భారీ యంత్రాల సహాయంతో తవ్వకాలు
అనంతపురం సెంట్రల్: యల్లనూరు మండలం కూచివారిపల్లి గ్రామ సమీపంలోని ఎల్లుట్ల అటవీ ప్రాంతంలో జేసీ కుటుంబం భారీ యంత్రాలతో అక్రమ మైనింగ్‌కు తెరతీసింది. రెండు రోజుల క్రితం ముగ్గురాయి వెలికితీతకు పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ కూడా చేశారు. ఖనిజ సంపదను కొల్లగొట్టడంలో భాగంగా ఇప్పటికే దాదాపు 50 అడుగుల మేర మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇందుకోసం సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో భారీ వృక్షాలను కూడా నేలకూల్చారు. ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టాలన్నా అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి. అయితే అధికార పార్టీ నేత కనుసన్నల్లో సాగుతున్న బాగోతం కావడంతో అనుమతి లేకపోయినా యథేచ్ఛగా బ్లాస్టింగ్‌లు చేపడుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. అనుమతులు రాకమునుపే అటవీ ప్రాంతంలో ఏకంగా దారిని ఏర్పాటుచేసుకొని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను జేసీ దివాకర్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసింది. గత నెలలో ఒకసారి, ఈ నెలలో వారం రోజుల క్రితం ఆయన అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాలు, సొంత పనుల మీద పర్యటించే సమయంలో ఆయనకు ప్రొటోకాల్ హంగామా ఉంటుంది. అయితే కూచివారిపల్లి అటవీ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రొటోకాల్ లేకుండానే వచ్చి వెళ్లడం గమనార్హం.
వన్య ప్రాణులకు ముప్పు
జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. మొక్కల పెంపకం ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఉన్న చెట్లను ఇష్టారాజ్యంగా నరికేస్తుండటంతో ప్రకృతి సమతుల్యత లోపించి వర్షాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో అటవీ ప్రాంతంలో బ్లాస్టింగ్, తవ్వకాల వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. కూచివారిపల్లిలో ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా మైనింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా వన్యప్రాణులు అడవిని వదిలి పొలాలు, గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే వాహనాల రాకపోకలు, ఇతరత్రా కారణాలతో ఈ మధ్య కాలంలో జంతువులు మృత్యువాత పడుతున్నాయి.
ముగ్గురాయికి విపరీతమైన డిమాండ్
అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఖనిజం ముగ్గురాయి(బెరైటీస్). భూమిలో నుంచి ముడిచమురు, సహజ వాయువులు వెలికితీసే సంస్థలకు ఈ ఖనిజం ఉపయోగపడుతుంది. ఉష్ణ నిరోధక సాధనంగా ఉపయోగపడే ఈ ముగ్గురాయిని అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలైనా దుబాయ్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ప్రపంచ బెరైటీస్ నిల్వల్లో 28 శాతం ఇండియాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యతను బట్టి టన్ను ముగ్గురాయి ధర రూ.5వేల నుంచి రూ.25వేలు పలుకుతోంది. ఇంతటి డిమాండ్ ఉన్న ఖనిజం తవ్వకాలను ప్రయివేట్ వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకున్నా తవ్వకాలు చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment