ఓవర్ లోడ్ | over load | Sakshi
Sakshi News home page

ఓవర్ లోడ్

Published Sun, Mar 22 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

over load

సాక్షి, చిత్తూరు: జిల్లాలో విలువైన గ్రానైట్‌ను వ్యాపారులు కొందరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో గ్రానైట్ తరలిపోతున్నా రవాణాశాఖ పట్టించుకోవడంలేదు. సుమారు 400 లారీలు గ్రానైట్‌ను రవాణా చేస్తుండగా, అందులో అధిక శాతం లారీలు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో తీసుకెళుతున్నాయి. ఆ శాఖలోని కొందరు అధికారులు లక్షల్లో నెల మామూళ్లు పుచ్చుకుంటూ గ్రానైట్ వ్యాపారులకు,ఇటు లారీ యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రానైట్ అక్రమ ఎగుమతుల పుణ్యమాని ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. పన్నుల రూపంలో ఏడాదికి సుమారు *220 కోట్లకు పైగా రావాల్సివుండగా *30 నుంచి 40 కోట్లకు మించి రావడంలేదు.  

చిత్తూరు  రవాణాశాఖ తోపాటు  గనులశాఖకు చెందిన కొందరు అధికారులు సొంత లాభం చూసుకుంటూ ప్రభుత్వాదాయం సంగతి గాలికి వదిలారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం రోజులపాటు మొక్కుబడిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు తప్పించి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడంలేదు. ఒక్క రవాణాశాఖ నెల మామూళ్లు లక్షల రూపాయల్లో ఉన్నాయంటే అక్రమరవాణా  ఏ స్థాయిలో జరుగుతోందో తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా  230కి పైగా వర్కింగ్ గ్రానైట్ గనులు ఉన్నాయి. జీ-20, ఇంగ్లిష్ టీక్, మేఫ్లవర్, మదనపల్లె వైట్, పుంగనూరు వైట్,గ్రీన్,పీకార్‌గ్రీన్,వైట్‌రోజ్,చిత్తూరు ప్యారడైజ్ తదితర గ్రానైట్ రకాలు చెన్నై హార్భర్ ద్వారా ఇతర దేశాలకు నిత్యం ఎగుమతి అవుతుంది.

ప్రధానంగా క్వారీల నుంచి తీసిన 270,150,100 అడుగుల పైబడిన సైజుల గ్రానైట్ రాయి మాత్రమే ఎగుమతి చేస్తారు. రోజుకు సరాసరి వెయ్యి క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా గ్రానైట్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక ఇంతకు మించి తక్కువ సైజు గ్రానైట్  రాళ్లు కనీసం 2100  క్యూబిక్ మీటర్ల వరకూ స్థానికంగా ఉన్న  ఫ్యాక్టరీలకు (కటింగ్‌కు) తోలతారు. గనులనుండి రోజుకు సరాసరి 3100 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా  రాయి అవసరమవుతుంది.ఈ లెక్కన 330 గనుల పరిధిలో ఒక్కో గని నుంచి  రోజుకు  10 క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా రాయిని తీయాల్సివుంది.
 
రావాల్సిన రాయల్టీ:
గ్రానైట్ కలర్ రాయికి సంబంధించి ఒక్క క్యూబిక్ మీటరుకు ప్రభుత్వానికి రాయల్టీ * 1750 లు,బ్లాక్ రాయికి * 2250 లు చెల్లించాల్సివుంది. సరాసరి  క్యూబిక్ మీటరుకు * 2 వేలు వేసుకున్నా  93 వేల క్యూబిక్ మీటర్లకు  నెలకు * 18 కోట్ల 60 లక్షలు రాయల్టీ వస్తుంది. ఏడాదికి * 223 కోట్లకుపైగా  ప్రభుత్వానికి  రాయల్టీ రూపంలో రావాల్సివుంది.
 
ప్రస్తుతం వస్తున్న ఆదాయం:
భూగర్భ గనులశాఖ లెక్కల ప్రకారం చిత్తూరు పరిధిలోని 36 మండలాల్లో 2012-13కు గాను టార్గెట్ *10.42 కోట్లు కాగా * 11.70 కోట్లు,2013-14 కు గాను టార్గెట్ * 12.56 కోట్లు కాగా * 13.04 కోట్లు రాయల్టీ రూపంలో రాబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2014-15 ఏడాదికి సంబంధించి * 14.6 కోట్లు లక్ష్యంకాగా  ఇప్పటివరకూ * 13 కోట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గంగవరం భూగర్భ గనులశాఖ పరిధిలోని 30 మండలాల పరిధిలోని గనులు,ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆదాయంతో కలిపినా ఏడాదికి సరాసరి * 30 కోట్లకు మించి  రాయల్టీ  ప్రభుత్వానికి  రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement