గోరంట్ల మండలం గంగంపల్లిలో నిర్వహిస్తున్న అక్రమ క్వారీ
అనంతపురం టౌన్: గ్రానైట్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలను సైతం పక్కనపెడుతుండటం చూస్తే ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఎవరెవరికి ఎంత ముట్టజెప్పాలో తెలిసిన అక్రమార్కులు.. నకిలీ పర్మిట్లతో దందా సాగిస్తున్నారు. అధికారులు చుట్టపుచూపు పర్యవేక్షణతో సరిపెడుతుండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయల గండి పడుతోంది. జిల్లాలో అధికారికంగా 320 క్వారీలకు గనుల శాఖ అనుమతించింది. ఇందులో 70 పైగా గ్రానైట్ క్వారీలు, 250 రోడ్డు మెటల్ క్వారీలు ఉన్నాయి. ఇటీవలగనుల శాఖ అధికారుల బృందం జిల్లాలోని క్వారీలను పరిశీలించారు. చాలా వరకు క్వారీల్లో అనుమతులకు మించి త్వకాలు జరిపినట్లు నిర్ధారణ కావడంతో వాటిని సీజ్ చేయాలని.. అనుమతుల్లేని క్వారీల నిర్వాహకులకు జరిమానా విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ దిశగా ఇప్పటి వరకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
ఒక్క పర్మిట్‌తో పదులసంఖ్యలో వాహనాలు
అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మిన్నకుండిపోతుండటంతో గ్రానైట్ అక్రమ రవాణా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. ఒక్క పర్మిట్‌తో పదుల సంఖ్యలో వాహనాలు అత్యంత విలువైన గ్రానైట్‌ను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇక్కడి గ్రానైట్‌కు కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా మడకశిర, శెట్టూరు, గోరంట్ల, పెనుకొండ ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రానికి సమీపంలో ఉండడంతో వీరి అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోతోంది. కర్ణాటక సరిహద్దులో దాదాపు 18కిపైగా చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ దొడ్డిదారిన గ్రానైట్ తరలిస్తున్నారు.
చోద్యం చూస్తున్న గనులశాఖ అధికారులు
గడిచిన ఏడాది కాలంలో అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న ఒక్క వాహనాన్ని మాత్రమే సీజ్ చేయడం చూస్తే అధికా రుల పనితీరు ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. అదికూడా పెనుకొండ పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఎలాంటి పర్మిట్లు లేకుండా గ్రానైట్ తరలిస్తుండడంతో వాహనాన్ని సీజ్ చేశారు. అది మినహా ఇప్పటి వరకు గనులశాఖ అధికారులు గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకున్న పాపనపోలేదు. ఎంతో విలువైన ప్రకృతి సంపద కళ్లెదుటే జిల్లా సరిహద్దులు దాటిపోతున్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం కావడం వల్లే అధికారులు కూడా మౌనం దాలుస్తున్నట్లు తెలుస్తోంది. పైగా నెలవారీ మామూళ్ల కారణంగా కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సమాధానం చెప్పలేక..
జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా విషయమై గనులు, భూగర్భ శాఖ ఏడీ వెంకట్రావును ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరే ప్రయత్నం చేసింది. అయితే ప్రతిసారీ ఆయన సమాధానం దాటవేస్తూ ఫోన్ కట్ చేయడం చూస్తే వాస్తవాన్ని అంగీకరించినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న గ్రానైట్ క్వారీ గోరంట్ల మండలం గంగం పల్లి గ్రామంలోనిది. ఇక్కడ గ్రానైట్ తవ్వకానికి ఎలాంటి అనుమతల్లేవు. క్వారీని సీజ్ చేయాలని గనుల శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయినప్పటికీ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్‌ను కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment