుకూల నివేదికలతో పక్కా ప్రణాళిక ► పచ్చటి పొలాలను.. పంటలు పండని భూములుగా చూపిన వైనం ► అనుచరులు, ఉద్యోగుల ద్వారా మైనింగ్‌కు దరఖాస్తులు ► బాధిత రైతుల ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ అన్ని విధాలా వెనుకబడిన దళితులను ఆదుకోడానికి 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూములిస్తే.. ఇన్నాళ్లూ వారు చక్కగా పంటలు పండించుకుని జీవనం సాగించారు. అలాంటి భూముల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉందని ఓ ప్రభుత్వ శాఖ నివేదిక ఇచ్చింది. ఇతర శాఖలూ ఇందుకు వంతపాడాయి. అలాంటి భూములు మీకెందుకంటూ ప్రభుత్వం పట్టాలను రద్దు చేసింది. బంగారం పండే భూములను లాక్కోవడం అన్యాయమంటూ పేద దళిత రైతులు లబోదిబోమంటున్నా సర్కారు వినిపించుకోలేదు. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీస్తే ఆ భూముల్లో రూ.2 వేల కోట్ల విలువైన గ్రానైట్ రాయి ఉండటమే అని తెలిసింది. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, అమరావతి : దళితుల కడుపుకొట్టి వేల కోట్లకు పడగలెత్తేందుకు ఓ అమాత్యుడు చక్కటి వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. వివిధ శాఖల అధికారులను లోబరుచుకుని తనకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకుని చక్రం తిప్పుతున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని 250 మంది నిరుపేద దళితులకు సాంఘిక సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 19, 1975లో అప్పటి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లుకలాపు లక్షణదాసు, నాటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్యలు సర్వే నెంబర్ 381లో 416.50 ఎకరాలను కేటాయించారు. లబ్ధిదారులందరికీ ఏకపట్టాగా ఆ భూమిని అందచేయడంతో వారంతా 1976లో ‘‘యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటి లిమిటెడ్’’ పేరుతో గ్రూపుగా ఏర్పడ్డారు. ఆ భూములకు సాగునీటిని అందించేందుకు మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3.20 కోట్ల వ్యయంతో శ్రీ అరుణోదయ సోమేపల్లి సాంబయ్య ఎత్తిపోతల పథకం ఏర్పాౖటెంది. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా దళిత రైతులు ఏటా పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. చక్రం తిప్పిన ప్రత్తిపాటి పత్తి వ్యాపారంతో మొదలు పెట్టి కోటాను కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ పరిశ్రమ స్థాపించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రణాళిక రచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన ప్రణాళికను కార్యరూపంలో పెట్టడానికి పావులు కదిపారు. తన చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే వ్యవహారాన్ని నడిపించారు. దళితులు సాగుచేస్తున్న భూముల్లో ఏ మేరకు గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి జియాలజిస్టులను పిలిపించి సర్వే చేయించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఆ భూమిలో ఉప్ప శాతం ఎక్కువగా ఉన్నందున సాగుకు యోగ్యమైనది కాదని వ్యవసాయ శాఖ, ఆ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని సహకార శాఖ, ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని మైనింగ్ శాఖ, గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న భూమిని పారిశ్రామికవేత్తలకు అమ్ముకునేందుకు దళితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విజిలెన్స్ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చేలా చేశారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు. దరఖాస్తుదారుల్లో కొందరి వివరాలు ► వై.శివయ్య తండ్రి బాలకోటయ్య, డోర్ నెం 1–130.యడవల్లి గ్రామం. ఇతని భార్య రమాదేవి. యడవల్లి గ్రామ సర్పంచ్. టీడీపీ. ► వై.రవీంద్రబాబు, తండ్రి శివయ్య, డోర్ నెం 1–130, యడవల్లి గ్రామం. యడవల్లి గ్రామ సర్పంచ్ రమాదేవి కుమారుడు. ► సీహెచ్ వెంకటరామిరెడ్డి, తండ్రి సుబ్బరామిరెడ్డి, డోర్ నెం 5–285, జాలయ్యకాలనీ, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు కుమార్తె స్వాతి ► పేరున గణపవరం గ్రామంలో ఉన్న స్వాతి ఆయిల్ మిల్స్‌లో సూపర్వైజరుగా పని చేస్తున్నారు. ► షకీలా సాంబశివరావు, తండ్రి కష్ణమూర్తి, డోర్‌నెం 2–52–2, గణపవరం గ్రామం, నాదెండ్ల మండలం. మంత్రి పుల్లారావుకు చెందిన పత్తిమిల్లులో (టీఎంసీ యూనిట్)లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. ► తాళ్లూరి సుబ్బారావు, తండ్రి రాములు, డోర్‌నెం 3–404,9వ లైన్, పండరీపురం, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు పత్తి మిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు. ► బొమ్మినేని రామారావు, తండ్రి పాపయ్య, గణేశునివారిపాలెం గ్రామం, యడ్లపాడు మండలం. మంత్రి పుల్లారావు పత్తిమిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు. ► ఎం.సుధాకర్‌రెడ్డి, తండ్రి వెంకటరెడ్డి, డోర్ నెం 3–104, మానుకొండవారిపాలెం, చిలకలూరిపేట. మంత్రి పుల్లారావు పత్తిమిల్లులో పత్తి బయ్యర్‌గా పని చేస్తున్నారు. ► కొమ్మాలపాటి పూర్ణచంద్రరావు, తండ్రి వెంకటేశ్వర్లు, డోర్ నెం.5–46/5–1, మువ్వవారి బజార్, గణపవరం గ్రామం, నాదెండ్ల మండలం. మంత్రి కంపెనీ శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో టీఎంసీ యూనిట్ ఇన్చార్జిగా పని చేస్తున్నారు. ► మేడూరి సత్యనారాయణ, తండ్రి పిచ్చయ్య, డోర్ నెం. 4–190, కొండ్రువారి వీధి, గణపవరం గ్రామం. నాదెండ్ల మండలం. మంత్రి కంపెనీ శివస్వాతి టెక్స్‌టైల్స్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గ్రానైట్ నిక్షేపాల వివరాలు యడవల్లి గ్రామంలో లభించే గ్రానైట్‌లో ముఖ్యమైనది బ్లాక్ పెరల్. దీని ధర మీటరు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. సాధారణంగా ఏ క్వారీలోనైనా 6 మీటర్ల లోతు తవ్విన తర్వాతే మంచి మెటీరియల్ లభిస్తుంది. అయితే ఇక్కడ 4 మీటర్ల లోతు తవ్వితే మంచి మెటీరియల్ దొరుకుతుంది. ఎక్కువ లోతు తవ్వకుండానే నిర్వాహకులకు మంచి లాభాలు వస్తాయి. సొసైటి రద్దుపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ తమకు జరిగిన నష్టంపై బాధిత దళిత రైతులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. మంత్రి పుల్లారావు సహా టీడీపీ నాయకుల అక్రమాలను వివరించారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించినప్పటికీ విధుల్లో బిజీగా ఉన్నామంటూ మూడుసార్లు హాజరు కాలేదు. 2016 జూలై 10వ తేదీన బాధితులు మరోసారి అర్జీ ఇచ్చారు. దీనిపై సంబంధిత నివేదికతో హాజరు కావాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, గ్రామానికి చెందిన ఎస్సీలకు నోటీసులు వచ్చాయి. కష్ణా పుష్కరాలు జరుగుతున్నందున ఆ విధుల్లో బిజీగా ఉన్నామని, తర్వాత వస్తామని కమిషన్ కు ఉన్నతాధికారుల ద్వారా లేఖ పంపారు. అక్టోబర్ 1వ తేదీన కమిషన్ నూఢిల్లీలో నిర్వహించిన విచారణకు జిల్లా కో–ఆపరేటివ్ అధికారి పాండురంగారావు, డివిజన్ సొసైటీ అధికారి పురుషబాబు, నరసరావుపేట ఆర్డీవో జి.రవీందర్, చిలకలూరిపేట తహశీల్దార్ పీసీహెచ్ వెంకయ్యలు హాజరయ్యారు. జనవరి 8వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన విచారణకు అధికారులు హాజరు కాకపోవడంతో ఫిబ్రవరి 8 వ తేదీకి విచారణ వాయిదా వేశారు. వాస్తవాలివీ.. పేద దళితులు ప్రభుత్వం నుంచి భూములు పొందినప్పటి నుంచి సొసైటీ సహకారంతో వరి, పత్తి తదితర పంటలు పండించుకున్నారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా పొందారు. ఆయా సంవత్సరాలలో ఏమేరకు పంటలు సాగయ్యాయన్న సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉంది. భూములు ఉప్పు కయ్యలుగా మారడానికి సమీపంలో సముద్రం లేదు. ఈ భూములు మినహా చుట్టుపక్కల ఉన్న భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు తేలలేదు. నిజంగా ఉప్పుశాతం ఎక్కువుగా ఉంటే పంటలు ఎలా పండుతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. సొసైటీ రికార్డులు సరిగా లేకపోతే నోటీసు ఇవ్వాలి. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా సొసైటీని ఎలా రద్దు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరక్ష్యరాస్యతను ఆసరాగా తీసుకుని రికార్డులు సరిగా నమోదు చేయలేదనడం సరికాదని బాధిత రైతులు వాపోతున్నారు. 25.08.2012 : నరసరావుపేట ఆర్డీవో, మైనింగ్ శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్, మండల సర్వేయరు, వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు యడవల్లి భూముల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 04.09.2015 : ఈ భూముల్లో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల సాగుకు యోగ్యమైనవి కావని నరసరావుపేట వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నివేదిక ఇచ్చారు. 02.12.2015 : చిలకలూరిపేట హార్టీకల్చర్ అధికారి కూడా ఈ భూములు సాగుకు పనికి రావని నివేదిక ఇచ్చారు. 02.12.2015 : నిబంధనల ప్రకారం యడవల్లి సొసైటీ రికార్డుల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని, ఆసొసైటీని రద్దు చేస్తున్నామని జిల్లా సహకార శాఖ నివేదిక ఇచ్చింది. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది మంత్రి బినామీలే ఒక వైపున సొసైటీని రద్దు చేయించడానికి మంత్రి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపున ఆ భూముల్లోని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి కోరుతూ తనకు అనుకూలమైన వ్యక్తులతో మైనింగ్ శాఖకు ముందస్తుగానే దరఖాస్తు చేయించారు. ఏడాది కాల వ్యవధిలోనే 39 మంది వ్యక్తులు యడవల్లి భూముల్లోని గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయడం గమనార్హం. మైనింగ్ నిబంధనల ప్రకారం తొలి దరఖాస్తుదారుకు తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ విధంగా మొదటి 20 దరఖాస్తుల్లో మంత్రి అనుచరులు, ఆతని సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారనేది సమాచారం. వీరందరికీ త్వరలో గ్రానైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేందుకు మైనింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయం తెలిసి.. బాధిత దళిత రైతులందరూ మంత్రి పుల్లారావును కలిశారు. తాము ఎప్పటి నుంచో ఆ భూములను సాగు చేసుకుంటున్నామని, ఉన్నఫళంగా తమకు భూములు లేకుండా చేస్తే ఎలా బతకాలని గోడు వెల్లబోసుకున్నా మంత్రి స్పందించలేదు. -
ఏమైంది... స్వరం మారింది!
బడే దేవరకొండపై టీడీపీ నాయకుల యూటర్న్ మారిన వ్యూహంపై సర్వత్రా చర్చ కొత్తగా తెరపైకి తెచ్చిన అటవీ భూముల అంశం తెరవెనుక సూత్రధారులెవరో తెలుసునంటున్న గిరిజనులు సాక్షి ప్రతినిధి, విజయనగరం : మైనింగ్ కోసం లైన్ క్లియర్ చేశారు. రూ. కోట్లకొద్దీ నిధులు చేతులు మారాయి. గిరిజనుల ఆరాధ్యదైవమైన బడేదేవరకొండ దేవత వెలిసిన భూముల్ని లీజుకిచ్చేశారు. అమ్మవారిని పూజిస్తే తప్ప వర్షాలు పడవనే నమ్మకాన్ని తాకట్టు పెట్టారు. మనోభావాలకు దెబ్బ తగిలితే ఎవరైనా క్షమిస్తారా? అందులో గిరిజనులైతే ఊరుకుంటారా? అనుకున్నట్టుగానే అంతెత్తున లేచారు. వారికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ, వామపక్షాల నేతలతో కలిసి రోడ్డెక్కారు. అధికార పార్టీని ఉతికి ఆరేస్తున్నారు. టీడీపీ తీరును కడిగి పారేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలనూ వదలడం లేదు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత దృష్ట్యా గ్రామాల్లో ఉన్న టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరిపోతున్నారు. రోజురోజుకూ పార్టీ ఖాళీ అవుతుండటం, ప్రజాగ్రావేశాలు ఎక్కువవడంతో టీడీపీ నేతలు యూటర్న్ తీసుకోక తప్పలేదు. అటవీ భూములు అంశాన్ని తెరపైకి తెచ్చి వివాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. జరుగుతున్న డ్యామేజ్‌ను తగ్గించుకునేందుకు యత్నిస్తున్నారు. బడేదేవర కొండ గ్రానైట్ కోసం 2009లో ఎంఎస్పీ గ్రానైట్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. కానీ, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులిచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఎంఎస్పీ సంస్థ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ తెరపైకి వచ్చింది. 2014జూన్ 26వ తేదీన సర్వే జరిపి సుమారు 44 ఎకరాలు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది జూన్ 22వ తేదీన ఏకంగా అనుమతులిచ్చింది. టీడీపీ నేతలు మాత్రం గత ప్రభుత్వంలోనే సర్వే జరిగిందని, అప్పట్లోనే అంతా జరిగిపోయిందని, టీడీపీ వచ్చాక అనుమతులే ఇచ్చిందని బుకాయిస్తున్నారు. గిరిజనుల నమ్మకంపై దెబ్బకొడతారా ? బడేదేవర కొండ దేవతను పూజిస్తే వర్షాలు పడతాయని నమ్ముతారు. ఆ కొండ వాగుల నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు పొందుతున్నారు. ఇంతటి విశిష్టత గల కొండను మైనింగ్ కోసం ఓ కంపెనీకి లీజుకిచ్చేశారు. అది గిరిజనుల్లో ఆగ్రహానికి కారణమైంది. వైఎస్సార్సీపీ, వామపక్షాలతో కలిసి తమ భూములను కాపాడాలంటూ ఉద్యమిస్తున్నారు. టీడీపీ నేతలపై ధ్వజమెత్తడమే కాకుండా స్థానిక టీడీపీ నాయకులను నిలదీస్తున్నారు. మా వెంట నిలబడతారా? రాజకీయ భవిష్యత్‌ను కోల్పోతారా? అంటూ అల్టిమేటం ఇవ్వడంతో స్థానిక టీడీపీ నాయకులు ఉద్యమ బాటలోకి రాక తప్పలేదు. అలాగే, ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీలో ఉండలేక సంగంవలస ఎంపీటీసీ కోడి వెంకటనాయుడు, ములగ మాజీ వైస్ సర్పంచ్ బంకపల్లి రామినాయుడు, మరికొందరు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. మిగతా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకుంది. నష్టాన్ని తగ్గించేందుకు... రోజురోజుకు పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. ప్రజా వ్యతిరేకత ఎక్కువైపోతోంది. గిరిజన గ్రామాల్లో వైఎస్సార్సీపీకి ఆదరణ పెరిగిపోతోంది.అధికార పార్టీ నాయకులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంకా వేచి ఉంటే ఇబ్బందేనన్న విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు. దీని నుంచి బయటపడేందుకు అటవీ భూముల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. రిజర్వు ఫారెస్టు భూముల్లో అనుమతులు ఎలా ఇచ్చారని అటవీ శాఖాధికారులపై నెపాన్ని తోసేస్తున్నారు. అసలీ సర్వే చేసినప్పుడు అటవీ భూములున్నాయని తెలియదా? ఆ సర్వేకు టీడీపీ నేతలు పరోక్షంగా సహకరించలేదా? అంతెందుకు గ్రానైట్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకపోవడం వెనక కారణమేంటి? గ్రానైట్ కంపెనీకి అనుకూలంగా ఆందోళన చేసిన వారెవరు? ప్రజలంతా సంతకాలు చేసి మరీ వ్యతిరేకిస్తున్నా మైనింగ్‌కు అండగా నిలిచిందెవరు? అన్నది అందరికీ తెలిసిందే. మైనింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ప్రజలంతా కోరుతున్నా ససేమిరా అంటున్న కోరి గంగాపురం, కె.ములగ సర్పంచ్‌లు అధికార పార్టీకి చెందిన వారే కదా? దీన్నేమనాలి. ఇదంతా వదిలేసి అటవీ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ఇందులో నుంచి బయటపడాలని ప్రయత్నించడంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరో ధరఖాస్తుదారుడు ప్రకాష్ వెనకున్నదెవరు 2006లో బడేదేవరకొండ గ్రానైట్ తవ్వుకోవడానికి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. అప్పట్లో లీజుకిచ్చేందుకు ససేమిరా అనడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఎప్పుడైతే ఎంస్ఏపీ గ్రానైట్ సంస్థకు అనుమతులిచ్చారో గత దరఖాస్తు దారుడైన ప్రకాష్‌ను తెరపైకి తెచ్చారు. ఆ కంపెనీకి అనుమతిచ్చినప్పుడు తమకీ ఇవ్వాలంటూ ప్రకాష్ చేత దరఖాస్తు చేయించారు. దీని వెనుక ఉన్న దెవరో కాదు టీడీపీ కీలక నేతే. ఆ మధ్య జరిగిన సర్వేలో సాక్షాత్తు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ సోదరుడు తిరుపతిరావు పాల్గొనడాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. -
తరలిపోతున్న గ్రానైట్
* యథేచ్ఛగా ఖనిజ సంపద అక్రమ రవాణా * రాత్రి వేళల్లో జిల్లా హద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు * పట్టించుకోని వాణిజ్య పన్నుల శాఖాధికారులు పాత గుంటూరు: జిల్లాలో గ్రానైట్ సంపద యథేచ్ఛగా అక్రమ రవాణాకు గురౌతోంది. రాత్రి వేళల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చి స్వేచ్ఛగా తరలించుకుపోతున్నారు. అచ్చంపేట మండలం మాదిపాడు బల్లకట్టు మీదుగా జిల్లా సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు గ్రానైట్ తరలిపోతోంది. కట్టడి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని చిలుకలూరి పేట, ప్రకాశం జిల్లా మార్టూరు, చీమకుర్తి నుంచి కోట్లాది రూపాయలు విలువ జేసే ఖనిజ సంపద ఎలాంటి వే బిల్లులు లేకుండా జిల్లా నుంచి అక్రమంగా తీసుకుపోతున్నారు. అరికట్టాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ళకు అలవాటుపడి నిద్ర నటిస్తుండటంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండాపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిహద్దుల గుండా.. జిల్లాలోని మాచర్ల, పొందుగల తదితర జిల్లా సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్‌లు వున్నా అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి అక్రమ రవాణాదారులు మామూళ్ళను సమర్పించుకుంటూ గ్రానైట్‌ను పక్క రాష్ట్రాలకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏడు లోడు లారీల పట్టివేత.. గత నెలలో రాష్ట్ర ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి అచ్చంపేట మండలం మాదిపాడు బల్లకట్టు మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వెళ్తున్న 7 గ్రానైట్ లోడు లారీలను గుంటూరుకు చెందిన సీటీవో సత్తెనపల్లి పట్టణంలో అర్ధరాత్రి పట్టుకొని కేసు నమోదు చేశారు. ఒక్కరోజులోనే 7 గ్రానైట్ లోడు లారీలు పట్టుబడ్డాయంటే.. నెలనెలా ఎన్ని వందల సంఖ్యలో లారీల్లో అక్రమంగా గ్రానైట్ తరలిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గట్టి నిఘా ఏర్పాటు చేశాం.. జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ అక్రమ రవాణాను అరికట్టడానికి గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. గత మూడు నెలల్లో అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని రూ.50 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశాం. అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణాపై సమాచారం తెలిస్తే ప్రజలు కూడా మాకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటాం. – ఎం.రాంబాబు, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనరు, గుంటూరు – 2 డివిజన్ -
గ్రానైట్
వెలుగులు చిమ్మిన చోటే చీకటి ముప్పేట దాడులతో మూతపడ్డ పరిశ్రమలు ఉపాధి కోల్పోయిన 30 వేల కుటుంబాలు 30 ఏళ్లగా అవినీతిని పోషిస్తున్న అధికారులు తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమలు విస్తారంగా ఏర్పాటు కావడంతో అది వ్యాపారుల మధ్య పోటీకి దారితీసింది. ఈ క్రమంలో వ్యాపారం వక్రమార్గంలోకి మళ్లింది. ముడి సరుకు కోసం పొరుగు జిల్లాలపై ఆధారపడ్డ వ్యాపారులు జీరో వ్యాపారానికి తెరలేపారు. క్వారీల్లో రాయల్టీ చెల్లించకుండా సగం ధరకే ముడి సరుకు దిగుమతి చేసుకునేవారు. 30 టన్నుల రెడ్ గ్రానైట్ రాయి కోసం రాయల్టీ చెల్లిస్తే రూ. 70 వేలు అవుతుంది. అదే బిల్లులు లేకుండా అయితే రూ. 35 వేలకే సరుకు పరిశ్రమకు చేరుకుంటోంది. అవినీతిలో అధికారుల పాత్రే కీలకం గ్రానైట్ పరిశ్రమ యజమానుల జీరో వ్యాపారంలో విజిలెన్స్, వాణిజ్య, ఆదాయ పన్నుల, గనుల శాఖకు చెందిన కొందరు అవినీతి అధికారుల పాత్ర కీలకంగా ఉంది. అక్రమార్జన కోసం అధికారులు అవినీతిని పోషిస్తూ వచ్చారు. తాడిపత్రిలో గ్రానైట్ పరిశ్రమలు 400 దాకా ఉంటే ఇందులో 200 పరిశ్రమలకు ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేకపోవడం ఇందుకు అద్దం పడుతోంది. నల్లబండల పరిశ్రమలు దాదాపు 500 వరకు ఉంటే ఇందులోనూ 300 వాటికి ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 సంవత్సరాలుగా తాడిపత్రిలో గ్రానైట్ జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. నెల మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ఇందుకు పూర్తిగా సహకరించారన్న ఆరోపణలున్నాయి. కథ అడ్డం తిరగడంతో దాడులు తాడిపత్రిలోని గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ బిల్లులు నెలసరి రూ. 5 కోట్లు మేర వస్తుండడంతో గుర్తించిన విజిలెన్స్ డైరెక్టర్ నేరుగా రంగంలో దిగారు. పెద్ద ఎత్తున వినియోగం జరుగుతున్నా ప్రభుత్వ ఖజానాకు ఆ మేరకు ఆదాయం జమా కాకపోవడంతో దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా ముడిసరుకు తరలింపులో ప్రభుత్వానికి రాయల్టీ, ఆదాయ, వాణిజ్య పన్నులు చెల్లించడం లేదని గుర్తించారు. ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేనివి, జీరో వ్యాపారం సాగిస్తున్న పరిశ్రమల యాజమాన్యాల వైఖరి వల్ల ఖజానాకు రూ. కోట్లలో నష్టం వాటిల్లుతున్నట్లు ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఆయన అందజేశారు. దీని ఆధారంగా తాడిపత్రిలో ప్రవేశించే నాలుగు మార్గాల్లోనూ వాణిజ్య, గనుల శాఖలు సంయుక్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాయి. రాయల్టీ లేకుండా ముడిసరుకు రవాణా చేస్తున్న లారీలను అడ్డుకుని జరిమానాలు విధించసాగారు. వీధినపడ్డ కార్మికులు కొన్ని రోజుల ముందు వరకు తమ నుంచి మామూళ్లు దండుకున్న అధికారులు ఇప్పుడు ముప్పేట దాడులకు దిగడంతో పరిశ్రమల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. మరోమార్గం లేక వారు పరిశ్రమలను మూసేశారు. కటింగ్, పాలిష్ చేసేందుకు ఒక్కొ పరిశ్రమలో 10 నుంచి 15 మంది వరకు పనిచేస్తారు. పరిశ్రమలు మూతపడడంతో ప్రత్యక్షంగా వాటిని నమ్ముకుని ఉన్న కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఇక్కడి పరిశ్రమలను నమ్ముకుని తాడిపత్రిలో దాదాపు 500కు పైగా లారీలు నడుస్తున్నాయి. పరిశ్రమలు మూతపడడంతో లారీలకు బాడుగ లేకుండా పోయింది. ఫలితంగా లారీల యాజమాన్యాలు వాటిని నమ్ముకుని జీవిస్తున్న డ్రైవర్లు, క్లీనర్ల కుటుంబాలు వీధిన పడ్డాయి. -
కొల్లగొట్టుడే..!
గుట్టలను గుల్ల..గుల్ల చేస్తున్న అక్రమార్కులు ► కేశంపేట మండలంలో 20 ఎకరాల విస్తీర్ణంలో 2గుట్టలు ► విచ్చలవిడిగా బ్లాస్టింగ్స్ జరుపుతున్న వ్యాపారులు ► ముగిసిన లెసైన్స్.. అయినా ఆగని తవ్వకాలు ► లోతైన గుంతలు తవ్వడంతో తరచూ ప్రమాదాలు కేశంపేట: కొండలు, గుట్టలు మాయమవుతున్నాయి.. అక్రమార్కుల చేతుల్లో నామరూపాల్లేకుండా పోతున్నాయి. విచ్చలవిడిగా బ్లాస్టింగ్లతో వాటి ఉనికిలేకుండా చేస్తున్నారు. కేశంపేట మండలం ఇప్పలపల్లి, దత్తాయిపల్లి శివారులోని ప్రభుత్వ భూముల్లో గుట్టలను లీజు పేరుతో కొందరు వ్యక్తులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. రాత్రివేళల్లో గ్రానైట్, పలుగు రాయిని ఇతరప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ రెండు గ్రామాల్లో గుట్టలు సుమారు 20 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. గతంతో వీటిని పెద్దగుట్ట, బోడగుట్ట అని పిలిచేవారు. ప్రస్తుతం అవి కరిగిపోతున్నాయి. లెసైన్స్‌ల గడువు 2008లోనే ముగిసినా ఇంకా గ్రానైట్‌ను కొల్లగొడుతున్నారని ఇప్పలపల్లి గ్రామస్తులు కొందరు తెలిపారు. ఇక్కడి నుంచి విలువైన గ్రానైట్, పలుగు రాయిని హైదరాబాద్, శంషాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ గుట్టల ప్రాంతంలో ఒకప్పుడు వర్షాలు కురిస్తే పశువులకు మేత విస్తారంగా లభించేది. సమీపంలోనే నీటి వనరులు ఉండడంతో పశువుల మేతకు కొంత సౌకర్యవంతంగా ఉండేది. చూపరులను మైమరిపించే గుట్టలు నేడు బ్లాస్టింగ్లతో నెలకొరుగుతున్నాయని ఆ రెండు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. భారీ బ్లాస్టింగ్ల శబ్దాలతో దద్దరిల్లడమే కాకుండా బోరుబావులు కూడిపోయి నీళ్లు లేక ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తరచూ ప్రమాదాలు మైనింగ్‌దారులు తీసిన గోతుల్లో అనేకసార్లు మూగజీవాలు పడిపోయి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాగే గ్రానైట్‌లోడ్‌తో లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో గ్రామాల్లో విపరీతమైన దుమ్మురేగుతోంది. ఇక్కడి నుంచి రాయిని రవాణా చేస్తున్న లారీలకు నంబర్ప్లేట్లు సరిగా ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు. అతివేగంగా వస్తున్న లారీలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాపోతున్నారు. ఒకరిద్దరు కూలీలు లారీల కిందపడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొండలు, గుట్టలను బ్లాస్టింగ్ చేస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించడంపై వారు కన్నెర్రచేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకుని ప్రకృతి సంపదను కాపాడాలని కోరుతున్నారు అధికారులు పట్టించుకోవడం లేదు.. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్ లీజుకు తీసుకున్నవారు తీసిన పెద్ద పెద్ద గోతుల్లో మూగజీవాలు పడి చనిపోతున్నాయి. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ప్రమాదకరంగా మారిన గోతులను వెంటనే పూడ్చివేయాలి. - వెంకటేశం గ్రామస్తులు మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తా గ్రామంలో జరుగుతున్న మైనింగ్ పనుల గురించి సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్తాం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగితే వారిపై చర్యలు తీసుకుంటాం. మైనింగ్‌దారుల తీరును గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చారు. అనుమతులు ఉన్నాయా? లేదా? అనే విషయాలను పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. - కృష్ణకుమార్, తహసీల్దార్, కేశంపేట -
యథేచ్ఛగా అక్రమ రవాణా
► చెక్‌పోస్టులు దాటిపోతున్న గ్రానైట్ రాళ్లు ► ప్రభుత్వ ఆదాయానికి గండి హిందూపురం అర్బన్: గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. అర్థరాత్రి సమయాల్లో కర్ణాటక, జిల్లా సరిహద్దుల నుంచి 10 చక్రాల లారీల్లో భారీ సైజుల్లో గ్రానైట్ రాళ్లు తరలిపోతున్నాయి. జిల్లా సరిహద్దుల నుంచి కర్ణాటకకు అక్రమ మార్గాల్లో రవాణా సాగిస్తున్నారు. క్వారీల నుంచి అర్ధరాత్రి పూట చెక్‌పోస్టు తనిఖీ సిబ్బందికి పైసలు ఇచ్చి కొన్ని, అక్రమ మార్గంలో మరికొన్ని దాటి వచ్చేస్తున్నాయి. దీంతో రూ.లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం నష్టపోతోంది. అంతేకాకుండా క్వారీల్లో ఒక వే బిల్లుతోనే మళ్లీ మళ్లీ రవాణా సాగించి కూడా లబ్ధి పొందుతున్నారు. చాలాసార్లు గ్రానైట్ వాహనాలు హిందూపురం ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న ఎంవీఐ, పోలీసు అధికారుల కంటపడ్డాయి. వాటిపై చర్యలు తీసుకునే లోపే అధికారపార్టీ నాయకుల నుంచి ఒత్తిడులు తీవ్రతరం కావడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇటీవల ఎంవీఐ అధికారి పది చక్రాల గ్రానైట్ లారీకి ఎలాంటి రికార్డులు లేకపోవడంతో సీజ్ కూడా చేశారు. చిలమత్తూరు మండలంలోని ఫ్యాక్టరీల్లో దాడులు చేసి భారీ మొత్తంలో అపరాధ రుసుం సైతం వసూలు చేశారు. అధికారులు అడపాదడపా తనిఖీలు చేస్తూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తరలిపోతున్నాయి ఇలా.. మడకశిర సమీపంలోని అగళి, గుడిబండ ప్రాంతాల నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి పూట అధిక టన్నులతో 10, 12 చక్రాల లారీల్లో గ్రానైట్ బండలు తరలిపోతున్నాయి. అనుమతులు లేకపోయినా అక్రమ మార్గంలో వె ళ్తున్నాయి. వేసవికాలంలో గ్రానైట్ బండలకు మంచి డిమాండ్ ఉండడంతో వీటి రవాణా జోరుగా సాగుతోంది. మడకశిర, గుడిబండ ప్రాంతం నుంచి హిందూపురం శివారు మీదుగా వీరాపురం గ్రామంలో నుంచి అదేవిధంగా చిలమత్తూరు మండలం కొడికొండ, కొండూరు గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి కర్ణాటకకు తరలిపోతున్నాయి. చెక్‌పోస్టు సిబ్బందికి పైసలు ఇచ్చి.. గుడిబండ, అగళి, ఎల్డోడు, గౌరీబిదనూర్, తుమకూరు ప్రాంతాల నుంచి రవాణా సాగుతోంది. అక్కడి చెక్‌పోస్టు సిబ్బందికి పైసలు ఇచ్చి ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సేల్ ట్యాక్స్ శాఖకు భారీగా గండి పడుతోంది. ఒక్కో రాయి రూ.లక్షల్లో ఉంటుంది. అలాగే పాలిషింగ్ చేసిన మూడు, నాలుగు మీటర్ల బండ సుమారు రూ.30 వేల ధర పలుకుతుంది. ఇలాంటివి ఒక్కో ఫ్యాక్టరీ నుంచి 30 నుంచి 40 వరకు రవాణా అవుతుం టాయి. ఈ విధంగా సుమారు వందల సంఖ్యలో లారీల గుండా రవాణా సాగిపోతున్నాయి. -
నాపరాయి కష్టాలు
♦ గ్రానైట్, టైల్స్ రావడంతో తగ్గిన వ్యాపారాలు ♦ వంద దాకా మూతపడిన పరిశ్రమలు ♦ రోడ్డున పడుతున్న కార్మికులు ♦ అయోమయంలో యజమానులు ఎర్రగుంట్ల : జిల్లాలోని పేరెన్నికగన్న నాపరాయి పరిశ్రమకు గడ్డు కాలం దాపురించింది. ఒకప్పుడు దేశవిదేశాలలో ఈ రాయికి యమ డిమాండ్ ఉండేది. వీటి యజమానులకు, ఆ పరిశ్రమపై ఆధారపడిన కూలీలకు ఉపాధి పుష్కలంగా ఉండేది. కాలక్రమేణ ఇతర ప్రాంతాల నుంచి గ్రానైట్, టైల్స్ ఆధునిక డిజైన్లతో రావడం, వాటి వినియోగం పెరగడంతో నాపరాయి పరిశ్రమలు మూత దిశగా ఉన్నాయి. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో కూలీలు నాపరాయి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందేవారు. ఎర్రగుంట్లలో సుమారు ఈ పరిశ్రమలు 200 దాకా ఉండేవి. వీటిపై ఆధారపడి సుమారు 20 వేలకు పైగానే కూలీలు ఉపాధి పొందేవారు. ఎర్రగుంట్లలో నాపరాయి వ్యాపారం ఆరు దశాబ్దలుగా డిల్లీ నుంచి గల్లీ వరకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు కొనసాగేది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి ఉండేది. మొదట్లో రాళ్లను చేత్తో తొలచి మొలలు ద్వారా రాళ్లను చదరపు సైజలు తయారు చేసేవారు. నాపరాయి పరిశ్రమకు గనులు నుంచి ఎద్దుల బండలపై చేర్చేవారు. తరువాత కాలక్రమేణ లారీలు, ట్రాక్టర్ల రావడంతో వాటి ద్వారా తరలించేవారు. అటు తరువాత కొత మిషన్ వచ్చి గనులలో రాళ్లను సులభతరంగా రాళ్లను తీసి పరిశ్రమలకు చేర్చేవారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతి ఇలా తీసిన రాళ్లను పరిశ్రమలకు చేర్చి వాటిని వివిధ ఆకారాలలో, సైజులలో అందంగా తయారీ చేసి వాటిని కోల్‌కతా, ముంబై, డిల్లీ, తమిళనాడు రాష్ట్రంతోపాటు న్యూజిల్యాండ్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు.గతంలో నిత్యం నాపరాయి లోడింగ్, అన్ లోడింగ్ వ్యాపారాలతో ఉండే ఈ పరిశ్రమ యజమానులు బిజీగా ఉండేవారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు, ఇళ్ల ముందు ముతక రాళ్లతో చప్పటి వేసేవారు. ఈ రాయిని ఎగుమతి చేసే ట్రేడర్లకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అర్డర్లు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. వ్యాపారం లేక పరిశ్రమలు మూత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం వచ్చింది అంటే చాలు కూలీ ఖర్చులు కూడా రాలేదంటున్నారు ఇంటిలోని బంగారు నగలను బ్యాంకులో కుదవ పెట్టి రుణాలు, కూలీల డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని వారు వాపోయారు. ప్రస్తుతం గ్రానైట్, టైల్స్ వ్యాపారం ఎక్కువ కావడంతో గడ్డు నాపరాయి పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వ్యాపారాలు సన్నగిల్లడం వల్ల పరిశ్రమ యజమానులు దిక్కుతోచని పరిస్థితి ఉన్నారు. వ్యాపారాలపై తెచ్చుకున్న రుణాలు చెల్లించలేక పరిశ్రమలు మూతలు వేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు మున్సిపాలిటీ పన్నులు అధికంగా ఉండడంతో యజమానులు అయోమయంలో పడ్డారు. నాపరాయికి గడ్డుకాలం ఇంతటి ప్రాధాన్యత గల నాపరాయి పరిశ్రమకు ప్రస్తుతం గడ్డుకాలం వచ్చింది. చాలా వరకు పరిశ్రములు మూత పడ్డాయి. దీనికి కారణం గ్రానైట్ , టైల్స్‌తో పాటు అత్యనిధుక డిజైన్లుతో టైల్స్ రావడం వల్ల పరిశ్రమ దెబ్బతింది. ఇలా వ్యాపారం డీలా పడడంతో బ్యాంకుల అప్పులు కట్టలేక వ్యయం భరించలేక మూడు సంవత్సరాలుగా సుమారు వంద పరిశ్రమలు దాకా మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కడప నాపరాళ్లను వినియోగించుకుంటే పరిశ్రమ కొంత వరకు నష్టాల నుంచి గట్టెక్కెతుందని పరిశ్రమ యజమానులు అంటున్నారు. -
వేటుపడింది
► గ్రానైట్‌కు అక్రమ విద్యుత్ వ్యవహారంఇద్దరు సెస్ ఉద్యోగుల సస్పెన్షన్ ► విచారణ అధికారిగా ఏడీ రాజిరెడ్డినాయకుల ఒత్తిళ్లతో ఉద్యోగులు బలి ► వారిపైనా చర్యలు తీసుకోవాలి ఎంప్లాయూస్ సంఘం డిమాండ్ వేములవాడ రూరల్ : వేములవాడ మండలం సంకెపల్లి గ్రామ శివారులోని గ్రానైట్ క్వారీలో అక్రమ విద్యుత్ వినియోగం వ్యవహారం విషయంలో ఇద్దరు సెస్ ఉద్యోగులపై వేటుపడింది. సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడంతో సెస్ ఎండీ నాంపల్లిగుట్ట వేములవాడ రూరల్ ఏఈ తిరుపతి, సంకెపల్లి అసిస్టెంట్ హెల్పర్ దేవయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంకా ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయూన్ని తేల్చేందుకు ఏడీ రాజిరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. గ్రానైట్ క్వారీ యజమాని ఎలాంటి అనుమతి లేకుండా ఏకంగా 12 స్తంభాలు వేసుకొని విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకుంటున్నాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో సెస్ ఎండీ నాంపల్లిగుట్ట గురువారం క్వారీని పరిశీలించారు. క్వారీ యజమాని ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో శుక్రవారం ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గని చైర్మన్ సెస్ ఉద్యోగులపై వేటు వేయకుండా ఉండేట్లు చూడాలని, ఈ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయవద్దని అధికార పార్టీ నాయకులు, సెస్ పాలకవర్గంలో ఉన్న కొంతమంది నాయకులు ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ చైర్మన్ లక్ష్మారెడ్డి మాత్రం తలొగ్గలేదు. నూతన పాలకవర్గంపై మచ్చపడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోక తప్పలేదు. ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వెళ్లడంతో చైర్మన్ తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. వీరిద్దరే కాకుండా మరికొందరిపైనా వేటు వేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎంప్లాయిస్ యూనియన్‌లో వ్యతిరేకత.. అక్రమ విద్యుత్ వ్యవహారంలో సెస్ ఉద్యోగులపై వేటు వేయడాన్ని ఎంప్లాయిస్ యూనియన్ తీవ్రంగా పరిగణిస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల మేరకే వారు క్వారీ యజమానికి సహకరించారని, వారిపై చర్యలు తీసుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనియన్ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. నాయకుల ఒత్తిళ్లకు ఉద్యోగులు తలొగ్గారని, వారిని బలిపశువులుగా చేయడం ఎంతవరకు సమంజసమని అధికారుల తీరుపై మండిపడ్డట్లు సమాచారం. విద్యుత్ అక్రమానికి సంబంధం ఉన్న సెస్ డెరైక్టర్‌పై, క్వారీ యజమానిపై చర్యలు తీసుకున్నాకే ఉద్యోగులపై వేటు వేయాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఉద్యోగులకేనా వేటు..? అక్రమ విద్యుత్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన సెస్ అధికారులు, పాలకవర్గం దానికి బాధ్యులైన క్వారీ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని చర్చించుకుంటున్నారు. క్వారీ యజమానిపై కేసు పెడుతారా? లేక జరిమానాతోనే వదిలివేస్తారా? అనేది చర్చనీయూంశమైంది. ఒకవేళ ఈ ఉద్యోగులను మాత్రమే బలిచేసి, క్వారీ యజమానిపై, దానికి సంబంధమున్న నాయకునిపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే... చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఉద్యోగ సంఘం నాయకులు చ ర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. -
గ్రానైట్‌కు అక్రమ విద్యుత్
► స్తంభాలు వేసుకుని యథేచ్చగా వినియోగం ► ఆలస్యంగా తేరుకున్న సెస్ ► జరిమానాతో సరి..! వేములవాడ రూరల్ : నిరుపేదలు విద్యుత్ స్తంభాలకు వైర్లు తగిలించి తమ ఇళ్లలో ఒక్క బల్బు వెలిగించుకుంటే కేసులు నమోదు చేసి, వారిని ముప్పు తిప్పలు పెట్టడం సెస్ అధికారులకు పరిపాటి. కానీ ఒక బడా వ్యాపారి తన వ్యాపారానికి కావాల్సిన విద్యుత్‌ను చోరీ చేసినా, ఎలాంటి అనుమతి లేకుండా ఏకంగా పోల్స్ వేసుకున్నా పట్టించుకోరు! వేలాది రూపాయల విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకుంటే కేసు నమోదు చేయకుండా కేవలం జరిమానాతో సరిపెట్టడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. వేములవాడ మండలం సంకెపల్లి గ్రామ శివారులోని ఒక గ్రానైట్ క్వారీ యజమాని తన క్వారీలో ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్‌ను అక్రమంగా వినియోగించుకుంటున్నాడు. 12 స్తంభాలను ఏర్పాటు చేసుకుని, దానికి సెస్ విద్యుత్ వైరు కనెక్షన్ కలుపుకుని, 5హెచ్‌పీ, 7హెచ్‌పీ మోటార్లు బిగించుకుని విద్యుత్‌ను వాడుకుంటున్నాడు. చాలాకాలంగా విద్యుత్ అక్రమ వినియోగం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తుండగా.. సెల్ అధికారులు ఆలస్యంగా గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది. గురువారం సెస్ ఎండీ నాంపల్లిగుట్ట సదరు గ్రానైట్ క్వారీని తనిఖీ చేయడంతో విద్యుత్ అక్రమ వినియోగం వెలుగులోకి వచ్చింది. దీనివెనుక సెస్ అధికారులతోపాటు ఇటీవల సెస్ డెరైక్టర్‌గా ఎన్నికైన అధికార పార్టీ నాయకుని హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సెస్ నుంచే స్తంభాలు సరఫరా..? గ్రానైట్ క్వారీ యజమాని వేసుకున్న 12 విద్యుత్ స్తంభాలు, దానికి సరిపడా విదుత్ వైర్లు సిరిసిల్ల సెస్ నుంచే సరఫరా అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి అదే కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులు సహకరించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సెస్ సిబ్బందే విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను వారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని విషయూలు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సిబ్బంది మధ్య విభేదాలతో...! గ్రానైట్ క్వారీకి విద్యుత్ పోల్‌లను, వైర్లను వేసిన సెస్ సిబ్బంది మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతోనే ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటపడిందని తెలుస్తోంది. గురువారం సెస్ ఎండీ నాంపల్లిగుట్ట క్వారీని పరిశీలించడంతో అక్రమ విద్యుత్ వినియోగం విషయం బయటపడింది. ప్రతి గ్రామానికి ఒకరిద్దరు సెస్ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ పనులను ఆ ఎందుకు గుర్తించలేదనే అనుమానం రాక మానదు. అధికార పార్టీ నాయకుడి ఒత్తిడి..? సెస్ పరిధిలో పనిచేసిన లైన్మెన్లపై ఒక అధికార పార్టీ నాయకుడు ఒత్తిడి తీసుకువచ్చి ఈ గ్రానైట్ క్వారీకి విద్యుత్ పోల్‌లను, విద్యుత్ వైర్లను వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడింతలు జరిమాన విధిస్తాం -సెస్ ఎండీ నాంపల్లిగుట్ట గ్రానైట్ క్వారీ యజమాని అక్రమంగా విద్యుత్‌ను వా డుకుంటున్నట్లు సెస్ ఎండీ నాంపల్లిగుట్ట ధ్రువీకరిం చారు. విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటుట్లు తెలి యడంతో తాను వెళ్లి పరిశీలించానని చెప్పారు. గత ఆ రు నెలల్లో క్వారీకి వచ్చిన విద్యుత్ బిల్లులపై మూడిం తల జరిమాన విధిస్తామన్నారు. ఈ విషయూన్ని సెస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. విద్యుత్ పో ల్లు, వైర్ల విషయమై ప్రశ్నించగా... క్వారీ యజమాని బయట నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు చెప్పాడని, ర శీదు మాత్రం చూపించలేదని తెలిపారు. బ్లాస్టింగ్‌కు అనుమతులు ఉన్నాయా..? గ్రానైట్ క్వారీకి బ్లాస్టింగ్ అనుమతులు ఉన్నాయా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా గ్రానైట్ క్వారీ నిర్వహిస్తుండగా, వేల సంఖ్యలో బ్లాస్టింగ్లు చేసినట్లు క్వారీలో చూస్తే తెలుస్తోంది. అనుమతులు లేకుండా విద్యుత్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో బ్లాస్టింగ్ల అనుమతులు తీసుకున్నారా..? అనేది సందేహమే. ఇప్పటికైనా జిల్లా అధికారులు పూర్తిస్థారుులో విచారణ జరిపి అక్రమాలను అరికట్టాల్సిన అవసరముంది. -
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
ఓంగోలు (ప్రకాశం) : ప్రకాశం జిల్లా ఓంగోలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని గ్రానైట్ వ్యాపారి ప్రసాద్ రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు 70 సవర్ల బంగారం చోరీచేశారు. బంగారంతో పాటు రూ. 14 లక్షల నగదు అపహరణకు గురైందని బాధిత వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అయితే, కుటుంబంతో సహా గ్రానైట్ వ్యాపారి పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగిందని పోలీసులు వివరించారు. రాత్రి పదిగంటల సమయంలో ప్రసాద్ రెడ్డి ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న నగదు, బంగారం అపహరణకు గురైందని గమనించిన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు
గోరెంట్ల(అనంతపురం జిల్లా): అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్న క్వారీపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. అనంతపురం జిల్లా గోరెంట్ల మండలంలోని కమ్మలవాండ్లపల్లి గుట్ట వద్ద ఈ దాడులు శుక్రవారం జరిగాయి. అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో క్వారీపై దాడి చేసి అధికారులు దానిని సీజ్ చేశారు. ఇటాచీ, క్రైన్, కంప్రెసర్లను స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రానైట్ లారీ బోల్తా..
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామం సమీపంలో బుధవారం వేకువజామున గ్రానైట్ రాయితో కాకినాడ వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. లారీపై ఉన్న గ్రానైట్ రాయి క్యాబిన్పైకి దూసుకెళ్లటంతో డ్రైవర్, క్లీనర్ అందులో చిక్కుకున్నారు. స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి అక్కడికి చేరుకున్నారు. పొక్లెయినర్ సాయంతో రాయిని పక్కకు లాగారు. నుజ్జయిన క్యాబిన్ నుంచి బాధితులను రక్షించేందుకు యత్నిస్తున్నారు. (తణుకు) -
ఓవర్ లోడ్
సాక్షి, చిత్తూరు: జిల్లాలో విలువైన గ్రానైట్‌ను వ్యాపారులు కొందరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో గ్రానైట్ తరలిపోతున్నా రవాణాశాఖ పట్టించుకోవడంలేదు. సుమారు 400 లారీలు గ్రానైట్‌ను రవాణా చేస్తుండగా, అందులో అధిక శాతం లారీలు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో తీసుకెళుతున్నాయి. ఆ శాఖలోని కొందరు అధికారులు లక్షల్లో నెల మామూళ్లు పుచ్చుకుంటూ గ్రానైట్ వ్యాపారులకు,ఇటు లారీ యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రానైట్ అక్రమ ఎగుమతుల పుణ్యమాని ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. పన్నుల రూపంలో ఏడాదికి సుమారు *220 కోట్లకు పైగా రావాల్సివుండగా *30 నుంచి 40 కోట్లకు మించి రావడంలేదు. చిత్తూరు రవాణాశాఖ తోపాటు గనులశాఖకు చెందిన కొందరు అధికారులు సొంత లాభం చూసుకుంటూ ప్రభుత్వాదాయం సంగతి గాలికి వదిలారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజులపాటు మొక్కుబడిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు తప్పించి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడంలేదు. ఒక్క రవాణాశాఖ నెల మామూళ్లు లక్షల రూపాయల్లో ఉన్నాయంటే అక్రమరవాణా ఏ స్థాయిలో జరుగుతోందో తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 230కి పైగా వర్కింగ్ గ్రానైట్ గనులు ఉన్నాయి. జీ-20, ఇంగ్లిష్ టీక్, మేఫ్లవర్, మదనపల్లె వైట్, పుంగనూరు వైట్,గ్రీన్,పీకార్గ్రీన్,వైట్‌రోజ్,చిత్తూరు ప్యారడైజ్ తదితర గ్రానైట్ రకాలు చెన్నై హార్భర్ ద్వారా ఇతర దేశాలకు నిత్యం ఎగుమతి అవుతుంది. ప్రధానంగా క్వారీల నుంచి తీసిన 270,150,100 అడుగుల పైబడిన సైజుల గ్రానైట్ రాయి మాత్రమే ఎగుమతి చేస్తారు. రోజుకు సరాసరి వెయ్యి క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా గ్రానైట్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక ఇంతకు మించి తక్కువ సైజు గ్రానైట్ రాళ్లు కనీసం 2100 క్యూబిక్ మీటర్ల వరకూ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలకు (కటింగ్‌కు) తోలతారు. గనులనుండి రోజుకు సరాసరి 3100 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రాయి అవసరమవుతుంది.ఈ లెక్కన 330 గనుల పరిధిలో ఒక్కో గని నుంచి రోజుకు 10 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రాయిని తీయాల్సివుంది. రావాల్సిన రాయల్టీ: గ్రానైట్ కలర్ రాయికి సంబంధించి ఒక్క క్యూబిక్ మీటరుకు ప్రభుత్వానికి రాయల్టీ * 1750 లు,బ్లాక్ రాయికి * 2250 లు చెల్లించాల్సివుంది. సరాసరి క్యూబిక్ మీటరుకు * 2 వేలు వేసుకున్నా 93 వేల క్యూబిక్ మీటర్లకు నెలకు * 18 కోట్ల 60 లక్షలు రాయల్టీ వస్తుంది. ఏడాదికి * 223 కోట్లకుపైగా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సివుంది. ప్రస్తుతం వస్తున్న ఆదాయం: భూగర్భ గనులశాఖ లెక్కల ప్రకారం చిత్తూరు పరిధిలోని 36 మండలాల్లో 2012-13కు గాను టార్గెట్ *10.42 కోట్లు కాగా * 11.70 కోట్లు,2013-14 కు గాను టార్గెట్ * 12.56 కోట్లు కాగా * 13.04 కోట్లు రాయల్టీ రూపంలో రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2014-15 ఏడాదికి సంబంధించి * 14.6 కోట్లు లక్ష్యంకాగా ఇప్పటివరకూ * 13 కోట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గంగవరం భూగర్భ గనులశాఖ పరిధిలోని 30 మండలాల పరిధిలోని గనులు,ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆదాయంతో కలిపినా ఏడాదికి సరాసరి * 30 కోట్లకు మించి రాయల్టీ ప్రభుత్వానికి రాలేదు. -
గా‘నైట్’
జిల్లా సరిహద్దులు దాటుతున్న స్టోన్ నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు.. అధిక లోడ్‌తో వెళ్తున్న లారీలు గుంతలు పడుతున్న రహదారులు పభుత్వ ఆదాయూనికి రూ.కోట్లలో గండి పట్టించుకోని అధికార యంత్రాంగం కాజీపేట : జిల్లాలో దాదాపు 200 వరకు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటిలో అనుమతి ఉన్నవి 110 నుంచి 120 వరకు ఉండగా.. అనుమతి లేనివి 50 నుంచి 60 వరకు ఉంటారుు. వివిధ కారణాలతో నడవనివి దాదాపు 20 నుంచి 40 వరకు ఉన్నారుు. ప్రధానంగా శాయంపేట, కొండపర్తి, మడికొండ, ధర్మసాగర్, మహబూబాబాద్, ఏటూరునాగారం, కేసముద్రం తదితర ప్రాంతాల్లో అధికంగా ఉన్నారుు. ఈ ప్రాంతాల క్వారీల నుంచి రోజు రాత్రి వందల సంఖ్యలో గ్రానైట్ లోడ్ లారీలు కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని అయోధ్యపురం రైల్వేట్రాక్‌కు చేరుకుంటున్నారుు. తెల్లవారే సరికి అవి రైళ్లలో కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం ఓడరేవులకు చేరుకుంటున్నారుు. అక్కడి నుంచి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ ఈ ముడి గ్రానైట్ అందమైన ఆకృతిలో తయూరై మళ్లీ దిగుమతి అవుతోంది. ఉదాహరణకు జిల్లాలో రూ.100కు ఎగుమతి చేసిన గ్రానైట్ రాయి విదేశాల్లో ఆకృతి మార్చుకుని రాగానే మనం రూ.1000కి కొనుగోలు చేస్తున్నాం. సీమాంధ్ర, బెంగళూరు, చెన్నైకి చెందిన పలువురు వ్యాపారులు జిల్లాలో ని క్వారీల యజమానులతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా.. ప్ర భుత్వానికి పన్ను చెల్లించకుండా రాత్రి వేళల్లో జిల్లా సరిహద్దుల నుంచి విదేశాలకు గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రూ.కోట్లలో దందా జరుగుతుం డగా.. పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన రూ.లక్షల ఆదాయూనికి గండి పడుతోంది. నిబంధనలు గాలికి.. క్వారీల నుంచి తరలించే గ్రానైట్ లారీకి ఒక్కోదానికి మూడు నెలలకోసారి రూ.8,500 చొప్పున ప్రభుత్వానికి రోడ్‌ట్యాక్స్ చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 10 టైర్ల ట్రక్కులో 25 టన్నుల గ్రానైట్, 12 టైర్ల ట్రక్కులో 31, 14 టైర్ల ట్రక్కులో 35, 18 టైర్ల ట్రక్కులో 41, 22 టైర్ల ట్రక్కులో 49 టన్నుల గ్రానైట్ మాత్రమే తీసుకెళ్లాలి. కాగా ఆయా ట్రక్కు ల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా లోడింగ్ చేస్తున్నారు. సామర్థ్యానికి మించి లోడులో 22 టన్నుల నుంచి 32 టన్నుల వరకు అదనంగా వేసి రవాణా చేస్తున్నారు. టన్నుకు రూ.1,060 చొప్పున మైనింగ్ శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 25 టన్నులకు రూ.26,500 పన్నుల రూపకంగా చెల్లించాల్సి ఉండగా, ఒక ట్రక్కులో సుమారు 45 టన్నుల మేర వేసి రూ.21,200 పన్ను ఎగ్గోడుతున్నారు. దీంతోపాటు రవాణా భారం కూడా తగ్గుతుంది. రెండు సార్లు తీసుకెళ్లాల్సిన గ్రానైట్ రాళ్లను ఒకేసారి తీసుకెళ్లడంతో ఒక్క లోడుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. నెలకు రూ.లక్షల్లో వసూళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రానైట్ రాళ్లు తరలిస్తున్న ట్రక్కులను అధికారులు పట్టుకుని సీజ్ చేసి టన్నుకు రూ.1000 చొప్పున జరిమానా విధిం చాలి. కానీ, అధికారులు కాసులకు కక్కుర్తి పడి టన్నుకు రూ.200 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక క్వారీల యజమానులు, వ్యాపారులు ముందస్తుగానే అధికారులతో ఒప్పందం కుదుర్చుకుని.. రూ.లక్షలు ముచ్చజెప్పి ఇబ్బంది లేకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. దీంతో చెక్ పోస్టుల వద్ద అధికారులు ఆపడం లేదు. ఇక.. క్వారీల యజ మానులు గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వేస్తున్నారు. చీక టి పడుతుందంటే చాలు.. జిలెటిన్‌స్టిక్స్ పేలుళ్లతో సమీప గ్రామాల ప్రజ లు ఉలిక్కిపడుతున్నారు. ఇళ్ల పునాదులు కదలడంతోపాటు క్వారీ పరిసరాల్లోని పంటలు నాశనమవుతున్నారుు. దీనికి తోడు అధిక లోడ్‌తో వెళ్లడంతో రహదారులపై ఉన్న కల్వర్టులు, పైప్లైన్లు, రోడ్లు దెబ్బతింటున్నాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు.. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ రాయిని తరలించడం నేరం. జిల్లాలో మైనింగ్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అదనపు లోడుతో వెళ్తున్న వాహనాలపై జరిమానా వేస్తున్నాం. క్వారీల వివరాలు కావాలంటే సమాచారహక్కు చట్టం కింద ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. - బాలరాజుగౌడ్, అసిస్టెంట్ డెరైక్టర్, మైన్స్ అండ్ జియాలజీ -
వండువ కొండపై గ్రానైట్ బాంబు !
ఓ మాజీ ప్రజాప్రతినిధి, బినామీలుగా వ్యవహరిస్తున్న కొంతమం ది అధికార పార్టీకి చెందిన ఛోటా నాయకులు తమ స్వార్థం కోసం పచ్చని పొలాల్లో క్వారీ చిచ్చు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లోని పంటలకు ముప్పు కలిగించేందుకు బరి తెగిస్తున్నారు. 50 గ్రామాలకు తాగునీరు అందించేందుకు నిర్మాణంలో ఉన్న ఉపరితల ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం తెచ్చి పెడుతున్నారు. సుమారు 350 మంది సరస్వతీ పుత్రులకు విద్యనందిస్తున్న ఉన్నత పాఠశాలకు, 2,500 మంది జనాభా కలిగిన గ్రామాలపై గ్రానైట్ బాంబు విసరాలని చూస్తుండడంతో జనం భయూందోళన చెందుతున్నారు. ప్రజలు, పర్యావరణ వేత్తల అభ్యంతరాలు, ఆందోళనలు బేఖాతరు చేస్తూ వీరఘట్టం మండలం వండువ కొండను గ్రానైట్ లీజు పేరిట కొల్ల గొట్టాలని నేతల పన్నాగం పన్నుతున్నారు. - వీరఘట్టం పరిస్థితి ఇది : సర్వే నెంబరు 185పై ఉన్న వండువ కొండపై రూ.35 కోట్లు వ్యయంతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. దీని ద్వారా వీరఘట్టం మండంలోని 50 గ్రామాలకు కొద్ది రోజుల్లో తాగునీరు అందనుంది. అలాగే కొండకు ఆనుకొని ఉన్న వండువ గ్రామంలో 2500 మంది జనాభా నివసిస్తున్నారు. పక్కనే ఉన్నత పాఠశాల, మరో పక్క అడారు కాలనీ, కొండ చుట్టూ సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు, రూ.5 లక్షలతో నిర్మించిన క్రైస్తవ దేవాలయం ఉంది. కొండను లీజుకి ఇస్తే వీటి భవిష్యత్ ప్రమాదంలో పడనుంది. ఇదీ విషయం : ఓ మాజీ ప్రజాప్రతినిధి గ్రానైట్ లీజుల కోసం ప్రయత్నిన్నారు. దీంతో వండువ కొండపై గతంలో అధికారులు గుట్టుగా సర్వేలు జరిపారు. కొండకు ఆనుకొని ఉన్న గ్రామం, ఉన్నత పాఠశాల, చుట్టూ సాగవుతున్న పొలాలు, కొండపై సాగవుతున్న జీడి, మామిడి తోటలు, సాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరింగుల ఫొటోలు సేకరించారు. వీటితో పాటు కొండ వద్ద వన్యప్రాణులు సైతం ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ వాస్తవ పరిస్థిని ప్రభుత్వానికి నివేదిస్తాని అప్పట్లో ప్రకటించారు. అయితే సర్వే చేసిన అధికారులు వాస్తవాలను విస్మరించి తప్పుడు నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారనే విమర్శలు వస్తున్నారుు. 30న ప్రజాభిప్రాయ సేకరణ సర్వే నెంబరు 185లో సుమారు 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వండువ కొండ లీజు విషయమై ఈనెల 30న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి గ్రామసభ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో వండువ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణతో లోలోపల అధికారులు కుమ్మకై అక్రమ లీజుకు యత్నిస్తున్నారని గ్రామస్తులంటున్నారు. ఇటువంటి చర్యలు మానుకోవాలని, లేకుంటే ఆమరణ నిరాహరదీక్షకు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. స్థానికుల ఆందోళన కొద్ది కాలంగా మౌనంగా ఉన్న వండువ కొండ లీజు వ్యవహారం తెరపైకి రావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొండే జీవనాధారం కావడంతో గ్రానైట్ లీజు విషయం తెలిసినప్పటి నుంచి పేదలు ఆందోళనకు గురవుతున్నారు. కొండను లీజు పేరిట ఎవరికైనా ధారదత్తం చేస్తే కుటుంబాలతో సహా వలసలు పోవాల్సిందేనని వాపోతున్నారు. కొండను రక్షించుకునేందుకు ప్రాణత్యాగాలకైనా, ఆమరణ నిరాహరదీక్షలకైనా సిద్ధమంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను నిలిపి వేసి అక్రమ లీజును నిలుపుదల చేయాలని గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. -
ప్రభుత్వ ఆదాయంపై ‘బండ’
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నా రవాణాశాఖ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదు. సక్రమంగా తమకు మామూళ్లు ఇస్తే చాలు ఇష్టం వచ్చినన్ని రాళ్లు తోలుకున్నా పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన అధికారులు స్వయంగా ఓవర్లోడ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నెల్లూరు (దర్గామిట్ట): మన రాష్ట్రంలో లభించే గ్రానైట్‌కు విదేశాల్లో డిమాండ్ ఉంది. దీంతో కృష్ణపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి ఓడల ద్వారా ఎగుమతి చేస్తారు. దీన్ని ఆసరాగా తీసుకుని జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి సుమారు 200కు పైగా వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళుతుంటాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ, గుంటూరు జిల్లా గురిజేపల్లి, కరీంనగర్, వరంగల్, టెక్కలి, వైజాగ్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో గ్రానైట్ రాళ్లను కృష్ణపట్నం, చెన్నై, హొసూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. వీటితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అధిక లోడుతో సిమెంట్ వస్తుంది. జిల్లాలో ఇసుక, సిలికా, బొగ్గు తదితర వాటితో నిత్యం చెన్నైకు లారీలు అధిక సంఖ్యలో వెళుతున్నాయి. ఈ వాహనాలన్నీ పరిమితికి మించి అధిక లోడుతో వెళుతున్నా ఆయా శాఖల అధికారులు నెలవారీ మామూళ్లతో మిన్నకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా సరుకును నాలుగు రకాల వాహనాల్లో చేరవేస్తుంటారు. ఆరు చక్రాలు కలిగిన వాహనంలో 10 టన్నులు, 14 చక్రాలు కలిగిన వాహనంలో 35 టన్నులు, 18 చక్రాలు కలిగిన లారీలో 40 టన్నులు, 22 చక్రాలు కలిగిన లారీలో 49 టన్నులు మాత్రమే రవాణా చేయాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ఆరు చక్రాల వాహనంలో 15 టన్నులు, 14 చక్రాల లారీలో 60 నుంచి 70 టన్నులు, 22 చక్రాల లారీలో 100 టన్నులకు పైగా లోడ్ వేసుకుని రవాణా చేస్తుంటాయి. పరిమితికి మించితే ప్రతి టన్నుకు రూ.1000 జరిమాన విధించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఓనర్ ఫెనాల్టీ కింద రూ.2 వేలు జరిమానా విధిస్తారు. ఈ విషయం అధికారులకు తెలిసినా మామూళ్లు ముడుతుండడంతో మిన్నకుంటున్నారు. ప్రభుత్వాదాయానికి కోట్లల్లో గండి పడుతున్నా వీరికి ఏ మాత్రం పట్టదు. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉమ్మడి తనిఖీ కేంద్రంలోనూ అధిక లోడు వాహనాలకు పచ్చ జెండా ఊపుతున్నారు. రవాణాశాఖకు రూ.కోటి నెల్లూరు ఉపరవాణా కమిషనర్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 36 మంది రవాణా అధికారులు ఉన్నారు. వీరితో పాటు పోలీసు, విజిలెన్స్ అధికారులకు కలిపి చెన్నై వరకు మామూళ్లు రూపంలో దాదాపు రూ. 55 వేలు అవుతుందని వాహనదారులే బహిరంగంగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 15 మంది, నెల్లూరులో 21 మంది విధులు నిర్వహిస్తుంటారు. అధిక లోడ్‌తో వెళుతున్న ఒక్కో వాహనానికి ఒక్కో ఎంవీఐకి రూ. 1000 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్క రవాణాశాఖకు సంబంధించి ఒక్కో వాహనం నుంచి రూ. 36వేలు మామూళ్లు రూపంలో అందుతున్నాయి. ఈ లెక్కన 200 గ్రానైట్ వాహనాలకు సంబంధించి మొత్తం రూ. 12 లక్షలు మూమూళ్లు ఇస్తున్నారు. వీటితో పాటు సిమెంట్, ఇసుక, సిలికా, బొగ్గు తదితర వాటి నుంచి మరో రూ. 28 లక్షలు మామూళ్ల రూపంలో వస్తున్నాయి. అన్నింటితో కలిపి రవాణాశాఖకు దాదాపు రూ.కోటి అందుతోంది. ఉమ్మడి తనిఖీ కేంద్రంలో పచ్చజెండా అధికలోడుతో ఇతర ప్రాంతాలకు వెళుతున్న వాహనాలకు జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ఉమ్మడి తనిఖీ కేంద్రంలో ఆయా శాఖాధికారులు పచ్చ జెండా ఊపుతున్నారు. ఒక్కో వాహనం నుంచి రవాణాశాఖ అధికారులు రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. కొన్ని రకాల వాహనాల నుంచి రోజువారీ మామూళ్లు తీసుకుంటున్నార్న ఆరోపణలున్నాయి. వీరితో పాటు మైనింగ్, వాణిజ్యశాఖ అధికారులకు కూడా ఆయా వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్టు తెలిసింది. పోలీసుశాఖకు.. అధికలోడుతో వెళుతున్న వాహనాలు పోలీసులకు సైతం మామూళ్లు ఇస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న పోలీసు స్టేషన్లో ఉన్న అధికారులుకు ప్రతినెలా మామూళ్లు సమర్పించుకోవాల్సిందేనని వాహనదారులు వాపోతున్నారు. వాస్తవంగా ఓవర్‌లోడ్‌కు సంబంధించి కేసు నమోదు చేసేందుకు పోలీస్ అధికారులకు సంబంధం లేదు. అధిక బరువు ఉన్న వాహనాన్ని ఆపి రవాణా అధికారులకు పంపిస్తారు. ఈ భయం కారణంగానే వాహనదారులు పొలీసులకు మామూళ్లు ఇస్తున్నారు. ఒంగోలు నుంచి తడ వరకు పోలీసుస్టేషన్ల వారీగా మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. ఈ లెక్కన ఒక్కో లారీకి సంబంధించి పోలీసుశాఖకు ప్రతి నెలా దాదాపు రూ.12వేలు ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. దాదాపు 200 గ్రానైట్ లారీల నుంచి రూ. 24 లక్షలు మామూళ్లు అందుతున్నాయి. ఇవిగాక జిల్లా నుంచి వెళుతున్న సిమెంట్, ఇసుక, సిలికా, బొగ్గు, బియ్యం, క్వార్ట్జ్ తదితర ఖనిజాలకు సంబంధించి రవాణా చేస్తున్న వాహనాల నుంచి సుమారు మరో రూ.2లక్షల వరకు మామూళ్లు ఇస్తున్నట్టు వాహనదారులు చెబుతున్నారు. విజిలెన్స్ శాఖకు.. ఇతర శాఖల అధికారుల అవినీతిని ప్రశ్నించాల్సిన విజిలెన్స్ అధికారులకు కూడా అధిక లోడ్‌తో వెళుతున్న వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయి. గ్రానైట్ రాళ్లతో వెళుతున్న ఒక్కో వాహనం నుంచి దాదాపు రూ. 4,500 మామూళ్లు ఇస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. మంత్రి ఇలాకా నుంచే.. రవాణాశాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం నుంచే ఎక్కువగా అధిక లోడు వాహనాలు వెళుతున్నాయి. చీమకుర్తి నుంచి దాదాపు 100కు పైగా వాహనాలు నిత్యం ఇతర ప్రాంతాలకు పోతున్నాయి. మంత్రికే స్వయంగా గ్రానైట్ క్వారీ ఉండడంతో ఆ వాహనాలకు కేసులు నమోదు చేసేందుకు రవాణా అధికారులు జంకుతున్నారు. ఇటీవల కొంతమంది అధికారులను తన వద్దకు పిలిపించుకుని గ్రానైట్ రాళ్లతో వెళుతున్న వాహనాలను చూసీచూడనట్టు పొమ్మని సూచించినట్టు సమాచారం. -
ఓవర్‌లోడ్‌కు చెక్!
కరీంనగర్ క్రైం : జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక, గ్రానైట్ లారీలపై పోలీసులు నిఘా పెంచారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఇసుక, గ్రానైట్ క్వారీలున్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది రాతంత్రా ఉండి.. అక్రమ రవాణాకు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇసుక, గ్రానైట్ క్వారీలున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్సైలు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆదివారం ఉదయం వరకూ అక్కడే మకాం వేసేందుకు వెళ్లినట్లు సమాచారం. వీరితోపాటు ఇతర అధికారులను కూడా దాడులు చేసేందుకు వెళ్లాలని సూచించినట్లు తెల్సింది. 8 చెక్‌పోస్టులు జిల్లా నుంచి ఇసుకతోపాటు గ్రానైట్రాయిని ఇతర ప్రాంతాలకు ఓవర్‌లోడ్‌తో తరలిస్తుంటారు. వీటితోపాటు పొగాకు ఉత్పత్తులు, ఎన్డీపీ మద్యం, బొగ్గు కూడా అక్రమంగా తరలిపోతోంది. వీటిని అడ్డుకునేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఎనిమిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిని శనివారం సాయంత్రమే ప్రారంభించారు. దీనిలో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఆర్టీఏ అధికారులు ఉంటారు. వీరు అయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో 24 గంటల పాటు వాహనాలను తనిఖీ చేస్తారు. అక్రమంగా తరలుతున్న వాటిపై కేసులు నమోదు చేయనున్నారు. తిమ్మపూర్ మండలం అల్గునూర్ వద్ద, సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద, ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి చౌరస్తా వద్ద, కమాన్‌పూర్ మండలం అంబాల క్రాసింగ్ వద్ద, సిరిసిల్ల మండలం జిల్లెల్లలో, ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్ ఎదుట, ఇబ్రహీంపట్నం మండలం గుండి హన్మండ్ల వద్ద, ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద నాలుగు శాఖల అధికారులు 24 గంటలూ వాహనాలను తనిఖీ చేయనున్నారు. -
అటవీ అనుమతుల గుట్టు..గోపాలుడికే ఎరుక!
అటవీ అనుమతులు లేక అనుప్పల్లి-పనబాకంరహదారి పనుల నిలిపివేత రూ.4.59 కోట్ల నాబార్డ్ నిధులు వెనక్కి పరదరామి, కీనాటంపల్లి రిజర్వు ఫారెస్టులో గ్రానైట్ తవ్వకానికి అటవీశాఖ అనుమతి! ఇద్దరు గ్రానైట్ వ్యాపారులు మంత్రికి సన్నిహితులు కావడం వల్లే అనుమతులు వచ్చాయంటున్న అధికారవర్గాలు..! సాక్షి ప్రతినిధి, తిరుపతి: అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ఆ శాఖ అనుమతించడం లేదు. కానీ.. అటవీ భూముల్లో నిక్షిప్తమైన సహజసంపదను బడా వ్యక్తులకు దోచిపెట్టడానికి మాత్రం ఆశాఖ తలుపులు బార్లా తెరుస్తోంది. రామచంద్రాపురం మండలంలో అనుప్పల్లి-పనబాకం రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతించలేదు. ఎంత ప్రయత్నించినా అటవీశాఖ అనుమతించకపోవడంతో చేసేదిలేక ఆ రోడ్డును రహదారులు, భవనాలశాఖ అధికారులు రద్దు చేశారు. యాదమరి మండలంలో కీనాటంపల్లి, పరదరామి రిజర్వు అటవీ భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి మాత్రం ఇద్దరు టీడీపీ నేతలకు ఆ శాఖ అనుమతి ఇచ్చేసింది. అటవీశాఖ మంత్రి బొజ్జలకు ఆ ఇద్దరు సన్నిహితు లు కావడం వల్లే అనుమతి ఇచ్చిందని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించి, చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖను దక్కించుకున్నారు. అటవీ శాఖమంత్రి జిల్లాకు చెందిన నేతే కావడంతో ఆశాఖ అనుమతులు రాక ఆగిపోయిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగే అ వకాశం ఉందని అధికారవర్గాలు భావించాయి. ప్రజలూ అదే ఆశించారు. ఆ ఆశలను అటవీశాఖ అడియాశలు చేస్తోంది. జనం ఆశలపై నీళ్లు.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రామచంద్రాపురం మండలంలోని ఆర్కే పల్లి రోడ్డు 0/0 కిమీ నుంచి 9/4 కిమీ వరకూ అనుపల్లి నుంచి గోకులాపురం మీదుగా పనబాకం వరకూ రోడ్డు నిర్మాణానికి ఆగస్టు 1, 2011న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు రూ.4.59 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేసింది. 9.4 కిమీల పొడవు ఉన్న రోడ్డును.. 4.30 కిమీల మేర రిజర్వు అటవీ ప్రాంతంలో నిర్మించాల్సి ఉంది. ఇందుకు అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అనుపల్లి-పనబా కం రోడ్డు నిర్మాణం కోసం రహదారులు భవనాలశాఖ అధికారులు అటవీశాఖ అనుమతి కోసం ప్రయత్నించారు. మూడేళ్లపాటు అటవీశాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ రహదారు లు, భవనాలశాఖ అధికారులు కాళ్లరిగేలా తిరిగారు. చివరకు అటవీశాఖ మంత్రి బొజ్జల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. కానీ.. ఆ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతిం చలేదు. దాంతో చేసేదిలేక ఆ రోడ్డు నిర్మాణాలను ఆపేశారు. పనులు చేసిన మేరకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించి.. తక్కిన నిధులను నాబార్డుకు వెనక్కి పంపాలని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి బి.శ్యాంబాబు ఆగస్టు 13న ఉత్తర్వులు(జీవో ఆర్టీ నెం: 618)ను జారీ చేశారు. ఇది అనుపల్లి, గోకులాపురం, పనబాకం గ్రామాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రానైట్ వ్యాపారులపై ప్రేమ.. యాదమరి మండలం పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలోని 213 కంపార్ట్మెంట్లో 4.90 హెక్టార్లలో నిక్షిప్తమైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి అనుమతించాలని టీడీపీ నేతకు చెందిన సిద్ధార్థ్ గ్రానైట్స్ జూన్ 14, 2007న దరఖాస్తు చేసుకుంది. అదే మండలంలో కీనాటంపల్లి రిజర్వు అటవీ ప్రాం తంలోని 228 కంపార్ట్మెంట్లో ఏడు హెక్టార్లలో నిక్షిప్తమైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి మరో టీడీపీ నేతకు చెందిన గుల్షన్ గ్రానైట్స్ జూన్ 7, 2008న దరఖాస్తు చేసుకుంది. రిజర్వు అటవీ భూముల్లో గనుల తవ్వకానికి ఆశాఖ అనుమతించలేదు. ఏడేళ్లుగా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. కానీ.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ శాఖ మంత్రి పదవి దక్కించుకోగానే ఆ ఇద్దరి నేతల ఫైళ్లు చకచకా కదిలాయి. కీనాటంపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో ఏడు హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ తవ్వుకోవడానికి టీడీపీ నేతకు చెందిన గుల్షన్ గ్రానైట్స్‌కు అనుమతి ఇస్తూ ఈనెల 4న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 73) జారీచేశారు. ఇక మరో టీడీపీ నేతకు చెందిన సిద్ధార్థ్ గ్రానైట్స్‌కు పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలో 4.90 హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి అనుమతి ఇస్తూ ఈనెల 4న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 74) జారీచేశారు. ఏడేళ్లుగా అనుమతించని అటవీశాఖ ఇప్పుడు ఒక్కసారిగా తలుపులు బార్లా తెరవడం వెనుక మతలబేమిటన్నది గోపాలుడికే ఎరుక. -
గ ‘లీజు’లపై హడల్!
=కొత్త దరఖాస్తులకు {పతిపాదనలు కరువు =ఎన్ఓసీల జారీలో జాప్యం =పెండింగ్‌లో సుమారు 600 దరఖాస్తులు సాక్షి, విశాఖపట్నం : గనుల లీజులంటేనే జిల్లా అధికారులు హడలెత్తిపోతున్నారు. బాక్సైట్‌పై ఉద్యమం, ఖనిజ తవ్వకాలపై ఆరోపణల నేపథ్యంలో లీజుల విషయంలో చొరవ చూపడం లేదు. గత ప్రతిపాదనలు తప్ప తాజాగా ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సులు చేయడం లేదు. దీంతో జిల్లాలో సుమారు 600 దరఖాస్తులు ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జిల్లాకు అదనంగా ఆదాయం పెరగడం లేదు. జిల్లాలో బాక్సైట్, క్వార్ట్జ్, కాల్షైట్, లైమ్‌స్టోన్, మైకా, గ్రానైట్‌తో పాటు రోడ్డు, బిల్డింగ్ నిర్మాణ సామగ్రి లభ్యమవుతున్నాయి. ఏజెన్సీతో పాటు మైదానంలోనూ పలుచోట్ల సహజ సిద్ధంగా ఉన్నాయి. వీటిని లీజుకివ్వడంద్వారా వచ్చే ఆదాయంతో స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో బాక్సైట్ గనులను లీజుకివ్వొద్దని గిరిజనుల ఆందోళన, దేశంలో పలుచోట్ల లీజుకి మించి తవ్వకాలతో ఖనిజాలు లూటీ అవుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి. దీంతో కొత్తగా మైనింగ్ లీజులో కచ్చితత్వం ఉండాలని, సహజ సంపదకు జవాబుదారీ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 2ను జారీ చేసింది. ఈ క్రమంలో మైనింగ్ లీజు దరఖాస్తును తొలుత తహశీల్దార్‌కు పంపి, సాధ్యాసాధ్యాలపై నివేదిక తెచ్చుకోవాలి. దానిపై ఆర్డీఓ, గనుల శాఖ ఏడీ, డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్ సంయుక్త పరిశీలన చేసిన నివేదిక ఇవ్వాలి. కలెక్టర్ దాన్ని పరిశీలించాక అనుమతులు ఇవ్వడానికి ఇబ్బందుల్లేవని నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలి. అనంతరం ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. గతంలో నేరుగా తహశీల్దార్లు ఇచ్చే నివేదిక ఆధారంగా అనుమతులొచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో తహశీల్దార్ స్థాయిలో కొన్ని, ఆర్డీఓ స్థాయిలో కొన్ని, కలెక్టర్ స్థాయిలో కొన్ని పరిశీలన దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 600 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మధ్య నాలుగైదు లీజులు మంజూరైనా అవన్నీ గతంలో ప్రతిపాదించినవే. తాజాగా కొత్తగా ఒక్కటి కూడా ప్రతిపాదించలేదు. జిల్లాలో 450 మైనర్, 40 మేజర్ లీజులున్నాయి. వాటి ద్వారా ఏటా రూ.25 నుంచి 30 కోట్ల ఆదాయం వస్తోంది. కొత్త వాటికి అనుమతులివ్వకపోవడంతో దాదాపు రూ. 10-15 కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోంది. -
రోగాలొచ్చె
చీమకుర్తి, న్యూస్‌లైన్: నిధులు లేక అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలున్నాయి. కానీ ఏటా వందల కోట్ల ఆదాయం ఆ ప్రాంతం నుంచి వస్తున్నా.. అక్కడి ప్రజల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గ్రానైట్ ఖిల్లాగా ప్రసిద్ధిగాంచిన చీమకుర్తి ప్రాంతం నుంచి గత 20 ఏళ్లలో రూ 20 వేల కోట్ల విలువైన గ్రానైట్ సంపద దేశ, విదేశాలకు తరలిపోయింది. దీని ద్వారా ప్రభుత్వాధీనంలో ఉన్న మైన్స్ డిపార్టుమెంట్‌కు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక గ్రానైట్ యజమానులైతే కోటానుకోట్ల ఆదాయం గడించారు. కానీ స్థానికులకు ఒరిగింది మాత్రం ... అక్షరాలా శూన్యం. ఎందుకూ పనికిరావనుకున్న భూముల్లో.. 1983కు పూర్వం రామతీర్థం పరిధిలో ఎందుకూ పనికిరావనుకుంటున్న భూముల్లో సిరులు కురిపించే గ్రానైట్ పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓబచెత్త తప్ప ఏమీ పండని ఆ భూములను ఖాళీగా ఉంచడం ఎందుకని సంతనూతలపాడుకు చెందిన అప్పటి ఎమ్మెల్యే వేమా యల్లయ్య పశువుల క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. తీరా దానిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉందని గమనించిన తర్వాత అందరి చూపు అటువైపు మళ్లింది. 1983లో ఒకే ఒక్క లీజుతో 8.094 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రానైట్ రాయిని వెలికి తీసేందుకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదటిసారి మైన్స్ డిపార్ట్మెంట్కు ఆ సంవత్సరం రాయల్టీ రూపంలో రూ 11,015 ఆదాయం వచ్చింది. అది మొదలు 2012-13 ఆర్థిక సంవత్సరం వరకు పారిశ్రామికవేత్తలు గ్రానైట్‌ను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రస్తుతం 510 హెక్టార్లలో దాదాపు 160 గ్రానైట్ లీజులతో విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని వెలికితీస్తున్నారు. ఇప్పటి వరకు 33,67,005 క్యూబిక్ మీటర్ల బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని వెలికితీశారు. ఏటా 4 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి ఎగుమతి.. రామతీర్థంలోని క్వారీలకు మాత్రమే ప్రత్యేకతగా నిలిచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ రాయిని సరాసరి నెలకు 35 వేల క్యూబిక్ మీటర్లు వెలికి తీస్తున్నారు. ఏడాదికి 3 నుంచి 4 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తీసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాయి నాణ్యతను బట్టి క్యూబిక్ మీటర్ రాయి రూ 25 వేల నుంచి రూ 65 వేల వరకు ధర పలుకుతుంది. సరాసరిన క్యూబిక్ మీటర్ రాయి రూ 50 వేలు ఉంటుంది. 1983 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని వెలికితీశారు. దానిలో నికరంగా రాయల్టీ చెల్లించి ఎగుమతి చేసిన రాయి దాదాపు 35 లక్షల క్యూబిక్ మీటర్లుంది. దీని ద్వారా ఇప్పటి వరకు రూ 17,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక డంపింగ్‌ల మీద, దొడ్డిదారిన అధికారుల కళ్లుగప్పి, క్వారీల్లో వృథాగా మరో 15 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి పోయిందని స్థానికుల అంచనా. దీని ద్వారా మరో రూ 4 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం మీద ఇప్పటి వరకు వెలికితీసిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ విలువ రూ 20 వేల కోట్లపైనే ఉందని మైన్స్ అధికారుల రికార్డుల ద్వారా వెల్లడవుతోంది. దీని వలన ప్రభుత్వానికి 1983 నుంచి ఇప్పటి వరకు రూ 726.4 కోట్ల ఆదాయం వచ్చింది. రాయల్టీ చెల్లించకుండా అడ్డదారిలో రవాణా చేస్తున్న గ్రానైట్ వలన అపరాధ రుసుం ద్వారా మరో రూ 300 కోట్ల ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. వెరసి మొత్తం మీద గడిచిన 20 ఏళ్లలో రూ 20 వేల కోట్ల విలువైన గ్రానైట్ తరలిపోగా, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల ఆదాయం సమకూరింది. మిగిలింది కాలుష్యమే... వేలాది కోట్ల విలువైన గ్రానైట్ సంపదను తీసుకెళ్లే గ్రానైట్ యజమానులు కనీసం స్థానికులకు కల్పించాల్సిన కనీస వసతులు మరిచారు. గ్రానైట్ పరిశ్రమల కారణంగా మండలంలోని సగానికిపైగా గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ఆయా గ్రామాల్లో ప్రజలంతా శ్వాసకోశ వ్యాధులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రానైట్ గుంతల్లో నిల్వ ఉండే నీటి వలన దోమలు, ఈగలు పెరిగి డెంగీ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ఎక్కువయ్యాయి. మలేరియా వ్యాధి వ్యాప్తిలో జిల్లాలో చీమకుర్తిదే మొదటి స్థానం. ఇతర ప్రాంతాల నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగా వచ్చిన కార్మికుల వల్ల ఎయిడ్స్ వ్యాధి విస్తరణలో చీమకుర్తి జిల్లాలోనే మొదటి స్థానం ఆక్రమించింది. తాగునీటికి ఫ్లోరైడ్ నీరే దిక్కయింది. కావాల్సినవివీ... చీమకుర్తి మండలంలో నివసిస్తున్న 79 వేల మంది ప్రజలకు ఉపయోగపడేలా అన్ని వ్యాధులకు చికిత్స చేయగలిగే స్థాయిలో ఉండే ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సి ఉంది. 35 వేల మంది జనాభా ఉన్న చీమకుర్తి పట్టణానికి సురక్షితమైన నీరందించేందుకు కనీసం రెండు ఆర్ఓ ప్లాంట్లు నిర్మించాలి. గ్రామాల్లో వర్షం నీరు నిలబడకుండా ప్రవహించేందుకు సైడు కాల్వలు నిర్మించాలి. ఆడపిల్లలు ప్రత్యేకంగా చదువుకునేందుకు బాలికల హైస్కూలు, కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉంది. విద్యార్థులు ఆడుకునేందుకు సరైన క్రీడా ప్రాంగణం లేక వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాలు వృథాగా పోతున్నాయి. క్రీడా ప్రాంగణంతో పాటు స్థానికులకు పార్కు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కాలుష్యాన్ని నివారించేందుకు వీధుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా సాగించాలి. గ్రానైట్ మెటీరియల్ రవాణాతో ఛిద్రమైన రోడ్లను, కల్వర్టులను మరమ్మతులు చేయాలి. వేల కోట్ల విలువైన భూగర్భ సంపదను తరలించే ముందు స్థానికులకు కనీసం ఎంతో కొంత మేలు చేద్దామనే ఆలోచనే ఎవరికీ రాకపోవడం శోచనీయం. -
పర్మిట్ల జారీకి చేయి తడపాల్సిందే!
టెక్కలి, న్యూస్‌లైన్ : ‘గ్రానైట్ లీజుదారులకు పర్మిట్లు జారీలో మైన్స్ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెళియాపుట్టి మండలం గోకర్ణపురం క్వారీయింగ్‌కు సంబంధించి పర్మిట్లు జారీలో చేసిన జాప్యంపై సదరు లీజుదారులు సోమవారం రాత్రి ఆత్యహత్యాయత్నానికి పాల్పడి, ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో టెక్కలి మైన్స్ కార్యాలయంలో అక్రమాలు మరోసారి చర్చనీయాంశమయ్యింది. ఇటీవల కొందరు సిబ్బంది, అధికారులు కలిసి లీజుదారుల నుంచి వివిధ రకాలుగా వేలాది రూపాయలు అక్రమంగా దోచుకోవడం, ప్రభుత్వ ఆదాయానికిగండి పెడుతున్న వైనంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి పాఠకులకు విదితమే. తాజా ఘటనతో టెక్కలి మైన్స్ కార్యాలయ వ్యవ హారాలు మరోసారి ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టిలో పడ్డాయి. గ్రానైట్ లీజుదారులకు సకాలంలో పర్మిట్లు జారీ చేయడంలో సిబ్బంది మామూళ్ల వసూళ్లకు దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి. పర్మిట్ల జారీలో క్యూబిక్ మీటర్‌కు ఒక్కో రేటు చొప్పున వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు లీజుదారులే బాహాటంగా ఆరోపిస్తున్నారు. పర్మిట్ల జారీలో జాప్యం చేయడంతో లీజుదారులపై బయ్యర్ల ఒత్తిడి పెరగడంతో అడిగిన లంచాల ను ఇస్తారనే ఏకైక కారణంతో మైన్స్ కార్యాలయ అధికారులు పర్మిట్ల జారీ ప్రక్రియను జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రావాల్సిన రెండు వేల రూపాయల రాయల్టీకి గండి పడుతోంది. నెలలో ఒక్క టెక్కలి డివిజన్లో ఉన్న 187 క్వారీల నుంచి సుమారు ఆరు వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రవాణా జరుగుతాయి. పర్మిట్లు నిలిపి వేసినా, ప్రభుత్వాదాయానికి గండిపడిన మొత్తం లక్షల్లోనే ఉంటుంది. సోమవారం జరిగిన ఘటనతో లీజుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. వివరణ కోరిన జిల్లా కలెక్టర్..! సోమవారం రాత్రి గోకర్ణపురం క్వారీ లీజుదారులతో మైన్స్ ఏడీ ప్రసాద్ చేసిన వివాదాంశం చర్చనీయాంశమైంది. ఈ మేరకు మంగళవారం పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ సౌరభ్‌గౌర్ తీవ్రంగా స్పందించి ఏడీని వివరణ కోరారు. దీంతో ఉదయాన్నే ఆయన కలెక్టర్‌ను కలిసి పరిస్థితిపై పూర్తి వివరణిచ్చినట్లు తెలిసింది. అక్కడ ఏమి జరిగిందోగాని టెక్కలి కార్యాలయంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. లీజుదారులైన ధనుంజ యరెడ్డి, మురళీకృష్ణలను పిలిపించుకున్న ఏడీ, వారికి వెంటనే పర్మిట్లు జారీ చేశారు. ఈ విషయం ధ్రువీకరణ కోసం ‘న్యూస్‌లైన్’ ఫోన్లో ప్రయత్నించినప్పటికీ ఏడీ ప్రసాద్ అందుబాటులోకి రాలేదు. లీజుదారుడు ధనుంజయరెడ్డి మాత్రం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తనకు మంగళవారం మధ్యాహ్నం కార్యాలయానికి పిలిపించి ఏడీ పర్మిట్లు ఇచ్చారని అంగీకరించారు.